
భక్తి, వైరాగ్య, ప్రేమాస్పద సాధు సంతులు
బీభత్స భయానక అలంకారాల పాత్రలను జీవింపజేస్తున్నారు.
కరుడుగట్టిన భౌతిక వాదులు
కఠోర భక్తులుగా మారిపోతున్నారు.
హాయిగా బోసి నవ్వులతో ఎగిరే సీతకొక చిలుకల్లాంటి చిన్నారులు
నెత్తురోడుతున్న పాషాణ
కత్తులను ఝులిపిస్తున్నారు.
పెరోల్‌పై బయటకు వచ్చిన ఆ భయంకర నేరస్థుడు
జీవన సాఫల్యం గురించి
మోహ మాయా ప్రపంచపు బాధల నుంచి
విడివడేందుకు తాత్విక చింతనలను ప్రబోధిస్తున్నాడు.
ప్రశాంత గాలులు వీచే సుందర మందార వనాలు
భయంకరమైన భూకంప తుఫాన్ల కేంద్రకాలుగా(ఎపిసెంటర్) మారిపోతున్నాయి.
చెమట చుక్కలు ధారపోసి యాజమానుల పెట్టుబడిని
ఆకాశం దాటేంత ఎత్తుకు తీసుకెళుతున్న శ్రామిక వీరులు
తమకందాల్సిన ప్రతిఫలాన్ని మరిచి, పడుతూ లేస్తూ
తీర్థయాత్రలకు వెళ్లి తమ అదృష్టాన్ని,
తమ నుదుటి గీతలను, చేతిరాతలను
కొత్తగా తిరగ రాయించుకుంటున్నారు.
ఎప్పటిలాగే ఏదీ ఆశించని నిశ్శబ్ద, నిస్వార్థ సూరీడు
తానస్తమించే చోటుకి పయనమై అక్కడ కూడా
మళ్ళీ మళ్ళీ ఉదయిస్తూనే ఉన్నాడు.
అన్నీ తెలిసిన అమాయక చంద్రుడు మాత్రం
తన చుట్టూ తాను తిరుగుతూనే
ఈ భూమండలం అంతా చల్లదనాన్ని వెన్నెలగా
కురిపిస్తూనే ఉన్నాడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.