
2023 మే హింస తర్వాత ప్రధాని మోడీ మొదటిసారి మణిపూర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో, ఇది చిత్తశుద్ధితో శాంతి కోసం ప్రయత్నమా? లేక జాగ్రత్తగా సమయం చూసుకొని, రాజకీయ అభిప్రాయాన్ని తెలియజేయడానికా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ: ఆగస్టు 30వ తేదీ నాడు మణిపూర్ హోంశాఖ ఓ సర్క్యూలర్‌ను జారీ చేసింది. అందులో సెప్టెంబర్ 7 నుంచి 14వ తేదీ వరకు అత్యవసర విధుల కారణంగా, పోలీసు అధికారులు- సిబ్బందికి సెలవులు మంజూరు చేయరాదని స్పష్టం చేసింది.
ఉత్తర ఈశాన్య రాష్ట్రాన్ని ప్రధాని మోడీ సందర్శించనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఓ సీనియర్ మణిపూర్ అధికారి ది వైర్‌కు తెలియజేశారు. ప్రధాని పర్యటన జాబితాలో, రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌తో పాటు హింసకు గురైన చురాచంద్పూర్ జిల్లాలు ఉన్నాయి. ప్రభుత్వ వర్గాల ప్రకారం, మోడీ సెప్టెంబర్ రెండవ వారంలో మణిపూర్‌లో పర్యటించే అవకాశం ఉందని ది హిందూ ఆగస్టు 31న నివేదించింది.
ఈ పర్యటన అనుకున్నట్లుగా జరిగితే- 2023 మేలో చెలరేగి రెండు సంవత్సరాలకు పైగా కొనసాగుతోన్న జాతుల మధ్య ఘర్షణ నేపథ్యంలో, ఇది ప్రధానమంత్రి తొలి పర్యటన అవుతుంది.
ప్రధాని పర్యటన “సుదీర్ఘంగా సాగుతోన్న పోరాటానికి ముగింపు చెప్పి, ప్రభుత్వం పూర్తి స్థాయిలో పని చేయడానికి అవకాశం కల్పించే విధంగా ఉండగలదు”అని తాము భావిస్తున్నట్టుగా రాష్ట్రానికి చెందిన కొన్ని వర్గాలు ది వైర్‌కు తెలియజేశాయి.
పరిస్థితులు ఎంతో దిగజారిపోయినప్పటికీ కళ్లకు కనిపించే వాస్తవం ఏంటంటే, అన్ని వర్గాలు తీవ్రంగా విభజించబడి ఉన్నాయి. వేలాది మంది ఇంకా సహాయక శిబిరాల్లో నివసిస్తున్నారు. ఈ సంక్షోభం పట్ల దీర్ఘకాలంగా మౌనం పాటిస్తున్న మోడీ ప్రభుత్వంపై అనేక విమర్శలు ఉన్నాయి.
దాదాపు 850 రోజుల మణిపూర్ చిట్టచివరి దశలో ఉంది. మణిపూర్‌లో చెలరేగిన హింస 260కి పైగా ప్రాణాలు తీసుకోగా, 60,000 మందికి పైగా నిరాశ్రయులను చేసింది. మోడీ కార్యరూపం దాల్చే పర్యటన రెండు కీలక పరిణామాలపై ఆధారపడి ఉంది. అవేంటంటే, ఆపరేషన్ల సస్పెన్షన్(ఎస్ఓఓ) కింద మార్గదర్శకాలపై కూకీ- జో గ్రూపులతో కొత్త ఒప్పందం కుదుర్చుకోవడం. అంతేకాకుండా, కొత్త ముఖ్యమంత్రిని నియమించి రాష్ట్రప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
ఎస్ఓఓ ఒప్పందం జరిగేనా?
2024 నుంచి పెండింగ్‌లో ఉన్న కొత్త ఒప్పందం కోసం సంతకాలు చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 3న తమను ఆహ్వానించిందని, మణిపూర్‌లో ప్రధాన సంఘాలు యూనైటెడ్ పీపుల్స్ ఫండ్(యూపీఎఫ్), కుకీ నేషనల్ ఆర్గనైజేషన్(కేఎన్ఓ), అనేక మిలిటెంట్ ఆర్గనైజేషన్లను కలుపుకొని ఉన్న వర్గాలకు చెందిన వారు తెలియజేశారు.
భారత- మణిపూర్ ప్రభుత్వాలకు మధ్యన ఎస్ఓఓపై మొదటి సారి 2008 ఆగస్టు 22న ఒప్పందం కుదిరి సంతకాలు చేశారు. అప్పటి నుంచి ప్రతీయేట కుకీ తిరుగుబాటు గ్రూపులు ఈ ఒప్పందాన్ని సమీక్షించుకుంటూ వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, తిరుగుబాటు గ్రూపులు తమ ఆయుధాన్ని లాకర్లో పెట్టి, తాళాలు వేసి వారికి నిర్దేశించిన క్యాంపులలో ఉండాల్సి ఉంటుంది.
“అస్థిర రాజకీయ పరిష్కారంపై భారతప్రభుత్వంతో కేఎన్ఓ, యూపీఎఫ్‌లు 2023 మే 3న ఇంఫాల్‌లో సంతకాలు చేసే దశకు వచ్చాయి. కానీ, “రాజకీయ అనిశ్చితి” కారణంగా మణిపూర్‌లో తెగల మధ్య హింస చెలరేగింది” అని ది వైర్‌కు కొన్ని వర్గాలు తెలియజేశాయి.
తెగల మధ్య హింస చెలరేగినప్పటి నుంచి యూపీఎఫ్, కేఎన్ఓలు కుకీ- జో ప్రాంతాలకు “ప్రత్యేక పరిపాలన” కావాలని గట్టిగా పట్టుబడుతున్నాయి. మైతీ వర్గంతో ఎంత మాత్రం సహజీవనాన్ని కొనసాగించలేమని తేల్చిచెప్పాయి. కుకీ- జో వర్గం చేస్తున్న డిమాండ్‌కు పెద్ద ఎత్తున మద్దతు ఉంది. మణిపూర్ వ్యాలీ జిల్లాలకే పరిమితమైన మెజారిటీ తెగ మైతీలు ఈ డిమాండ్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి.
రాజకీయ పరిష్కారాన్ని కనుగొనడానికి కుకీ- జో సాయుధ గ్రూపులతో 2025లో భారత ప్రభుత్వం రాజకీయ చర్చను పునరుద్ధరించింది. ఈ ప్రయత్నాన్ని మైతీ పౌర సమాజ గ్రూపుల నుంచి బలమైన ప్రతిఘటనను ఎదుర్కొనవలసి వచ్చింది. ఎస్ఓఓ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని మైతీలు డిమాండ్ చేస్తూ, ఘర్షణ సమయంలో కుకీ- జో గ్రూపులు కాల్పుల విరమణను ఉల్లంఘించారని ఆరోపించారు.
2024 న్యూఢిల్లీలో మూడు దఫాల రాజకీయ చర్చలు జరిగాయి. మధ్యవర్తి ఏకే మిశ్ర ఆగస్టు 2024లో ఒక ముసాయిదా ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు అందజేశారు. అయితే, దానిపై భారత ప్రభుత్వం ఇంత వరకు కూడా అధికారికంగా స్పందించలేదని ది వైర్‌కు కొన్ని వర్గాలు తెలియజేశాయి.
రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ అంతర్గత వర్గాలు ది వైర్‌కు చెప్పిన దాని ప్రకారం, కుకీ-జో గ్రూపు చేస్తున్న “ప్రత్యేక పరిపాలన” డిమాండ్‌ను ఢిల్లీలో అంగీకరిస్తే, కేంద్ర ప్రభుత్వం పట్ల మైతీ వర్గంలో అంతర్గతంగా వైరం ఏర్పడగలదని అన్నారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటు సంగతేంటి?
ఈ ఆగస్టులో యూనియన్ ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను మరో ఆరు మాసాలు పొడిగించింది. బీజేపీకి చెందిన ఇంఫాల్ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కొద్ది మాసాలుగా బ్యాచ్‌ల వారిగా పార్టీ జాతీయ నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. మణిపూర్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వాదిస్తున్నారు. మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అంతర్గతంగా చర్చ జరిగే అవకాశం ఉంది.
60 మంది సభ్యులు గల మణిపూర్ శాసనసభలో 44 మంది శాసనసభ్యుల మద్దతు ఉన్నట్టుగా ఎన్డీఏ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలనను విధించింది. ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేశారు. ది వైర్ చెప్పినట్టుగా ఆడియో టేపులలో ఆరోపణలు బయటపడిన తర్వాత చెలరేగిన హింసను బీరెన్ సింగ్ సమర్ధవంతంగా ఎదుర్కొవలేదని విమర్శల ఒత్తడి పెరిగిన కారణంగా ఆయన రాజీనామ చేశారు. ప్రస్తుతం ఆడియో టేపుల అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది.
ఈ కేసులో ఆగస్టు 25న మరో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఆడియో రికార్డింగ్‌లలో చేసిన ఆరోపణలలో బీరెన్ సింగ్ సంబంధాన్ని నిర్ధారించడానికి గాంధీ నగర్‌లోని నేషనల్ ఫోరాన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) పంపించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకు ముందు ఒక పేరు గాంచిన ప్రైవేటు ల్యాబ్, దాని పేరు ట్రూత్ ల్యాబ్ ఈ ఆడియో టేపులో వినిపిస్తున్న గొంతు 90% మేరకు బీరేన్ సింగ్ గొంతుతో పోలి ఉందని తన నివేదికలో తెలియజేసింది.
ఎన్డీఏ తమకు మెజారిటీ ఉందని వాదిస్తున్నప్పటికీ, జాతులు- తెగల మధ్య ఘర్షణ చెలరేగిన తర్వాత తనకు మద్దతు తెలుపుతున్నట్టు చెప్పబడుతున్న 44 మంది శాసనసభ్యుల పూర్తి జాబితాను ప్రజల ముందు పెట్టలేదు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై పార్టీలో అంతర్గతంగా అభిప్రాయ భేదాలు ఉన్న కారణంగా సుస్థిరప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నామని పార్టీకి చెందిన కొందరు ది వైర్‌కు తెలియజేశారు. అయితే, బీరేన్ సింగ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారదా దేవితో పాటు, పార్టీలోని ముఖ్య నాయకులు ఎవరు కూడా మీడియాతో మాట్లాడరాదని ఆదేశించారు.
మణిపూర్‌లో బీజేపీ అంతర్గత తిరుగుబాటును కూడా ఎదుర్కొంటుంది. ఏడుగురు బీజేపీలతో పాటు పదిమంది కుకీ శాసన సభ్యులు బీరేన్ సింగ్ హింస పరిస్థితులను ఎదుర్కొన్న తీరును బహిరంగంగా విమర్శించారు. అప్పటి నుంచి ముఖ్యంగా మణిపూర్ టేపులు బహిర్గతమైన రోజు నుంచి వీళ్లు పార్టీకి దూరంగా ఉంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే, పార్టీలో అంతర్గతంగా ఏర్పడిన చీలికలతో పాటు అన్ని గ్రూపులను సంతృప్తి పరచడం బీజేపీకి పెద్ద సవాళుగా మారింది.
టెలిఫోన్ ద్వారా ఇంఫాల్ నుంచి పార్టీ వర్గాలు తెలిపిన దాని ప్రకారం, బీరేన్ సింగ్ వర్గం తాజా ఎన్నికలకై ఒత్తిడి తెస్తుందని, పార్టీ జాతీయ నాయకత్వం కొత్త ముఖ్యమంత్రిని వారు వ్యతిరేకిస్తున్నారని, ఒకవేళ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించినట్టైతే బీరేన్ సింగ్ రాజకీయ స్థాయి తారుమారయ్యే అవకాశం ఉంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.