
“ఆపరేషన్ సింధూర్” పేరిట చేపట్టిన సైనిక చర్య ముచ్చటగా మూడవ రోజుకల్లా యధాప్రకారం అసంతృప్తిగా, అసంపూర్ణంగా ముగిసిపోయింది. దీనికి తోడు(అమెరికా) మధ్యవర్తిత్వానికి తలొగ్గడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీన్ని బట్టి “ఆపరేషన్ సింధూర్” ముందుగా అనుకున్న మేరకు నష్టం కలిగించాక, అమెరికా రంగప్రవేశం చేసి 1.3 బిలియన్ డాలర్ల ఐఎంఎఫ్ అప్పు సాకున ఇస్లామాబాద్ మీద ఒత్తిడి తీసుకువచ్చి దారికి వచ్చేలా చేసినట్టుగా కనబడుతున్నది.
నా చిన్నప్పుడు మా ధార్వాడ్‌లో దక్కనీ హిందూస్తాన్ భాషలో “పడేంగా పడేంగా పూస్”(పేలుద్ది పేలుద్ది అనుకుంటే తుస్సుమంది) అన్నట్టుగా “ఆపరేషన్ సింధూర్” ముగిసిపోయింది.
పహల్గాంలో ఏప్రిల్ 22 హత్యకాండ తరువాత మన నాయకుల ధీర వీర ప్రవచనాలలో పాకిస్తాన్ “ఊహింపనలవికాని” పర్యవసానాలు చవిచూడబోతోందనే ప్రధాని మోడీ మాటలు గుర్తు చేసుకోండి. మన వాళ్లు భారీగా ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నారని జనం భావించారంటే, వారిని తప్పు పట్టలేం కదా. సామాజిక మాధ్యమాల్లో అయితే “పెట్టుకోక పెట్టుకోక మోడీతో పెట్టుకుంది, ఈ సారి పాకిస్తాన్ పని సఫా” అనే రీతిలో ప్రచారం హోరెత్తి పోయింది. చివరికి అటూ ఇటూ కాసిన్ని డ్రోన్లు, క్షిపణుల ప్రయోగంతో “ఆపరేషన్ సింధూర్” ఊహింపనలవి కాని రీతిలో ముగిసిపోయింది.
ఉగ్రవాద స్థావరాలైన మురిద్కే, భావల్పూర్ల మీద క్షిపణుల దాడి మినహా పాకిస్తాన్ ఉత్తర భాగంలోని కీలక స్థావరాలైన హాజీపీర్, స్కర్దుల మీద దాడులు చేసే ప్రణాళిక లేకపోవడం విచిత్రమే. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేశామని ప్రకటించడం ద్వారా పాకిస్తాన్‌పై పైచెయ్యి సాధించామని ప్రజలను మానసికంగా ఒప్పించడానికి, ఉగ్రవాదం మీద పోరుసల్పే సంకల్పం మోడీ ప్రభుత్వానికే ఉందని రాజకీయంగా ప్రచారం చేసుకోవడానికి భావల్పూర్, మురిద్కే దాడులు పనికి వస్తాయి. “భవిష్యత్తులో ఎలాంటి ఉగ్రదాడి జరిగినా దానిని యుద్ధంగా పరిగణించి తగినరీతిలో బదులు ఇస్తాం” అన్న మోడీ సందేశం మంచిదే కానీ అది మాత్రమే సరిపోదు.
“ఆపరేషన్ సింధూర్”లో మన వైమానిక బలగం నూతన సాంకేతికతను, కొత్తగా వస్తున్న ధోరణులను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడంలో లోటుపాట్లు ఎదుర్కొంటుంది. భారత వైమానిక దళానికి చెందిన రెండు రాఫేల్ యుద్ధ విమానాలను, ఒక రష్యన్ యస్-30ను, 2 దేశీయ మిరేజ్- 2000 విమానాలను ధ్వంసం చేశాయని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ మేరకు సీఎన్ఎన్, రాయిటర్స్, ది టెలిగ్రాఫ్(లండన్) వార్తా సంస్థలు వెలువరించిన భోగట్టాను అమెరికన్ అభిజ్ఞ వర్గాలు కూడా ధృవీకరించాయి. “ఆపరేషన్ సింధూర్”లో భారత్- పాక్ వైమానిక బలగాల మధ్య జరిగిన పోరు గురించి ఒక మాజీ సైనిక అధికారి మాట్లాడుతూ “అవాక్స్(ఏడబ్ల్యూఏసీఎస్) నిశ్శబ్దంగా పహారాకాస్తుంటే జే 10 సీ ఫైటర్ విమానాలు నిష్క్రియాత్మకంగా ఎగురుతూ మాక్-5 వేగంతో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగే పీఎల్ 15-ఈ, క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగించింది. ఆ క్షిపణి 50 కిలోమీటర్ల దగ్గరకు వస్తేగాని రాఫేల్ యుద్ధ విమానం ఆ క్షిపణి తన మీద దాడికి ఎక్కుపెట్టబడిందని గ్రహించలేకపోయింది. అంత వేగంతో వస్తున్న క్షిపణిని ఎదుర్కోవడానికి గానీ, తప్పించుకోవడానికి గానీ భారతీయ పైలెట్‌కు కేవలం 9 సెకన్ల సమయమే మిగిలి ఉంటుంది. ఆ క్షణాలలో బతుకు జీవుడాని తప్పించుకోవడం కూడా అసాధ్యం.” అని తేటతెల్లంగా వివరించారు.
“ఆపరేషన్ సింధూర్” నడిచిన రెండు, మూడు రోజులలో జమ్మూ కశ్మీర్ గగనతలంలో భారత వైమానిక బలగాల జాడ లేకపోవడానికి గల కారణాలు ఏంటి?
“ఎందుకంటే మన యుద్ధ విమానాలు గాల్లోకి లేచిన మరుక్షణం పాకిస్తాన్ రాడార్లు పసిగట్టేస్తున్నాయి. ఎందుకంటే మన రాడార్లు పసిగట్టలేని వాటిని పాకిస్తాన్ వినియోగిస్తున్న ఇరి”ఐ” పసిగట్టగలుగుతున్నాయి. ఎందుకంటే ప్రమాదాన్ని రాఫెల్ యుద్ధ విమానం పసిగట్టలేనంత దూరం నుంచి పిల్-15 క్షిపణులను పాకిస్తాన్ ప్రయోగించగలుగుతున్నది. ఎందుకంటే భారత్ అమ్ములపొదిలో పాశుపతాస్త్రం అని భావించిన 250 మిలియన్ డాలర్ల విలువ చేసే రాఫెల్ యుద్ధ విమానం రన్‌వే మీద పొదిగే కోడిలా కూలబడి పోయి ఉన్నది. భారత వైమానిక బలగాలు పాక్ సరిహద్దులకు 300 కిలోమీటర్ల ఇవతల మాత్రమే గాల్లోకి లేవగలుగుతాయి కాబట్టి”
ఆచితూచి ఖర్చు చేసే భారత వైమానిక దళం ఎందుకనో ఈ సారి తలకుమించిన వెలకి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. పాకిస్తాన్ మాత్రం గురి చూసి దెబ్బ కొట్టగలిగే జే-10సీ, ఎస్ఎఎబీ అవాక్స్ వంటి ఎయిర్ టూ ఎయిర్ దీర్ఘ శ్రేణి యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. (రాఫెల్ యుద్ధ విమానాల సామర్థ్యంపై 2024,4 నాటి వివరాణత్మక వ్యాసం కోసం ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ చూడండి.) 2019లో బాలాకోట్ మీద మన దేశం చేసిన విఫల సర్జికల్ దాడుల నేపథ్యంలో ఆనాటి వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఈ ఆపరేషన్ చేపట్టడానికి మన దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలు లేని లోటు గురించి ఎంత హంగామా, హడావుడి సృష్టించారో మీకు గుర్తు ఉండే ఉంటుంది.
మన రాఫెల్ యుద్ధ విమానాలను రెండింటిని ధ్వంసం చేశామని పాకిస్తాన్ చేసిన ప్రకటనను అమెరికన్ అభిజ్ఞ వర్గాలు నిర్ధారించినంత మాత్రాన పరిగణనల్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదని గౌరవనీయ మాజీ ఎయిర్ మార్షల్ ఒకరు నాకు సూచించారు. ట్రంప్ అధికార యంత్రాగాన్ని అడ్డం పెట్టుకుని అమెరికన్ మిలిటరీ ఆయుధ ఉత్పత్తి కార్పొరేట్ కంపెనీలు పనికిమాలని ఎఫ్-35 యుద్ధ విమానాలను భారీ రేటుకు మోడీ ప్రభుత్వంతో కొనిపించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రచారం సాగిస్తుండవచ్చు. అయినప్పటికీ ఆయుధాలు, యుద్ధవిమానాలు కొనుగోళ్లలో పాకిస్తాన్ వైమానిక దళం చూపిన తెలివిడిని మనం విస్మరించలేం.
ఇవాళ పాకిస్తాన్ అనుసరిస్తున్న యుద్ధతంత్ర వ్యూహమే మారిపోయింది. పాకిస్తాన్ తన గగనతలాన్ని వీడకుండా ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ గ్రౌండ్ దీర్ఘ శ్రేణి క్షిపణుల ద్వారా పొరుగుదేశం అయిన మన మీద విరుచుకుపడగలిగే సామర్థ్యం సంతరించుకోవడం తేలికగా తీసుకోవదగ్గ అంశం కాదు. 250 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే రాఫేల్ యుద్ధ విమానాలు మా దగ్గర ఉన్నాయని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప మరే రకంగా అయినా “ఆపరేషన్ సింధూర్”కి ఉపయోగపడ్డాయా? భారతీయ క్షిపణులు పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను, ఎయిర్ స్ట్రిప్‌లను ధ్వంసం చెయ్యడానికి మించిన నష్టం మనం రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోవడం మూలంగా జరిగింది. రాఫెల్ యుద్ధ విమానాల సామార్థ్యం గురించి జరిగిన ప్రచారం అంతా ఒట్టి ఆర్భాటమే అని “ఆపరేషన్ సింధూర్” రుజువు చేసింది.
రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసిన ఖర్చులో పావువంతు ఖర్చు చేసి మన “తేజోస్” యుద్ధ విమానాలను ఆధునీకరించుకుని ఉంటే ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ గ్రౌండ్ క్షిపణులను ప్రయోగించడానికి ఎంత అనువుగా ఉండేవో అని నేను చాలా కాలంగా చెబుతూనే వస్తున్నా. కొన్ని వందల బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసి దాదాపు మరో 100 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చెయ్యాలనే ప్రతిపాదనల గురించి ఇప్పటికైనా, సమయం మించిపోకముందే, రక్షణ మంత్రిత్వశాఖ గానీ, ప్రధానమంత్రి కార్యాలయం గానీ పునరాలోచిస్తుందని ఆశించవచ్చా? భారత వైమానిక దళం ఇప్పటికైనా తన పతాక ప్రతిష్టను నిలబెట్టుకోవడానికి విదేశాల నుంచి కలుపును దిగుమతి చేసుకోవడానికి బదులుగా దేశీయ “తేజోస్” యుద్ధ విమానాలను ఆధునీకరించుకుని వినియోగించడం వైపుకి మొగ్గుతుందని భావించవచ్చా?
“ఆపరేషన్ సింధూర్”లో రాఫెల్ యుద్ధ విమానాల గురించి రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడవచ్చు. ఈ యుద్ధ విమానాల నుంచి భారత వైమానిక దళం ఎంత దూరం పాటిస్తే అంతమంచింది. (మరే ఇతర ప్రపంచ దేశాలూ ఈ యుద్ధ విమానాలను ఎంచుకోకపోవడానికి గల కారణాలను నా వ్యక్తిగత బ్లాగ్‌లో అనేక పోస్టులలో ఉదహరించాను)
“తాత్కాలిక కాల్పుల విరమణ”(సీజ్ ఫైర్) ప్రకటించి కొన్ని గంటలు గడవక ముందే సరిహద్దులలోని పాకిస్తాన్ సైనిక దళాలు కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ సెక్టార్ల మీద ఫిరంగులను పేల్చాయి. పాకిస్తాన్ గుండేకాయవంటి పంజాబ్ మీద భారతీయ సైన్యం గట్టి దెబ్బకొట్టగలిగే స్థితిలో ఉన్నా, పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొంత భూభాగాన్ని అయినా భారతీయ సైన్యం చేజిక్కుంచుకోగలిగే సామర్థ్యంతో ఉన్నాగానీ పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ దాడులకు పాల్పడింది. గత రెండు దశాబ్దాలుగా కశ్మీర్లో ఉన్న భారతీయ సైనిక బలగాలకు ఈ తెగువ ఉన్నప్పటికీ పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద చర్యలకు పాల్పడడం మానలేదు. “ఆపరేషన్ సింధూర్”తో పాకిస్తాన్ ఆటకట్టయిందన్న ప్రచారాన్ని ఎవరన్నా నమ్మడానికి సిద్ధంగా ఉంటే “శుభం” అని తప్ప వేరే మాట ఏం చెప్పగలను నేను.
ప్రధాని మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు తరచూ “థింక్ బిగ్, యాక్ట్ బిగ్” అని చెబుతుంటారు. కానీ పాకిస్తాన్‌తో చిల్లర యుద్ధాలతో సరిపెడుతుంటారు. మాటకి, చేతకి పొంతన లేకపోవడం మోడీ ప్రభుత్వానికి కొత్త కాదు కదా.
అనువాదం: కె సత్యరంజన్
(వ్యాసకర్త భారతీయ సాంప్రదాయ వ్యూహకర్త. భారత్ కర్నాడ్ డాట్ కామ్ బ్లాగ్ నిర్వాహకులు)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.