
Reading Time: 3 minutes
2018లో కేవలం 3.67 కోట్ల బడ్జెట్‌తో మొదలైన పరీక్ష పే చర్చ కార్యక్రమం, 2025 బడ్జెట్ నాటికి 18.82 కోట్లకు చేరింది.
న్యూఢిల్లీ: సంవత్సరానికి ఒక సారి జరిపే పరీక్ష పే చర్చ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఐదు రెట్లు బడ్జెట్ పెంచింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా పాల్గొంటారు. విద్యార్దులతో ముచ్చటిస్తారు. వారి సందేహాలకు సమాధానాలు చెప్తారు. గత ఏడేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
2018లో తొలిసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు 3.67 కోట్లు ఖర్చు అయ్యింది. 2025 నాటికి ఈ ఖర్చు 18.82 కోట్లకు పెరిగింది. అంటే 522 శాతం పెరుగుదల.
ప్రభుత్వం అందించే అనేక విద్యా కార్యక్రమాలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును అనిశ్చితిలో పడేస్తున్నాయి. కానీ పరీక్ష పే చర్చ కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా మోడీ ఫొటోతో ఉన్న హోర్డింగ్‌ల కోసం ఖర్చులు పెరుగుతున్నాయి. 2023, 2024 రెండేళ్లల్లో 2.49 కోట్ల ఖర్చుతో దేశవ్యాప్తంగా 1111 చోట్ల సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు.
పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత విద్యార్ధులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటన్న ప్రశ్నపై ఒక్క చర్చ కూడా లేదు. ప్రశ్నాపత్రాల లీకేజీల గురించి కానీ, పరీక్షల విధానంలో పారదర్శకత గురించి కానీ ఎక్కడా చర్చ ఉండదు. ఈ కార్యక్రమంలో కేవలం మోడీ విద్యార్ధులకు ఉపన్యాసం ఇవ్వటమే పరీక్ష పే చర్చగా మారుతోంది.
పేరుకు విద్యా విషయక కార్యక్రమం అయినా పరీక్ష పే చర్చ చివరకు ఓ ఈవెంట్‌గా మారిపోయింది. కేవలం ఆ ఒక్క రోజు జరిగే కార్యక్రమానికి అయ్యే ఖర్చు 2024 నాటికి ఆరున్నర కోట్లకు పెరిగింది.
పరీక్ష పే చర్చ కేవలం ఏడాదిలో ఒక రోజు మాత్రమే జరిగే కార్యక్రమం.
కోవిడ్ నిర్బంధనల నడుమ 2021 ఏప్రిల్‌లో నాల్గో విడత పరీక్ష పే చర్చ కార్యక్రమం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన సమాచారం ప్రకారం కోవిడ్ వల్ల తలెత్తే సమస్యలను అధిగమించటానికి ఆరోజు మోడీ విద్యార్ధులను, వారి తల్లితండ్రులనూ దిశానిర్దేశం చేస్తూ ఉపన్యసించారు. కార్యక్రమం సాధించింది ఏమైనప్పటికీ, విద్యాశాఖ మాత్రం ఈవెంట్ నిర్వాహకులకు ఆరుకోట్లు బిల్లు చెల్లించింది.
ఈ కార్యక్రమాన్ని కొనసాగించటం వెనక కేవలం ప్రధానమంత్రి మోడీ వ్యక్తి గత ప్రచారాన్ని కొనసాగించటం తప్ప మరో లక్ష్యం లేదు.
ఇదిలా ఉండగా కేంద్ర విద్యా శాఖ పరిధిలో ఉండే పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్, ప్రధానమంత్రి ఇన్నోవేటివ్ లెర్నింగ్ ప్రోగ్రాంలకు నిధులు మాత్రం తగ్గిపోతున్నాయి. ఈ పథకాల కింద కేంద్ర బడ్జెట్ 2018- 19 నుంచి 2025- 26 మధ్య కాలంలో 23 శాతం తగ్గింది.
అదనంగా 2021 తర్వాత నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌ను రద్దు చేశారు. 1963 నుంచి క్రమం తప్పకుండా అమలు జరిగిన ఈ కార్యక్రమం ద్వారా ఏటా 2000 మంది పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదువుల వరకూ స్కాలర్షిప్, మెంటార్షిప్ కోసం నిధులు కేటాయించబడేవి.
మౌలానా అజాద్ నేషనల్ ఫెలోషిప్ కార్యక్రమాన్ని సమీక్షించాలనే పేరుతో ఈ పథకం కింద ఉపకారవేతనం పొందే పరిశోధన విద్యార్ధులకు ఉపకారవేతనాలు 2024 డిసెంబరులో నిలిపివేశారు. ఈ పథకానికి ఉపకారవేతనాలను అల్పసంఖ్యాకవర్గాల మంత్రిత్వశాఖ సమకూరుస్తోంది.
స్థూలంగా చెప్పాలంటే నేరుగా విద్యార్ధులకు ప్రయోజనం కలిగించే పథకాలు నిధుల కొరత ఎదుర్కొంటూ ఉంటే, ఏడాదికి ఒకరోజు మోడీ కోసం జరిగే కార్యక్రమానికి అయ్యే ఖర్చులు మాత్రం పెరుగుతూ పోతున్నాయి.
పరీక్ష పే చర్చ కార్యక్రమం ఎందుకు మొదలైంది?
ఏడాదికి ఒకసారి జరిగే ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రధాని మోడీ విద్యార్ధులు, ఉపాధ్యాయులు, తల్లితండ్రులతో ముఖాముఖీ సంప్రదించే కార్యక్రమంగా 2018 ఫిబ్రవరి 16న మొదలైంది. పరీక్షల ముందు విద్యార్ధులు, తల్లితండ్రుల్లో సహజంగా ఉండే భయాందోళనలను, ఒత్తిళ్లను అధిగమించటానికి, సానుకూల దృక్ఫథంతో విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యేలా ప్రోత్సహించటానికి, ప్రధానమంత్రి విద్యా పరమైన విజన్‌ను విద్యార్ధులకు చేర్చటానికి ఉద్దేశించింది ఈ కార్యక్రమం. ఎగ్జాం వారియర్స్ అనే పుస్తకంలో మోడీ పరీక్షలకు వెళ్లే విద్యార్ధులకు ఇచ్చే చిట్కాలు కూడా ఉన్నాయి.
ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఓ భారీ మైదానంలో ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా వందలాదిమంది విద్యార్ధులు ఆన్లైన్లో పాల్గొంటారు.
సాలుసరి ఖర్చులు..
సామాజిక కార్యకర్త కన్హయ్యకుమార్ సమాచార హక్కు కింద సేకరించిన సమాచారాన్ని ది వైర్ హిందీతో పంచుకున్నారు. ఈ సమాచారం ప్రకారం ఈ కార్యక్రమానికి ఏయేడాదికాయేడాది బడ్జెట్ కేటాయింపులు పెరుగుతూ వచ్చాయి. ఇప్పటి వరకూ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి ప్రభుత్వం 70.88 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది.
దేశవ్యాప్తంగా సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయటానికి కోట్ల రూపాయలు..
ఈ కోవకు చెందిన ఖర్చు ప్రధానంగా ఈవెంట్ మేనేజ్మెంట్ ఖర్చే. చిత్ర నిర్మాణం, సెల్ఫీల ఏర్పాటుకు అయ్యే ఖర్చే. పైన ప్రస్తావించినట్లు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ కార్యక్రమంలో సెల్ఫీ స్టాండ్లు ఏర్పాటు చేయటానికి 2023, 2024 లోనే 2.49 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇందులో 2డీ, 3డీ సెల్ఫీ పాయింట్లు కూడా ఉన్నాయి.
ఒక్కో 3డీ సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయటానికి అయ్యే ఖర్చు 1,25,000. 2డీ సెల్ఫీ పాయింట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు 15వేల నుండి 21 వేల వరకూ అవుతోంది. వీటన్నిటిలో మోడీ ఫోటో అనివార్యం. వీటితో పాటు ఏటా ఈ కార్యక్రమాన్ని డిజిటల్ ప్లాట్‌ఫారంలపై ప్రమోట్ చేయటానికి (అడ్వర్టైజ్మెంట్) పెద్దఎత్తున ఖర్చు పెడుతున్నారు. ఈ ప్రచార ప్రకటనల్లో మోడీ ఫొటో అనివార్యంగానే ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. 2021 నుంచి 2024 వరకూ డిజిటల్ మాధ్యమాలల్లో ఈ కార్యక్రమం గురించి ప్రచారం చేయటానికి 2.44 కోట్లు ఖర్చు అయ్యింది.
ఖర్చుల వివరాలు..
ప్రతి ఏటా జరిగే కార్యక్రమం కోసం ఏ పద్దు కోసం ఎంత ఖర్చు పెట్టారన్న వివరాలు అందుబాటులో లేకపోయినా కొంత సమాచారం అందుబాటులో ఉంది. ఉదాహరణకు ఈ ఖర్చులో గణనీయమైన భాగం ఎనిమిదో విడత జరిగిన కార్యక్రమానికి ఖర్చు పెట్టారు. 2025లో ఢిల్లీలో జరిగిన ఈ ఎనిమిదో విడత కార్యక్రమం భారత్ మండపం(గతంలో ప్రగతి మైదాన్ పేరుతో ఉండేది)లో జరిగింది.
ప్రభుత్వ నివేదికల ప్రకారం ఆ సమయంలో మొత్తం 14,21,99,125 ఈవెంట్ మేనేజ్మెంట్కు, మీడియా కంటెంట్ తయారీకి, క్షేత్రస్థాయి ఏర్పాట్లకు, కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీం చేయటానికి, అన్నపానీయాలకు ఖర్చు చేశారు. అదనంగా మరో 9765370 రూపాయలు ప్రచారానికి, ఎలక్ట్రానిక్ టెండర్లకు, టాక్సిల అద్దెకు, విద్యార్ధులకు వసతి ఖర్చుకు, బస్సు ప్రయాణాలు, పుస్తకాలు కొనుగోలు ఇతర ప్రయాణాలకు వెచ్చించారు.
అంతేకాదు. మోడీ పేరుతో వెలువడిన ఎగ్జాం వారియర్స్ పుస్తకాన్ని కొనుగోలు చేయటానికి 3,97,500 ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏర్పాటు చేయటానికి నియమించిన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ వారికి చెల్లించిన ఫీజు ఇందులో కలపలేదు.
ఈ కార్యక్రమం సందర్భంగా అవసరమైన ఈవెంట్ మేనేజ్మెంట్, వసతికి అయ్యే ఖర్చు, ఇంటర్నెట్ ఏర్పాటు, తాత్కాలిక పారిశుద్ధ్యం, ప్రచార ప్రకటనలు రూపొందించటం, కేటరింగ్, ఆడియో విజువల్ సేవలు, చిత్రీకరణ, సామాజిక మీడియాలో మార్కెటింగ్ వంటి సేవలన్నీ వేర్వేరు సంస్థలు అందిస్తాయి. వాటి కోసం ప్రత్యేకమైన చెల్లింపులు ఉన్నాయి. బిల్లులు, ఇన్వాయిస్లు కాపీలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వటానికి మాత్రం ప్రభుత్వం సిద్ధం కాలేదు. ఈ సమాచారం ఇవ్వడం ఆయా సంస్థల వాణిజ్య ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందన్నది ప్రభుత్వ వాదన.
డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ కింద సర్టిఫికెట్లు అచ్చేయటానికి 6.19 కోట్లు ..
సమాచార హక్కు కార్యకర్త అజయ్ బాసుదేవ్ బోస్ అందించిన సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ఇచ్చే సర్టిఫికెట్లు అచ్చేయించటానికి 6.19 కోట్లు ఖర్చు అయ్యింది. కోవిడ్ టీకా సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఈ సర్టిఫికెట్టు కూడా డిజిటల్ సర్టిఫికెట్ గా ఇవ్వవచ్చు. కానీ ప్రభుత్వం దానికి సిద్ధం కాలేదు. డిజిటల్ ఇండియా పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఈ సమచారాన్ని వెల్లడించింది. పేపరు రహిత పరిపాలన ఈ మిషన్ లక్ష్యం.
ఈ కార్యక్రమం ద్వారా పరీక్షకు వెళ్లే విద్యార్ధుల్లో భయాందోళనలు తొలగించటానికి ఉపయోగపడిందని ప్రభుత్వం చెప్తోంది. ఏది ఏమైనా ఏడాదికేడాది పెరిగే ఖర్చుతో కేవలం ఒక వ్యక్తిని ప్రమోట్ చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ కార్యక్రమం ప్రతిపాదిత లక్ష్యాలు చేరుకోవటం లేదన్న విమర్శ కూడా ఉంది.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.