
భారతీయ మధ్యతరగతి ప్రజలలో ఆదాయం, వినియోగం స్తబ్దుగా ఉందని గత కొంతకాలంగా స్థూల-ఆర్థిక గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్న విషయాన్ని నెస్లే ఇండియా ఛైర్మన్ మనకు చెప్పారు.
ప్రముఖ వినిమయ ఉత్పత్తుల కంపెనీ నెస్లే ఇండియా సిఎండి సురేష్ నారాయణన్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. పట్టణ విభాగంలో అమ్మకాల వృద్ధిలో తన కంపెనీ తీవ్ర మందగమనాన్ని చవి చూస్తోందని చెప్తూ ‘‘కుంచించుకుపోతున్న మధ్యతరగతి’’ గురించి మాట్లాడారు.
‘‘ఒకప్పుడు ఒక మధ్యతరగతి ఉండేది. ఆ మధ్యతరగతి అవసరాలు తీర్చటానికి అవసరమన వినమయ ఉత్పత్తుల తయారీలో చాలా కంపెనీలు పనిచేసేవి. అది తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది,’’ అని తమ కంపెనీ త్రైమాసిక నివేదికలను విడుదల చేస్తూ చెప్పాడు. ఇప్పుడు చాలా త్రైమాసికాలుగా మందగమనం కొనసాగుతోందని, ఇది అసాధారణమని ఆయన అన్నారు.
మే 2024లో, ఏషియన్ పెయింట్స్ సిఇఓ విశ్లేషకుల, పెట్టుబడిదారుల సంపాదన గురించి మాట్లాడుతూ స్థూల జాతీయోత్పత్తి సంఖ్యలపై సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఈ గణాంకాలు క్షేత్ర స్థాయిలో వివిధ రంగాల పనితీరుతో సంబంధం లేకుండా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. కానీ మరుసటి రోజు తమ వ్యాఖ్యలను మీడియా తప్పుగా పేర్కొన్నారనే పేరుతో ఉపసంహరించుకుంది.
గత కొంతకాలంగా గ్రామీణ, పట్టణ భారతదేశం రెండింటిలో వినిమయ సామర్ధ్యం మందగించటం గురించి అత్యంత నిష్ణాతులైన కార్పొరేట్ / మార్కెట్ విశ్లేషకులు తమతమ అభిప్రాయాలు విశ్లేషణలు వ్యక్తం చేస్తున్నారు.
కార్ డీలర్లు రూ.86,000 కోట్ల విలువైన 7 లక్షల వాహనానాలు స్టాకుతో పతమతమౌతున్నారన్న వార్త బాగా ప్రచారంలోకి రావడం పండుగల సీజన్‌కు ముందు మధ్యతరగతి వారు కొనుగోలు చేయడం లేదని చెప్పడానికి మరొక సంకేతం.
2023లో ఇదే కాలంతో పోలిస్తే డీలర్ల వద్ద పేరుకు పోయిన ప్యాసింజర్ కార్ల నిల్వలు 75% పెరిగింది. ఇంతగా డిమాండ్ తగ్గుదల చాలా కాలంగా కనిపించలేదు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2024లో వాణిజ్య వాహనాల విక్రయాలు కూడా 4 నుంచి 6% తగ్గాయి. ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో కొంత కదలిక ఉన్నప్పటికీ ఈ కదలిక కూడా 2018 స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి.
వాస్తవాలను తిమ్మిని బమ్మిన చేసే ప్రభుత్వానుకూల వ్యాఖ్యాతలు భారతీయ మధ్యతరగతి బాగా ఎదిగిపోయిందనీ, సాధారణంగా ద్విచక్రవాహనాలు నుండి కార్లకు మారేటప్పుడు ముందు చిన్న కార్లు కొంటారనీ, తర్వాత మాత్రమే అత్యాధునిక వాహనాల కొనుగోలుకు సుముఖుత చూపేవారనీ, కానీ ఇపుడు వారి ఆర్థిక స్థాయి గణనీయంగా పెరిగిపోవటంతో ఏకంగా అత్యాధునిక విలాసవంతమైన కార్ల వైపు మొగ్గు చూపుతున్నారనీ, అందువల్లనే చిన్న కార్ల మార్కెట్ స్థబ్దతకు లోనైందనీ విశ్లేషిస్తున్నారు. మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్ ఛైర్మన్, ఆర్ సి.భార్గవ ఇటువంటి వాదనను కొట్టి పడేశారు. వినియోగదారులు తమ వినియోగంలో ఇంత పెద్ద ఎత్తుకు దూకడం తెలియదని అన్నారు. ఎస్ యు వి అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ధనవంతులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మధ్యతరగతి వారు ఇప్పటికీ ఆదాయ స్తబ్దతతో కొట్టుమిట్టాడుతున్నారు. కోవిడ్ తర్వాత ఎగుడు దిగుడులో సాగుత్ను జిడిపి వృద్ధి రేటు పునరుద్ధరణ సమాంతరంగా అదే ఎగుడుదిగుడు తో కూడిన వినియోగ నమూనాకు దారితీసింది. ఇక్కడ ప్రీమియం కార్లు బాగా అమ్మడుపోతున్నాయి. కానీ మధ్య విభాగంలోని కార్ల అమ్మకాలు మందకొడిగా ఉన్నాయి.
దాదాపు దశాబ్ద కాలంగా గ్రామీణ వేతనాలు, వినియోగంలో స్తబ్దత కొనసాగుతోంది. జిడిపి వృద్ధి అంచనా 7% మించి ఉన్నప్పటికీ పట్టణ వినియోగంపై ఒత్తిడి కొనసాగుతోంది. ఈ అధిక జిడిపి/ఆదాయ వృద్ధి అధిక విస్త్రుత ఆధారిత వినియోగంలోకి ఎందుకు చేరటం లేదు అనేది ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. ఎన్ ఎస్ ఎస్ ఓ సర్వే నుండి వెలువడే అధికారిక వినియోగ వ్యయ డేటా ప్రకారం ఒక దశాబ్దం కాలంగా వినియోగ వఅద్ధి వార్షికంగా దాదాపు 3.5% పెరుగుతోంది. అంటే ఇది జిడిపి వ్రుద్ధిలో సగం అని గమనించండి. వినియోగ వ్రుద్ధి జిడిపి లేదా ఆదాయ వ్రుద్ధిలో సగం స్థాయిలో నడుస్తున్న ఈ ద్రుగ్విషయాన్ని ఆర్థికవేత్తలు వివరించలేకపోతున్నారు. ఇదే నిజమైతే పొదుపులో బలమైన పెరుగుదల ఉండాలి. కానీ ఇంటి పొదుపు కూడా తగ్గిపోతోంది! కొంతమంది ప్రముఖ ఆర్థికవేత్తలు ఈ స్పష్టమైన వైరుధ్యానికి ఏకైక సమాధానం జిడిపి పెరుగుదలను అతిగా అంచనా వేయటమేనని అని చెప్పారు.
భారతీయ మధ్యతరగతి ఆదాయం మరియు వినియోగాలలో నెలకొన్న స్తబ్దతను వ్యవస్థాగత స్థాయిలో మరింత నిశితంగా అధ్యయనం చేయాలి. అమెరికన్ ప్యూ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన డేటా ప్రకారం, 2010లో భారతదేశ మధ్యతరగతి సుమారుగా 5 కోట్ల నుండి 7 కోట్లదాకా ఉంది. ఇది 2020 నాటికి 15 కోట్ల నుండి 20 కోట్లకు పెరిగింది.
2017లో భారతదేశం, చైనాలలో మధ్యతరగతి పరిమాణాన్ని అంచనా వేయడానికి పర్చేజ్ పవర్ ప్యారిటీ (పిపిపి) ప్రాతిపదికన రోజుకు 10 నుంచి 50 డాలర్ల ఆదాయం కలిగిన తరగతిని గుర్తించటానికి ప్యూ సంస్థ పరిశోధనలు నిర్వహించింది. ఈ ప్రమాణం ప్రకారం 2016లో భారతీయ మధ్యతరగతి 10.8 కోట్లు ఉండగా, చైనా మధ్యతరగతి 70.7 కోట్లు ఉంది. మరింత అర్థవంతంగా చెప్పాలంటే, చైనా జనాభాలో 61% మంది రోజుకు 10 డాలర్ల కంటే ఎక్కువ ఆదాయంతో జీవిస్తుండగా, కేవలం 3% భారతీయులు మాత్రమే రోజుకు 10 డాలర్ల ఆదాయంతో జీవిస్తున్నారు.
భారతదేశంలోని మధ్యతరగతి కంటే చైనా మధ్యతరగతి చాలా వేగంగా అభివృద్ధి చెందింది. చైనాలో స్థూల జాతీయోత్పత్తిలో పన్ను శాతం 2000 వ సంవత్సర జీడీపిలో 14% నుండి 2020 జీడీపీలో 23%కి ఎలా పెరిగిందో ఒక డేటా వివరించింది. భారతదేశ జీడీపీలో పన్ను నిష్పత్తి ఈ కాలంలో దాదాపు 15% నుంచి 18% పరిధిలోనే ఉంది. భారతదేశంలో మధ్యతరగతి పరిమాణం కావలసినంత వేగంతో పెరగడం లేదనే వాస్తవానికి ఇది మరొక స్పష్టమైన సంకేతం. ఇటీవలి సంవత్సరాలలో మధ్యతరగతి ఎదుర్కుంటున్న తీవ్రమైన స్తబ్దత ఆదాయాలు, పొదుపుల పతనంలో కనిపిస్తుంది. అధికారిక కథనం అటువంటి లోతైన సమస్యలను పట్టించుకోనట్లు నటిస్తూ, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఎలా కొనసాగుతుందో పేర్కొంటూ స్వీయ-అభినందనల ధోరణితో కొనసాగుతోంది. ఈ పెరుగుదల ఫలాలు ఎలా పంపిణీ అవుతుందో ఎవరూ అడగడం లేదు. ఇది విచారకరమైన వాస్తవం.
ఈ భాగం మొదటగా ది వైర్ మరియు గెలీలియో ఐడియాస్ లు సంయుక్తంగా నడిపే ప్రీమియం న్యూస్ లెటర్ అయిన ది ఇండియా కేబుల్‌లో ప్రచురించబడిరది. తాజాపర్చబడిన తరువాత ఇక్కడ తిరిగి ది వైర్లో ప్రచురించిన వ్యాసానికి నెల్లూరు నరసింహారావు అనువాదం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.