
“విదేశీ పత్రికలలో” ఆపరరేషన్ సిందూర్‌కు సంబంధించి అనేక వాదనలు ఉన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. అయినప్పటకీ మే నెలలో నాలుగు రోజుల పాటు జరిగిన భారత్- పాకిస్తాన్ సైనిక ఘర్షణలో, భారతదేశానికి నష్టం వాటిల్లినట్లు సూచించే ఛాయాచిత్రాలు- ఉపగ్రహ చిత్రాలు లేవని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: “విదేశీ పత్రికలలో” అనేక వాదనలు ఉన్నప్పటికీ, మే నెలలో నాలుగు రోజుల పాటు జరిగిన భారత్-పాకిస్తాన్ సైనిక ఘర్షణలో భారతదేశానికి ఎటువంటి నష్టం వాటిల్లినట్లు సూచించే ఛాయాచిత్రాలు, ఉపగ్రహచిత్రాలు లేవని జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అన్నారు.
అయితే, ఈ ఘర్షణలో కనీసం ఒక భారతీయ యుద్ధ విమానం నష్టపోయినట్లు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సహా పలువురు భారత భద్రతా అధికారులు అంగీకరించారు. ఈ సమయంలో అజిత్ దోవల్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఐఐటీ మద్రాస్ స్నాతకోత్సవంలో ఎన్ఎస్ఏ దోవల్ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీంగా తయారు చేసిన వస్తువులను విస్తృతంగా ఉపయోగించారని అన్నారు. ఇది భారతదేశానికి గర్వకారణమని తెలియజేశారు.
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ప్రదేశాలను ఉగ్రవాద మౌలిక సదుపాయాలుగా భారతదేశం గుర్తించిందని, ఈ ఆపరేషన్ సమయంలో వాటిని లక్ష్యంగా చేసుకున్నామని దోవల్ గుర్తుచేశారు. దాడుల సమయంలో ఒక్క ప్రదేశం కూడా ‘తప్పిపోలేదు’ అని ఆయన చెప్పారు. మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల్లో ముగిసిందని పేర్కొన్నారు.
“ఈ ఆపరేషన్ తర్వాత, విదేశీ పత్రికలలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ‘పాకిస్తాన్ ఇలా చేసింది, అలా చేసింది’ అని అతిశయోక్తులు పోయారు. భారతదేశానికి ఏదైనా నష్టం జరిగినట్టుగా, ఒక గాజు కూడా పగిలిపోయిందోమో మీరు నాకు ఒకే ఒక చిత్రం లేదా ఒక ఉపగ్రహ చిత్రం చూపించండి” అని దోవల్ సవాల్ విసిరారు.
ఆపరేషన్ సిందూర్‌పై కథనాలను ప్రచురించిన పత్రికా సంస్థలలో ది న్యూయార్క్ టైమ్స్ కూడా ఉందని అత్యున్నత భద్రతా అధికారి ప్రత్యేకంగా పేర్కొన్నారు.
సంఘర్షణ ముగిసిన వెంటనే న్యూయార్క్ టైమ్స్ పాకిస్తాన్‌కు సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్‌ను అందించింది. అందులో రావల్పిండిలోని నూర్ ఖాన్ విమానాశ్రయంలోని సౌకర్యాలపై దాడులు, రహీం యార్ ఖాన్, సర్గోధా విమానాశ్రయాలలో రన్‌వేలో పగుళ్లు వంటి అనేక పాకిస్తాన్ విమానాశ్రయాలకు భారత దాడులు ఎంత నష్టం కలిగించాయో నివేదించింది.
ఆ సమయంలో అందుబాటులో ఉన్న పరిమిత ఉపగ్రహ చిత్రాలు ‘సైనిక చర్యకు సంబంధించిన ధృవీకరించబడిన ఆధారాలు ఉన్న ప్రదేశాలలో కూడా, పాకిస్తాన్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని స్పష్టంగా చూపించలేదు’ అని కూడా ఆ వార్తాపత్రిక తెలియజేసింది.
నష్టాన్ని అంగీకరించిన సైనిక అధికారులు..
గమనించాల్సిందేంటే, ఈ సంఘర్షణ ముగిసిన తర్వాత భారతదేశ యుద్ధ విమానాలకు నష్టం వాట్టిల్లిందని భద్రతా అధికారులు అంగీకరించారు.
ఇండోనేషియాలోని జకార్తా భారత రాయబార కార్యాలయంలో డిఫెన్స్ అటాచీగా ఉన్న నేవీ కెప్టెన్ శివ్ కుమార్ గత నెలలో స్పందించారు. పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో భారతదేశం ‘కొన్ని విమానాలను’ కోల్పోయిందని చెప్పారు.
“సైనిక స్థావరాలపై లేదా వారి వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడి చేయకూడదని రాజకీయ నాయకత్వం బలవంతం చేయడం” ఈ నష్టానికి కారణమని ఆయన పేర్కొన్నారు.
ఒక సెమినార్లో 35 నిమిషాల ప్రజెంటేషన్‌లో కెప్టెన్ శివ కుమార్ మాట్లాడుతూ, “యుద్ధంలో భారతదేశం చాలా విమానాలను కోల్పోయిందనే వాదనతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ, కొన్ని విమానాలు పోయాయని నేను అంగీకరిస్తున్నాన”ని అన్నారు.
ఫ్రెంచ్ నిర్మిత రాఫెల్ యుద్ధ విమానాలతో సహా ఆరు భారతీయ విమానాలను తమ సైన్యం కూల్చివేసిందని పాకిస్తాన్ అధికారులు అన్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ కుమార్ మాట్లాడారు.
ఈ విషయంలోనే, రక్షణ కార్యదర్శి ఆర్కే సింగ్ కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “వారి సంధానకర్త ‘రాఫెల్’ అనే పదాన్ని బహువచనంలో ఉపయోగించారు. అయినప్పటికీ, ఇది పూర్తిగా సరైనది కాదని నేను మీకు హామీ ఇవ్వగలను” అని అన్నారు.
అంతకుముందు, భారత రక్షణ దళాల చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ, మే 7న పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలో భారత వైమానిక దళానికి చెందిన కొన్ని యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని అంగీకరించారు.
ఈ విషయంలో సంఖ్యను చెప్పడానికి నిరాకరిస్తూ, భారతదేశం ఈ నష్టాల నుంచి నేర్చుకుందని అంతేకాకుండా మెరుగుదలలు సాధించిందని ఆయన అన్నారు.
గమనించాల్సిందేంటంటే, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదదాడికి ప్రతీకారంగా భారతదేశం మే 6, 7 తేదీల మధ్య రాత్రి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. ఈ దాడుల తర్వాత ప్రారంభమైన సైనిక సంఘర్షణకు పాకిస్తాన్ బాధ్యత వహించాలని భారతదేశం ఆరోపించింది. ఈ వివాదం నాలుగు రోజుల పాటు కొనసాగి మే 10న కాల్పుల విరమణ ప్రకటనతో ముగిసింది.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.