
ముసాయిదా ఓటర్ల జాబితాలో స్థానం సంపాదించుకోలేని ఓటర్ల వివరాలను వెల్లడించాల్సిన అవసరం తమకు లేదని సుప్రీంకోర్టు ముందు కేంద్ర ఎన్నికల సంఘం వాదించింది.
బీహార్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీని మీద కోర్టులో జరుగుతోన్న వాదోపవాదనలలో ఎన్నికల సంఘం తన వైఖరిని తెలియజేసింది.
అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ స్వచ్చంధ సంస్థ(ఏడీఆర్) ఈ కేసును దాఖలు చేసింది. సంస్థ తరఫున ప్రశాంత్ భూషణ్, నేహా రాఠీలు వాదిస్తున్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లకు చోటు దక్కలేదని ఈసీ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో స్థానం కోల్పోయిన 65 లక్షల మందికి సంబంధించిన వివరాలను తెలియజేయాలని సుప్రింకోర్టులో ఏడీఆర్ కేసు దాఖలు చేసింది. అంతేకాకుండా, ఏఏ నియోజకవర్గాలలో ఏఏ పోలింగ్ బూత్‌లలో ఎంతమంది ఉన్నారో వెల్లడించాలని కోరింది.
వీరికి సంబంధించిన ఓటర్ల నమోదు జాబితా, ఓటర్ల నమోదు ఫారాలు తమకు అందలేదని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇలా ఇంత స్థాయిలో పౌరులకు సంబంధించిన వివరాలు అందకపోవడానికి గల కారణాలు వెల్లడించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏడీఆర్ అడిగింది.
ఏ ఏ ఎన్నికల బూతులలో పోలింగ్ బూతు స్థాయి అధికారులు ఎంతమందిని ఈ కేటగిరి కిందికి చేర్చి, ఓటర్ల జాబితా నుంచి తొలగించారో వెల్లడించాలని ఏడీఆర్ డిమాండ్ చేసింది.
ఏడీఆర్ మీద ఈసీ ఆరోపణ..
ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టును ఏడీఆర్ తప్పుదారి పట్టిస్తోందని ఆ సంస్థపై కోర్టు ధిక్కారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం వాదించింది.
చట్టప్రకారం, అటువంటి జాబితా తయారు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదని అటువంటి సమాచారం తెలుసుకునే హక్కు కూడా పౌరులకు లేదని సుప్రీంకోర్టు ముందు ఎన్నికల సంఘం పేర్కొన్నది.
తన వాదనను సమర్థించుకోవడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం- 1950 నిబంధనలలో రూల్ నంబర్ 10, 11లను న్యాయస్థానానికి అందించింది.
ఈ రెండు నిబంధనలు ఓటర్ల నమోదుకు సంబంధించిన విధివిధానాలను నిర్దేశిస్తాయి.
రూల్ నంబర్ 10 ప్రకారం, పోలింగ్ బూతు స్థాయి అధికారి ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. దీని తర్వాత ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో ఈ ముసాయిదా జాబితాను ప్రజలకు అందుబాటులో పెట్టాలి.
రూల్ నంబర్ 11 ప్రకారం, అటువంటి జాబితాలను ఆయా ప్రాంతాలలో అందుబాటులో పెట్టాలి. రెండేసి ప్రతుల చొప్పున ఈ జాబితాలను గుర్తించిన రాజకీయాల పార్టీలకు అందజేయాలి.
ఈ రెండు నిబంధనలను తాము పాటిస్తున్నామని సుప్రీంకోర్టుకు కేంద్ర ఎన్నికల సంఘం నివేదించింది.
“ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించిన తరువాత, జాబితా నుంచి తొలగించిన వారి పేర్లతో కూడిన వివరాలు రాజకీయ పార్టీలకు అందజేయాలి. తద్వారా అర్హత కలిగిన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోకుండా చూసేందుకు తగిన అన్ని మార్గాలలోనూ ప్రయత్నించాలి. ముసాయిదా ఓటర్ల జాబితా తమకు అందాయని రాజకీయ పార్టీలు ఇచ్చిన ధృవీకరణ పత్రాలు కూడా ఉన్నాయ”ని సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలియజేసింది. ఈ విధంగా ధృవీకరణ పత్రాలను ఇచ్చిన పార్టీలలో సీపీఐ(ఎంఎల్) కూడా ఉంది.
అయితే, బ్రతికున్న వాళ్ల పేర్లు కూడా ముసాయిదా జాబితా నుంచి తొలిగించిన సందర్భాలు ఉన్నాయని సీపీఐ(ఎంఎల్) ఆరోపించింది.
ఆగస్టు 1న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత వారం రోజుల వ్యవధిలో, ఆగస్టు 7న ఎన్నికల సంఘం బీహార్‌లో పోలింగ్ బూత్ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో(పోలింగ్ ఏజెంట్) సమావేశం జరిపింది.
“ఈ సమావేశంలో ముసాయిదా జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలు వెల్లడించాము. స్థానికంగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. స్థానిక బూతు స్థాయి అధికారులు జాబితాలో చోటు చేసుకొని ఓటర్లను గుర్తించి కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నార”ని ఎన్నికల సంఘం తెలియజేసింది.
ముసాయిదా ఓటర్ల జాబితా తయారు చేసేటప్పుడు, ప్రత్యేకంగా విచారణ చేయలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఓటర్ల నమోదు పత్రాల ద్వారా అందిన వివరాల ప్రకారం, ముసాయిదా జాబితాను సిద్ధం చేశామని ఎన్నికల సంఘం పేర్కొన్నది.
“ఆగస్టు 1న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని వాళ్లు ఫారం- 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అనుబంధం- డీలో అడిగిన వివరాలను సమర్పించడం ద్వారా తమ అభ్యంతరాలు తెలియజేయవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తాము” అని ఎన్నికల సంఘం తెలిపింది.
ఈ విధంగా ఫారం- 6 నింపడం ద్వారా సదరు ఓటర్లు చనిపోలేదని, శాశ్వతంగా వలసపోలేదని నిర్ధారించుకోవచ్చు.
అయితే, ఈ విధంగా పేర్లు తొలగించడానికి గల కారణాలు వెల్లడించినంత మాత్రాన కలిగే ప్రయోజనం ఏమి ఉండదని ఎన్నికల సంఘం అభిప్రాయపడింది.
“ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేనంత మాత్రాన సదరు పౌరుడు ఓటరు కాకుండా పోడు. ముసాయిదా జాబితా కేవలం ఓటర్ల నమోదు పత్రాలు సమర్పించిన వారికి సంబంధించిన వివరాలు మాత్రమే”అని సుప్రింకోర్టు ముందు ఎన్నికల సంఘం వాదించింది.
ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం, ఈ విధంగా వ్యక్తమయ్యే ప్రతీ అభ్యంతరంపైన ఎన్నికల నమోదు అధికారులు బహిరంగ విచారణ జరపాలి. సదరు పౌరుడి పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చలేకపోవడానికి గల కారణాలు వివరించాలి. ఈ అభ్యంతారలపై సమగ్ర దర్యాప్తు జరపాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.