
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ హైకోర్టు మార్గనిర్దేశాలను జారీ చేసింది. ట్రాఫిక్ జాం కాకుండా, అత్యవసర దారులను మూసివేయకుండా, ఆసుపత్రులకు వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా గణేష్ మండపాలు ఉండాలని సూచించింది. అంతేకాకుండా పర్యావరణహిత విగ్రహాలను ఉపయోగించాలని, రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలని తెలియజేసింది. డీజేలను పది గంటల తర్వాత ఉపయోగించకూడదని, సౌండ్ స్పీకర్ల వాల్యూమ్ తగిన స్థాయిలో ఉండేలా నిర్వాహకులు చూసుకోవాలని పేర్కొన్నది.
హైదరాబాద్: వినాయక మండపం విషయంలో తెలంగాణ హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలైంది. ఇబ్బంది కలిగేలా తన ఇంటి ముందే మండపాన్ని ఏర్పాటు చేయడంపై పిటీషన్‌దారు పిటీషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. నడీరోడ్డు మీద చట్టవిరుద్దంగా మండపం ఉండడంతో, శ్రావణ్ కుమర్‌తో కూడిన ఏకసభ్య ధర్మాసనం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్యావరణ అనుకూలంగా ఉండేలా వినాయక మండపాల ఏర్పాటును పోలీసులు, మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలని ఉత్తర్వులలో తెలియజేసింది.
వినాయకుడి మండపంలో ఎక్కువగా సౌండ్ పెట్టి, పాటలను ప్లే చేయడం వల్ల ఇబ్బందికి గురైన ఒక వ్యక్తి గర్భవతి భార్యతో పాటు వృద్ధురాలు కోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. దీంతోపాటు మండపాల వల్ల ఏర్పడుతున్న శబ్దకాలుష్యం వల్ల పెద్ద మొత్తంలో ప్రజలు అభ్యంతరాలు లేవనెత్తారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటూ, పోలీసులకు– మున్సిపల్ అధికారులకు కోర్టు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.
అందులో, సామాజిక స్థలాలో నిర్వాహకులు విగ్రహాలను ఏర్పాటు చేసే ముందు స్థానిక పోలీసు– మున్సిపల్ అధికారుల అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. వాహనాల స్వేచ్ఛా ప్రవాహానికి అడ్డుగా మండపాలు ఉండకూడదు. ఇళ్లకు వెళ్లే దారులకు, ఆసుపత్రులతో పాటు అత్యవసర దారులకు అడ్డంగా మండపాల ఏర్పాటు జరగకూడదు.
స్థానిక సంస్థలు నిర్దేశించిన సామాజిక మైదానాలలో, బహిరంగ స్థలాలలో మాత్రమే మండపాలను ఏర్పాటు చేసి విగ్రహాలను ప్రతిష్టించాల్సి ఉంటుంది. ఎటువంటి అగ్నిప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలను పాటించి, మండపాలకు విద్యుత్ సౌకర్యం కల్పించుకోవాల్సి ఉంటుంది.
కేటాయించబడిన సమయంలోనే పూజలు..
శబ్ద కాలుష్యం నియమ నిబంధనల చట్టం- 2000 ప్రకారం, సౌండ్ సిస్టమ్స్ ఖచ్చితంగా కేవలం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మత్రమే ప్లే చేసుకోవడానికి అనుమతించబడింది. నివాస ప్రాంతాలలో రాత్రి– పగలు డెసిబుల్ స్థాయి ఖచ్చితంగా సూచించిన పరిమితులకు లోబడి ఉండేలా నిర్వహకులు చూసుకోవాలి.
నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలకు దూరంగా లౌడ్ స్పీకర్లు ఉండాలి. శబ్ద స్థాయిని డెసిబెల్ మీటర్లతో పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ నియమాలను ఉల్లంఘిస్తే పోలీసులు తక్షణమే చర్యలను తీసుకోవాలి.
నిర్వాహకులు ట్రాఫిక్‌ను స్తంభింపజేయలేదని నిర్ధారించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ట్రాఫిక్ పోలీసులలో కలిసి ప్రత్యామ్నాయ దారులను నిర్ణయించాలి.
అగ్ని భద్రత కోసం అత్యవసర వాహనాలు నిలపడానికి తగిన స్థలాన్ని నిర్వాహకులు కేటాయించాల్సి ఉంటుంది.
సంబంధిత పోలీసు స్టేషన్లో హెల్ప్ డెస్క్ అందుబాటులో ఉంటుంది. అక్కడ స్థానికుల చేత ఎటువంటి ఫిర్యాదైనా నమోదు చేయబడుతుంది. లౌడ్‌స్పీకర్లతో ఇబ్బంది పెట్టిన, సమస్యలను సృష్టించినా నివాసితులు ఫిర్యాదు చేయవచ్చు.
నిమజ్జన ఊరేగింపులు సమయంలో వివిధ హైకోర్టు మార్గనిర్దేశాలకు అధికారులు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. అంతేకాకుండ, పూజలు– నిమజ్జనమైపోయిన తర్వాత మండప ప్రాంగణాలను శుభ్రం చేసే బాధ్యత నిర్వహకులదే. కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణహిత విగ్రహాలను– సామాగ్రిని ఖచ్చితంగా ఉపయోగిస్తున్నట్టుగా నిర్వాహకులు నిర్ధారించాలి. అనుమతులు తీసుకునే ముందు ప్రతి ఒక్క నిర్వాహక మండపం ఖచ్చితంగా నిమయనిబంధలను అనుసరించాలి.
హైకోర్టు విడుదల చేసిన మార్గదర్శకాలు వినాయక నిమజ్జనం వరకు అధికారులు తుచ తప్పకుండా పాటించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో తెలియజేయడం జరిగింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.