
పదకొండేళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ ఏప్రిల్‌లో మోడీ నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు.
75 ఏళ్లు నిండిన తర్వాత మోడీని ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సూచనలు పంపిస్తోందని శివసేన(ఉద్ధవ్ బాలసాహెబ్ థాకరే)నేత సంజయ్ రావత్ అన్నారు.
“75 ఏళ్లకు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిబంధనను ఆర్ఎస్ఎస్, మోడీలు కలిసి రూపొందించారు. ఈ నిబంధనను స్వయంగా మోడీయే అమలు చేసే సమయం వచ్చిందని ఆర్ఎస్ఎస్ పదేపదే మోడీకి గుర్తు చేస్తోందని అనుకుంటున్నాను” అని రావత్ వ్యాఖ్యానించినట్టు దక్కన్ క్రానికల్ పత్రిక వార్త ప్రచురించింది.
ఒక మనిషి 75 ఏళ్లకు చేరుకున్న తర్వాత బాధ్యతల నుంచి తప్పుకుని, ఇతరులకు అవకాశం ఇవ్వాలంటూ ఆర్ఎస్ఎస్ నేత మొరాపంత్ పింగ్లె చేసిన వ్యాఖ్యను ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పునఃప్రస్తావించారు. ఈ నేపథ్యంలో సంజయ్ రావత్ వ్యాఖ్యలు చేశారు.
పింగ్లే జీవితం, కృషిపై రూపొందించిన ఇంగ్లీషు పుస్తకాన్ని నాగపూర్‌లో విడుదల చేస్తూ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“పింగ్లే ఆర్ఎస్ఎస్కు నేర్పిన పాఠం ఇది. ఎటువంటి ప్రచార ఆర్భాటాలకు తావివ్వకుండా 75 ఏళ్ల వరకు పని చేసి 75 తర్వాత వైదొలగాలన్నదే ఆ పాఠం.”
మోడీనీ ఉద్దేశించి మాట్లాడుతూ, ఆ సూత్రాన్ని పాటిస్తారా లేదా అన్నది వేచి చూడాలని రావత్ వ్యాఖ్యనించారు.
“బీజేపీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్‌లు 75 ఏళ్లు దాటగానే వాళ్లను మోడీ బలవంతంగా ఇంటికి పంపారు. అదే సూత్రాన్ని తన విషయంలో పాటిస్తారా లేదా అన్నది చూడాలి” రావత్ అన్నారు.
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 11 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ ఏడాది ఏప్రిల్‌లో నాగపూర్‌లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలోనే మోడీ సెప్టెంబర్‌లో ప్రధానిగా పదవీ విరమణ చేయనున్నారని ఆయన వారసుడిగా మహారాష్ట్ర బీజేపీ నేత రానున్నారని రావత్ వ్యాఖ్యానించారు.
ఈ విషయాన్ని చర్చించటానికి ఆర్ఎస్ఎస్ మోడీని నాగపూర్ పిలిపించుకున్నదని రావత్ అన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.