
గత మూడు నెలలో జరిగిన జాతీయా అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలం కావడంతో ఆయా కంపెనీల విలువ పడిపోయింది. దాంతో పాటే ఆయా కంపెనీలలో ఉన్న ఎల్ఐసీ వాటాల విలువ కూడా పడిపోయింది. (లీడ్)
బుధవారం రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం దారుణంగా పతనమవుతున్న రూపాయి విలువను నిలబెట్టే ప్రయత్నంలో విదేశీ మారకం మార్కెట్లో ఆర్బీఐ జోక్యం చేసుకొని డిసెంబర్ 2024లో 15.2 బిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు జరిపింది. గత సంవత్సరం నవంబర్ నెలలో ఈ అమ్మకాలు 20.2 బిలియన్ డాలర్లుగా సాగాయి. అదే నెల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ వాణిజ్య సుంకాల యుద్ధానికి తెరతీయనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ప్రత్యేకించి స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలానికి గురయ్యాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ విలువ పెరిగింది.
నిరంతరం పతనమవుతున్న రూపాయి విలువను కాపాడే ప్రయత్నంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేరుగా విదేశీ మారకం మార్కెట్లో అమ్మకాలు, కొనుగోళ్లకు దిగింది. గత కొన్ని నెలలుగా వివాదాస్పదమైన అమెరికన్ వాణిజ్య సుంకాలు, రాజకీయ భూగోళంలో అనిశ్చితి, పెట్టుబడుల పలాయనం వంటివి రూపాయి పతనానికి ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయి. రూపాయి విలువ పతనం ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుంది. ఐదుశాతం రూపాయి విలువ పతనమైతే ద్రవ్యోల్బణం 30- 35 బేస్ పాయింట్లు పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్ర అంచనా వేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే 40 దేశాల కరెన్సీలతో పోల్చి రూపాయి విలువ పతనాన్ని, పెరుగుదలను లెక్కిస్తారు. ఈ క్రమంలో ఆర్బీఐ జోక్యం అంటే భారతమార్కెట్లో ఆ నలభై దేశాల కరెన్సీలలో జరిగే లావాదేవీలను నియంత్రించడానికి జోక్యం చేసుకోవడమే, కరెన్సీ విలువ తక్కువగా ఉంటే ఎగుమతులు పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో దిగుమతుల పరిణామం మారకపోయినా దిగుమతుల విలువ పెరిగి, ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ మొత్తం లావాదేవీలు స్టాక్ మార్కెట్లో ఒక భాగంగా ఉన్న ఈక్విటీ మార్కెట్‌ను పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి.
ఈక్విటీ మార్కెట్లో భారతీయ జీవిత బీమా కంపెనీ ప్రధానమైన మదుపుదారు(ఇన్వెస్టర్). రూపాయి విలువ నిలబెట్టే ప్రయత్నంలో ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా ఈక్విటీ మార్కెట్ పడిపోయింది. అంటే ఈక్విటీ మార్కెట్లో షేర్ల విలువ పడిపోయింది. ఫలితంగా ఈక్విటీ మార్కెట్లో ప్రధాన మదుపుదారుగా ఉన్న ఎల్ఐసీపీకి ఒక జనవరి నెలలోనే 84 వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2024 డిసెంబర్ నాటికి వివిధ కంపెనీలలో ఎల్ఐసీ 14.72లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టింది. గత మూడు నెలలో జరిగిన జాతీయ- అంతర్జాతీయ ఆర్ధిక, రాజకీయ, వాణిజ్య పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లు అతలాకుతలం కావడంతో ఆయా కంపెనీల విలువ పడిపోయింది. దాంతో పాటే ఆయా కంపెనీలలో ఉన్న ఎల్ఐసీ వాటాల విలువ కూడా పడిపోయింది. 2024 డిసెంబర్ నాటికి 14.72 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న వివిధ కంపెనీలలో ఎల్ఐసీ వాటాల విలువ 2025 ఫిబ్రవరి 18నాటికి 13.87 లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. అంటే స్టాక్ మార్కెట్ అనిశ్చితి కారణంగా గత రెండు నెలలలో ఎల్ఐసీకి వచ్చిన నష్టం 84వేల కోట్ల రూపాయలు.
– ద వైర్ స్టాఫ్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.