
ప్రపంచంలోని ప్రతి మనిషికి ఆహారం అనేది కనీస అవసరం. పలు నివేదికల ప్రకారం మన దేశంలోని పలు పట్టణాలలో నివసించే చాలామందికి తినడానికి సరైన ఆహారం దొరకక ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో కావాల్సినంత పోషకాహారం ప్రజలకు అందడం లేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమస్యను పరిష్కారించడానికి తెలుగుదేశం నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా అన్న క్యాంటీన్ పథకాన్ని తీసుకు వచ్చి, పేద ప్రజల ఆకలి తీరుస్తుంది. ఈ పథకం ద్వారా కేవలం 15 రూపాయిలకే మూడు పూటల భోజనాన్ని ప్రజలకు అందిస్తుంది. పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ‘అన్న క్యాంటీన్’లను సందర్శించి, వాటి పనితీరుపై అధ్యయనం చేసి నివేదికను విడుదల చేసింది.
పీపుల్స్ పల్స్ సంస్థ నియమించిన రీసెర్చర్లు రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఒక క్యాంటీన్ చొప్పున మొత్తం 25 అన్న క్యాంటీన్ల మీద అధ్యయనం చేశారు. అన్న క్యాంటీన్లలో అందిస్తున్న భోజనం నాణ్యత ఎలా ఉంది? పరిశుభ్రత పాటిస్తున్నారా లేదా? మౌలిక సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సిబ్బంది ప్రవర్తనతో పాటు పథకంపై లబ్ధిదారుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.
లబ్ధిదారులతో ముఖాముఖి..
జనవరి నెలలో 3వ తేది నుంచి 10 తేది వరకు మొత్తం వారం రోజుల పాటు అన్న క్యాంటీన్ పథకంపై అధ్యయనం కొనసాగింది. ‘పీపుల్స్ పల్స్’ సంస్థ సీనియర్ రీసెర్చర్ జీ మురళీకృష్ణ నేతృత్వంలో మొత్తం 10 మంది రీసెర్చర్లు క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. రీసెర్చ్‌లో భాగంగా ప్రతి క్యాంటిన్ వద్ద 50- 60 మంది లబ్దిదారులతో రీసెర్చర్లు మాట్లాడారు. దాదాపు 1200 మందితో మాట్లాడి, పథకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఒక్కొక్క క్యాంటీన్ వద్ద రీసెర్చర్లు కనీసం నాలుగు గంటల సమయాన్ని కేటాయించారు. లబ్ధిదారులను అడిగి క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం గురించి సమచారాన్ని సేకరించారు.
ప్రధానమైన అంశాలు..
భోజనం నాణ్యత, సిబ్బంది ప్రవర్తనా సమయపాలన, పరిశుభ్రత, ఈ పథకాన్ని ఎవరు ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు?, పథకం వల్ల ప్రభుత్వానికి రాజకీయంగా లబ్ధి చేకూరుతోందా? లేదా?, ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం ఉన్న లోపాలు ఏమిటి? ఇటువంటి అంశాలపై సర్వేలో ప్రధానంగా లబ్ధిదారుల అభిప్రాయాన్ని సేకరించారు. వీటి ఆధారంగా పథకాన్ని మరింత మెరుగు పరిచి అమలు చేయడానికి పలు సూచనలను, నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో పీపుల్స్ పల్స్ సంస్థ నివేదికను రూపొందించింది.
డిమాండ్‌ని బట్టి సప్లయ్..
2018 జులైలో పట్టణలలో పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశ్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు మీద ‘అన్న క్యాంటీన్ల’ను టిడిపి ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఏపిలోని ముఖ్య పట్టణాలలో 204 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. వీటి నిర్వహణ బాధ్యతను ‘అక్షయపాత్ర’ అనే ఎన్జీవోకు అప్పగించారు. ఇస్కాన్ సంస్థ నడిపించే ఈ ఎన్జీవోకు చెందిన సెంట్రలైజ్డ్ కిచెన్ల నుంచి ఆహారం తయారుచేసి క్యాంటీన్లకు సరఫరా చేస్తున్నారు. ముందురోజు డిమాండ్‌ని బట్టి అక్షయపాత్ర ఫౌండేషన్ రోజూ తమ కిచెన్ల నుంచి ఆహారాన్ని అన్న క్యాంటీన్లకు సప్లయ్ చేస్తోంది. ప్రాంతాలను బట్టి ఒక్కో అన్న క్యాంటీన్ 300 నుంచి 500 మంది పేదలకు కడుపు నింపుతుంది.
క్యాంటీన్ల నిర్వహణ లెక్కలు..
ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఉదయం టిఫిన్‌కు రూ.22, ఒక పూట భోజనానికి రూ.34 చొప్పున ఖర్చు అవుతోంది. అంటే మూడు పూటలకు ప్రభుత్వం మొత్తం రూ.90 ఖర్చు చేస్తుంది. ఇందులో లబ్ధిదారుల నుంచి 15 రూపాయలు వసూలు చేస్తారు. మిగిలిన 75 రూపాయిలు ప్రభుత్వం రాయితీగా ఇవ్వడంతో పాటు కొంతమంది దాతల ద్వారా సమకూర్చి అక్షయపాత్రకు చెల్లిస్తోంది. ఒక్కో క్యాంటీన్ నడపడానికి ప్రభుత్వానికి ఒక్క రోజుకు రూ.26,256 ఖర్చు అవుతుండగా, మొత్తం క్యాంటీన్ల నిర్వాహణకు దాదాపు రూ.53 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. సంవత్సరానికి రూ.200 కోట్ల రూపాయిలు వెచ్చిస్తోంది.
క్యాంటీన్ల పున:ప్రారంభం..
2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో ‘‘అన్న క్యాంటీన్ల’’ను వైసిపి ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిలిపివేసింది. 2019 ఎన్నికలకు ముందు వైసిపికి చెందిన కొంతమంది నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ‘‘రాజన్న క్యాంటిన్ల’’ను ప్రారంభించి పేదలకు ఆహారాన్ని అందించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడంతో 2024 ఆగస్టు 15న మళ్లీ ఈ క్యాంటీన్లు ప్రారంభమించారు.
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ నాయకులు రాష్ట్రంలోని పలుచోట్ల ప్రైవేటు అన్న క్యాంటీన్లను నడిపారు. ప్రైవేటు క్యాంటీన్ల ఆహారంతో పోలుస్తూ ప్రస్తుతం ప్రభుత్వ క్యాంటీన్లలో అందిస్తున్న ఆహారం పట్ల లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
లబ్ధిదారుల అభిప్రాయం..
‘‘అన్న క్యాంటీన్లలో అందిస్తున్న ఆహార పదార్థాల్లో ఉప్పూ కారం సరిగ్గా ఉండటం లేదు. మెనూ ప్రకారం భోజనంలో ఆహార పదార్థాలు ఇవ్వడం లేదు. కూర కూడా నీళ్లలా ఉంటుంది. ఉదయం టిఫిన్‌లో అందిస్తున్న చట్నీ కూడా బాగుండటం లేదు. చెడిపోయి, వాసన వస్తోంది. కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది’’ అని లబ్ధిదారులు కోరారు.
‘‘చాలా క్యాంటీన్లలో హాట్ బాక్సులు లేకపోవడంతో ఆహార తయారు కేంద్రాల నుంచి వచ్చిన ఆహారం చల్లగా అవుతుంది. క్యాంటీన్ ప్రారంభోత్సవం రోజు వచ్చిన నాయకులు తర్వాత రావడంలేదు. ఒక వేళ నాయకులు వస్తే, ఆ సమాచారం సిబ్బందికి అందుతుంది. దీంతో కేవలం ఆ రోజు భోజనం బాగుంటుంది, మిగతా రోజుల్లో రుచిగా, నాణ్యమైనదిగా ఉండటం లేదు.’’ అని విజయనగరానికి చెందిన జగదీశ్ అనే యువకుడు చెప్పాడు.
‘‘నాయకులు వస్తారని తెలిసి ఆహారాన్ని క్వాలిటీగా అందించకుండా, ప్రతి రోజూ కూడా అలానే అందించాలి.’’ అని మరో ఇద్దరు యువకులు కోరారు.
‘‘ప్రతిరోజూ క్యాంటీన్లలో ఆహారం రుచి ఒకేవిధంగా ఉంటుంది. అస్తమానం ఒకే రకమైన కూరలు వండించకుండా మారిస్తే బాగుంటుంది’’ అని ఏలూరులో సాయితేజ చెప్పాడు.
‘‘అల్పాహారం తీసుకుంటున్నవారిలో ఆహారం సరిపోక ఎక్కువమంది రెండేసి టోకెన్లు తీసుకుంటున్నారు. మరో విషయమేంటంటే, అల్పాహారంలో అందిస్తున్న పదార్థాలు క్వాలిటీగా ఉండటం లేదు. లబ్ధిదారుల నుంచి టిఫిన్ కోసం రూ.5 తీసుకొని, ప్రభుత్వం రూ.17 కలిపి ఏజెన్సీకి ఇస్తుంది. అయినా, టిఫిన్‌లో నాణ్యత లోపిస్తుంది. ఏపిలోని అనేక ప్రాంతాలలో బండ్ల మీద కేవలం రూ. 15 నుంచి 20లకు క్వాలిటీ టిఫిన్ అందిస్తున్నారు. రూ.22 తీసుకుంటున్న ఏజెన్సీ అల్పాహారాన్ని మరింత నాణ్యతగా అందించవచ్చు’’ అని నివేదిక సూచించింది.
‘‘అదే విధంగా, రాష్ట్రంలోని అనేక చోట్ల 20 నుంచి 25 రూపాయలకే లెమన్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, టమాటా రైస్, పెరుగన్నం మంచి క్వాలిటీతో అందిస్తున్నారు. అటువంటిది, ఒక భోజనానికి 34 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అటువంటప్పుడు ప్రస్తుతం అందిస్తున్న దానికన్నా మరింత క్వాలిటీతో భోజనం అందించవచ్చు.’’ అని తెలిపింది.
క్వాంటిటీలో చేతివాటం..
‘‘దాదాపు మెనూ ప్రకారమే ప్రతిరోజూ క్యాంటిన్స్కు ఐటెమ్స్ వస్తున్నాయి. కానీ, మెనూలో సూచించిన క్వాంటిటీ ప్రకారం లబ్దిదారులకు ఆహారాన్ని క్యాంటిన్ సిబ్బంది ఇవ్వడం లేదు. ఈ విషయంలో సిబ్బంది చేతివాటం స్పష్టంగా కనపడుతోంది.’’ అని నివేదిక తెలిపింది.
‘‘అన్న క్యాంటీన్ల ఉద్దేశ్యం, నడిపించే విధానం బాగానే ఉంది. కానీ, రూ.5కు వడ్డిస్తున్న భోజనం చిన్న పిల్లాడికి కూడా సరిపోదు. చాలా తక్కువగా వడ్డిస్తున్నారు. ఇదేంటని అడిగితే రూ.5కి ఇంతకు మించి రాదులే అని సిబ్బంది కసురుకుంటున్నారు’’అని గాజువాకలో పవన్‌కుమార్ అసహనం వ్యక్తం చేశాడు. ఇంచుమించు ఇలాంటి మాటలే చాలా చోట్ల వినపడ్డాయని నివేదిక తెలిపింది. రూ.5 టోకెన్ తీసుకున్నప్పుడు, ఆ ఆహారం ఒక వ్యక్తికి సరిపోకపోవడంతో రెండు టోకెన్లు తీసుకుని భోజనం చేస్తున్నట్టుగా రీసెర్చర్లు గమనించారు.
దీనికి పరిష్కారంగా రూ.10 తీసుకుని కొంచెం క్వాలిటీ, క్వాంటిటీ పెంచితే బాగుంటుందని చాలామంది ఒకేలా చెప్పారని నివేదిక తెలిపింది. తమ ఇంట్లో నుంచి తెచ్చి వడ్డిస్తున్నట్టుగా లబ్దిదారులను సిబ్బంది చిన్నచూపు చూస్తున్న ప్రవర్తనను పీపుల్స్ పల్స్ రీసెర్చర్లు పరిశీలించినట్టుగా నివేదిక ద్వారా తెలుస్తోంది.
శుభ్రత ఎలా ఉంది?
నివేదిక ప్రకారం.. అన్న క్యాంటీన్ల శుభ్రత, నాణ్యత పట్ల 65 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొంత మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. క్యాంటీన్ల శుభ్రతను పర్యవేక్షించడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ, చాలా చోట్ల ఈ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
‘‘క్యాంటీన్లలో ప్లేట్లు, వాష్ బేషన్లు, టేబుల్స్‌ని సిబ్బంది సరిగ్గా క్లీన్ చేయడం లేదు. దీంతో వాటి మీద మరకులు ఉంటున్నాయి. పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయి. వడ్డించేటప్పుడు సిబ్బంది గ్లౌజులు వాడటం లేదు. తాగునీటి శుభ్రత విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.’’ అని పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సమయ పాలన పాటించడం లేదు..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటల క్యాంటీన్లను తెరిచి ఉంచాలి. కానీ, చాలా క్యాంటీన్లలో సమయపాలన పాటించడం లేదని సర్వేలో తేలింది. దీని వల్ల లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నట్టుగా ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది పనివేళలను పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడమే సమయపాలన పాటించకపోవడానికి ప్రధాన కారణమని, దీనిపై ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నివేదిక తెలిపింది.
నివేదిక తెలిపిన ప్రకారం.. అన్న క్యాంటీన్లను ఎక్కువగా అసంఘటిత రంగంలో పని చేస్తున్నవారే ఉపయోగించుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఆటో డ్క్రెవర్లు, కూరగాయల- పండ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులు, కార్పెంటర్లు, ప్లంబర్లు, నిరుద్యోగులు, వలస కూలీలు ఉన్నారు. క్యాంటీన్లు ఎక్కువగా ఆస్పత్రులు, బస్టాండులకు దగ్గరగా ఉండటం వల్ల ఈ పథకం ద్వారా ఇంకా ఎక్కువ మంది లబ్ధిపొంతున్నారు.
‘‘క్యాంటీన్లలో అధిక శాతం మంది ఎస్సీలు, బీసీలే భోజనం చేస్తున్నారు. ఎక్కువమంది మగవాళ్లే ఉండటం, ప్రత్యేక క్యూలైన్లు లేకపోవడం వల్ల మహిళలు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో మగవాళ్ల శాతం ఎక్కువ, ఆడవాళ్ల శాతం తక్కువగా ఉంటుంది.’’ ఈ విషయం పీపుల్స్ పల్స్ బృందం దృష్టికి వచ్చింది.
‘‘సన్న బియ్యం భోజనం వడ్డిస్తున్నారు, క్వాలిటీ కూడా బాగుంది. కానీ, మహిళలకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది’’ అని పలుచోట్ల మహిళలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో వైపు నిరుద్యోగులు, పోటీ పరిక్షలకు సన్నద్ధం అయ్యేవారు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.
క్యాంటీన్లు మళ్లీ తెరవడంపై 75 శాతం మంది ప్రజలు తాము సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. ‘‘నేను ఎరువుల కోసం గుంటూరుకు వచ్చాను. తిరిగి వెళ్లిపోతూ అన్న క్యాంటీన్లో భోజనం చేశాను. చాలా బాగుంది, ఇంతకముందు ఇంటికి వెళ్లేదాక ఖాళీ కడుపుతో ఉండేవాడిని. పేదలకు, ప్రయాణాలు చేసేవారికి ఉపయోగంగా ఉన్న ఈ క్యాంటీన్లు ఇలాగే కొనసాగించాలి’’ అని గుంటూరు బస్టాండు వద్ద ఉన్న అన్న క్యాంటీన్లో కలిసిన రైతు వెంకటేశ్వర్లు చెప్పారు.
అన్న క్యాంటీన్లు నిర్వహణకు సూచనలు..
సర్వే నిర్వహించిన పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అన్న క్యాంటీన్లను మరింత పటిష్టంగా నిర్వహించడం కోసం పలు కీలకమైన సూచనలు చేసింది. అందులో ‘‘అన్న క్యాంటీన్ల పర్యవేక్షణ, వాటి నిర్వాహణ కోసం ఒక ప్రత్యేక కార్పోరేషన్‌ను ఏర్పాటు చేయాలి. భోజనం తక్కువ పెడుతుండటంతో లబ్ధిదారుల్లో అసంతృప్తి ఉంది. దాన్ని దూరం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఈ పథకానికి ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఆహారంలో, కూరలలో మార్పులు చేర్పులు చేయాలి. శుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. క్యాంటీన్లలో లబ్ధిదారులతో దురుసుగా ప్రవర్తిస్తున్న వారిపై, చేతివాటం చూపిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. క్యాంటీన్ సిబ్బంది సమయాన్ని తూచా తప్పకుండా పాటించేలా చూడాలి. క్యాంటీన్ల గురించి పబ్లిసిటీ చేయాలి. ఈ సూచనలతో క్యాంటీన్లను సంస్కరిస్తే, కొన్ని మార్పులు చేర్పులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.’’ అని తెలిపింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.