
న్యూఢిల్లీ: బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఒడిస్సా, ఢిల్లీ, అస్సాం, మహారాష్ట్ర, జార్ఖండ్లలో ఓ వైపున బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను తనిఖీల పేరుతో వేధిస్తున్నారు. మరోవైపు శుక్రవారం జూలై 18న బెంగాల్లోని దుర్గాపూర్లో జరిగిన సభలో, మోడీ మాట్లాడుతూ బెంగాలీ ఆత్మగౌరవాన్ని ప్రశంసించారు.
రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తుందంటూ విమర్శించారు. అయితే, ఈ మధ్యకాలంలో వివిధ బీజేపీ పాలిత రాష్ట్రాలు బెంగాలీ మాట్లాడుతున్న వలస కార్మికులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పరిణామాల నడుమ మోడీ దుర్గాపూర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో నిబంగ్లా భాషను, బెంగాలీ ప్రజలను గౌరవంగా చూస్తుందని చెప్పుకున్నారు.
“బంగ్లా భాషను భారతీయ జనతా పార్టీ ఒక అస్తిత్వంగాను, స్ఫూర్తిగా, సాంప్రదాయంగాను గుర్తిస్తుంది. బీజేపీ దృష్టిలో బంగ్లా ఆత్మగౌరవం అత్యున్నతమైనది. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ, దేశంలోనూ బంగ్లా భాష మాట్లాడే ప్రజలను సముచిత గౌరవ సత్కారాలతో చూస్తున్నాము. కానీ ఇక్కడ బెంగాల్లో మాత్రం తృణ మూల్ కాంగ్రెస్ పార్టీ తన సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం బెంగాలీల ఆత్మ గౌరవాన్ని ఫణంగా పెడుతుంది”అని ఆరోపించారు.
“అందుకే తృణమూల్ కాంగ్రెస్ సీమాంతర వలసలను ప్రోత్సహిస్తూ వచ్చింది. తప్పుడు డాక్యుమెంట్లను వారికోసం సృష్టిస్తూ వచ్చింది. సీమాంతర వలసలను ప్రోత్సహించడానికి పెద్ద యంత్రాంగమే తయారయింది. ఈ పరిణామాలు బెంగాల్ అస్తిత్వానికి ప్రమాదకరంగా మారనున్నాయి. కేవలం బెంగాల్ అస్తిత్వానికే కాదు, జాతీయ భద్రతకు కూడా ప్రమాదకరంగా మారనున్నాయి. బెంగాలీ సంస్కృతి కలుషితమైపోతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్ధ శక్తులను ప్రోత్సహించడంలో టీఎంసీ హద్దులు దాటి వ్యవహరిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ దేశానికి వ్యతిరేకంగా సాగిస్తున్న కుట్రను ఈరోజు బహిర్గతం చేస్తున్నాము. అందుకే ఇప్పుడు ఈ సీమాంతర చొరబాటుదారులను కాపాడేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది” అని మోడీ అన్నారు.
పౌరసత్వం లేకుండా దేశంలో అక్రమంగా ప్రవేశించే వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు.
“వాళ్లు(తృణమూల్ ) రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను సవాల్ చేస్తున్నారు. టీఎంసీ ప్రస్తుతం చొరబాటుదారులకు అనుకూలంగా మాత్రమే మాట్లాడుతోంది. ఓ విషయాన్ని మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. భారతదేశంలో చట్టబద్ధమైన పౌరసత్వం లేని వారు, అక్రమంగా ప్రవేశించిన వారిపై రాజ్యాంగం ప్రకారం చర్యలు తీసుకుంటాము. బెంగాలీ ఆత్మగౌరానికి వ్యతిరేకంగా సాగే ప్రయత్నాలైనా చూస్తూ బీజేపీ ఊరుకోదు” అన్నారు.
మోడీ దుర్గాపుర్ ఉపన్యాసంపై తృణమూల్ కాంగ్రెస్ విరుచుకుపడింది. “బెంగాల్ గడ్డపై నిలబడి అబద్ధాలు చెప్పటం మోడీ నైజాన్ని వెల్లడిస్తోంది. ఓవైపున బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఒడిస్సా, జార్ఖండ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, గుజరాత్లలో బీజేపీ ప్రభుత్వాలు బెంగాలీ మాట్లాడుతున్న ముస్లింలను నానారకాలైన చిత్రహింసలకు గురిచేస్తున్నాయి. అయినా సరే ఇక్కడకు వచ్చి బెంగాలీ ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నామంటూ మాట్లాడటం వారి ద్వంద ప్రమాణాలకు సంకేతం” అంటూ టీఎంసీ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో విమర్శించింది.
“ఈ రకమైనటువంటి ధోరణి చూస్తే అబద్దాలాడటంలో మిమ్మల్ని మించినవారు లేకపోవడమైన జరగాలి. లేదా కళ్ళ ముందు జరుగుతున్న పరిణామాలను చూసి కూడా గమనించలేని ప్రమాదకర లక్షణమన్నా మీకు ఉండాల”ని వ్యంగ్య బాణాలను విసిరింది.
బెంగాలీ ప్రజలను ఆకట్టుకోవడానికి ఉపన్యాసం మొదట్లో “బీజేపీ పార్టీని బెంగాల్ విద్రోహి అని తృణమూల్ పార్టీ ఆరోపిస్తోందంటూ” బెంగాలీలో మోడీ మాట్లాడారు. దీనిపై చమత్కరిస్తూ తృణమూల్ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ వేదికలో “మీ ఉపన్యాసాన్ని బెంగాలీలో ప్రారంభించటం గొప్పగా ఉంది. బెంగాలీ భాష మాట్లాడినందుకు మిమ్ములను కూడా ఈ ప్రభుత్వం జైలుకు పంపిస్తుందేమో చూసుకోండి” అంటూ వ్యాఖ్యానించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.