
ఖురాన్ విశ్లేషణపై హిందూ మతోన్మాదుల దాడి
రౌండ్ టేబుల్ సమావేశంలో మేధావుల ఖండన
తిరుపతి : ఖురాన్ ను విశ్లేషిస్తూ శర్మ అనే వ్యక్తి తెలుగులో రాసిన గ్రంథాన్ని కొందరు హిందూ మతోన్మాదులు చించి పోగులు పెట్టి, వీరంగం సృష్టించారు. తిరుపతిలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో శుక్రవారం సాయంత్రం ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ, ఆ పుస్తకాన్ని తగలపెట్టడానికి విఫలయత్నం చేశారు. అబద్దాలతో, బూతులతో విరుచుకుపడ్డారు. విశాలాంధ్ర బుక్ స్టాల్ వద్దకు కూడా వెళ్ళి హడావిడి చేశారు. ఈ సంఘటకు నిరసనగా ‘సాహిత్యం, భావప్రకటనా స్వేచ్ఛపై మతోన్మాద శక్తులు దాడులను అరికట్టాలి’ అని కోరుతూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తిరుపతిలోని వెంకట శివయ్యభవన్ లో శనివారం ఉదయం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మేధావులు, రచయితలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు ఈ మతోన్మాద చర్యలను తీవ్రంగా ఖండించారు.
ఈ సంఘటన జరిగినప్పుడు పుస్తక ప్రదర్శన శాలలో అక్కడే ఉన్న పౌరచైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్, సాహితీ వేత్త సాకం నాగరాజు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. సంఘటన పూర్వాపరాలను వాకా ప్రసాద్ వివరిస్తూ, ‘‘ఒక స్టాల్ దగ్గర కేకలు వినిపిస్తే నేను, సాకం నాగరాజు పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఒక పుస్తకాల షాపు నుంచి ఖురాన్ లో ఇస్లాంకు, హిందూ మతానికి మధ్య ఉన్న సారూప్యతను విశ్వేషిస్తూ శర్మ అనే వ్యక్తి రాసిన పుస్తకాన్ని కొద్ది మంది హిందుత్వ వాదులు చించిపోగులు పెడుతున్నారు. దాన్ని తగల పెట్టడానికి కూడా ప్రయత్నిస్తూ, పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. విశాలాంధ్ర బుక్ స్టాల్ వద్దకు వచ్చి, జై శ్రీరాం అన్న నినాదాలతో, అసభ్యకర పదజాలంతో ఈ…లే ‘రామాయణ విష వృక్షం’ రాసి అమ్ముతున్నారు.(రామాయణ విష వృక్షం రాసింది రంగనాయకమ్మ ) తల్లిని, చెల్లెని పెళ్లి చేసుకోమని చెప్పే పెరియార్ పుస్తకాలు కూడా వీళ్లు అమ్ముతున్నారు.’’ అంటూ తమ అజ్ఞానాన్ని ప్రదర్శించారు. మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే పుస్తక ప్రదర్శన నిర్వాహకులకు చెప్పండి కానీ, ఇలా అరవడం, బూతులు తిట్టడం, దాడి చేయడం హిందుత్వానికే కళంకం తెస్తుందని నచ్చచెప్పాను. పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేసిన భారతీయ విద్యాభవన్ అధ్యక్షలు సత్యనారాయణ రాజు అక్కడికి వచ్చి వారికి సర్ది చెప్పి, ఆ పుస్తకం అమ్మిన స్టాల్ ను వెంటనే మూయించారు. వాళ్ళు చాలా అమానుషంగా ప్రవర్శించారు. ఇలాంటి సంఘటనలను ఖండించాలని కోరుతున్నాను.’’ అని అన్నారు.
అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మినారాయణ మాట్టాడుతూ, ‘‘ఇది ఉన్మాద ప్రారంభ దశ. దేశంలో ఉన్మాదం పెరుగుతోందని అర్థం చేసుకోవాలి. మనం ఏం తినాలో, ఏ గుడ్డలు వేసుకోవాలో, ఏ సాహిత్యం చదవాలో వీరే చెపుతారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. తమ భావాలకు వ్యతిరేకమైన వాటిపైన పాలక పక్షాలు దాడులుచేస్తాయి. సఫ్దర్ హష్మీని చంపేశారు. పెరుమాళ్ మురుగన్ పై దాడులుచేసి, ఆయన పుస్తకాలను చించేశారు. ‘రచయితగా చచ్చిపోయాను’ అని ఆయన ప్రకటించాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు. ఈ ఉన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఐక్య వేదికను ఏర్పాటుచేసి పోరాడాలి.’’ అని పిలుపునిచ్చారు.
అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ, ‘‘మతోన్మాదాన్ని, మత దురహంకారాన్ని సహించడం వల్ల ఆ మతానికి కీడు జరుగుతుందే కానీ, మేలు జరగదు. రాజ్యాంగం ప్రకారం నిషేధించని పుస్తకాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. నిషేధించని పుస్తకాన్ని అమ్మకూడదనడం, అల్లరి చేయడం రాజ్యాంగం ప్రాకారం నేరం. ఈ గడ్డపైన అన్ని మతాల వారు జీవించడానికి, వారి భావజాలాన్ని ప్రచారం చేసుకునే హక్కు వారికుంది. విశాలాంధ్ర హేతువాద, మార్క్సిస్టు భావజాలానికి అనుకూలమైనవి కనుకనే రామాయణ మహాభారతాలు కూడా అమ్ముతున్నారు’’ అని గుర్తు చేశారు.
సీనియర్ జర్నలిస్ట్ రాఘవ మాట్లాడుతూ,‘‘ఝంఝ, లే కవితా సంకలనాలపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని కొట్టి వేస్తూ, జస్టిస్ జీవన్ రెడ్డి ఇచ్చిన తీర్పులో ‘ఏ ఆలోచననూ నిషేధించలేం. అలానిషేధిస్తే మానవ సమాజం ముందుకు పోదు’ అని వ్యాఖ్యానించారు. పుస్తకాలను నిషేధించడమే తప్పని భావిస్తున్నప్పుడు, అసలు నిషేధించని పుస్తకాలను వీళ్ళెలా అడ్డుకుంటారు? విజయవాడలో గూండాలకు వ్యతిరేకంగా చండ్రరాజేశ్వరరావు కర్రపుచ్చుకుని నిలబడ బట్టే వాళ్ళు తోకముడిచారు. అవసరమైతే మతోన్మాదులకు వ్యతిరేకంగా తిరుపతిలో కూడా వీధిపోరాటాలకు దిగాల్సి ఉంటుంది.’’ అని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ, ‘‘ఆ గొడవ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్నాను. పెరియార్ హిందూ వ్యతిరేకి అని చాలా నీచంగా మాట్లాడారు. కనుక మనం పెరియార్ పుస్తకాలను పట్టుకుని పూలే విగ్రహం నుంచి గాంధీ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించాలి. ఈ మతోన్మాదులు తిరుపతి కేంద్రంగా ఉన్మాదాన్ని ప్రచారం చేస్తున్నారు. గౌరీ లంకేష్ ను, కల్బుర్గిని చంపిన వారిని ఊరేగించే పరిస్థితి వచ్చింది.
ప్రముఖ రచయిత, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ, ‘‘అన్ని భావాలు అర్థం చేసుకుంటే కానీ సత్యాన్ని అన్వేషించలేం. ఇది రాజ్యానికి, వ్యక్తికి మధ్య జరిగే పోరాటం. ఇది చాలా పెద్ద సమస్య. ఇది ఒక రకమైన ఫ్యాసిజం. సంఘర్షణ నుంచే అగ్ని పుడుతుంది అని ఛంఘిజ్ కాన్ అంటాడు. పెరుమాళ్ మురుగున్ పైన చేసిన దాడి అతన్ని అంతర్జాతీయ స్థాయి రచయితను చేసింది. సృజన కారుడికి ఇది చాలా పెద్ద సమస్య. సత్యం చెప్పడానికి భయపడుతున్న కాలం ఇది. అలాంటి పరిస్థితి రాకుండా కలిసి కట్టుగా సహకరించాలి. గళ మెత్తి నిరసన తెలపాలి.’’ అని పిలుపునిచ్చారు.
రాజ్యాంగ వేదిక అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ, ‘‘ఇలాంటి బుట్ట బెదిరింపులకు మనం భయపడకూడదు. మనం కూడా రోడ్డు పైకి రావాల్సిందే. కులాల మధ్య, మతాల మధ్య, ప్రజల మధ్య సయోధ్య కుదర్చాలి. మాంసం తినకూడదంటూ పిరమిడ్ వారు 5వేల మందితో తిరుపతిలో ప్రదర్శన నిర్వహిస్తారట. మనం ఏం తినాలో, ఏం తినకూడదో వీళ్లు నిర్ణయిస్తారా?’’ అంటూ ప్రశ్నించారు.
సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ, ‘‘బీజేపీ, భజరంగ్ దళ్, ఆర్ ఎస్ ఎస్ వారు తిరుపతిపైన దృష్టి కేంద్రీకరించారు. దీంతో తిరుపతి డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఎస్వీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పైన భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. తిరుపతిలో గరుడవారధికి టీటీడీ నిధులు ఇవ్వకూడదని బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ కోర్టులో పిటీషన్ వేస్తారు. మదరసాలలో చిన్న పిల్లలకు చదువు చెప్పడం ఆపేయాలని ప్రయత్నించారు. వీళ్ళని తన్నే రోజులు వచ్చాయి. ఎవరు ఏం తినాలో వీళ్ళు చెపుతారా? ఎదురు దాడి చేయకపోతే నష్టం జరిగిపోతుంది. ఈ రోజు పుస్తకాల దగ్గరకు వచ్చారు. రేపు ఇళ్ళ దగ్గరకు వస్తారు. భారతీయులకు సంకెళ్ళు వేసి స్వదేశానికి పంపితే బీజేపీ నాయకులు నోరు విప్పలేదు’’ అంటూ ఎద్దేవా చేశారు.
సాహితీ వేత్త సాకం నాగరాజు మాట్లాడుతూ, ‘‘హిందు మత లక్ష్యం మత సామరస్యం అని వివేకానందుడు అన్నాడు. నిన్న జరిగిన సంఘటనతో ఒక హిందువుగా నేను తలదించుకుంటున్నాను. అన్యమతస్తులంటున్నారు. ఫోన్లు, టీవీలు, సెల్ ఫోన్లు, కనిపెట్టింది ఎవరు? అన్యమతస్థులు కాదా? వాటిని ఎలా వాడుతున్నారు? మతోన్మాదులు ఈ దేశానికి పెద్ద శత్రువులు’’ అంటూ హెచ్చరిక చేశారు.
కార్యాచరణ
సీపిఐ జిల్లా కార్యదర్శి మురళి కార్యాచరణను ప్రకటించారు.
1. పుస్తక ప్రదర్శన శాలలో విశాలాంధ్ర దగ్గరకువచ్చి మతోన్మాదులు అల్లరి చేయడం పై జిల్లా ఎస్ పీకి ఫిర్యాదు చేయాలి.
2. పదకొండవ తేదీ మంగళవారం సాయంత్రం అంబేద్కర్ భవన్ నుంచి గాంధీ రోడ్డు వరకు పెరియార్ పుస్తకాలతో ప్రదర్శన నిర్వహించాలి.
పౌరచైతన్య వేదిక తిరుపతి జిల్లా కార్యదర్శ ఏ.ఎన్. పరమేశ్వరరావు మాట్లాడుతూ, ‘‘దేశాన్ని 500 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళాలని ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసమే పుస్తకాలను నిషేధించాలని చూస్తోంది.’’ అన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కేశవులు, జనార్ధన్, డాక్టర్ కె.వి.రమణ, లక్ష్మి, విశాలాంధ్ర ప్రసాద్ తదితరులు మాట్లాడారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.