
2018- 2022 మధ్య కాలంలో ఉపా కింద 6,503 మందిపై చార్జిషీట్లు దాఖలు చేశామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలియజేసింది. అందులో 252 మందిని దోషులుగా నిర్ధారించామని పేర్కొన్నది. ఇందులో రెండు కేసులను కోర్టులు కొట్టివేశాయి.
న్యూఢిల్లీ: 2018-2022 మధ్య చట్టవిరుద్ధ కార్యకలాపాల(నివారణ)చట్టం(యూఏపీఏ) కింద నమోదైన రెండు కేసులను మాత్రమే కోర్టులు కొట్టివేశాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం(జూలై 30) పార్లమెంటుకు తెలిపింది .
ఉపా కింద 6,503 మందిపై చార్జిషీట్లు దాఖలు చేశామని, అందులో 252 మందిని దోషులుగా నిర్ధారించామని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ అన్నారు. ఒక ప్రశ్నకు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిస్తూ పేర్కొన్నారు.
మంత్రి సమర్పించిన గణాంకాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) “భారతదేశంలో నేరాలు” అనే తాజా నివేదిక నుంచి తీసుకోబడ్డాయి. ఏవైతే రెండు కేసులు రద్దుచేయబడ్డాయో అవి 2022 నాటివి, వాటిని కేరళ కోర్టులు కొట్టివేశాయి.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, 2018- 2022 మధ్య మొత్తం 8,947 మందిని ఉపా చట్టం కింద అరెస్టు చేశారు. వీరిలో 2,633 మందిని జమ్మూ కశ్మీర్లో, ఉత్తరప్రదేశ్లో 2,162 మందిని అరెస్టు చేశారు.
సంవత్సరాల వారీగా వివరాలను చూసుకున్నట్లైతే, 2018లో ఉగ్రవాద నిరోధక చట్టం కింద 1,421 మందిని అదుపులోకి తీసుకున్నారు. 2019లో 1,948, 2020లో 1,321, 2021లో 1,621, 2022లో 2,636 మంది అరెస్టు అయ్యారు.
1967లో ఉపా చట్టం మొదట అమలు చేయబడింది. అయితే ఇటీవల 2008, 2012లో కాంగ్రెస్ ప్రభుత్వం, తరువాత మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన సవరణలు దానిని మరింత కఠినతరం చేశాయి.
ఉపా నిబంధనల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ లభించడం దాదాపు అసాధ్యం. నిందితుడిపై ఉన్న అభియోగాలు ప్రాథమికంగా నిజమని కోర్టు భావిస్తే, అతన్ని బెయిల్పై విడుదల చేయలేమని చట్టం పేర్కొంది.
ఫలితంగా, ఉపా కింద అభియోగాలు ఎదుర్కొంటున్న చాలా మంది వ్యక్తులు చాలా కాలం పాటు జైళ్లలో విచారణ ఖైదీలుగా మిగిలిపోతున్నారు.
అనువాదం: వంశీకృష్ణ చౌదరి
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.