ఆలయ ప్రాంగణంలోని దుకాణాలకు హిందువులు కానివారు బిడ్డింగ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన నిబంధనపై సుప్రీంకోర్టు మరోసారి స్టే విధించింది. ఆ నిబంధనను 2015లో ప్రభుత్వ జీవో నంబర్ 426 ద్వారా ప్రవేశపెట్టారు. దీన్ని సవాలు చేస్తూ అప్పట్లో కొందరు హైకోర్టును ఆశ్రయిస్తే 2019లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ జిఓను సవాలు చేసే పిటిషన్‌ను రద్దు చేసింది. దీనిపై పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే 2020లో హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అదే స్టే కొనసాగుతుందని సుప్రీంకోర్టు తాజాగా మరోసారి స్పష్టతనిచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన స్టేను పట్టించుకోకుండా తాజాగా పాత జీవో ప్రకారమే శ్రీశైలం దేవస్థానం అధికారులు టెండర్లను ఆహ్వానించడం ప్రస్తుత వివాదానికి కారణమైంది. ఆలయ అధికారుల తీరును తప్పుబడుతూ రఫీ అనే వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఆలయ అధికారులు తమ తప్పును గ్రహించి టెండర్లను ఉపసంహరించుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన వారు కోర్టుకు తెలిపారు. అయితే, ఇలాంటి టెండర్లు చాలాసార్లు జారీ అయ్యాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన సూచనలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. దాంతో సుప్రీంకోర్టు మరోమారు ఉత్తర్వులు జారీచేసింది.
అసలు నేపథ్యం ఏంటి? ప్రభుత్వం జీవో ఎందుకిచ్చింది?
శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించడంపై హిందూ ధార్మిక సంస్థలు గతంలో తీవ్ర అభ్యంతరం తెలిపాయి. అలాగే తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఈ సంఘటనపై స్పందిస్తూ వెంటనే అన్యమతస్తుల షాపులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఆందోళన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఇక్కడి దుకాణాల వేలం పాటలో ఇతర మతస్తులు పాల్గొననవద్దని బీజేపీతో సహా ఇతర పార్టీలు వేలాన్ని అడ్డుకున్నాయి. దీంతో అప్పుడు వేలం పాటను నిలిపివేశారు. అయితే వివాదం రాజుకున్న తరువాత ఆలయ ఈవోను బదిలీ చేశారు. అనంతరం అన్య మతస్తులకు దుకాణాలు కేటాయించ వద్దని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది.
2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిఓ 426ను ఆమోదించింది. ఇది ఎండోమెంట్ చట్టం పరిధిలోకి వచ్చే ఆలయ ప్రాంతాలలో దుకాణాల నిర్వహణ కోసం టెండర్లలో హిందువులు కానివారు పాల్గొనకుండా ఆంక్షలు విధించింది. అప్పట్లో దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా 2019లో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ ప్రభుత్వ ఉత్తర్వును సమర్థించింది, ఇది చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. అయితే, కొంతమంది దుకాణదారులు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 2020లో హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది.
ఈ వివాదాలు ఎందుకు?
హిందూ ఆలయాల విషయంలో పలుచోట్ల ఇతర మతస్తుల జోక్యానికి సంబంధించి ఎప్పటి నుంచో వివాదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలతో సహా పెద్ద ఆలయాలలో తరచూ అన్యమత అంశం ప్రస్తావనకు వస్తోంది. ఆలయాలలో ఉద్యోగాలలో వున్న అన్యమతస్తులను తొలగించాలని, ఆలయ పరిధిలో ఇతర మతస్తుల దుకాణాలు ఉండరాదని హిందూ సంస్థలు, విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల విజయవాడలో జరిగిన హిందూ శంఖారావం సభలోనూ ధర్మ పరిరక్షణ దిశగా తీర్మానాలు కూడా చేశారు.
1.హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. అంటే దేవాలయాల నిర్వహణపై ప్రభుత్వ అజమాయిషీ ఉండకూడదు. హిందువులకే అప్పగించాలి.
2. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే విధంగా చట్ట సవరణ చేసేలోగా దేవాలయాలలో పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి.
3.హిందూ దేవాలయాలలో, ఆలయాలచే నిర్వహించబడుతున్న సేవా సంస్థలలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలి.
4.హిందూ దేవాలయ ట్రస్టు బోర్డులలో హిందూ ధర్మంపై శ్రద్ధా భక్తులతో ధర్మాచరణ చేసే రాజకీయేతర ధార్మిక వ్యక్తులను మాత్రమే నియమించాలి.
ఇలా పలు డిమాండ్లు చేసిన హైందవ శంఖారావం, ఆలయాల ఆధ్వర్యంలో నడిచే దుకాణాల నిర్వహణ లో హిందూయేతరులను అనుమతించకూడదన్న డిమాండ్ కూడా ముందుకు తెచ్చింది. శ్రీశైలంలో దుకాణాల అంశాన్ని ప్రస్తావించింది.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్ధానంలోను అన్యమతస్తులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. పర్మినెంట్ ఎంప్లాయిస్ ను గుడికి సంబంధంలేని సంస్థలకు బదిలీ చేస్తున్నారు. టీడీపీ బోర్డ్ కొత్త ఛైర్మన్ గా బీఆర్ నాయుడు నియమించబడ్డ తర్వాత తొలి ప్రాధాన్య అంశంగా టీటీడీలో పనిచేసే అన్యమతస్తులను తొలిగించడంపైనే దృష్టి పెట్టారు.
ఏదిఏమైనా ఆలయాల ఆధ్యర్యంలో నడుస్తున్న దుకాణాల నిర్వహణ టెండర్లలో హిందూయేతరులను అనుమతించక పోవడాన్ని సుప్రీంకోర్టు అడ్డుకున్న నేపధ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? గతంలోని జీవోలను మారుస్తుందా? హిందూ సంస్థల డిమాండ్లను ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.