
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో “బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు” అనే అనుమానంతో 444 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత పౌరసత్వానికి సంబంధించిన వారి పత్రాలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఒడిశాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అక్రమ వలసదారుల గుర్తింపును తమ ప్రభుత్వ ప్రధాన సమస్యగా బీజేపీ మార్చింది.
న్యూఢిల్లీ: ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో 444 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయుల, రోహింగ్యాలుగా వారిని అనుమానిస్తున్నారు. భారత పౌరసత్వానికి సంబంధించిన వారి పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) ఏర్పాటు చేయబడిందని, అనుమానితులను రెండు వేర్వేరు నగరాల్లోని హోల్డింగ్ కేంద్రాలలో ఉంచినట్లు ఝార్సుగూడ పోలీసు సూపరింటెండెంట్(ఎస్పీ) స్మిత్ పర్మార్ తెలిపారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, “భారత పౌరసత్వానికి సంబంధించిన వారి రుజువులను, ఒడిశాకు వారెలా చేరుకున్నారో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని ఆయన అన్నారు.
ప్రతి జిల్లాలో ఎస్టీఎఫ్, ఎఫ్ఆర్ఓల మోహరింపు..
అధికారుల ప్రకారం, హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఎస్టీఎఫ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించబడ్డాయి. ఈ టాస్క్ ఫోర్స్‌లు జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో ఉంటాయి. అలాగే, ప్రతి ఎస్టీఎఫ్తో ఒక విదేశీ రిజిస్ట్రేషన్ అధికారి(ఎఫ్ఆర్ఓ) నియమితులవుతారు. ఆయన అక్రమ వలసదారుల గుర్తింపు, బహిష్కరణ ప్రక్రియను పర్యవేక్షిస్తారు.
చెల్లుబాటు అయ్యే పౌరసత్వ పత్రాలు లేని వ్యక్తులను గుర్తించి, వారిని దేశం నుంచి వెనక్కి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
దీని కోసం, ఇటువంటి అనుమానితులను తాత్కాలికంగా ఉంచడానికి ప్రతి జిల్లాలో హోల్డింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే కాకుండా, అత్గఢ్లోని ఒక పాత జైలును రాష్ట్ర స్థాయి హోల్డింగ్ కేంద్రంగా గుర్తించారు.
బీజేపీ ప్రభుత్వానికి ప్రాధాన్యతగా మారిన అక్రమ వలసదారుల సమస్య..
2024లో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ(బీజేపీ), రాష్ట్రంలో అక్రమ వలసదారుల గుర్తింపును ప్రభుత్వానికి ప్రధాన సమస్యగా మార్చింది.
రాష్ట్రానికి 480 కిలోమీటర్లకు పైగా తీరప్రాంతం ఉందని, అందువల్ల చాలా మంది అక్రమ వలసదారులు సముద్ర మార్గం ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించి కేంద్రాపాడా, జగత్సింగ్పూర్, భద్రక్, బాలాసోర్ వంటి తీరప్రాంత జిల్లాల్లో స్థిరపడతారని అధికారులు చెబుతున్నారు.
గత నెలలో కేంద్రాపాడా పర్యటన సందర్భంగా, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నివసిస్తున్న బంగ్లాదేశ్ పౌరులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్ర సంస్థల సహకారంతో ఈ సమస్యను పరిష్కరించాలని పోలీసులను కోరారు. అంతేకాకుండా జాతీయ భద్రతకు ఈ చర్య అవసరమని అన్నారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ప్రభుత్వం 3,740 మంది బంగ్లాదేశ్ పౌరులు ఒడిశాలో పత్రాలు లేకుండా నివసిస్తున్నారు. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అధికారులు అంటున్నారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.