
అమెరికా- ఇజ్రాయిల్ దేశాలకు వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక యుద్ధానికి సిద్ధపడ్డారన్న ఆరోపణలపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్కా ఆల్బనీస్పై అమెరికా బుధవారం నాడు ఆంక్షలు విధించింది. గాజాలో జరుగుతోన్న నరమేధంలో భాగస్వాములైన బహుళ జాతి కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులపై విమర్శలు ఎక్కుపెట్టినందుకు ప్రతిస్పందనగా అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నది. గాజా పరిధిలో ఇజ్రాయిల్ చేస్తున్న ప్రత్యక్ష పరోక్ష యుద్ధం నరమేధంతో సమానమైన స్థాయిలో సాగుతోంది.
అమెరికా- ఇజ్రాయిల్ ప్రభుత్వాలకు చెందిన అధికారులు, వివిధ కంపెనీల నిర్వాహకులు, కార్యనిర్వాహక ఆధికారులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ప్రేరేపించడానికి అక్రమంగా వ్యవహరించారని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి మార్కో రూబియో ఆరోపించారు.
2022 నుంచి పాలస్తీనా భూభాగంలో జరుగుతోన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై అధ్యయనాలు సాగిస్తోన్న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఆల్బనీస్పై అమెరికా- ఇజ్రాయిల్‌లు చాలాకాలంగా విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నాయి.
ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహును అనుకరిస్తున్న ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్ దేశాల ప్రభుత్వాలను ఆల్బనీస్ ఈ వారం ప్రారంభంలో బహిరంగంగా విమర్శించారు. గాజాలో సాగిస్తోన్న యుద్ధ నేరాలకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఆయనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని, అటువంటి నెతన్యాహు అమెరికా వెళ్ళటానికి ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్ దేశాల గగనతలం గుండా ప్రయాణించారని, ఒక అంతర్జాతీయ నేరస్థుడు ప్రయాణించడానికి అవకాశాలు కల్పించినందుకు ఇటలీ, ఫ్రాన్స్, గ్రీస్ దేశాల ప్రభుత్వాలపై ఫ్రాన్సిస్కా ఆల్బనీస్ విమర్శలు గుప్పించారు.
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ జారీ చేసినందుకుగాను అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ న్యాయమూర్తులపై గత నెల అమెరికా ప్రభుత్వం పలుఆంక్షలు విధించింది.
ట్రంప్ కంటే ముందు బాధ్యతల్లో ఉన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంతర్జాతీయ న్యాయస్థానం దర్యాప్తుకు దూరంగా ఉన్నారు. దానికి భిన్నంగా ట్రంప్ ప్రభుత్వం అంతర్జాతీయ న్యాయస్థానం చర్యలపై దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు చట్టవిరుద్ధంగా స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది.
“అమెరికా, ఇజ్రాయిల్‌లకు వ్యతిరేకంగా రాజకీయ ఆర్థిక రంగాలలో యుద్ధాన్ని ప్రారంభించే చర్యలను ఎంత మాత్రమూ సహించబోము. ఆత్మరక్షణ విషయంలో అమెరికా ఎల్లప్పుడూ తన భాగస్వామ్య దేశాల పక్షాన నిలుస్తుంది” అని రూబియో సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో వెల్లడించిన ఒక ప్రకటనలో తెలిపారు.
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన మరో ప్రత్యేకమైన ప్రకటనలో “ఎటువంటి భేషజాలు లేకుండా వ్యక్తం అవుతున్న యూదు వ్యతిరేకత, ఉగ్రవాద చర్యలకు బహిరంగంగా మద్దతు ప్రకటించడం, అమెరికా- ఇజ్రాయిల్ పాశ్చాత్య దేశాలను బాహాటంగా విమర్శించటం” ఆల్బనీస్పై ఆంక్షలు విధించడానికి కారణాలంటూ ప్రకటించింది.
“ఆమె బాధ్యతలో ఉన్నంతకాలం ఈ వ్యతిరేకత బాహాటంగా బట్టబయలవుతోంది. ఎటువంటి ఆధారాలు లేకుండా నెతన్యాహుపై చర్యలు తీసుకోవాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి సిఫార్సు చేయటం, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, మాజీ ఇజ్రాయిల్ ఎలక్షన్ శాఖ మంత్రి యువోవ్ గల్లంట్‌లపై అరెస్టు వారింట్స్ జారీ చేయించడం ఆంక్షలకు కారణాల”ని అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం ప్రకటన వివరించింది.
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ శాఖ మంత్రి గలాంట్లను అరెస్ట్ చేయాల్సిందిగా అంతర్జాతీయ న్యాయస్థానం వారెంట్లు జారీ చేసింది. పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ప్రజలకు నిత్యావసరాలైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయం అందకుండా అవరోధాలు సృష్టించటం ద్వారా వీరు ఇరువురు మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ న్యాయస్థానం ఆరోపించింది.
అమెరికా ప్రభుత్వం విధించిన ఆంక్షలపై స్పందించాలని కోరినప్పుడు ఆమె అల్ జజీరా టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ “మాఫియా తరహాలో రెచ్చగొడితే స్పందించడానికి ఏముంటుంది! ఐక్యరాజ్యసభ సభ్యులు దారుణ మారణ హోమాన్ని అడ్డుకోవాలని, నరమేధానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని గుర్తు చేసే పనిలో హడావుడిగా ఉన్నాను” అన్నారు.
సామాజిక మాధ్యమాలలో క్రియాశీలకంగా ఉన్న ఫ్రాన్సిస్కా అంతర్జాతీయ న్యాయస్థానం చర్యలను సమర్థిస్తూ “నేను నిస్సందేహంగా న్యాయం పక్షాన నిలిచానని గతంలో ఎన్నడూ లేనంతగా ఈరోజు స్పష్టమైనది” అని స్పందించారు.
ఆల్బనిస్ జన్మస్థలం అంతర్జాతీయ న్యాయస్థానానికి కేంద్రంగా ఉన్న ఇటలీ. అటువంటి దేశం నుంచి వచ్చిన తాను ” ప్రతిభావంతమైన న్యాయ నిపుణులు, అనుభవజ్ఞులైన న్యాయవాదులు, సాహసోపేతమైన న్యాయమూర్తులు అందరూ న్యాయాన్ని కాపాడటం కోసం ప్రాణాలకు వెరవకుండా కృషి చేశారు” అని ఆల్బనీస్ తెలిపారు.
ఆల్బనీస్ తాజా నివేదికపై అమెరికా ఆగ్రహవేశాలను వ్యక్తం చేసింది. ఈ నివేదికలో గాజాలో జరుగుతోన్న నరమేధానికి సహకరించినందుకు అంతర్జాతీయ బహుళ జాతి సంస్థలు అమెరికా కేంద్రంగా పనిచేసే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు గాజా, వెస్ట్ బ్యాంకులలో ఇజ్రాయిల్ సేనలు సాగిస్తోన్న యుద్ధాలు అపారమైన లాభాలు పొందటానికి సహకరిస్తున్నాయంటూ ఆల్బనీస్ ఈ నివేదికలో ఆరోపించారు. ఈ చర్యలన్నీ అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైనవనని, గాజాలో జరుగుతోన్న నరమేధానికి ఈ ప్రైవేటు కంపెనీలను కూడా బాధ్యులను చేయాలంటూ ఈ నివేదిక ప్రతిపాదించింది.
ఈ నివేదిక, ఆ నివేదిక రూపొందించే ప్రయత్నంలో ఆమె వివిధ కంపెనీలను చేరుకోవడానికి చేసిన ప్రయత్నాలు తాజా ఆంక్షలకు కారణమయ్యాయని రూబియో ఆ ప్రకటనలో తెలిపారు. “ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ కంపెనీలకు ఆమె లేఖలు రాయడం ద్వారా పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఆమె నుంచి లేఖలు అందుకునే వాటిలో అమెరికాకు చెందిన ప్రధాన కంపెనీలు ఉన్నాయి. ద్రవ్యరంగంలోనూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలోనూ రక్షణ రంగంలోనూ కేంద్రంలోనూ పౌర సేవలు అందించే రంగంలోనూ ఈ కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నాయి” అని రూబియో ప్రకటన తెలిపింది.
“ఈ లేఖలో నిరాధారమైన కీలకమైన ఆరోపణలు చేయడంతో పాటు ఈ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులపై కూడా చర్యలు తీసుకోవడానికి వీలుగా అంతర్జాతీయ న్యాయస్థానం దర్యాప్తు చేయాలని ఆమె ప్రతిపాదించారు”అని రూబియో ఆ ప్రకటనలో తెలిపారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.