
ఏ దారిన పోతుందో ఈనాటి తరం
ఎటువంటి లోకంతో పోటీ పడుతుందో యవ్వనం
పీల్చే గాలికి ప్రోపగాండాను పూసే రాజకీయo
ఆ గాలి సోకి జీవితాలను దుర్మార్గానికి అర్పించే యువతరం
విద్యాసంస్థలు దేశాభివృద్ధికి మొదటి మెట్టు
కానీ, చదువు మత్తులో ఆలోచనా శక్తి
తరగతి గదులపై దుమ్ములా నిలిచిపోతుంది
విద్యార్ధుల వివేకం పుస్తకాల పేజీలను దాటలేక పోతుంది
కార్పొరెట్లు కన్నుగీటి యువతని ఆకర్షిస్తున్న వైనం
కోట్ల సంపదను కొల్లగొట్టే సాధనం శ్రమ దోపిడీ
స్వల్ప స్వలాభ మగతలో
సామాజిక స్పృహని విస్మరిస్తూ
దుస్స్వప్నాల పాలవుతున్న యువజనం
అభివృద్ధి కేవలం ఎండమావి మాత్రమే
ఎన్నటికి నిజమవ్వని ఓ మిథ్య మాత్రమే..
ఇది యువకులు వేసిన బాటలో నడిచే దేశం కాదు
పాలకులు వేసిన బాటలో నడుస్తున్న యువకుల దేశం
బంధుప్రీతి ధన, కుల, మత, వర్గ మొహం
రాజ్యాధికారానికి కంచు గోడలు
ఆ కోట గోడలను కూల్చే ఫిరంగులు నవ యువ వివేకులు
ఓ వైపు స్వార్ధపు రాజకీయాల చదరంగపుటెత్తులు
మరోవైవు మానాన్ని మరిపించే పాశ్చాత్య ప్రవృత్తులు
కల్పిత కథానాయకులను దేవుళ్లని చేసే సినిమా ఓవైపు
సామాజిక మాధ్యమాల మహమ్మారి మరోవైపు
ఇది నవ భారతానికి ముందడుగా?
నవ(త)త్వానికి వెనుకడుగా?
ఇది తిరోగమనం కాదు పతనానికి పురోగమనం
రేపటి ఉదయానికి చీకట్లని పూసే యుగం
ఇదే నవ యువ యుగం
కందూరి శ్రామిక్
ఫ్రంట్ ఎండ్ డెవలపర్, సాఫ్ట్వేర్