
ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామంటూ చంద్రబాబు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు కంపెనీలకు విలువైన భూములు కట్టబెట్టడం చర్చకు దారితీసింది. ఎక్కడో ఏ మూలో అభివృద్ధి పేరిట భూములు కేటాయించారంటే ఒక ఎత్తు , ఏకంగా విశాఖలో విలువైన భూములను అతి తక్కువ ధరకు ఇవ్వడమంటే, అదీ ఊరు పేరు లేని కంపెనీకైతే అందరి నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సిందే. ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందే. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.
ఊరు పేరు లేని ఉర్సా క్లస్టర్ కంపెనీకి విశాఖపట్నంలో 59 ఎకరాల వరకు చంద్రబాబు ప్రభుత్వం ఎలా కేటాయించిందని ద వైర్ పరిశోధనాత్మక కథనానికి దేశవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. ఉర్సా పుట్టుపూర్వోత్తరాలతో సహా ఇచ్చిన కథనం తరువాత లోకల్ పత్రికలతో పాటు జాతీయ ఛానళ్లు , పత్రికలు కూడా విశాఖపట్నంలో ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూ కేటాయింపులపై దృష్టి పెట్టాయి. ద వైర్ కథనాన్ని సమర్థించాయి.
ఏపీలో అభివృద్ధి జరగాలి. కంపెనీలకు ప్రభుత్వ ప్రోత్సాహం వుండాలి. అందుకని అర్హత లేకున్నా కోట్ల విలువ చేసే భూములను చిన్న కంపెనీకి కట్టబెట్టడం ఏంటన్నది అందరి ప్రశ్న. ఉర్సా కంపెనీ విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చి వుండవచ్చు. కానీ దానికి ఆ సమర్థత వుందా లేదానే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇదే ప్రశ్న చంద్రబాబు ప్రభుత్వానికి సూటిగా తగులుతోంది.
అయితే, ద వైర్ కథనం తరువాత విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఉర్సా క్లస్టర్స్పై ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు. తన సోదరుడు, ఎంపీ కేశినేని చిన్నిని లక్ష్యంగా చేసుకుని నానీ ఆరోపణలు గుప్పించారు. ‘‘ఉర్సా కంపెనీ నా సోదరుడు చిన్ని రూపొందించిన బినామీ కంపెనీ. ఆ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీశ్ చిన్నికి సన్నిహితుడు, ఇంజనీరింగ్‌లో క్లాస్మేట్. భూకేటాయింపుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వారాల ముందే ఈ కంపెనీని స్థాపించారు’’అని ఆయన విమర్శించారు.
స్పందించిన ఉర్సా క్లస్టర్స్
తమకు అనుభవం లేదని, చిన్న కంపెనీకి భూములెలా ఇస్తారనే ఆరోపణలపై ఉర్సా క్లస్టర్స్ యాజమాన్యం స్పందించింది. ఉర్సా క్లస్టర్స్‌కు విశాఖలో భూకేటాయింపులపై వస్తున్న విమర్శలపై సతీశ్, జయ్, ఉర్సా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎరిక్ వార్నర్ అమెరికా నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. తమ కంపెనీ ప్రపంచస్థాయిలో డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో సేవలందిస్తోందని, భారతదేశంలో ఇటీవలే తమ కార్యకలాపాలు ప్రారంభించామని తెలిపారు. దీంతోపాటు కొందరు ఆరోపిస్తున్నట్లు ఎంపీ కేశినేని చిన్నితో తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుతానికి భారతదేశంలో తాత్కాలిక కార్యాలయం ద్వారా సేవలందిస్తున్నామని స్పష్టం చేశారు.
తాము పెట్టే పెట్టుబడులు ఆర్బీఐ అనుమతించిన ఎఫ్‌డీఐ పాలసీతో ఏపీకి వస్తాయని జయ్ తాళ్లూరి చెప్పారు. ఉర్సా క్లస్టర్స్ ప్రమోటర్లు అందరూ ఆర్థికంగా బలమైన వారని, సంస్థ ఆర్థిక సామర్థ్యంపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు. ఏపీ నుంచి ఆహ్వానం రావడంతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చామన్నారు. విశాఖలో మూడు దశల్లో ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. వంద మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఐదు వేల కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. తమకు 99 పైసలకు ఎకరా కేటాయించారన్న కథనాల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. విశాఖ ఐటీ పార్కు వద్ద కేటాయించిన భూమి ఎకరా కోటి, కాపులుప్పాడు వద్ద కేటాయించిన భూమి ఎకరా 50 లక్షలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. తాము ఏర్పాటు చేసే డేటా సెంటర్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల రాష్ట్రంలోని ప్రతి చిన్న పట్టణంలోనూ స్టార్ట్‌పలను ప్రారంభించే వాతావరణం ఏర్పడుతుందని ఉర్సా ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
తమకు కేటాయించిన భూమిలో రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాల్సి ఉందని, రెండు వేల మందికి ఉపాధి లభించడంతో పాటు పరోక్షంగా కొన్ని వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయకపోతే కేటాయించిన భూమిని వెనక్కి తీసుకునే వెసులుబాటు ఎంవోయూలో ఉందని, నిర్దేశిత సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయకపోతే అప్పుడు ఆరోపణలు చేస్తే తప్పు లేదు. కానీ, ప్రారంభంలోనే విమర్శలు చేయడం సరైన విధానం కాదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
భారతదేశంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఏపీలో కంపెనీని రిజిస్టర్ చేశామని, త్వరలోనే పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపడతామన్నారు. తమ సంస్థ క్లయింట్ బేస్ అని, చాలా దేశాల్లో ఉందని ఉర్సా క్లస్టర్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ ఎరిక్ వార్నర్ తెలిపారు. దక్షిణ అమెరికా, ఆఫ్రికాతోపాటు భారత్‌లోనూ ఆదాయ వనరులపై సమగ్ర అధ్యయనం చేసి క్లయింట్ బేస్‌ను గుర్తించామని చెప్పారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి లోకేష్ నారా మాట్లాడుతూ ఉర్స తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
స్పందించిన ప్రశాంత్ భూషణ్
ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు భూములు కేటాయించడంపై ద వైర్ పరిశోధనాత్మక కథనంపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందించారు. ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి అన్ని ఎకరాల భూములు ఏ విధంగా కేటాయిస్తారని కూటమి ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
మౌనముద్రలో ఏపీ ప్రభుత్వం
దేశవ్యాప్తంగా ఇంత రచ్చ జరిగిన ఏపీ ప్రభుత్వం మాత్రం ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమి ఎందుకు కేటాయించాల్సి వచ్చింది అనే అంశంపై నోరు మెదపడం లేదు. ఇదిలా ఉంటే అమరావతి పనులతో సహా అన్నింటినీ ప్రభుత్వ పెద్దలు అస్మదీయులకే కట్టబెడుతున్నారని విపక్షం ఆరోపిస్తోంది. విశాఖపట్నంలో అర్హతలేని కంపెనీల భూకేటాయింపును ద వైర్ తెలుగు వెలుగులోకి తెచ్చిన తరువాత కూడా ప్రభుత్వం నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. ఉర్సా కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. కానీ ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. “ఫలానా కంపెనీకి ఇలాంటి అర్హత వుంది, అందుకే ఆ భూములు కేటాయించాము” అని చంద్రబాబు ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందిపోయి, గుంభనంగా వుంటూ తన అస్మదీయ కంపెనీలకు ఆహ్వానం పలుకుతూనే వుండటం విస్మయం కల్గిస్తోంది.
అయితే విశాఖలో టీసీఎస్‌కు భూకేటాయింపును అందరూ సమర్దించారు. లాభాల బాటలో వున్న ఆ కంపెనీ మరింత మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుందని నమ్ముతున్నారు. అయితే, టీసీఎస్ విషయంలోనూ భూమి ధరపై విమర్శలు వస్తున్నాయి. అలాంటిది కంపెనీ ప్రారంభమై ఆరు నెలలు కూడా కాని ఉర్సాకు దాదాపు 60 ఎకరాలు కేటాయించడం, దానిని సమర్థించుకోవడం మాత్రం అందరూ తప్పపడుతున్నారు.
అసలేం జరిగింది…?
యూఆర్‌ఎస్‌ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి విశాఖలో కారు చౌకగా ఏకంగా 59 ఎకరాలకు పైగా భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. దీంతో ఉర్సా అందరి దృష్టిని ఆకర్షిస్తూ, ఆ కంపెనీపై ప్రభుత్వానికి ఎందుకంత ప్రేమ అనే అనుమానం కలిగించింది. విశాఖపట్నంలోని ఐటి హిల్ నంబర్ 3లో 1,370 కోట్ల పెట్టుబడితో ఐటి క్యాంపస్ ఏర్పాటు కోసం, 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్‌కి మొత్తం 21.16 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. దాని పక్కనే ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాల భూమిని యూఆర్‌ఎస్‌ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ప్రస్తుతం అమలులో ఉన్న నియమాల ప్రకారం కేటాయించారు. దీంతో పాటు ఐపీ కాపులుప్పాడలో 56.36 ఎకరాల భూమిని అదే కంపెనీ యూఆర్‌ఎస్‌ఏ క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కేటాయించారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. అంటే ఏకంగా 59 ఎకరాలకు పైగా సదరు ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి విశాఖలో కేటాయించారు. ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డేటా సెంటర్, ఐటి కార్యాలయం ప్రారంభించి, యువతకు ట్రైనింగ్‌తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని ప్రభుత్వం చెబుతోంది.
ఉర్సా క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కథేంటి?
ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ హైదరాబాద్‌లో తాత్కాలిక కార్యాలయంగా సరిగ్గా రెండు నెలల క్రితం 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. 10 లక్షల రూపాయల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్, లక్ష రూపాయల పెయిడప్తో ఇద్దరు డైరెక్టర్ల పేరున ఈ కంపెనీ వుంది. పెందుర్తి విజయ్ కుమార్, సతీష్ అబ్బూరి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా ఉన్నారని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ చూపిస్తోంది. అయితే, 2024 సెప్టెంబర్ 27న అమెరికాలోనూ ఉర్సా క్లస్టర్స్ పేరుతోనే కంపెనీని రిజిస్టర్ చేశారు. అటు అమెరికాలోనైనా మన దేశంలోనైనా ఈ సదరు కంపెనీ పుట్టి ఏడాది కూడా కాలేదు. ఏదో భారీ స్థాయిలో ప్రారంభించారా అంటే అదీను లేదు. 10 లక్షల రూపాయల క్యాపిటల్ ఇన్వెస్టిమెంట్‌తో ఇటీవల ప్రారంభమైన సంస్థ 5వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చి, రిటర్న్ గిఫ్ట్‌గా విశాఖలో మార్కెట్ రేట్లో వెయ్యి కోట్ల వరకు విలువైన భూములను కొట్టేసింది.
ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం కూడా హైదరాబాద్ శేరిలింగంపల్లి ప్రాంతంలోని కొత్తగూడలోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్. దీనికి అమెరికాలోనూ ఒక కార్యాలయం ఉంది. అయితే, ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2024 జూన్‌లో కొలువుదీరిన తర్వాతే ఉర్సా క్లస్టర్స్ కంపెనీ పేరుతో 2024 సెప్టెంబరులో రిజిస్టర్ చేశారు.
విశాఖలో భూకేటాయింపులపై విమర్శలు వచ్చాక స్పందించిన ఉర్సా క్లస్టర్ డైరెక్టర్లు తమ కంపెనీ పలు దేశాలలో పని చేస్తోందని చెప్పుకొస్తున్నారు. తామంతా ఆర్థికంగా బలమైన వాళ్లమేనంటూ ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టు పూర్తి చేయకపోతే విమర్శించండంటూ చెబుతున్నారే తప్ప, అనుభవాన్ని చెప్పడంలేదు. అలాంటిది ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఏపీ ప్రభుత్వం డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖలో విలువైన భూమి కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది. ఇలాంటి కంపెనీని ఏపీ ప్రభుత్వం ఎందుకు నమ్మింది? దీని వెనుక ఇంకెవరైనా వున్నారా అన్నది తెలియాల్సివుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.