
1984 అక్టోబరు 24న ఫ్రాన్సులో ఫ్రెంచి పోలీసులు చేత అరెస్టయిన ఒక జాతీయ విమోచననోద్యమనేత 2025 జూలై 25న విడుదల కాబోతున్నారు. తన నిరవధిక నిర్బంధకాలం సరిగా 40 సంవత్సరాల 7 నెలలు అవుతుంది.
సామ్రాజ్యవాద యుగంలో ఇలా సుదీర్ఘ జైలు జీవితాలు, అరుదుగానైనా సంభవిస్తూనే ఉన్నాయి. అయితే ఇవి సామ్రాజ్యవాద దేశాలలో మాత్రం కాదు. సామ్రాజ్యవాద రాజ్యాల ప్రత్యక్ష లేదా పరోక్ష పెత్తనం కిందున్న దేశాలలో, ఇలాంటి అత్యంత అరుదైన సుదీర్ఘ నిరవధిక జైలు జీవితాలు కనబడతాయి. కానీ అమెరికా, యూరప్‌లలో ఇలాంటి అవకాశం లేదు. వాటి రాజ్యాంగ- న్యాయవ్యవస్థలు అందుకు సాధారణంగా అవకాశం కల్పించవు. ఇది ఇలాంటి రికార్డునే కాకుండా, భావాన్ని కూడా భ్రమగా మార్చివేసింది.
సామ్రాజ్యవాద వ్యతిరేక హీరో జార్జిస్ ఇబ్రహీం అబ్దుల్లా తన 33 వ ఏటా అరెస్టు అయ్యారు. యవ్వన వయస్సులో జైలుకు వెళ్లి 74వ ఏట ఆయన విడుదల కాబోతున్నారు.
రాజకీయ జీవితం- విప్లవసందేశ సింహావలోకనం..
అబ్దుల్లా సాధారణ జాతీయ విమోచనోద్యమకారుల కోవలోకి మాత్రమే కాకుండా అదనంగా కమ్యూనిస్టు కోవలోకి కూడా వస్తారు. లెబనాన్‌లో పాఠశాల ఉపాధ్యాయునిగా ఆయన పనిచేస్తూ తొలుత పాలస్తీనా జాతీయ విమోచనోద్యమానికి ఆకర్షితుడయ్యారు. ఆ క్రమంలో కమ్యూనిస్టు సిద్ధాంతానికి కూడా ఆకర్షితుడైయ్యారు. సామ్యవాద మార్గంలో పాలస్తీనా జాతీయ విమోచనోద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారు. మార్క్సిస్టు- లెనినిస్టు సంస్థ స్థాపన కోసం పూనుకున్నారు.
తొలుత బ్రిటన్, తర్వాత అమెరికా సామ్రాజ్యవాదాల, ప్రత్యక్ష అండతో సెటిలర్స్ దేశంగా ఏర్పడి, సాయుధ ఉగ్రవాద రాజ్యంగా మారిన ఇజ్రాయిల్‌ను సాయుధ ప్రతిఘటనా మార్గంలో తప్ప ఓడించలేమని నమ్మారు. ఇలాంటి ప్రతిఘటనా మార్గం చేపట్టకుండా పాలస్తీనా విమోచన సాధ్యం కాదని భావించారు. ఇలా నమ్మిన మార్గంలో అమెరికా సామ్రాజ్యవాద, ఇజ్రాయిల్ జాత్యహంకార ప్రభుత్వాలకు చెందిన రాయబార సిబ్బందిని లక్ష్యంగా చేసే పద్దతులు అవసరమని భావించారు. అది ఆయన వ్యక్తిగత విధానం కాదు. ఆయన నేతృత్వంలోని పాలస్తీనా విమోచనోద్యమ మార్క్సిస్టు- లెనినిస్టు చేపట్టిన రాజకీయ మార్గమది. అందులో భాగంగా పై రెండు దేశాల రాయబారుల హత్య చోటుచేసుకున్నది. ఆ క్రిమినల్ కేసులో అబ్దుల్లాను ముద్దాయిగా చేర్చారు. అజ్ఞాత జీవితంలో ఒక ప్రయాణంలో ఉండగా అబ్దుల్లాను 1984 అక్టోబరు 24న ఫ్రాన్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. 1987లో ఆయనకు ఫ్రాన్సు దేశ కోర్టు యావజ్జీవశిక్షను విధించింది.
ఫ్రాన్స్ రాజ్యాంగ న్యాయ సూత్రాల ప్రకారం, యావజ్జీవ శిక్ష 15 ఏండ్లు అనుభవించిన తర్వాత పేరోల్ అభ్యర్థన దరఖాస్తును, పాతికేండ్ల తర్వాత విడుదల దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లభిస్తుంది. ఇలాంటి దరఖాస్తులు ఆయనకు ఏవీ ఫలించలేదు. పై అర్హత పొందిన నేపథ్యంలో మొత్తం 11 సార్లు విడుదల కోసం అబ్దుల్లా తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్లు వేశారు. కొన్నిసార్లు దాదాపు విడుదల జరిగే పరిస్థితి ఏర్పడింది. రేపోమాపో పారిస్ కోర్టు విడుదల చేయనున్నదనే పరిస్థితి ఏర్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకట్రెండు సార్లు విడుదల తేదీలు కూడా ఖరారైన పరిస్థితి ఏర్పడింది. అయినా అబ్దుల్లా ఫ్రాన్సు కోర్టులు విడుదల చేయలేదు. విడుదల చేసే ఉత్తర్వులు ఇవ్వబోయిన చివరి క్షణాలలో తిరిగి నిర్ణయాలను వెనక్కి తీసుకున్నాయి. ఫ్రాన్సు ప్రభుత్వం మీద అమెరికా- ఇజ్రాయిల్ ప్రభుత్వాలు బహిరంగ రూపంలోనే ఒత్తిళ్లు తేవడం అందుకు కారణం.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆధునిక ప్రపంచంలో పుట్టిల్లు బ్రిటన్ కావచ్చు. కానీ, వాస్తవ అర్థంలో రూసో, వాల్తేరు, మాంటెస్కూ వంటి ఆధునిక ప్రజాస్వామ్య తాత్విక ప్రబోధనాలతో విప్లవాత్మక పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఫ్రాన్స్‌లోనే మొట్టమొదట ఆవిర్భవించింది. ఫ్యూడలిజాన్ని ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంలో బలప్రయోగంతో కూలదోసిన చరిత్ర ఫ్రెంచి పార్లమెంటరీ వ్యవస్థకు ఉంది. కానీ అలాంటి ఫ్రాన్స్ కూడా తన ప్రకటిత పార్లమెంటరీ ప్రజాస్వామ్య నీతికి తిలోదకాలిచ్చింది. అబ్దుల్లా 41 ఏండ్ల జైలు జీవితం అందుకొక సజీవ ఉదాహరణగా నిలుస్తుంది.
వర్తమాన ప్రపంచంలో ఉనికిలో ఉన్న ప్రాథమిక వైరుధ్యాలలో సామ్రాజ్యవాద దేశాల మధ్య అంతర్వైరుధ్యం ఒకటి. రష్యా- చైనా కూటమికి వ్యతిరేకంగా అమెరికా- యూరోపియన్ యూనియన్ మధ్య స్థూలంగా ఐక్యత ఉన్నా, సూక్ష్మంగా అమెరికా- ఈయూల మధ్య అంతర్వైరుధ్యం కూడా ఉంది. ట్రంప్ అధికారానికి వచ్చాక అది తీవ్రమైనది. సుంకాల సమస్య పెరిగింది. అయినా ఇవేవీ అబ్దుల్లా విడుదల అంశాన్ని ప్రభావితం చేయలేదు.
యూఎన్ఓలో ఇతర కొన్ని అంతర్జాతీయ వేదికలలో అమెరికా వైఖరిని జర్మనీతో కలసి ఫ్రాన్సు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కానీ, ఒక విప్లవ జాతీయ విమోచనోద్యమ నేత, ముఖ్యంగా కమ్యూనిస్టు నేత అబ్దుల్లా విడుదల విషయానికి వస్తే ఫ్రాన్సు ప్రభుత్వం తన బుద్ధిని చాటుకున్నది. పైగా తన స్వంత దేశ రాజ్యాంగ నీతి ప్రకారం, తన స్వంత న్యాయవ్యవస్థ నీతి ప్రకారం విడుదల చేయాల్సిన నాయకుణ్ణి విడుదల చేయలేదు. దీంతో సామ్రాజ్యవాద రాజ్యాల మధ్య ఐక్యత పరిరక్షణ కోసం తన రాజ్యాంగంపై తానే దాడికి దిగడం గమనార్హం.
సామ్రాజ్యవాద దేశాల మధ్య ఐక్యత, ఘర్షణ రెండూ కొనసాగుతాయి. వాటి స్థానాలు సుస్థిరమైనవి కాదు. అవి నిత్యచలనంలో ఉంటాయి. కొన్ని సందర్భాలలో స్థానభ్రంశం కూడా చెందుతాయి. అబ్దుల్లా నిర్బంధ సమస్యకూడా అమెరికా- ఫ్రాన్సు ప్రభుత్వాల మధ్య సంబంధాలలో మౌలిక మార్పును తెచ్చింది. అందుకు గల కారణానని అవలోకించుదాం.
అబ్దుల్లా విడుదల కోసం ఫ్రాన్సులో క్రియాశీల ఉద్యమం దీర్ఘకాలిక ప్రాతిపదికన నిరవధికంగా కొనసాగింది. దశలవారిగా పోరాటాలు సాగాయి. పైగా అవి క్రమేణా తీవ్రరూపం ధరించసాగాయి. ఫ్రాన్సులో మొదలై పశ్చిమాసియా దేశాలకు క్రమంగా విస్తరించిసాగింది. ముఖ్యంగా అరబ్బు దేశాలలో తీవ్రతం కాసాగింది.
గాజా మారణహోమం పట్ల ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా పశ్చిమాసియాలో ఏ మేరకు నిరసనోద్యమం పెరిగే స్థాయిని బట్టి అబ్దుల్లా విడుదలకై జరిగే ఉద్యమ తీవ్రత కూడా పెరిగింది. అది ఫ్రాన్స్ ప్రభుత్వానికి అంతర్గత సమస్యగా మారసాగింది. సహజంగానే అమెరికా- ఫ్రాన్సు మధ్య ఐక్యత- ఘర్షణల మధ్యగల పొందికలో మార్పులకు కారణమవుతోంది. అది ఒకానొక దశకు చేరినప్పుడు సహజంగానే అమెరికా- ఇజ్రాయిల్‌ల మీద ఫ్రాన్స్ నుంచి కూడా కౌంటర్ ఒత్తిడిని తెస్తుంది. అది తెర వెనుక ప్రారంభమై క్రమంగా తెర మీదికి వస్తుంది. ఆ స్థితి ఏర్పడే నేపథ్యంలో అమెరికా- ఇజ్రాయిల్‌లు ఒక వెనుకడుగును వేశాయి. అబ్దుల్లా ఒకవేళ కోర్టు ఎదుట క్షమాపణలు చెబితే విడుదల చేయవచ్చని ఫ్రాన్సుకు అమెరికా సూచించింది. అది బెడిసి కొట్టింది. అది మరో మలుపు తిరిగింది.
ఫ్రాన్సుతో సంబంధాలను బట్టి అమెరికా ఇజ్రాయిల్ ఒక మెట్టు దిగిన మాట నిజం. ఫ్రాన్సుకు ఒకింత ఊరట కలిగిన మాట కూడా నిజమే. అబ్దుల్లా నుంచి క్షమాపణను చెప్పించుకొని విడుదల చేస్తే స్వామికార్యం, స్వకార్యం నెరవేరతాయని ఫ్రాన్సు కలలు కన్నది.
అదే విధంగా అబ్దుల్లా ఒకవేళ క్షమాపణ చెబితే, ఆ సన్నివేశానికి మీడియా ద్వారా విస్తృత ప్రాచుర్యం ఇద్దామని అమెరికా, ఇజ్రాయిల్‌లు కలలు కన్నాయి. నలభై ఏండ్ల జైలు జీవితం ద్వారా ప్రపంచ పీడిత ఉద్యమ సంస్థలకు స్ఫూర్తిదాతగా, పాలస్తీనా విమోచనోద్యమానికి హీరోగా వెలుగొందుతోన్న అబ్దుల్లాను జీరోను చేయొచ్చన కలలు కన్నాయి. తద్వారా బరిలో నిలిచి పోరాడుతున్న పాలస్తీనా విమోచనోద్యమ శక్తులపి నీరుగార్చవచ్చని ఆశపడ్డాయి. అలాంటి వేటగాళ్ల వలలకు చిక్కడానికి అబ్దుల్లా అంగీకరించలేదు. ఆయన సావర్కర్ వంటి ద్రోహుల జాబితాలోకి చేరడానికి ససేమిరా ఒప్పుకోలేదు. తాను ఏ పాలస్తీనా జాతి విమోచన కోసం కమ్యూనిస్టుగా, విప్లవ నేతగా నాలుగు దశాబ్దాలకు పైగా జైలు జీవితం సాగించాడో ఆ జాతి రాజకీయ నైతిక ప్రతిష్టల్ని దిగజార్చదలుచుకోలేదు. ప్రపంచ పీడిత ప్రజల హృదయాలలో ముఖ్యంగా చావు బ్రతుకుల్లో పోరాడుతున్న పాలస్తీనా ప్రజల మనస్సుల్లో జీరోగా మారి, స్వేచ్ఛా ప్రపంచంలోకి రావాలని భావించలేదు.
స్వేచ్ఛను కోల్పోయి, తిరిగి స్వేచ్ఛను సాధించడానికి పోరాడే పాలస్తీనా జాతీయ విమోచనోద్యమానికి మచ్చతెచ్చే క్షమాపణ చెప్పాలనుకోలేదు. ఒకవేళ క్షమాపణ చెప్పనందున శేష జీవితాన్ని జైలుల్లో గడపాల్సి వస్తే, అది స్వేచ్ఛ కోసం పోరాడే పాలస్తీనా జాతిలో హీరోగా నిలబడవచ్చని భావించాడు. అందుకే క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. దీంతో పైన పేర్కొన్న మూడు దేశాల ప్రభుత్వాల నోట్లో వెలక్కాయ పడింది. మళ్లీ ప్రతిష్టంభన ఏర్పడింది.
బలాబలాల పొందికలో సమతూకం శాశ్వత సూత్రం కాదు కదా. అబ్దుల్లా విడుదల కోసం ఉద్యమం విస్తృతమౌతోంది. ఫ్రాన్సు దేశ ప్రజల దృష్టిలో ఫ్రాన్సు ప్రభుత్వ రాజనీతిక్రమంగా బట్టబయలు కాసాగింది. ముఖ్యంగా ఫ్రెంచి రాజ్యవ్యవస్థ, ఫ్రెంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పాతరేస్తున్న స్థితి ఫ్రెంచి సమాజాన్ని ఆగ్రహానికి గురిచేయసాగింది. గత్యంతరం లేని పరిస్థితులలో అబ్దుల్లాను బేషరతుగా విడుదల చేయడానికి పారిస్ అప్పీలేట్ కోర్టు ఆదేశించింది. అయితే లెబనాన్‌కు వెళ్లాక తిరిగి ఫ్రాన్సులో అడుగు పెట్టరాదనే షరతు విధించింది. అవి అబ్దుల్లా రాజకీయ విధానానికి గానీ పాలస్తీనా విమోచన మార్గానికి గానీ ఎలాంటి నష్టం లేనిది.
సామ్రాజ్యవాద వ్యవస్థ తీవ్ర అంతర్గత సంక్షోభంలో చిక్కుకుంటున్న కాలమిది. యుద్ధాలను పరిష్కారంగా ఎంచుకునే దశకు చేరుకుంది. తాను అధికారానికి వస్తే ఉక్రెయిన్- రష్యా, గాజా- ఇజ్రాయిల్‌ల మధ్య యుద్ధాలను నియంత్రిస్తాననే నిర్దిష్ట హామీలతో గెలిచిన ట్రంప్ విరుద్ధ దశలో అడుగులు వేస్తున్నారు. నిరాయుధ యుద్ధాలలో ఒకటైన వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ ప్రభుత్వం పరాకాష్ట దశకు తీసుకెళ్తోంది. అది మరింత తీవ్రతరం చేస్తే అనివార్యంగా భౌతికయుద్ధాలకు దారితీస్తుంది.
ఏదిఏమైనా వర్తమాన ప్రపంచం యుద్ధం దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. పైన పేర్కొన్న రెండు యుద్ధాలను విరమింపజేయరాదు. పైగా ఇరాన్ మీద కొత్తయుద్ధానికి దిగి అమెరికా ఇజ్రాయిల్‌లు చేతులు కాల్చుకున్నాయి. ప్రపంచ బలాబలాల మధ్య పొందిక ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ఇరాన్ నుంచి అనూహ్యమైన ప్రతిఘటన ఎదురుకావడంతో పశ్చిమాసియా పరిస్థితిలో తీవ్ర మార్పుకు దారితీస్తుంది. అది ఏదో స్థాయిలో ప్రపంచ పరిస్థితిపై కూడా ప్రభావం కలిగిస్తుంది.
ఈ మారుతున్న పరిస్థితుల ప్రభావం అబ్దుల్లా విడుదల కోసం సాగిన ఉద్యమం మీద కూడా ఉంది. ఆయనను బేషరతుగా విడుదల చేయాల్సిన స్థితికి ఫ్రాన్సు నెట్టబడటానికి కూడా అదొక కారణంగా మారింది. ఫ్రాన్సు మీద అంతకంటే ఎక్కువ స్థాయిలో అమెరికా ఒత్తిడి తేవడానికి ఆటంకంగా మారడంలో కూడా అదొక కారణంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే అబ్దుల్లా విడుదల యాదృచ్ఛిక పరిణామం కాదు. అదో విడిఘటన కూడా కాదు. ఈనాటి ప్రపంచ యవనిక మీద పరస్పర విరుద్ధ శక్తుల మధ్యసాగే సంఘర్షణతో సంబంధంలేకుండా చూడాల్సిన ఘటన కాదు.
అదే విధంగా ఫ్రాన్సు రాజ్యాంగం ప్రకారం లేదా న్యాయవ్యవస్థ ప్రకారం ఓ పదేండ్ల క్రితమే, లేదా అంతకంటే ముందే సాధారణ పద్ధతిలో అబ్దుల్లా విడుదలయ్యారని అనుకుందాం. ఆ స్థితిలో అబ్దుల్లా విడుదలైనా పాలస్తీనా జాతీయ విమోచనోద్యమానికి తప్పకుండా ఉత్ప్రేకంగా ఉపకరించేది. ఇంత వరకూ అమెరికా ఒత్తిళ్లకు తలవంచి విడుదల చేయలేదు. కానీ ఈనాటి పరస్పర విరుద్ధశక్తుల మధ్య అనివార్యంగా విడుదల చేసింది. ఈనాటి విడుదల జరిగిన తీరు భిన్నమైనది. ఈనాటి అబ్దుల్లా విడుదల పాలస్తీనా విమోచనోద్యమానికి అనేక రెట్లు రాజకీయ, నైతిక బలాలను ఇస్తుంది.
ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని పేర్కొనాలి. పాలస్తీనా విమోచనోద్యమ పథంలో మొదటి నుంచి నాన్ కమ్యూనిస్టు ఉద్యమ శక్తులే ప్రధాన స్థానంలో ఉండేవి. అదే సమయంలో 1970వ దశకంలో కమ్యూనిస్టు శక్తుల స్థానం కూడా పెరిగింది.
ఒకవైపు యూఎస్ఎస్ఆర్ అనుకూల, మరోవైపు చైనా అనుకూల, ఇంకోవైపు స్వతంత్ర అరబ్ కమ్యూనిస్టు బృందాలు పని చేస్తుండేవి. కానీ, 1980 దశకం తర్వాత అవి నామమాత్రమైపోయాయి. ఓస్లో ఒడంబడిక మీద ఫతా(పీఎల్ఓ) సంతకం చేసిన తర్వాత అది కూడా బలహీనపడింది.
కారణాలు ఏమైనప్పటికీనీ తాజా పాలస్తీనా ప్రతిఘటనోద్యమంలో కమ్యూనిస్టు శక్తుల పాత్ర బయటకు వెల్లడి కాగలిగే స్థాయిలో లేదు. అయితే, అసలు లేకుండా పోయినట్లుగా భావించరాదు. ఈ సమయంలో 41 ఏండ్లుగా ఫ్రాన్సులో కఠోర జైలు జీవితంలో సైతం నిటారుగా నిలబడ్డ కమ్యూనిస్టు అబ్దుల్లా ఒక కొత్త కాంతిని ప్రసరింపజేస్తాడు. కమ్యూనిస్టులు పాలస్తీనా జాతీయ విమోచనోద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా స్పందించలేక పోయారో లేదా కమ్యూనిస్టుల ఆకాంక్షల ప్రకారం పాలస్తీనా జాతి స్పందించలేదో ఇప్పుడు చెప్పగలిగేది కాదు. కానీ పాలస్తీనా విమోచనోద్యమంలో కమ్యూనిస్టులు నేడు బలమైన భౌతిక పునాదితో లేరనేది ఒక భౌతిక సత్యం. ఈ స్థితిలో పాలస్తీనా విమోచనోద్యమంతో పాటు పశ్చిమాసియాలో సామ్రాజ్యవాద వ్యతిరేక జియోనిస్టు వ్యతిరేక ఉద్యమంలో కమ్యూనిస్టుల రాజకీయ ప్రతిష్ట పెరగడానికి అబ్దుల్లా పోషించిన పాత్ర గొప్పగా ఉపకరిస్తుంది.
అబ్దుల్లా చిరస్మరణీయ పాత్ర..
ఆయన 33వ ఏట విదేశీ జైలుకు చేరి 74 ఏట మాతృదేశమైన లెబనాన్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఈ 41 ఏండ్లల్లో ప్రపంచ కాలగమనంలో కొన్ని ముఖ్యమైన మార్పులు జరిగాయి.
ప్రచ్ఛన్న యుద్ధ శకంలో జైలుకు వెళ్లారు. అలీన ఉద్యమం ఉన్నత స్థాయిలో ఉండగా అబ్దుల్లా అరెస్టు అయ్యారు. ఆయన జైలులో ఉండగానే అట్లాంటిక్‌కి ఆవల రీగనిజం ఇవతల థాచరిజం ఉనికిలోకి వచ్చాయి. ఆయన జైలు ఊచల మధ్య ఉండగానే యూఎస్ఎస్ఆర్ కుప్పకూలింది. ఏకధృవ ప్రపంచ వ్యవస్థ ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్- ఇరాక్ దురాక్రమణలు, సద్దాం ఉరితీత, గడ్డాఫీ హత్యలు జరిగాయి. ఏకధృవ స్థితి నుంచి బహుళ ధృవ ప్రపంచస్థితికి మారింది.
పాలస్తీనా సమస్యకు వస్తే పీఎల్ఓ ఉచ్ఛస్థితి నుంచి పతనస్థితికి చేరింది. పీఎల్‌ఓను బలహీనపరచడంలో మతసంస్థగా ఆవిర్భవించిన హమాస్ సంస్థ ప్రాపంచిక పరిస్థితులపై ఆధారపడి సమరశీల జాతీయ విమోచనా సంస్థగా పరివర్తన చెందింది. అబ్దుల్లా అరెస్టుకు ముందు పాలస్తీనా ఉద్యమానికి వెస్ట్‌బ్యాంకు ఉన్నతమైనపాత్ర పోషిస్తే గాజా అనుసరించేది. ఆ తర్వాత గాజా ఉన్నతమైనపాత్ర పోషించే స్థాయికి చేరింది. అబ్దుల్లా సుదీర్ష జైలు జీవితం ప్రపంచ పరిణామాలలో అనేక మలుపులకూ, పశ్చిమాసియాలో మూలమలుపులకూ సాక్ష్యంగా నిలుస్తుంది.
ప్రపంచ పరిస్థితులలో పాలస్తీన విమోచనోద్యమ గమనంలో అనేక ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఉత్తానపనాలున్నాయి. ఉత్తేజం, నిరుత్సాహ పరిణామాలున్నాయి. అయినా జైలు ఊచల మధ్య కూడా అబ్దుల్లా స్థిరంగా నిలబడ్డారు. సామ్రాజ్యవాద వ్యతిరేక భావజాలానికీ అంతకంటె ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలానికీ నికరంగా, నిశ్చలంగా, నిబద్దంగా, సుస్థిరంగా నిలబడ్డారు. ఆ వీరయోధుడు తన పాలస్తీనా లక్ష్యానికీ కమ్యూనిస్టు సిద్ధాంతానికీ రాజకీయ నైతిక ప్రతిష్టలను చేకూర్చారు. యుద్ధభూమిలో వర్గపోరాట బరిలో నిలబడి రక్తమోడ్చుతూ నిలబడ్డ వీరవిప్లవయోధులకంటే జైలు ఊచల మధ్య నిరాయుధునిగా నిలబడ్డ అబ్దుల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి అనన్యమైనా బలం చేకూర్చారు. ఆ మహానీయ త్యాగధనుడు 2025 జూలై 25న ఒక సామ్రాజ్యవాద రాజ్య జైలు నుంచి విడుదలై, తన మాతృదేశం లెబనాన్‌లో 41 ఏండ్ల తర్వాత అడుగు పెట్టబోతున్నారు.
ఫ్రాన్సు నుంచి లెబనాన్ వరకే కాకుండా పశ్చిమాసియా, యావత్తు పీడిత ప్రపంచం అబ్దుల్లాకు స్వాగతం పలుకుతోంది. ఆయనకు పలికే స్వాగతం వ్యక్తిగతమైనది కాదు. అది సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటనా సిద్ధాంతానికి, కమ్యూనిస్టు సిద్ధాంత వైభవానికి పలికే స్వాగతం. ఈ స్వాగత హృదయంతో మనం కూడా స్పందిద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.