
మేఘాలయ అసెంబ్లీలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోనీ వీ లింగ్దోహ్ తన పార్టీని వీడి అధికార నేషనల్ పీపుల్స్ పార్టీలో చేరారు. దీంతో, కాంగ్రెస్‌కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1972లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది.
న్యూఢిల్లీ: మేఘాలయలోని ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోనీ వీ లింగ్దోహ్ బుధవారంనాడు(2025 జూలై 30) రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ థామస్ ఏ సంగ్మాను కలిశారు. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లో చేరడానికి స్పీకర్‌కు లింగ్దోహ్ విలీన లేఖను అందజేశారు.
న్యూఢిల్లీ: 60 మంది సభ్యుల మేఘాలయ అసెంబ్లీలో ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే రోనీ వీ లింగ్దోహ్ తన పార్టీని వీడి అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీపీ)లో చేరారు.
లింగ్దోహ్ ఈ చర్యతో, 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదుగురు ఎమ్మెల్యేలను కలిగిన కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత సభలో ఒక్క ఎన్నికైన ప్రతినిధి కూడా లేరు. 1972లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ ప్రాంతంలో అత్యధిక ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీగా కాంగ్రెస్ నిలిచింది.
హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, తన ఓటర్ల నిరంతర అభ్యర్థనల మేరకు తాను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని, తనకు ఎటువంటి పదవీ వ్యామోహం లేదని లింగ్దోహ్ చెప్పారు.
“ఇది నా వ్యక్తిగత కోరిక కాదు. 2018 నుంచి ప్రజలు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నేను కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికైనందకు ఇంతకాలం నేను ఆ పార్టీలోనే కొనసాగాను. కానీ ఇప్పుడు, సగం కంటే ఎక్కువ కాలం గడిచిన తర్వాత, స్థిరత్వం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని నా ఓటర్లు నమ్ముతున్నార”ని ఆయన అన్నారు.
ఎటువంటి ముందస్తు షరతులు లేకుండానే ఎన్పీపీలో చేరినట్టుగా ఆయన నొక్కి చెప్పారు. “ప్రజలకు స్థిరత్వాన్ని, అభివృద్ధిని అందించాలనేదే ముఖ్యమంత్రికి నా ఏకైక అభ్యర్థన” అని ఆయన అన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఓడించి ఎన్పీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 21 నుంచి ఐదుకు తగ్గింది.
ఈ ఎమ్మెల్యేలలో ఒకరు 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో లోక్‌సభకు వెళ్లిన తర్వాత రాజీనామా చేయగా, మరో ముగ్గురు గత కొన్ని నెలల్లో ఎన్పీపీలో చేరారు. దీంతో లింగ్దోహ్ సభలో, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఒంటరిగా మిగిలిపోయారు.
ఈ రాజకీయ పరిణామంతో, ఎన్పీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పుడు 33కి పెరిగింది. అయితే, 2018 నుంచి ఆ పార్టీ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తోంది. ఇందులో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా ఉంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిన తర్వాత, ఎన్పీపీ ఇప్పుడు 60 మంది సభ్యుల సభలో మెజారిటీ మార్కును దాటింది.
ఈ నేపథ్యంలో స్పందించిన కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ, మేఘాలయ ఇన్చార్జ్ మాథ్యూ ఆంటోనీ మాట్లాడారు. లింగ్దోహ్ చర్యను కాంగ్రెస్ ఇప్పటికే ఊహించిందని అన్నారు. ఆంటోనీ మాట్లాడుతూ, “రోనీ వీ లింగ్దోహ్ రాజీనామా ఆశ్చర్యం కలిగించదు(పార్టీకి ఇంకా అధికారిక రాజీనామా అందలేదు), ఎందుకంటే అధికార ఎన్పీపీ మేఘాలయ ప్రజలను అవినీతి, దోపిడీ ద్వారా సేకరించిన డబ్బుతో ప్రజలను కొనుగోలు చేస్తూనే ఉంది” అని అన్నారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.