
కోయి కోటేశ్వరరావు “నాగస్వరం” కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకాన్ని తన తల్లి కోయి సుబ్బమ్మకు, తనను తీర్చిదిద్దిన గురువులకు కవి అంకితం చేశారు. యాభై కవితలున్న ఈ పుస్తకం ఇరవై ఏళ్ల క్రింటే రావాల్సి ఉంది. ప్రొ శిఖామణి, కలేకూరి ప్రసాద్, డా చెన్నయ్య(కెనడా) ఎంతో విలువైన ముందు మాటలను పుస్తకానికి అందించారు. అట్ట వెనుక ప్రముఖ కవి, విమర్శకులు జీ లక్ష్మీ నరసయ్య బ్లర్బ్ రాశారు.
కోయికోటేశ్వరరావు ప్రకాశం జిల్లా ఎనిక పాడులో పేదవ్యవసాయ కార్మికుల ఇంట్లో జన్మించారు. తన బాల్యం నుంచే ఆకలి బాధలను, ఎన్నో అవమానాలను, కష్టాలను ఎదుర్కున్నారు. కటిక పేదరికంలో మగ్గి కన్నీళ్లను రాల్చిన వ్యక్తి, ఆ తర్వాత ఎంతో ఎత్తుకు ఎదిగారు. పేదరికం ఎంతలా వెంటాడిన దృఢ సంకల్పంతో పీజీ చేసి డాక్టరేట్‌ను పొందారు. ఆ తర్వాత ఒక కళాశాలలో హెడ్ ఆఫ్ తెలుగు డిపార్ట్మెంట్ స్థాయికి అధిరోహించారు. కవిగా, విమర్శకుడిగా, సామాజిక ఉద్యమకారునిగా ఎదిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపు పొందారు. కారంచెడు, చుండూరు, పదిరి కుప్పం, వాకపల్లిలాంటి అమానవీయమైన ఘటనలనెన్నింటినో చూసి కలత చెందారు. దళితులపై అగ్రవర్ణాలు సాగించిన మారణకాండను చూసి చలించి వాటినెదిరిస్తూ కోయికోటేశ్వరరావు ఉద్యమకెరటమై లేచారు.
ప్రజాస్వామిక కోరికైన తెలంగాణ ఉద్యమాన్ని “కావడి కుండల్లో” మోశారు. పల్లె అందాన్ని ఛిద్రం చేస్తోన్న ప్రపంచీకరణపై అక్షర ధిక్కార స్వరం వినిపించారు. అందుకే సాహిత్యలోకం కోయికోటేశ్వరరావును గౌరవిస్తోంది. నిశాని, గుండె డప్పు క్రమంలో నాగస్వరం ధిక్కార నాదస్వరమైంది.
ప్రస్తుతం దళిత– బహుజనులు అనేక పేర్లతో పిలవబడినా, చారిత్రకంగా వారంతా నాగజాతికి చెందిన వారేనని అంబేద్కర్ అంటారు. బుద్ధుని కాలం నుంచి నాగుల ప్రస్తావన ఉంది. ఈ నాగజాతిని అణిచి వేయడంలో ఆర్యులు పన్నిన కుట్రలను– కుతంత్రాలను చరిత్రకారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చి ఈ దేశమూలవాసులను వెలివేసిన మనుధర్మ శాస్త్రాన్ని అంబేద్కర్ కాల్చివేశారు.
ఒక చిన్న పల్లెటూరు నుంచి ప్రారంభమైన కవితలు, అగ్రరాజ్యం చేస్తోన్న విధ్వంసాల దాకా పాఠకున్ని చదివించి ఆలోచింపజేస్తాయి. అన్యభాషల్లోకి అనువదించాల్సిన కవితలెన్నో ఈ సంపుటిలో ఉన్నాయి.
కష్టాలతో కాపురం చేస్తున్న అమ్మను “పత్తిపూవు” కవితలో హృద్యంగా కవి ఆవిష్కరించారు. “కాళ్ల కింద ముల్లు కడుపులో కత్తి/ కూడా బలుక్కొని ఒకేసారి దిగబడినా/ నా పిచ్చితల్లి పెదాల మీద మాత్రం/ పత్తిపువ్వులే పరిమళిస్తాయి.”
అలాగే తండ్రిపై “ప్రాణవాయువు” కవితలో ఉత్పత్తి కులాల కష్ట జీవుల శ్రమను కవి వ్యక్తీకరించారు. “అయ్య చెమట చుక్కలు పరిచిన రహదారిపైనే కదా/ నేనంటూ ఇక్కడ దాక నడిచి వచ్చాను/ నాకే కాదు, మా ఊరి అన్నదాతకు కూడా/ వెన్నెముక మా అయ్యే/ ఆరుగాలం మా అయ్య రెక్కల్ని కరిగించుకుంటే/ ఆసామి కల్లంలో పసిడిరాశులు వెలిసాయిగానీ/ అయ్య కడుపులో ఆకలి మంటలు చల్లారలేదు” అంటారు. ఇందులో శ్రమదోపిడి అద్దంలా కనిపిస్తుంది. గీతోపదేశం కంటే శ్రమోపదేశమే ఈ విశ్వానికి శిరోధార్యమని కవి పేర్కొంటారు.
మూఢనమ్మకాలపై “కాలసర్పం” అనే కవితలో, “వైజ్ఞానిక సైనికులకు సమాధి కట్టి/ దొంగ బాబాల పాదాలను నాకుతుంది/ భలే మంచి చౌక బేరమంటూ- జాతి సౌభాగ్యాన్ని ధారపోసి/ కార్పోరేట్ బేహారితో రమిస్తుందీ కాలసర్పం” పాలకులు ఎవరైనా, ఏ పార్టీ వారైనా వీళ్లంతా కార్పొరేట్ శక్తుల సేవలో తరించే వారే, ఈనాడు ఖరీదైన న్యాయం సామాన్యులకు చేరడం లేదు. అంటరానితనం, ఆకలి, అవమానం, అత్యాచారం, కాషాయ నీతులు నేడు నిత్యకృత్యమై పోతున్నాయి. ఈ విధానాలపై “ఐ ఆబ్జెక్ట్ యువరానర్” కవితలో కవి బలమైన అభివ్యక్తి కనబడుతుంది. “అంటరానివాడ అవమానాలను/ ఎఫ్ఐఆర్ మింగేసిన అక్రమాలను ఛార్జ్‌షీట్‌లో సమాధి చేయబడిన అత్యాచారాలను/ లెక్కగట్టలేని సర్వోన్నత అంధత్వం కాషాయ నీతులను వల్లిస్తుంది/ జనహిత ప్రయోక్త కావాల్సిన ఈ ధర్మాసనాన్ని మనువాదం పీడిస్తుంది/ ఐ ఆబ్జెక్ట్ యువరానర్!!” ప్రస్తుత సమాజానికి ప్రతిబింబంగా ఈ కవిత నిలుస్తుంది.
ఎండ్లూరి సుధాకర్‌పై స్మృతి కవితలో కవి ఒక చోట “అగ్నిరాగం”లో, “తనువంతా గాయాలైనా/ అణువంత చెక్కుచెదరకుండా/ అగ్నిరాగాలను ఆలపించినా/ అంటరాని పిల్లనగ్రోవి/ హఠాత్తుగా మూగబోయింది/ కొత్త గబ్బిలానికి హక్కుల పోరు పాదాలను/ బోధించిన కవిశ్వాస ఆగిపోయింది” అంటారు.
అలాగే భీమరాజ్యం కవితలో బలమైన విశ్వాస ప్రకటనగా ముగింపు ఇస్తారు. “పరమ నిశ్శబ్దంగా రాజ్యం/ అగ్నిగుండంలో ఆజ్యం పోస్తూ ఫైరింజన్‌లా ఫోజులిస్తుంది/ దినదినగండాలను రగిలిస్తూ/ దీర్ఘాయుషుతో విషం కక్కె ఈ హోమగుండంపైకి/ చైతన్య సముద్రాలుగా ప్రవహిద్దాం/ ధమ్మపథంలో భీమరాజ్యాన్ని లిఖిద్దాం” లేని రామరాజ్యం కోసం అరాచకాలను సృష్టించే భజనపరులకు “భీమరాజ్యం” బోధపడేదెన్నడో?
“కులగోత్రాలు మలమూత్రాలు లాంటివి అవి విసర్జించకుంటే దేశానికి, దేహానికి అరిష్టమ”ని కవి కామేశ్వరరావు తన లఘు కవితలో అంటారు. అలాగే “నిమజ్జనం” కవితలో కోటేశ్వరరావు చివర్లో ఇలా అన్నారు. “మన సాంకేతిక పరిజ్ఞానం/ చంద్రుడి మీద రహస్యాలను శోధిస్తుంటే/ మన సంస్కారం మాత్రం ఇంకా కులం మలాన్ని వాసన చూస్తుంది” చక్కటి ప్రతీకతో చాలా చక్కగా ప్రస్తుత పరిస్థితిని వ్యక్తీకరించారు.
“తడి గుడ్డతో గొంతు కోస్తాడు/ తానంతే పరమ యుద్ధోన్మాది/ ఒక్క చమురుబొట్టుకోసం/ లెక్కలేనన్ని రక్త సముద్రాల్ని పొంగిస్తాడు/ కుడిచేతిలో శాంతి పావురాన్ని ఎగురవేసి/ ఎడమ చేతితో దాన్ని కాల్చిచంపే/ వృత్తి వేటగాడి హింసాప్రవృత్తిని/ చెట్టుకీ పుట్టకీ పిట్ట కథలుగా చెప్పాలి/ వందరూపాయలు అప్పిచ్చి/ కోటి షరతులు విధించే వాడి ఆర్థిక తీవ్రవాదాన్ని అమెజాన్ నదిలో ముంచాలి” అని అమెరికాను “ఆధునిక వామనుడు”గా చెపుతూ కవి మండిపడతారు.
క్యూబా, చీలి, వియత్నాం, ఆఫ్ఘన్, ఇరాక్, పాలస్తీనా, గల్ఫ్లలో అమెరికా పన్నిన పన్నాగాలను, సృష్టిస్తోన్న విధ్వంసాన్ని ప్రపంచం మొత్తం చూస్తోంది. భారత్‌ను కూడా ఎన్నిసార్లు బెదిరించలేదు? వీటన్నింటిని అక్షరీకరించిన కవి, పరిస్థితులను పరోక్షంగా– ప్రత్యక్షంగా పాఠకులకు దృశ్యమానం చేస్తారు.
ఒక బస్సు దహనంలో విజయవర్థనం, చలపతిలకు 1997 ఉరిశిక్ష వేసిన ఈ వ్యవస్థ, 600కు పైగా బస్సుల్ని దహనం చేసినప్పుడు(ఒక్క ఎమ్మెల్యే మృతి సందర్భంలో) ఏ ఒక్కరిని ఉరితీయలేదే? దీనిని పరోక్షంగా ఉదహరిస్తూ కులాన్ని ఉరితీయమంటాడు కవి. అంతేకాకుండా, “దొడ్డిదారిలో నా దేశంలోకి చొరబడ్డ ఆర్యఖడ్గాలు/ నా గొంతుకోయాలని ఘోషించాయి/ ఉన్మాదంపై నాది నిత్యదండయాత్ర/ నేనే నిజమైన దేశభక్తుడిని”అని కవి అభివర్ణిస్తారు.
కవి, రచయిత కవి కోయి కోటేశ్వరరావు వ్యధబరిత వృత్తాంతాలను శక్తివంతమైన కవితలుగా అక్షరీకరించారు. తన కలం నుంచి జాలువారిన అక్షరాలను క్షిపణులుగా మార్చారు. తిరోగమిస్తున్న ప్రస్తుత సమాజాన్ని మరిన్ని కవితా అస్త్రాలతో కవి ప్రక్షాళన చేయాలని ఆశిద్దాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.