
ప్రస్తుత పాలకుల వల్ల దేశ రాజ్యాంగం సంక్షోభంలో పడిందని, అభివృద్ధి పేరిట దోపిడీ సాగుతోందని నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.
30వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజా ఉద్యమాల పోరాట కమిటీ ఎన్ఏపీఎం అఖిల భారత సమావేశం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. పీపుల్స్ మూమెంట్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ప్రముఖ సామాజిక వేత్త మేథాపాట్కర్ ఈ సమావేశాలలో ప్రత్యేక ఆకర్షణగా మారారు. మేథాపాట్కర్ హైదరాబాద్ కు రావడంతోనే ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు అప్రమత్తమయ్యారు.
దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాల నేతలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజల హక్కుల న్యాయవాదులు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు సహా దాదాపు 800 మంది ఈ 30వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రజా పోరాటాలు, వాటి ఫలితాలపై ఈ సమావేశాలలో సమగ్ర విశ్లేషణ చేపట్టారు. భవిష్యత్ కార్యాచరణకు ఈ సమావేశాలు నాంది పలికాయి.
నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ తరఫున దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చేపట్టిన పోరాటాలు వాటిలో సాధించిన విజయాలు, ఎదురైన సవాళ్ళను కూడా చర్చించారు. సమావేశాల చివరలో తమ ఎజెండాను ప్రకటించారు.
స్వార్థపూరితమైన నవ ఉదారవాదాన్ని దేశంలో ప్రభుత్వాలు సంపూర్ణంగా, విజయవంతంగా ప్రోత్సహిస్తున్నాయని దేశ రాజ్యాంగం కూడా ప్రమాదంలో పడిందని పీపుల్స్ మూమెంట్ తెలంగాణ శాఖకు నాయకత్వం వహిస్తున్న ప్రముఖ మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభ ఉపన్యాసంలోనే ఉటంకించి సమావేశాలను హైలెట్ చేశారు.
‘దేశంలో సహజ వనరులను అభివృద్ధి పేరుతో నాశనం చేస్తున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోంది. దీంతో ప్రకృతి వైపరిత్యాలకు కారణమవుతున్నారు’ అని ఈ సమావేశాల్లో పాల్గొన్న మేథావులు స్పష్టం చేశారు. మానవహక్కులను కాలరాస్తూ సమాజ హింసను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు.
ఈ వార్షిక సదస్సులో మేధా పాట్కర్ తో పాటు బేలా భాటియా, రోజ్మేరీ జువిచు, ఆశిష్ కొఠారి, సోనమ్ వాంగ్‌చుక్ వంటి ప్రఖ్యాత సామాజిక కార్యకర్తలు తమ అనుభవాలను పంచుకున్నారు. నిర్మాణాత్మక, వ్యవస్థాగత అణిచివేతలను పరిష్కరించడానికి సంఘీభావాన్ని కోరారు.
రాడికల్ ప్రజాస్వామ్యం, ఆర్థిక వైవిధ్యం, సామాజిక న్యాయం, పర్యావరణం, మతపరమైన , జ్ఞాన వైవిధ్యంపై పర్యావరణ కార్యకర్త కొఠారి మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శంకర్ గుహా నియోగ్ పిలుపు నిచ్చినట్లుగా ‘సంఘర్ష్ ఔర్ నిర్మాణ్’ నినాదంతో కొత్త సమాజ నిర్మాణం జరగాల్సి ఉందన్నారు.
నాగాలాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన జువిచు నాగాలాండ్ ప్రజల ఆకాంక్షలు, హక్కుల చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ ప్రాంతంలో సైనికుల దురాగతాలు, ఇండో-మయన్మార్ సరిహద్దు వివాదాలు, మణిపూర్‌లో అల్లర్లు, హింస అంశాలను ప్రస్తావించారు. మణిపూర్ లో ప్రార్థనా స్థలాలపై దాడులు జాతి వివక్ష , హింసకు వ్యతిరేకంగా పోరాటం సాగాలని ఆమె పిలుపునిచ్చారు.
ఉత్తరాఖండ్ లో తీసుకొచ్చిన యూనిఫామ్ సివిల్ కోడ్ అంశాన్ని సామాజిక వేత్త ఆలం ఉటంకించారు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లను నమోదు చేయడానికి సంబంధించిన నిబంధనలు, కోర్టు బాడీ షేమింగ్ వ్యాఖ్యలు, జైలు శిక్షకు దారితీసే నినాదాలు వంటి అంశాలను ప్రస్తావించిన ఆమె ఇటువంటి అంశాలలో తీవ్రమైన న్యాయపరమైన ఉదాసీనత కనబడుతోందన్నారు.
లడఖ్ నుండి, స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్‌మెంట్‌కు చెందిన సోనమ్ వాంగ్‌చుక్ వారి భూమి, సంస్కృతి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అవసరమైన రాజ్యాంగ చర్యలను వివరించారు. 2019లో బిజెపి లడఖ్‌ను ఆరవ షెడ్యూల్లో చేర్చుతామని హామీ ఇచ్చింది కానీ దానిని నెరవేర్చడంలో విఫలమైందని ఆయన అన్నారు.
ఇలా దేశ వ్యాప్తంగా మూడు దశాబ్దాలుగా జరిపిన , జరుగుతున్న ఉద్యమాలు, వాటి ఫలితాలను ఆయా ప్రాంతాల ప్రతినిధులు వివరంగా ప్రస్తావించారు.
ముప్పై సంవత్సరాల ఎన్ఏపీఎం మనుగడను మేధా పాట్కర్ అందరికీ గుర్తు చేస్తూ, ఈ కూటమి సంక్షోభం నుండి పుట్టిందని గుర్తించాలన్నారు. లక్షలాది మందిని ఉద్యోగాల నుంచి తొలగించిన నవ ఉదారవాద ఆర్థిక విధానాల పెరుగుదల, ప్రజలను విభజించి పాలించడం, ప్రతిఘటనను అణిచివేసే చర్యలు, పెరుగుతున్న మత హింస ఇలాంటి వాటికి వ్యతిరేకంగా నేషనల్ పీపుల్స్ మూమెంట్ ఆవిర్భావం జరిగిందన్నారు. అయితే ఆ సంక్షోభాలు మరింత తీవ్రమయ్యాయి, కార్పొరేట్ దురాశ పెరిగింది, ప్రభుత్వాల అణచివేత తీవ్రమైంది, ప్రజల శక్తిని బలహీనపరిచేందుకు మతపరమైన కుల విభజనలు తీసుకొస్తున్నారని మేథాపాట్కర్ తీవ్రంగా దుయ్యబట్టారు.
దేశంలోని ప్రతి మూలలో, మైనింగ్ కంపెనీలను వ్యతిరేకించే ఆదివాసీ భూముల నుండి తీరప్రాంత విధ్వంసంతో పోరాడుతున్న మత్స్యకార వర్గాల వరకు, వ్యవసాయ సార్వభౌమత్వాన్ని తిరిగి పొందే రైతుల నుండి కార్మిక హక్కులను కోరుతున్న పట్టణ కార్మికుల వరకు, ప్రతిఘటన చేస్తూనే ఉన్నారని వారికి అండగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.
అయితే, హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి ఇప్పటికే వ్యతిరేకత వస్తున్న సమయంలో సామాజిక వేత్త మేథాపాట్కర్ తో పాటు ప్రముఖులు హైదరాబాద్ రావడం పై పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. మేథాపాట్కర్ ఛాదర్ ఘాట్ ప్రాంతంలోని తన స్నేహితుల ఇంటికి వెళడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల సమస్య వస్తుందంటూ అక్కడి నుంచి పంపించి వేశారు. మొత్తంమీద హైదరాబాద్ లో జరిగిన నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ వార్షికోత్సవం వేడి పుట్టించింది.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.