
సోమవారం నాడు బీహార్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో నిరసన చేపట్టారు.
ఇందులో భాగంగా పార్లమెంట్ హౌస్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు మార్చ్ నిర్వహించారు.
మార్చ్‌లో పాల్గొన్న రాజ్యసభ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ: బీహార్‌లో “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేశారు.
రాజ్యసభ- లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ ఇతర ప్రతిపక్ష ఎంపీల నిరసనలో పాల్గొన్నారు. వీరిని సోమవారం(ఆగస్టు 11) ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీహార్ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు బ్యానర్లు చేతపట్టుకుని, నినాదాలు చేశారు. పార్లమెంట భవనం నుంచి భారత ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు వారి కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేయవలసి ఉంది.
అయితే, ట్రాన్స్పోర్ట్ భవన్ సమీపంలో ప్రతిపక్షాల మార్చ్‌ను బారికేడ్లతో ఢిల్లీ పోలీసులు ఆపారు. వారిని ఎక్కడ ఆపారో అక్కడే ప్రతిపక్ష నేతలు ధర్నాకు దిగారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, మహువా మొయిత్రా, సుష్మితా దేవ్ సహా పలువురు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు పోలీసుల చర్యలను ప్రతిఘటించారు.
మార్చ్‌ను ఆపడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లపైకి ఎక్కి నిరసన చేపట్టారు.

ప్రజాగొంతుక..
“వారు ప్రజల ఓట్లను తొలిగిస్తున్నారు, ప్రజల ఓటు హక్కును కాపాడడానికి మేము బారికేడ్లను దాటుతున్నాము. ఓటరు జాబితాలో పేర్లు లేని వారిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నాము. నేనే 18,000 తొలగించబడిన ఓట్ల జాబితాను ఇచ్చాను. ఎన్నికల కమిషన్ మా నుంచి అఫిడవిట్ కోరింది, మేము ఇచ్చాము. కానీ, వారు ఎటువంటి చర్య తీసుకోలేదు” అని యాదవ్ అన్నారు.
“వారు (ఎన్నికల సంఘం) మాట్లాడటానికి ఇష్టపడరు. వాస్తవం దేశం ముందు ఉంది. ఈ పోరాటం రాజకీయమైనది కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, “ఒక వ్యక్తి, ఒక ఓటు” హక్కును కాపాడటానికి జరిగే పోరాటం. కాబట్టి మేము పారదర్శకమైన ఓటరు జాబితాను కోరుకుంటున్నాము” అని గాంధీ బస్సులో నుంచి విలేకరులకు తెలియజేశారు.
దీని తర్వాత ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బస్సుల్లో ఎక్కించి సంసద్ మార్గ్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
దీనికంటే ముందు ఆదివారం నాడు కాంగ్రెస్ ఎంపీ, ప్రధాన కార్యదర్శి(మీడియా, కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్) జైరాం రమేష్‌కు ఎన్నికల కమిషన్ ఒక లేఖ రాసింది. “స్థలం లేకపోవడం” కారణంగా సమావేశానికి 30 మంది సభ్యుల పేర్లను, వాహన నంబర్లను అందించాలని కోరింది.
దీనికి ప్రతిస్పందనగా కమిషన్‌కు రమేష్ ఒక లేఖ రాశారు. ప్రతిపక్ష ఎంపీలందరూ ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు మార్చ్ చేపడతారని అందులో తెలియజేశారు.
బీహార్ ఎస్ఐఆర్కు మాత్రమే పరిమితం కాకుండా, అనేక అంశాలపై ఎన్నికల కమిషన్‌ను ఎంపీలందరూ సమిష్టిగా కలవాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.
సోమవారం రమేష్ విలేకరులతో మాట్లాడుతూ, “మా డిమాండ్లు, మా అభ్యర్థన చాలా స్పష్టంగా ఉంది. అన్ని పార్టీల ప్రతిపక్ష ఎంపీలు శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్నారు. మార్చ్ ముగింపులో మేము ఎస్ఐఆర్, ఇతర అంశాలపై సమిష్టిగా మెమోరాండం సమర్పించాలనుకుంటున్నాము. మేము ప్రతినిధి బృందాన్ని డిమాండ్ చేయలేదు. మా భాష స్పష్టంగా ఉంది. అన్ని ప్రతిపక్ష ఎంపీలు సమిష్టిగా మెమోరాండం సమర్పించాలనుకున్నారు. ఇప్పుడు మమ్మలని ఎన్నికల సభకు చేరుకోవడానికి కూడా అనుమతి లేదు. పార్లమెంటు ముందు ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది, హత్య చేయబడుతోంది.”
ఈ మార్చ్‌లో ఎన్సీపీ(ఎస్సీపీ) చీఫ్ శరద్ పవార్, డీఎంకే ఎంపీలు టీఆర్ బాలు, సంజయ్ రౌత్(ఎస్ఎస్- యూబీటీ), డెరెక్ ఓ’బ్రెయిన్ (టీఎంసీ), కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు డీఎంకే, ఆర్జేడీ, వామపక్ష పార్టీల వంటి “ఇండియా” కూటమిలోని పార్టీల నుంచి ఇతర ఎంపీలు సహా అగ్ర ప్రతిపక్ష నాయకులు పాల్గొన్నారు.

“ఒకవేళ ప్రభుత్వం మమ్మల్ని ఎన్నికల కమిషన్ వరకు చేరుకోవడానికి అనుమతించకపోతే, వారు దేనికి భయపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు? ఇది శాంతియుత నిరసన” అని ఖర్గే పేర్కొన్నారు.
“ఇది వీవీఐపీల మార్చ్, కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదు. వారు మా 300 మందిని ఒక హాలులో కూర్చోబెట్టి మా మాట వినగలిగేవారు. కానీ, 30 మంది సభ్యులను మాత్రమే పంపాలని కోరారు. మా కూటమి భాగస్వాముల నుంచి ఎవరు వెళ్లాలో మేము ఎలా నిర్ణయించగలం? వారు మమ్మల్ని హాలులో కలిసి ఉంటే, మేము మా సమస్యలను వారి ముందు ఉంచేవాళ్ళం” అని ఆయన అన్నారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.