
స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శిని ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. దీనికోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 80ని ఉపయోగించుకుంది. మరింత ఆశ్చర్యం ఏమిటంటే రాజ్యసభకు నామినేట్ చేయబడిన హర్షవర్ధన్ సింగ్లా మోడీ ప్రభుత్వంలోనే 2020 నుంచి 2022 వరకూ విదేశాంగ శాఖ కార్యదర్శిగా పని చేశారు.
జూలై 14వ తేదీన రాష్ట్రపతి నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేశారు. వారిలో విదేశాంగశాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ సింగ్లా, ముంబయి ఉగ్రవాద దాడులకు సంబంధించిన కేసుల్లో ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించిన న్యాయవాది ఉజ్వల్ నిక్కమ్, కేరళలో బీజేపీ నేత సదానంద మాస్టర్, చరిత్ర పరిశోధకులు మీనాక్షి జైన్లు తాజాగా రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన ప్రముఖులు ఉన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 ద్వారా రాష్ట్రపతికి సంక్రమించిన విశేషాధికారాలను ఉపయోగించుకుని ఈ నామినేషన్లు చేసినట్లు కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రకటనలో తెలిపారు.
ఈ ఆర్టికల్ కింద రాష్ట్రపతి వివిధ రంగాల్లో రాణించి దేశానికి ఖ్యాతి తెచ్చిపెట్టిన 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేయవచ్చు. ఇప్పటి వరకూ ఈ కేటగిరి కింద శాస్త్ర సాంకేతిక- సృజనాత్మక రంగాల్లోనూ, సామాజిక సేవల్లోనూ విశేషమైన కృషి చేసిన వారిని నామినేట్ చేస్తూ వచ్చారు. సాధారణంగా ఈ నామినేషన్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం చేసే సిఫార్సులపై ఆధారపడతాయి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వం. అంటే రాష్ట్రపతి నామినేట్ చేసింది ఎన్డీయే ప్రభుత్వం సిఫార్సు చేసిన వారినే.
2026 ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య కాలంలో రాజ్యసభ నుంచి 72 మంది పదవీ విరమణ చేయనున్నారు.
విదేశాంగ శాఖ కార్యదర్శిగా పని చేసిన వారిని రాజ్యసభకు నామినేట్ చేయటం ఇదే మొదటిసారి. హర్షవర్ధన్ సింగ్లా మోడీ హయాంలో 2020 నుంచి 2022 వరకూ విదేశాంగ కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. 2023లో భారతదేశం జీ20 దేశాల కూటమికి అధ్యక్షత బాధ్యతల్లో ఉన్నప్పుడు ఈయేనే జీ20 సమన్వయకుడిగా కూడా పని చేశారు.
ఇండిక్ చరిత్ర పరిశోధనలో విశేష ప్రతిభ కనబర్చారన్న కారణంతో రాజ్యసభకు నామినేట్ చేయబడిన చరిత్ర అధ్యాపకులు మీనాక్షి జైన్ ఢల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గి కాలేజీలో చరిత్ర విభాగంలో పని చేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ సంపాదకులు గిరిలాల్ జైన్ కూతురు. గిరిలాల్ జైన్ హిందూయిజం పూర్వ వైభవం గురించి అనేక పుస్తకాలు రాశారు.
బీజేపీతో భావసారూప్యత కలిగిన మీనాక్షి జైన్ సతి: ఎవాంజెలికన్లు, బాప్టిస్టులు, మిషనరీలు – మారుతున్న వలసవాద దృక్కోణం అన్న గ్రంధాన్ని ఈ మధ్యనే ప్రచురించారు. గతంలో వాజపేయి ప్రభుత్వంలో మీనాక్షి జైన్ ఎన్సీఈఆర్టీ కోసం తొమ్మిదో తరగతి చరిత్ర పాఠ్యాంశాన్ని రూపొందించారు. అప్పటి వరకూ రొమిల్లా థాఫర్, సతీష్ చంద్రలు రూపొందించిన చరిత్ర పాఠ్యాంశమే బోధనాంశంగా ఉండేది. వాజపేయి ప్రభుత్వం హయాంలో రోమిల్లా థాఫర్, సతీష్‌చంద్రలు రాసిన పాఠ్యాంశాన్ని తొలగించి మీనాక్షి జైన్ రాసిన పాఠ్యాంశాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత 2004లో యూపీఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు రొమిల్లా థాఫర్, సతీష్ చంద్రలు రూపొందించిన పాఠ్యాంశాన్ని పుసరుద్ధరించారు.
మరోవైపు ఉజ్వల్ నిక్కమ్ను రాజ్యసభకు నామినేట్ చేశారు. అంతకు ముందు ఈ కేటగిరి కింద సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్‌ను నామినేట్ చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తుల్లో రాజ్యసభకు నామినేట్ అయిన తొలి వ్యక్తి గగోయ్. అయోధ్య వివాదంలో గగోయ్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన కొన్ని నెలల తర్వాత పదవీ విరమణ చేసిన గగోయ్‌ను మోడీ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది.
విశిష్ట సామాజిక సేవలందించిన కేటగిరిలో కేరళకు చెందిన బీజేపీ నేత సదానంద మాస్టర్‌ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు.
గతంలో కూడా మితవాద రాజకీయాలకు, బీజేపీతో రాజకీయ సైద్ధాంతిక భావసారూప్యతకు ప్రాతినిధ్యం వహించే వారిని రాజ్యసభకు పంపటానికి మోడీ ప్రభుత్వం ఈ నామినేషన్ల మార్గాన్ని ఎంచుకున్నది. 2018లో కూడా మాజీ లోక్‌సభ సభ్యుడు, బీజేపీ నేత రామ్ శకల్ను సామాజిక సేవాతత్పరుల కేటగిరీలో తిరిగి రాజ్యసభకు పంపారు.
అంతకు ముందు కూడా మోడీ ప్రభుత్వం సలహాతో 2016లో ప్రముఖ జర్నలిస్టు స్వపన్ దాస్ గుప్తను రాజ్యసభకు నామినేట్ చేశారు. అయితే ఆయన ఆరేళ్ల పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేసి తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి బీజేపీ శాసనసభ అభ్యర్థిగా బరిలోకి దిగారు.
పార్టీ ఫిరాయింపుల చట్టం కింద స్వపన్ దాస్ గుప్త అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయాలని తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా డిమాండ్ చేశారు. చట్టం ప్రకారం ఏ రాజ్యసభ సభ్యుడయినా నామినేట్ అయిన ఆర్నెల్లలోపు పార్టీలో చేరవచ్చు. కానీ స్వపన్ దాస్ గుప్త చాలా కాలం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన అభ్యర్థిత్వం రద్దుకు తృణమూల్ డిమాండ్ చేసింది.
స్వపన్ దాస్ గుప్తతో పాటు 2016లో మళయాళం సినిమా హీరో సురేష్ గోపిని కూడా రాజ్యసభకు నామినేట్ చేసింది. 2024 ఎన్నికల్లో సురేష్ గోపి త్రిష్చూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2016లోనే సామాజిక సేవాతత్పరుల జాబితాలో మరో బీజేపీ నేత శంభాజీ రాజె ఛత్రపతిని కూడా బీజేపీ రాజ్యసభకు పంపింది. ప్రముఖ క్రికెటర్ బీజేపీ నుంచి రాజీనామా చేయటానికి ముందే నవజ్యోత్ సింగ్ సిద్దును 2017లో క్రీడాకారుడిగా దేశానికి అందించిన సేవలకు బదులుగా రాజ్యసభకు నామినేట్ చేశారు. 2017లో ఆయన రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
2012 వరకూ బీజేపీ జాతీయ కార్యనిర్వాహకమండలి సభ్యుడుగా ఉన్న మహేష్ జెఠ్మలానీని 2021లో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు.
2022లో కశ్మీర్‌కు చెందిన గులాం కుమార్ ఖతానాను రాజ్యసభకు నామినేట్ చేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీ కశ్మీర్ విభాగానికి అధికార ప్రతినిధిగానూ, కార్యదర్శిగానూ పని చేస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.