![mcms](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/mcms-2.jpeg)
స్వాతంత్య్రోద్యమానికి తిలోదకాలివ్వటమే కాక హిందు ముస్లింలు వేర్వేరు దేశాలుగా ఏర్పడటానికి కావలిసిన సైద్ధాంతిక పునాదిని ఏర్పాటు చేసిన వ్యక్తిగా సావర్కార్ భారత చరిత్రలో నిల్చిపోతారు.
జాతినుద్దేశించి ప్రధానమంత్రులు చేసే ప్రసంగాల్లో వినాయక దామోదర సావర్కార్ పేరు పదేపదే ప్రస్తావించే ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కరే. నరేంద్ర మోడీ ఈ మధ్యనే ఢల్లీ విశ్వవిద్యాలయం పరిధిలో కొత్తగా ప్రారంభం కానున్న ఓ కాలేజీకి శంకుస్థాపన చేశారు. ఆ కాలేజీ పేరు వీడీ సావర్కార్ కాలేజీ. ఇటువంటి చర్యలన్నీ భారత జాతిపిత గాంధీ, సర్దార్ పటేల్, అంబేద్కర్లనూ, స్వాతంత్య్రోద్యమ లక్ష్యాలనూ అవమానించటం తప్ప మరోటి కాదు.
సావర్కార్ గురించి గాంధీ ఏమన్నారు?
20వ శతాబ్దం తొలి దశాబ్దంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సావర్కార్ మాండలే జైలులో శిక్ష అనుభవిస్తున్న 1911-14 మధ్యకాలంలో ఎన్నోసార్లు క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకపోవటంతో చివరకు తనను విడుదల చేస్తే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఏ కార్యక్రమంలో పాల్గొనబోననీ, జీవితాంతం రుణపడి ఉంటానని కూడా రాతపూర్వకంగా ఇచ్చారు.
ఇంకా చెప్పాలంటే 1920 జనవరి 8న మహాత్మ గాంధీకి రాసిన లేఖలో బ్రిటిష్ పాలకులు క్షమాభిక్ష పెట్టదల్చుకున్న ఖైదీల జాబితాలో తన పేరు, ఖైదీగా ఉన్న మరో సోదరుడి పేరూ లేవని గుర్తు చేశారు. జనవరి 25న సమాధానం రాస్తూ గాంధీ సావర్కార్, అతని సోదరుడు చేసిన తప్పులు కేవలం రాజకీయ స్వభావంతో కూడుకున్నవన్న విషయం గురించి ప్రజలను ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తానని వ్రాశారు.
సావర్కార్ సోదరులు అన్న శీర్షికన యంగ్ ఇండియా పత్రికలో గాంధీ 1920 మే 26న ఓ వ్యాసం రాశారు. ఫ్రెంచి తీరపు సముద్ర జలాల ఓ పడవ నుండి తప్పించుకుపారిపోవడానికి సావర్కార్ సోదరులు చేసిన ప్రయత్నాన్ని, ఆ తర్వాత కేసుకు సంబంధించిన వివరాలనూ ప్రస్తావిస్తూ ఆ సోదరులిరువురూ భారతదేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం అవసరం లేదని భావిస్తున్నందున తమను దేశద్రోహులుగా గుర్తించరాదని అభ్యర్ధించిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తారు. సావర్కార్ సోదరులు ఈ దేశానికి స్వాతంత్య్రం అవసరం లేదని ప్రకటించటం నాటి స్వాతంత్య్రోద్యమ సమర స్పూర్తికి విరుద్ధం.
జిన్నా కంటే ముందే ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సావర్కార్
యావత్ భారత జాతి ముక్తకంఠంతో స్వాతంత్య్ర సమర భేరి మోగిస్తుంటే దాన్ని తిరస్కరించటమే కాక భారత ఉపఖంఢాన్ని హిందూ దేశం, ముస్లిం దేశంగా విభజించాలని ప్రతిపాదించిన తొలి వ్యక్తి సావర్కార్. అహ్మదాబాద్‌లో 1937లో హిందూ మహాసభ వార్షిక సమావేశాలనుద్దేశించి ప్రసంగిస్తూ సావర్కార్ ‘‘ ఒకవేళ ఇంగ్లాండ్ పాలకులు దేశాన్ని విడిచి వెళ్లినప్పటికీ భారతదేశం ఓ దేశంగా మిగలాలన్న ఆకాంక్షకు ఈ దేశంలో ముస్లింలే అత్యంత ప్రమాదకారులుగా మారే అవకాశం ఉందని హిందూ సోదరులను హెచ్చరిస్తున్నాను.’’ అంటూ తన ముస్లిం ద్వేషాన్ని బాహాటంగానే వెళ్లగక్కారు.
అదే ఉపన్యాసంలో ‘‘హిందువులు, ముస్లింలు ఇరుగుపొరుగున నివసిస్తున్న రెండు వైరి దేశాలు’’ అని చెప్తూ కొందరు రాజకీయ పసికూనలు భారతదేశం శాంతి సామరస్యాలు, సౌహార్ద్రతతో సమైక్య దేశంగా ఎదిగిందనో లేక బ్రిటిష్ పాలకులు దేశాన్ని వీడిపోతే అటువంటి సమైక్య భారతంగా ఎదుగుతామనో ఆశపడుతున్నారంటూ స్వాతంత్య్రోద్యమ కాలంలో నిర్మితమవుతున్న భారత జాతీయతా భావనను, ఆ భావన ప్రతిపాదకులనూ దుయ్యబట్టారు. ఈ వాదనలు చేసేవారు అవాహగన కలిగిన వారే అయినప్పటికీ ఆలోచన లేనివారని, ఊహాలోకంలో విహరిస్తూ ఉంటారనీ, సామాజిక పరిణామాల్లో మతకోణాన్ని విస్మరిస్తారనీ విమర్శించారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే మతపరమైన ప్రశ్న హిందూ ముస్లింల మధ్య శతాబ్దాలపాటు ఘనీభవించిన సాంస్కృతిక, ధార్మిక, జాతి వ్యతిరేకత వల్ల తలెత్తిన సమస్యేననీ స్పష్టం చేస్తారు.
ఇటువంటి ద్వేషపూరిత భావజాలం కలిగిన సావర్కార్ 1940 దశకంలో జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతానికి కావల్సిన సైద్ధాంతిక భూమికను ఏర్పర్చారు.
సావర్కార్ పట్ల గాంధీ, పటేల్, అంబేద్కర్ విమర్శలు
క్విట్ ఇండియా పిలుపునివ్వటానికి ముందు రోజు 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ వార్షిక సమావేశాల్లో మాట్లాడుతూ గాంధీ దేశాన్ని మతం ప్రాతిపదికన ముక్కలు చేయాలంటూ ఇస్తున్న పిలుపులను పురస్కరించుకుని
అదే జరిగితే ఈ దేశం అన్నదమ్ముల రక్తంతో తడిసి ముద్దవుతుందని ఆందోళన చెందారు. మూంజీ, సావర్కార్ లాంటి హిందూ సోదరులు ముస్లింలకు కరవాలంతోనే బుద్ధి చెప్పాలని, ముస్లింలపై హిందూ ఆధిపత్యాన్ని స్థాపించాలని ఉవ్విళ్లూరుతున్నారని గుర్తు చేస్తూ అటువంటి హిందువులకు నేను ప్రాతినిధ్యం వహించనని స్పష్టం చేశారు.
సావర్కార్ సిద్ధాంతంలోని హింస, విభజనవాదాన్ని 1942లోనే గాంధీ ప్రస్తావించిన అంశాలను అంబేద్కర్ తన పాకిస్తాన్ లేక దేశ విభజన అన్న గ్రంథంలో చర్చించారు. ఈ గ్రంథం 1946లో అచ్చయ్యింది. 1937లో దేశాన్ని విభజించాలని సావర్కార్ ముందుకు తెచ్చిన ప్రతిపాదనలను ఖండిస్తూ అంబేద్కర్ ‘‘ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జిన్నా, సావర్కార్ల మధ్య ద్విజాతి సిద్ధాంతం విషయంలో ఏకాభిప్రాయం ఉండటం.’’ అని గుర్తు చేశారు. వీరిద్దరూ ఈ విషయం మీద ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండటమే కాక దేశాన్ని రెండుగా చీల్చాలన్న విషయంపై కూడా ముక్తకంఠంతో వాదిస్తున్నారని అంబేద్కర్ గుర్తు చేస్తారు.
వీరిద్దరి మధ్య ఉన్న తేడా అంతా ఏ షరతుల ప్రాతిపదికన ఈ దేశాన్ని చీల్చాలన్న విషయంలోనే తప్ప దేశాన్ని సమైక్యంగా ఉంచాలా వద్దా అన్న అంశంలో వారి మధ్య తేడాలు లేవని అంబేద్కర్ మరీ మరీ గుర్తు చేస్తున్నారు. ‘‘ఈ దేశాన్ని రెండు ముక్కలు చేసి ముస్లింలు మెజారిటీగా ఉన్న భూభాగాన్ని పాకిస్తాన్గానూ, హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న భూభాగాన్ని హిందూస్తాన్గానూ గుర్తించాలని జిన్నా ప్రతిపాదిస్తుంటే సావర్కార్ దీనికి భిన్నంగా ఈ రెండు దేశాలూ ఒకే రాజ్యాంగం కింద ఉండాలనీ, కాకపోతే ఆ రాజ్యాంగం హిందువుల ఆధిపత్యానికి అవకాశం కల్పించేదిగానూ, తద్వారా ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చేందుకు అవకాశం కలిగించేదిగానూ ఉండాలని సావర్కార్ ఆకాంక్ష.
సావర్కార్ ప్రతిపాదించే ఈ సిద్ధాంతం భారత దేశ సమైక్యతా సమగ్రతలకు చేటు కలిగించేదిగా ఉంటుందని అంబేద్కర్ హెచ్చరించారు. ‘‘(హిందూ ఆధిపత్య దేశం అయినంత మాత్రాన) దేశంలో నివసించే హిందువులందరూ శాంతి సౌభాగ్యాలతో తులతూగుతారనుకోవడం వట్టి భ్రమ. ఎదుకంటే ముస్లింలు భయానికి లొంగినదాఖలాలు లేవు. నడవడికను మార్చుకున్న దాఖలాలూ లేవు.’’ అని కూడా అంబేద్కర్ హెచ్చరించారు.
మహాత్మాగాంధీ హత్యకు సావర్కారే బాధ్యుడని నేరుగా సర్దార్ వల్లభాయ్‌పటేల్ ప్రకటించటం గమనించాల్సిన విషయం. గాంధీ హత్య జరిగిన నెలరోజుల తర్వాత నాటి ప్రధాని నెహ్రూకు రాసిన లేఖలో పటేల్ ‘‘హిందూ మహాసభకు చెందిన సాయుధ దుండగులు సావర్కార్ నాయకత్వంలోనే ఈ కుట్రకు వ్యూహరచనచేశారు.’’ అని రాశారు.
గాంధీ హత్య కేసులో నిందితుడిగా విచారణ ఎదుర్కొన్న సావర్కార్ తనపాత్ర గురించి తగిన సాక్ష్యాధారాలు లేకపోవటం వలన నిర్దోషిగా బయటకొచ్చారు. కానీ నెహ్రూకు పటేల్ రాసిన లేఖలోని ఆరోపణలను తర్వాత జీవన్ లాల్ కపూర్ కమిటీ కూడా నిర్ధారించింది. ఈ కమిటీ 1970లో తన నివేదికను సమర్పించింది. నెహ్రూకు పటేల్ రాసిన లేఖ కూడా సర్దార్ పటేల్ కరస్పాండెన్స్ నాల్గో సంపుటంలో అచ్చయ్యింది. ఈ పుస్తకాన్ని దుర్గాదాస్ సంపాదకత్వంలో నవజీవన్ పబ్లిషింగ్ హౌస్ ప్రచురించింది.
తిరువనంతపురం సంస్థానం భారతదేశంలో విలీనం కావడాన్ని వ్యతిరేకించిన సావర్కార్
తనకు తాను వీర్ అని బిరుదు ఇచ్చుకున్న సావర్కార్ దేశంలోని సంస్థానాల పాలకులను సమర్ధించటం క్షమించరాని విషయం. ప్రధానంగా తిరువనంతపురం మహారాజు భారతదేశంలో విలీనం కాబోవటం లేదు అని చెప్పినప్పుడు సావర్కార్ ఆ ప్రతిపాదనను సమర్ధించారు. దానికి ఆయన చెప్పిన కారణం తిరువనంతపురం సంస్థానానికి దక్కిన రాజాధికారం నేరుగా పద్మనాభస్వామి అనుగ్రహమే తప్ప ప్రజానుగ్రహమో రాజ్యాంగానుగ్రహో కాదన్నది వారి వాదన. అందువలన దైవాజ్ఞను రాజ్యాంగ శాసనానికి లోబర్చలేమన్నది కూడా ఆ వాదనకు కొనసాగింపు.
ఈ నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో 1998లో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చెప్పిన మాటలను ఇక్కడ ప్రస్తావించుకోవటం సముచితంగా ఉంటుంది. అప్పట్లో తిరువనంతపురం దివాన్‌గా ఉన్న సిపి రామస్వామి అయ్యర్ ‘‘తిరువనంతపురం సంస్థానం శ్రీ పద్మనాభునికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఆ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం అన్న ప్రశ్నే తలెత్తదు’’ అని వాదించిన విషయాన్ని వాదనను రాష్ట్రపతి నారాయణన్ గుర్తు చేశారు. దీనికి బదులుగా సర్దార్ పటేల్ ‘‘మరి అలాంటప్పుడు అంతటి అనంత పద్మనాభుడే బ్రిటిష్పాలనకు ఎందుకు తలొగ్గినట్లో సెలవిస్తారా’’ అని సవాలు విసిరిన విషయాన్ని కూడా రాష్ట్రపతి గుర్తుచేశారు.
దేశాన్ని సమైక్యం చేసే బృహత్ కర్తవ్యంలో సర్దార్ పటేల్ మునిగి ఉంటే దేశాన్ని ముక్కలు చేయటంలో భాగంగా తిరువనంతపురం సంస్థానాధీశుల పక్షాన సావర్కార్ నిలిచారు.
సావర్కార్ : వివాదాస్పద వారసత్వం 1924-66 అన్న తన గ్రంథంలో విక్రం సంపత్ ‘‘దివాన్ రామస్వామి అయ్యర్ తిరువనంతపురం సంస్థానం స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యంగా ఉంటుందని ప్రకటించటం, దానికి సావర్కార్ మద్దతు పలకటం భారత దేశ ఐక్యతకు విఘాతం కలిగించే అంశం అని రాశారు.
ప్రాధమిక బాధ్యతలను సైతం తిరస్కరిస్తున్న మోడీ వైఖరి
అటువంటి సావర్కార్ దేశంలో అగ్రగామి నేత అని కీర్తిస్తూ ఆయన పేరు మీద ఓ కాలేజీని ప్రారంభించేందుకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోడీని ఎలా అర్థం చేసుకోవాలి? స్వయంగా ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి ఆ పని చేయటం అంటే మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్ల అత్యున్నత వారసత్వాన్ని ఎగతాళి చేయటమే. రాజ్యాంగంలో ఆర్టికల్ 51(అ)(ఆ)లో ప్రస్తావించిన స్వాతంత్య్రోద్యమ ఉన్నత విలువలను పెంపొందించి ప్రోత్సహించాలన్న కర్తవ్యానికి తిలోదకాలు ఇవ్వటమే.
– ఎస్ ఎన్ సాహు
అనువాదం : కొండూరి వీరయ్య