
దిగువ కోర్టు ఉత్తర్వులకు అనుకూలంగా మానవ హక్కుల కార్యకర్త మేధా పాట్కర్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. 2001లో పాట్కర్ మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో పాట్కర్‌ను దోషిగా ఢిల్లీ హైకోర్టు నిర్ధారించింది. శిక్షను కొనసాగిస్తూ, దిగువ కోర్టు ఉత్తర్వులలో జోక్యం అవసరం లేదని పేర్కొంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 2001లో దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ హైకోర్టు మంగళవారం(జూలై 29) తీర్పును వెలువరించింది. మానవ హక్కుల కార్యకర్త మేధా పాట్కర్‌ను దోషిగా నిర్ధారించి, దిగువ కోర్టు వెలువరించిన శిక్షను సమర్థించింది.
ది టెలీగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం, పాట్కర్‌ను దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు ఉత్తర్వులలో ఎటువంటి జోక్యం అవసరం లేదని జస్టిస్ శైలీందర్ కౌర్ చెప్పారు. అంతేకాకుండా దానిని సవాలు చేస్తూ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చారు.
“రికార్డును పరిశీలించిన తర్వాత, ఈ కోర్టు (దిగువ కోర్టు) ఉత్తర్వులో ఎటువంటి చట్టవిరుద్ధతను కనబడలేదు. దీంట్లో ఎటువంటి జోక్యం అవసరం లేదు. కాబట్టి పిటీషన్‌ను కొట్టివేస్తున్నాము” అని జస్టిస్ కౌర్ అన్నారు.
జస్టిస్ కౌర్ మాట్లాడుతూ, “అందుబాటులో ఉన్న రికార్డులోని సాక్ష్యాలను, వర్తించే చట్టాన్ని సరైన పరిశీలన తర్వాత సవాలు చేసిన ఉత్తర్వు జారీ చేయబడినట్లు కనిపిస్తోంది. ప్రక్రియను అనుసరించడంలో లేదా చట్టం అంశంలో స్పష్టమైన లోపాన్ని చూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారు. దీని పర్యవసానంగా న్యాయం పూర్తిగా తప్పిపోయింది. ఇది ఈ కోర్టు పునర్విమర్శ అధికార పరిధిని అమలు చేస్తున్నప్పుడు జోక్యాన్ని సమర్థిస్తుంది” అని తెలియజేశారు.
మేధా పాట్కర్, వీకే సక్సేనా కేసు దాదాపు 24 సంవత్సరాల నాటిది. 2000 సంవత్సరం నుంచి ఒకరిపై ఒకరు ఇద్దరూ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఆ సమయంలో, మేధా పాట్కర్ తనకు, “నర్మదా బచావో ఆందోళన్”(ఎన్బీఏ)కు వ్యతిరేకంగా ప్రకటన ప్రచురించినందుకు వీకె సక్సేనాపై కేసు దాఖలు చేశారు.
అప్పుడు వీకే సక్సేనా అహ్మదాబాద్‌లోని “నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్” అనే ఎన్జీఓకు అధిపతిగా ఉన్నారు. దీని తర్వాత, వీకే సక్సేనా ఒక టీవీ ఛానెల్లో తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటనలు జారీ చేసినందుకు మేధా పాట్కర్‌పై రెండు కేసులను కూడా దాఖలు చేశారు.
2000 నవంబర్ 25న విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, సక్సేనా రహస్యంగా ఎన్బీఏకి మద్దతు ఇస్తున్నారని పాట్కర్ ఆరోపించారు. ఆ సమయంలో, సక్సేనా ఎన్జీఓ గుజరాత్ ప్రభుత్వ సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు బలమైన మద్దతు ఇచ్చింది. ఎన్బీఏ దానికి వ్యతిరేకంగా ఉద్యమానికి నాయకత్వం వహిస్తోంది. ఎన్బీఏకి తాను ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందని కూడా పాట్కర్ ఆరోపించారు.
గత ఏడాది మే నెలలో, మెజిస్ట్రేట్ కోర్టు పాట్కర్ చేసిన ప్రకటనలను పరువు నష్టం కలిగించేవిగా పేర్కొంటూ జూలై 1న ఆమెకు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. తరువాత కోర్టు శిక్షను సస్పెండ్ చేసి 2024 జూలై 29న ఆమెకు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో 2025 ఏప్రిల్ 25న మేధా పాట్కర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే, అరెస్టు చేసిన కొన్ని గంటల తర్వాత ఢిల్లీ కోర్టు ఆమెను విడుదల చేయాలని ఆదేశించింది.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.