
కోల్కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జోయ్మాల్య సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈమేరకు సుప్రీం కోర్టు కొలీజియం ఓ ప్రకటన విడుదల చేసింది.
సుప్రీం కొలీజియం కొత్త బాచ్ న్యాయమూర్తులను నియమించిన ప్రతి సారీ ఏదో ఒక వివాదానికి తావిస్తూనే ఉంది. వివిధ సర్వీసుల్లో ఉన్నట్టు గానే న్యాయ వ్యవస్థలో కూడా అఖిలభారత సీనియారిటీ జాబితా తయారవుతుంది. ఆ జాబితా ప్రకారం ఎటువంటి వివాదాలు, ఆరోపణలు లేని న్యాయమూర్తికి పదోన్నతి రావడం సహజం. ఒక వేళ సదరు సీనియారిటీ జాబితాలో ఉన్నవారికి పదోన్నతి అవకాశాలు దక్కకపోతే దానికి కారణాలు కూడా సుప్రీం కోర్టు కొలీజియం వెల్లడిస్తుంది.
కానీ ప్రస్తుత సందర్భంలో అటువంటి సీనియారిటీ జాబితాలో ఉన్న పదిమందిని కాదని బాగ్చీను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఎంపిక చేసింది కొలీజియం. అలా సీనియర్లుగా ఉన్న వారిలో పలు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పని చేస్తున్నవారు ఉండటం గమనించాల్సిన విషయం.
ఈ పదిమంది సీనియర్ల లో కొలకత్తా హైకోర్టుకు చెందిన వారే నలుగురు ఉన్నారు. వారిలో అత్యంత సీనియర్ గా ఉన్న న్యాయమూర్తి విశ్వనాథ్ సమద్దర్. అటువంటి సీనియర్లలో మరో ముగ్గురు మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందినవారు. ఢిల్లీ, చెన్నై, ఛత్తీస్ ఘడ్ హైకోర్టుల నుండి ఒక్కొక్కరు బాగ్చి కంటే సీనియర్లుగా ఉన్నారు.
కోల్కతా హైకోర్టు న్యాయమూర్తులలో సమద్దర్ తర్వాత సీనియర్ న్యాయమూర్తులుగా ఉన్నవారు జస్టిస్ ఇంద్ర ప్రసన్న ముఖర్జీ, హరీష్ టాండన్, సౌమెన్ సెన్ లు. వీరిలో సమద్దర్ సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తుంటే ప్రసన్న ముఖర్జీ మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు.
ఇంతమంది సీనియర్లను కాదని బాగ్చిను ఎంపిక చేయటానికి గల కారణం ఏమిటో సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ప్రస్తావించలేదు. సుప్రీం కోర్టులో కోల్కతా హైకోర్టు నుండి ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నందున బాగ్చిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. పాఠకులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం సిక్కిం ప్రధాన న్యాయమూర్తి సమద్దర్, మేఘాలయ ప్రధాన న్యాయమూర్తి ముఖర్జీ కూడా వాస్తవానికి కోల్కతా హైకోర్టుకు చెందినవారే. కొలీజియం తీర్మానంలో ఉన్న పరిస్థితులు అన్నీ పరిశీలించి, ప్రతిభ, వృత్తిపరమైన నిజాయితీ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో ఉండాల్సిన బహులత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జస్టిస్ బాగ్చిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. గతంలో కూడా ఇలా సీనియర్లను పక్కన బెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. జస్టిస్ బాగ్చి 2031 వరకూ పదవిలో కొనసాగనున్నారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో ఉన్న సీనియారిటీ ప్రకారం ఆయన 2031లో ప్రధాన న్యాయమూర్తి కానున్నారు.
ది వైర్ తెలుగు స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.