
‘‘వాళ్లు బ్యాంకు ఖాతా పత్రాలు, స్కూల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు అన్నీ అడుగుతున్నారు. నా పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించేటపుడు మాత్రం ఏం అడగలేదు. కానీ, చేర్చమంటే ఇవన్నీ అడుగుతున్నారు’’అని మింటూ పాశ్వాన్ వాపోయారు. బీహార్‌లో జరుగుతోన్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో విచారించారు. వాదనల సందర్భంగా, సుప్రీం కోర్టు ముందు యోగేంద్ర యాదవ్ ఇద్దరు వ్యక్తులను హాజరుపరిచారు. అందులో పాశ్వాన్ ఒకరు.
న్యూఢిల్లీ: బీహార్‌లోని భోజ్‌పురి జిల్లా ఆరా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మింటు పాశ్వాన్‌కు 41 ఏళ్లు ఉంటాయి. బీహార్‌లో జరుగుతోన్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ వ్యక్తి చనిపోయినట్లు ఎన్నికల సంఘం ధృవీకరించింది. కానీ ఆగస్టు 12వ తేదీన రక్తమాంసాలతో సజీవంగా ఉన్న మింటు పాశ్వాన్ సుప్రీంకోర్టు ముందు ప్రత్యక్షమయ్యారు. బీహార్‌లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో యోగేంద్రయాదవ్ కూడా ఓ కక్షిదారుగా ఉన్నారు. చనిపోయారని ఎన్నికల సంఘం తనకు తానుగా నిర్ధారించుకుని, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఇద్దరిని యోగేంద్రయాదవ్ సుప్రీం కోర్టులో హాజరుపర్చారు.
దీంతో ఎన్నికల సంఘం విచక్షణారహితంగా అమలు చేస్తోన్న, బీహార్‌లో జరుగుతోన్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియ కారణంగా, లక్షలాదిమంది అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటున్నారని, సుప్రీం కోర్టును సాధికారికంగా వివరించేందుకు యోగేంద్రయాదవ్ ప్రయత్నం చేశారు.
మింటూ పాశ్వాన్ ఆరాలో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఓటరు దరఖాస్తు ఫారం నింపి ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించారు. దీని తర్వాత కూడా తన పేరు ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ది వైర్‌కు పాశ్వాన్ తెలియజేశారు.
‘‘నా పేరు ఓటర్ల జాబితాలో లేదని, నేను చనిపోయినట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాను. నేను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి ఓ వీడియో కూడా చేశాను. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాను. వాళ్లు బ్యాంకు ఖాతా పత్రాలు, స్కూల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు అన్నీ అడుగుతున్నారు. నా పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించేటపుడు ఏం అడగలేదు. చేర్చమంటే మాత్రం ఇవన్నీ అడుగుతున్నారు’’ అంటూ పాశ్వాన్ వాపోయారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 1న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయిన 65 లక్షలమంది పౌరుల్లో పాశ్వాన్ కూడా ఒకరు.
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం, ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మందిలో 22 లక్షల మంది చనిపోగా 36 మంది శాశ్వతంగా వలస పోయారు. లేదా వారి నిర్దేశిత చిరునామాలో కనిపించలేదు. మరో ఏడు లక్షల మంది ఓటర్లకు ఒకటి కంటే ఎక్కువ పోలింగ్ బూత్‌ల పరిధిలో ఓట్లున్నాయి.
తాను ఫిర్యాదు చేసిన తర్వాత మాత్రమే పోలింగ్ బూత్ స్థాయి అధికారి ఇంటికి వచ్చి చూసి వెళ్లారని పాశ్వాన్ వివరించారు. తనతో పాటు కేరళలో పని చేస్తున్న తన సోదరుడిని కూడా చనిపోయినట్లు ప్రకటించారని ఆయన గుర్తు చేశారు.
‘‘ఎన్నికల సంఘం హడావుడిగా ఉంది. కనీసం మనిషి బతికి ఉన్నాడో, చనిపోయాడో కూడా తెలుసుకోవాలి కదా. ఇరుగు పొరుగు వారితో విచారించాలి. ఎవరో ఎక్కడో కూర్చుని ఫలానా వ్యక్తి చనిపోయాడన్నంత మాత్రాన ఆ వ్యక్తి చనిపోతాడా? 2019 నుంచి 2024 వరకూ వరుసగా అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేశాను. కనీసం పోలింగ్ బూత్ స్థాయి అధికారి ఇంటికి కూడా రాలేదు. నా పేరు ఓటర్ల లిస్ట్ నుంచి రద్దు చేసిన విషయం తెలుసుకుని నేను ఫిర్యాదు చేసిన తర్వాత కానీ, సదరు అధికారి ఇంటికి రాలేదు’’ అని పాశ్వాన్ వివరించారు.
ఎన్నికల సంఘం తరఫున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ రాకేష్ ద్వివేది ఇలా వ్యక్తులను సుప్రీం కోర్టులో హాజరుపర్చటం డ్రామా అని కొట్టిపారేసే ప్రయత్నం చేశారు.
ఈ విధంగా నాటకాలాడే బదులు ఓటర్ల జాబితాలో జరిగిన పొరపాట్లను సరిదిద్దేందుకు యోగేంద్ర యాదవ్ సహకరిస్తే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు.
యోగేంద్రయాదవ్ వాదనల తర్వాత జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీల ధర్మాసనం ఏదో అనుకోకుండా జరిగిన పొరపాటు అయి ఉంటుంది, సరిద్దుకోదగిన పొరపాటే అని వ్యాఖ్యానించింది.
పాశ్వాన్‌ను ఉదాహరణగా చూపిస్తూ, “ఈ విధంగా సామూహికంగా ఓటుహక్కు రద్దుచేసే పరిస్థితి ఉంటే తాము జోక్యం చేసుకుంటామని” సుప్రీం కోర్టు చేసిన వాగ్దానాన్ని యోగేంద్రయాదవ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా, సామూహిక ఓటు హక్కు రద్దు ప్రక్రియ ఇప్పటికే బీహార్‌లో మొదలైందని గుర్తు చేశారు.
‘‘సామూహిక ఓటు హక్కు రద్దు ప్రక్రియ మొదలైంది. ఓటు హక్కు కోల్పోత్నున వారి సంఖ్య కేవలం 65 లక్షలు మాత్రమే కాదు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పూర్తయ్యేలోపు ఈ సంఖ్య గణనీయంగా పెరగనున్నది. ఇదేదో సవరణ ప్రక్రియలో జరుగుతున్న పొరపాటు కాదు. ఈ ప్రక్రియ రూపొందించిన తీరులోనే ఈ పొరపాటు ఉంది. ఈ తరహా ప్రక్రియ చేపట్టిన అన్ని చోట్ల ఫలితాలు ఇలాగే ఉంటాయి’’ అని యోగేంద్రయాదవ్ సుప్రీం కోర్టుకు నివేదించినట్లు లైవ్ లా వెబ్సైట్ కథనం పేర్కొంది.
పాశ్వాన్‌ను సీపీఐ(ఎంఎల్) అగిగావ్ ఎమ్మెల్యే ఢిల్లీ తీసుకువచ్చారు. ఆయన ఓట్ల గల్లంతు విషయంలో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన వారిలో ఇంకా నలుగురు పాశ్వాన్లా సమస్యను ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే తెలియజేశారు. బతికి ఉన్నా ఎన్నికల సంఘం దృష్టిలో చనిపోయినవారున్నారని పేర్కొన్నారు.
‘‘ఎన్నికల సంఘం హడావుడిగా చేపట్టిన ఈ ప్రక్రియ వల్ల చాలామంది పేదలు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎవరెవరు ఓటరు జాబితాలో చోటు సంపాదించుకోలేదో తనిఖీ చేయటానికి, భోజ్‌పురి జిల్లాలో పాత ఓటర్ల లిస్టు, కొత్త ముసాయిదా ఓటర్ల లిస్టు పట్టుకుని ఇంటింటికీ తిరిగాము. బూత్ స్థాయి బృందాలుగా ఏర్పడి ఈ పని చేస్తున్నాము. ఇప్పటికే ఆరా నియోజకవర్గంలో ఇటువంటి నాలుగు సందర్భాలు వెలుగు చూశాయి’’ సీపీఐ(ఎంఎల్) ఎమ్మెల్యే శివ ప్రకాష్ రంజన్ అన్నారు.
ఓటర్ల జాబితాను శుద్ధి చేసే ప్రయత్నంలో వలస కార్మికులకు, పేదలకు ఎన్నికల సంఘం ఎన్నో ఇబ్బందులు కలిగిస్తోందని, కొత్తకొత్త పత్రాలు అడిగి ఓటర్లను అనర్హుల జాబితాలో చేరుస్తుందని రంజన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో ఓటు వేసిన వారిని కొత్తగా ఫారం- 6 నింపి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తోంది. చాలా ఎన్నికల్లో పాల్గొన్న వారు కూడా ఇప్పుడు కొత్త ఓటర్లుగా నమోదవుతారని ప్రకాష్ రంజన్ అన్నారు.
పౌరసత్వాన్ని నిరూపించుకునే భారాన్ని ఎన్నికల సంఘం పౌరులపై మోపకూడదని పిటిషనర్లు సుప్రీం కోర్టులో వాదించారు.
‘‘ఈ కసరత్తు ఇక్కడే ఆపేయాలి. మా రాష్ట్రం నుంచి 40 మంది ఎంపీలు లోక్‌సభకు వస్తున్నారు. ఈ కసరత్తు ఎన్నికైన వారిని తప్పు పట్టకుండా ఎన్నుకున్నవారిని తప్పు పడుతోంది. ఇది సరైనది కాదు’’ అని రంజన్ అన్నారు.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.