సమానత్వం, సౌభ్రాతృత్వాలనే లక్ష్యాలను సాధించలేకపోతే ఈ ప్రజాస్వామ్య ప్రయోగ ప్రక్రియ మొత్తంగానే ప్రమాదంలో పడుతుందని మన రాజ్యాంగం ఆమోదించే ముందే హెచ్చరించినప్పుడు అంబేద్కర్ తనను తాను ‘అర్భన్ నక్సలైట్’ గా ప్రకటించుకున్నట్టేనా..!
“1950 జనవరి 26న మనమందరం ఒక వైరుధ్య భరితమైన జీవితంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయంగా మనకు సమానత్వం ఉంటుంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో అసమానత్వం ఉంటుంది” అని భారత రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు దాని ప్రధాన రూపశిల్పి అయినటువంటి బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగపు ముసాయిదా రచన ముగింపు సందర్భంగా పేర్కొన్నారు.
75 సంవత్సరాల తరువాత కూడా మన దేశాన్ని ఇవే వైరుధ్యాలు పట్టి పీడిస్తున్నాయి.
అధిక సంఖ్యాక ప్రజలు క్షేత్రస్థాయిలో సామాజిక బహిష్కారాలను అనుభవిస్తూనే ఉన్నారు. గ్రామీణ భారతంలోనూ, అధిక భాగంలో పట్టణ ప్రాంతపు మారుమూలల్లో కూడా కులాంతర వివాహాలు, కులాంతర భోజనాలు భారీ శిక్షలకు దారి తీస్తున్న సందర్భాలను చూస్తున్నాము.
“స్వచ్ఛత” అనే నియమం పరిశుభ్రతతో సంబంధం లేనిది. దాని గూడార్థంలో బాగా విద్యావంతులైన మంచి స్థానాల్లో ఉన్న అగ్రవర్ణ వారసులను నేటికీ పీడిస్తూనే ఉంది.
ఇటీవలనే తనకు ముందు ఆ పదవిలో ఉన్న వ్యక్తి శూద్రుడు కాబట్టి ఆ మొత్తం ఆవరణను గంగాజలంలో శుద్ధి చేయించాడు ఒక ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తి.
రాజ్యాంగపు హామీలు ఎన్ని ఉన్నా హిందూ సమాజంలోని కొన్ని తరగతులకు హిందూ ఆరాధనా స్థలాలు దాటరాని హద్దులుగానే ఉన్నాయి. ఈ వెలివేతల జాబితా చాలా పెద్దది. బాగా కష్టపడి కూడా పూర్తి జాబితా రాయలేము.
విషపూరితమైన మురుగు కాల్వలు శుభ్రం చేసేటపుడు ఉపయోగించే అవసరం అయిన రక్షణ సాధనాలు ఇవ్వనందు వల్ల వాటిని శుభ్రం చేస్తూ మరణించిన యువకుల గాధలను రోజూ పేపర్లు ఒక పక్కన ప్రచురిస్తుంటే మరో పక్కన మన గౌరవ ప్రధాని ఈ పౌరులు ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన పని ఎలా నెరవేర్చుతున్నారో వారు తెలుసుకోవాలని దేశానికి ప్రభోదిస్తుంటారు.
ఆర్థిక జీవితంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం, ఉన్నతాధికార కమిషన్లు, న్యాయవ్యవస్థ, పోలీస్ వ్యవస్థలతో సహా పలుకుబడి ఏ ప్రభుత్వ సంస్థలోనయినా నియంత్రణాధికారం చెలాయించే పదవుల్లో బాధ్యతల్లో 80 శాతం మంది భారతీయుల ఉనికి నామమాత్రమే.
భారతీయ రాకెట్లు చంద్రలోకానికి చేరుతున్నప్పుడు, ప్రవాస భారతీయులు విదేశాల్లో ఉన్నత ప్రావిణ్యాలు ప్రదర్శిస్తూ ఉన్నత స్థాయిలకు చేరుతున్నప్పుడు అంబేద్కర్ దూరదృష్టితో చేసిన ఈ పరిశీలన యొక్క విలువ స్పష్టం అవుతూ ఉంది.
కాబట్టి, మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకోబోయే ముందే సమానత్వం, సౌభ్రాతృత్వం లక్ష్యాలను (స్వేచ్ఛ గురించి ఇంకా ప్రస్తావనే లేదు) చేరకపోతే మన ప్రజాస్వామ్యం ప్రయోగం ప్రమాదంలో పడుతుందని ఆయన నొక్కి వక్కాణించినప్పుడు అంబేద్కర్ తనను తాను అర్భన్ నక్సలైట్ కాగలనని ప్రకటించుకున్నట్టేనా..?
లేని పక్షంలో రాహుల్ గాంధీ, ఇంకా అనేక లక్షల మంది సామాజిక సృహ గల పౌరులు ఎవరైతే రాజ్యాంగ బద్ధ పరిపాలనకు అంబేద్కర్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారో వారిని అర్భన్ నక్సలైట్లుగాను దేశానికి శత్రువులుగాను సాక్షాత్తూ ప్రధాని మోడీ ఎట్లా ముద్ర వేస్తారు..?
అంబేద్కర్ వక్కాణించిన వైరుధ్యాలు – సామాజిక ఆర్థిక అసమానతలు మచ్చుకు కూడా మిగల్చకుండా సమిసిపోయిన దశకు చేరుకున్నామా? లేదంటే రాజకీయ పార్టీలు వారి సామాజిక కర్తవ్య నిర్వహణలో భాగంగా ఈ అంశాలను లేవనెత్తనీయకుండా పార్టీలను వ్యక్తులనూ రాజ్యాంగం నిషేధించిందా..?
హిందువులను చీల్చడం అనే అపవాదు
హిందూ సమాజాన్ని విభజించే ఒక చెడు కుతంత్రంతో ఈ విషయాలు లేవనెత్తుతున్నారన్న తరకాన్ని మతోన్మాదులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ప్రశ్న: హిందూ సమాజం చీలకుండా ఉన్న చారిత్రక దశ ఏమైనా ఉందా ?విభజింపబడని కాలం అంటూ ఒకటి ఉందా..?
అట్లాకాదంటే మరి సనాతన ధర్మ సమాజపు అధిపతి మోహన్ భాగవత్ అంతటివాడు బహిరంగంగా “2 వేల సంవత్సరాలు మనం (అంటే అగ్రకులాలు) వారిని (అంటే శూద్రల్ని) జంతువుల్లా చూశామని నిజాయితీగా ప్రకటించాల్సి వచ్చింది.
హిందూ సమాజంలో విభజనలు కారణం ముస్లింలో మరెవరో కాదు హిందువులే అని దాపరికం లేకుండా ఒప్పుకున్నాక ఈ అంశంలో ఇంకా సంశయం ఎందుకు?
హిందూ మతాన్ని లేక హిందూ సమాజాన్ని చీలుస్తోంది జనగణన కులప్రాతిపదికన జరగాలంటున్న అవర్ణ హిందువులు కాదనేది సుస్పష్టం. వాళ్లు ఇప్పటికే శతాబ్ధాలుగా రెండు శిబిరాలుగా చీలి పోయే ఉన్నారు. ఓ వైపున రెండు జన్మలెత్తే(ద్విజులు) వారి మత నిర్మాణం, మరో వైపున మిగిలిన భారతీయులు అన్న చీలిక కి ఆద్యులు సవర్ణ హిందువులే.
కులాలు లేకుంటే అసలు “కుల నిర్మూలన” సిద్ధాంతం అంబేద్కర్ ప్రతిపాదించాల్సిన స్థితి ఎందుకుండేది. దాని అమలుకి అస్సలు పూనుకోని సనాతనధర్మ పరిరక్షణకులు దీనిపై అస్త్రశస్త్రాలు దూయాల్సిన అవసరం ఏమొస్తుంది ?
నిజానికి సనాతన సమాజంలోని కుల విభజనలను నిర్మూలించడం కాదు వారి లక్ష్యం కానేకాదు వాటిని కప్పిపుచ్చడమే ఈ సంరక్షుల లక్ష్యం. వారికి లాభాలిచ్చే ఆధిపత్య ప్రయోజనాలు ఈ హిందూ సమాజపు అంతర్గత విభజనపై ఆధారపడి ఉండటమే దీనికి అసలు కారణం.
నిజంగా కుల ప్రాతిపదికన జనగణన జరిగితే సనాతన నిర్మాణపు వికారమైన అస్థిపంజరాలు బయటపడొచ్చు. దాంతో సనాతన వక్రీకరణలకి ముస్లింలు కారణం కాదనీ సనాతనమయిన ఈ ఏర్పాట్లే కారణం అనీ వెళ్ళడై అది భయంకరమైన వక్రీకరణకు దారి తీయొచ్చు.
అటువంటి జనగణనను తమ ఎజెండాగా చేసుకున్న రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ సనాతనానికి అయిష్టులుగా మారడంలో ఆశ్చర్యం ఏముంది..? సనాతన రాజ్యాన్ని ధ్వంసం చేసే అర్భన్ నక్సలైట్లుగా వారిపై ముద్ర వేయటం కంటే వారికి కలిగించే హానీ ఏముంది..?
ఇదే కారణం వలన ఒకప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించడానికి నిరాకరించిన సనాతనం ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి వాళ్ళు వారి మోసపూరిత ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ఆరోపించడం రాజకీయంగా ప్రయోజనకరం అని భావిస్తున్నది.
బ్రాహ్మణేతర కులాల నుండి నాయకత్వంలో అధికారిక స్థానాల్లో ఉన్న అతి కొద్దిమందికి ఇది ఒక కష్టమైన నిర్ణయం. సనాతనంలో కలిసి నడవాలా లేక హిందూ సమాజం ఒక వాస్తవ పరిశీలన ద్వారా ప్రభావం వేయాలనుకుంటున్న వారి వైపుకి వెళ్లాలా అనేదే వారి ముందున్న సమస్య.
హిందూ మతోన్మాదులు పట్టుపగ్గాల్లేకుండా వదులుతున్న క్రూరమైన ఒంటెద్దు దూకుడు పోకడలను, రాజ్యాంగ నిర్దేశాల పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా చేస్తున్న దాడుల్ని కనీసం అదుపు చేయటానికి కూడా ప్రయత్నం చేయని ఈ సందర్భంలో సదరు నాయకత్వం పైగా వారి వాదనలకు సమర్ధింపులు పలుకుతున్న విషయం అందరికీ కనబడుతుంది. బీహారులో ముస్లింల జనాభా అధికంగాగల ప్రాంతాల్లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ హిందూ స్వాభిమాన్ యాత్ర సాగించడం లౌకికవాది అయిన నితీశ్ కుమార్ కు ఇబ్బందికరంగా ఉన్నట్లు కనిపించదు. జాతి మత భేదం చూపనని రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసే ఉంటారు కదా ఈ కేంద్ర మంత్రి.
ప్రతిరోజూ హిందీ ప్రాంతంలో పెద్ద ఎత్తున సాగుతున్న హిందూత్వ దూషణలను నిలువరించడానికి కానీ, అదుపు చేయటానికి కానీ రాజ్యాంగ మౌలిక విలువలు కాపాడేందుకు గానీ రాజ్యాంగ సంస్థలేవీ తొందరపడకపోవడం మనకు కనిపిస్తున్న విషయమే.
ప్రస్తుత ప్రభుత్వ లోపాలపై విమర్శల వెలుగు లు ప్రసరిస్తున్న రచయితలు, వ్యాఖ్యాతలు, మీడియా సంస్థలను పూర్తిగా పక్కన పెట్టేయడం కూడా మీడియా లో ఓ సెక్షన్ కు భేషుగ్గా నే ఉన్నట్టు కనిపిస్తోంది.
ఒక సోక్రటీసుకు విషం తాగించినప్పుడు ఒక రాహుల్ గాంధీ ఒక అఖిలేష్ యాదవ్ లు ఎంత? రాజ్యాంగం మంచిదా కాదా అన్నది దాన్ని అమలు చేసే వాళ్ళ పై ఆధారపడి ఉంటుందని అంబేద్కర్ చేసిన హెచ్చరిక ఎంతో ముందు చూపుతో చేసినట్టుగా కనిపించడం లేదా !
బద్రి రైనా
అనువాదం : పి ఎ దేవి