
రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులరిజం’, ‘సోషలిస్టు’ పదాలను చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
న్యూడిల్లీ : రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో ‘లౌకికవాదం’ ఎప్పుడూ భాగమేనని సుప్రీంకోర్టు అక్టోబర్ 21న మౌఖికికంగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకికవాదం’, ‘సోషలిస్టు’ అనే పదాలను చేర్చడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.
ఈ పదాలను 1976 లో చేసిన 42వ సవరణలో చేర్చటం జరిగింది. ఇది భారతదేశం గురించిన వర్ణనను ‘‘సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రం’’ నుండి ‘‘సార్వభౌమ, సోషలిస్ట్, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం’’గా మార్చింది. అలాగే రాజ్యాంగ ప్రవేశికలోని ‘‘జాతి ఐక్యత’’ అనే పదాలను ‘‘ఐక్యత మరియు దేశ సమగ్రత’’గా మార్చారు.
భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు పీఠిక నుండి ‘సెక్యులర్’ అనే పదాన్ని తొలగించాలని తరచుగా మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు సుబ్రమణ్యస్వామి, అశ్విని కుమార్ ఉపాధ్యాయ్, బలరామ్ సింగ్ లు వేసిన పిటిషన్లు ప్రస్తుతం సుప్రీం కోర్టు ముందున్నాయి.
జస్టిస్ ఖన్నా మౌఖికంగా చెప్పినట్లు లైవ్ లా ఇలా నివేదించింది:
‘‘సెక్యులరిజం ఎల్లప్పుడూ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమని ఈ కోర్టు అనేకసార్లు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలో ఉపయోగించిన సమానత్వం, సౌభ్రాత్రుత్వం అనే పదాలను, రాజ్యాంగంలోని మూడో భాగంలో ఉన్న హక్కులను చూచినప్పుడు లౌకికవాదం రాజ్యాంగం ప్రధాన లక్షణం అనే స్పష్టమైన సూచన ఉంది.
జస్టిస్ ఖన్నా పిటిషనర్లను ఇలా అడిగాడు: ‘‘భారతదేశం సెక్యులర్‌గా ఉండకూడదనుకుంటున్నారా?’’
తన పిటిషన్ సవరణకు మాత్రమే సవాలు అని, భారతదేశం లౌకికమని పిటిషనర్లు వివాదం చేయడం లేదని సింగ్ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ పేర్కొన్నాడు. భారతదేశం ఎప్పుడూ లౌకిక దేశంగానే ఉందని ఉపాధ్యాయ్ నొక్కి చెప్పాడు. ప్రవేశిక 1949 డిక్లరేషన్‌గా ఉన్నందున సవరణ ఏకపక్షమని స్వామి పేర్కొన్నాడు.
సవరణ ద్వారా జోడిరచిన పదాలను బ్రాకెట్ల లో చూపటం జరిగిందని, అందువల్ల 1976 సవరణ ద్వారా వాటిని చేర్చినట్లు అందరికీ స్పష్టంగా తెలుస్తుందని జస్టిస్ ఖన్నా కూడా చెప్పారని లైవ్ లా రిపోర్ట్ చేసింది. అంతేకాకుండా దేశ ‘‘ఐక్యత’’, ‘‘సమగ్రత’’ పదాలను కూడా అదే సవరణ ద్వారా చేర్చారని కూడా సదరు న్యాయమూర్తి ఎత్తి చూపటం జరిగిందని లైవ్ లా రిపోర్టు పేర్కొంది.
నెల్లూరు నర్సింహారావు