
గల్వాన్ లోయకు సంబంధించి కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి ఉపశమనం లభించింది. 2020లో జరిగిన భారత్- చైనా ఘర్షణ మీద గతంలో రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసు విషయంలో సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. అంతేకాకుండా, భారత భూమిని చైనాకు అప్పగించారనే ఆయన సోషల్ మీడియా పోస్టుపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: 2020లో జరిగిన భారత్- చైనా గల్వాన్ లోయ ఘర్షణపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఉపశమనం లభించింది. రాహుల్‌పై దాఖలైన క్రిమినల్ పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు 2025 ఆగస్టు 4న తాత్కాలిక ఆదేశాలను వెలువరించింది. ఇందులో భాగంగా కేసుకు సంబంధించి మధ్యంతర స్టే మంజూరు చేసింది.
అయితే, భారత భూమిని చైనాకు అప్పగించారనే ఆయన సోషల్ మీడియా పోస్టుపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
లక్నో కోర్టులో రాహుల్‌పై జరుగుతోన్న పరువు నష్టానికి సంబంధించిన చర్యలను కొట్టివేయడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. దీంతో ఈ నిర్ణయాన్ని రాహుల్ గాంధీ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ గతంలో ఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో, 2022 డిసెంబర్ 16న భారత్ జోడో యాత్రను ప్రస్తావించారు. యాత్ర సందర్భంగా గాంధీ చేసిన ప్రకటన అవమానకరమైనదని అందులో ఆరోపించారు.
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లో భారత సైనికులను కొడుతోందని రాహుల్ గాంధీ చెప్పారని ఫిర్యాదులో శ్రీవాస్తవ తెలియజేశారు. అంతేకాకుండా, భారత మీడియా దీనిపై ఎలాంటి ప్రశ్నలు అడగడం లేదన్నారని ఫిర్యాదులో చెప్పారు.
2020 జూన్ 15న లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత- చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది. ఇందులో 20 మంది భారతీయులు, కనీసం నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీని తరువాత, రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. అయితే, దేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ, “ఎవరూ మన సరిహద్దులోకి ప్రవేశించలేదు, ఎవరూ చొరబడలేదు, లేదా మన పోస్టు ఎవరి ఆక్రమణలో లేదు” అని అన్నారు.
తరువాత, ఈ ప్రకటనలోని ఒక భాగాన్ని ప్రభుత్వ పత్రికా ప్రకటన నుంచి తొలగించారు. “వాస్తవ నియంత్రణ రేఖను దాటి భారతదేశం వైపు నిర్మాణాలను చేసేందుకు చైనా ప్రయత్నించినప్పుడు ఘర్షణ చోటుచేసుకుంద”ని విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
రెండు దేశాలు తమ సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. అయినప్పటికీ అరుణాచల్ ప్రదేశ్, లద్దాఖ్‌లలో చైనా చొరబాటు ఎంతవరకు ఉందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.
“పార్లమెంటులో మాట్లాడండి, సోషల్ మీడియాలో ఎందుకు?”
లైవ్ లా నివేదిక ప్రకారం, జస్టిస్ దీపాంకర్ దత్తా రాహుల్ గాంధీతో “మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది పార్లమెంటులో చెప్పండి. సోషల్ మీడియా పోస్టులలో చెప్పాల్సిన అవసరం ఏంటి?” అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడారు.
“పత్రికల్లో ప్రచురితమైన విషయాలను కూడా రాహుల్ గాంధీ చెప్పలేకపోతే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎలా కొనసాగగలర”ని సింఘ్వీ ప్రశ్నించారు.
“డాక్టర్ సింఘ్వీ, చైనా 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు? మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏవైనా విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయా? మీరు అలాంటి ప్రకటనలు ఎందుకు చేస్తారు? మీరు నిజమైన భారతీయులైతే, మీరు అలా అనరు” అని జస్టిస్ దత్తా పదునైన ప్రశ్నను సంధించారు.
దీనికి ప్రతిస్పందనగా, “మన సైనికులలో 20 మంది మరణించారు. అంతేకాకుండా ఇది ఆందోళన కలిగించే విషయమ’ని నిజమైన భారతీయుడు కూడా దీని గురించి మాట్లాడగలరని సింఘ్వీ అన్నారు.
దీనిపై జస్టిస్ దత్తా, “సరిహద్దులో వివాదం జరిగినప్పుడు, రెండు వైపులా నష్టాలు చవిచూడటం అసాధారణమేనా?” అని అడిగారు.
“ఇలాంటి ప్రశ్నలను లేవనెత్తడానికి సరైన వేదిక సోషల్ మీడియా కాదు, పార్లమెంట”ని జస్టిస్ దత్తా అన్నారు.
లైవ్ లా నివేదిక ప్రకారం, రాహుల్ గాంధీ ప్రకటనలోని భాష ఇంకా మెరుగ్గానే ఉందని సింఘ్వీ పేర్కొన్నారు.
కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రశ్నలు లేవనెత్తినందుకు పరువు నష్టం ఫిర్యాదు వేశారని చెప్పారు. ఆయనను వేధించడానికి ఈ ఫిర్యాదు ఒక మార్గం మాత్రమేనని సింఘ్వీ తెలియజేశారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.