
Long Walk To Freedom పుస్తకం నెల్సన్ మండేలా ఆత్మకథ. రాపొలు సీతారామరాజు గారు ఈ పుస్తకాన్ని అనువాదం చేస్తే దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక పుస్తకంగా ప్రచురించింది. డిసెంబర్ 2024 లో జరిగిన హైదరాబాద్ బుక్ ఫేర్ లో పాలపిట్ట బుక్ షాప్ లో కొన్నాను. 340 పేజీల పుస్తకాన్ని గత 5 రోజులుగా ఏక బిగిన చదివేశాను. ఒక గొప్ప పోరాట యోధుడి జీవితాన్ని ఆయన ద్వారానే తెలుసుకున్నాను. 27 సంవత్సరాలు అత్యంత దుర్భరమైన, కష్టతరమైన జైలు జీవితం గడిపిన మండేలా జీవితేచ్ఛ, స్వేచ్ఛాకాంక్ష అనితరసాధ్యం అనిపిస్తుంది. 27 సంవత్సరాలలో చివరి రెండు సంవత్సరాలలో మాత్రమే కాస్త మెరుగైన జైలు జీవితాన్ని గడిపే అవకాశాన్ని ఇచ్చింది దక్షిణాఫ్రికా తెల్ల జాత్యాహంకార ప్రభుత్వం. అది కూడా అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక ఆంక్షలు, దౌత్య సంబంధాల బహిష్కరణ, క్రీడల బహిష్కరణ వలన దేశ ఆర్థిక వ్యవస్థ కునారిల్లిపోతున్న దశలో ప్రపంచ దేశాల ఒత్తిడికి తలవొగ్గి మండేలా విడుదలకు సన్నాహాలు చేసింది ప్రభుత్వం. అంతర్గతంగా ఆఫ్రికన్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో సాయుధ స్వాతంత్ర్య పోరాటం కూడా ఉదృతం అవుతున్నది. శాంతి కాముకుడైన మండేలా జైలు నుండే ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టి, జాతి వివక్షకు తావులేని దక్షిణాఫ్రికాలో తెల్లజాతి ప్రజలు కూడా అన్ని రకాల హక్కులతో బతికే పరిస్థితులే ఉంటాయి తప్ప వారి పట్ల వివక్షాపూరితంగా ప్రభుత్వం వ్యవహరించదని పదే పదే హామీ ఇచ్చిన తర్వాత స్వేచ్ఛాయుత ఎన్నికలకు ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఎన్నికలకు ముందే మండేలా విడుదల అవుతాడు. అమెరికా సహా ప్రపంచ దేశాలన్నీ పర్యటిస్తాడు. ప్రపంచ దేశాలలో ప్రజలు నీరాజనం పడతారు. న్యూయార్క్ లో 10 లక్షల మందితో జరిగిన ఊరేగింపు అపూర్వమైనది. ఆర్థిక ఆంక్షలు తొలగించరాదని ఆయా దేశాలని కోరుతాడు మండేలా. ప్రభుత్వం స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహించి మెజారిటీ పొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాతనే ఆంక్షలు తొలగించాలని కోరుతాడు. ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 62 శాతం వోట్లను గెలుచుకొని కూడా అన్ని పార్టీలతో కూడిన జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు మండేలా . 75 ఏండ్ల ముదిమి వయసులో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా 5 ఎండ్లు పదవీ బాధ్యతలు నిర్వహించాడు. దేశానికి కొత్త రాజ్యాంగాన్ని రచించడానికి నాయకత్వం వహించాడు. నల్ల జాతి ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించడానికి కృషి చేశాడు. పేద ప్రజలకు లక్షల సంఖ్యలో ఇండ్లు కట్టించాడు. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నా ఐదేండ్ల తర్వాత రాజకీయాల నుంచి విరమించుకొని దేశ పునర్నిర్మాణ బాధ్యతలు కొత్త తరానికి అందించాడు. ఆ తర్వాత మండేలా ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలో నిమగ్నం అవుతాడు. దేశంలో పాఠశాలలు, దవాఖానాలు నిర్మించడానికి నిధులు సేకరించి ఫౌండేషన్ ద్వారా వాటి అమలు కోసం కృషి చేశాడు. దేశంలో పెచ్చరిల్లి పోతున్న ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి కృషి చేశాడు. చివరిదాకా దేశ ప్రజల సేవలో నిమగ్నం అయినాడు. 95 ఏండ్ల వయసులో 2013 డిసెంబర్ 5 న తనువు చాలించాడు మండేలా.
భారత ప్రభుత్వం కూడా మండేలాకు భారత రత్న పురస్కారాన్ని ప్రధానం చేసింది. ఆయన భారత పర్యటనలో పురస్కారాన్ని గ్రహించి భారత పార్లమెంట్ లో ప్రసంగిస్తాడు. అయితే మండేలా ఈ అంశాన్ని తన ఆత్మకథలో ప్రస్తావించలేదు. ఎందుకో మరి. దక్షిణాఫ్రికాలో గాంధీ చేసిన అహింసాయుత పోరాటాన్ని మండేలా గుర్తించినా, వాటిపట్ల గౌరవ భావం ఉన్నా తీవ్రమైన హింసకు పాల్పడుతున్న ప్రభుత్వాన్ని అహింసాయుత పోరాటాల ద్వారా లొంగదీయలేము అని మండేలా నమ్ముతాడు. సాయుధ పోరాటానికే మొగ్గు చూపుతాడు. జవహర్ లాల్ నెహ్రూ పుస్తకాలు చదివి ప్రయభావితుడు అయినాడు. నెహ్రూ రాసిన Glimpses of World History చదివినట్టు ప్రస్తావించినాడు. నెహ్రూలో ఆధునిక, సోషలిస్ట్ భావజాలాన్ని మండేలా ఇష్టపడినట్టు తెలుస్తున్నది.
జైలు జీవితం అతన్ని చాలా మార్పులకు లోను చేస్తుంది. ప్రభుత్వంతో ఏనాడూ రాజీ పడకపోయినా చివరకు చర్చల ద్వారానే పరిష్కారం సాధ్యం అని నమ్మాడు. తాను నమ్మిన మార్గంలో ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించి అంతిమ పరిష్కారానికి చేరుకున్నాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు తొలుత చర్చలకు సుముఖంగా లేకపోయినా చర్చలకు పరిపక్వమైన పరిస్థితులు ఏర్పడి ఉన్నాయని, ఈ అవకాశాన్ని చేజార నివ్వ వద్దని వారిని ఒప్పించి ప్రభుత్వంతో చర్చలు కొనసాగించి సఫలం అవుతాడు. చర్చలు సఫలం కావడానికి మూడు కారణాలు తోడయ్యాయని నాకనిపించింది. 1. ప్రపంచ దేశాల ఆర్థిక ఆంక్షలు, దౌత్య సంబంధాలు తెగిపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. అధ్యక్షుడు బోథా ఈ సంక్షోభాన్ని తట్టుకోలేక రాజీనామా చేశాడు. ఈయన స్థానంలో క్లరిక్ అధ్యక్షుడు అవుతాడు. 2. ఉదారవాది అయిన క్లరిక్ జాతి వివక్షా విధానాలకు స్వస్తి పలికాడు. చర్చలకు మార్గం సుగమం చేశాడు. 3. దేశంలో సాయుధ పోరాటం తీవ్రతరం కావడం.
జాత్యాహంకారం, జాతి వివక్ష లేని ఆధునిక దక్షిణాఫ్రికా ఏర్పడడానికి కారకులైన నెల్సన్ మండేలా, ఎఫ్ డబ్ల్యూ క్లరిక్ లు 1993 నోబుల్ శాంతి బహుమతికి ఎంపిక అయినారు.
పుస్తకం చదివిన తర్వాత మండేలా జీవితం స్పూర్తిని పొందుతాము. ఎన్ని కష్టాలు ఎదురైనా జీవితేచ్ఛను కోల్పోకుండా కడదాకా నిలబడిన ఆయన మనోధైర్యం పాఠకుడిలో స్పూర్తిని నింపి తీరుతుంది. సీతారామరాజు అనువాదం సరళంగా సాఫీగా సాగింది. మండేలా జీవితంలో ముఖ్యమైన ఘట్టాలతో కూడిన ఒక పోటో గ్యాలరీ పుస్తకం లో చేరిస్తే బాగుండేదని అనిపించింది. మండేలాతో పనిచేసిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ పోరాట యోధులు అలివర్ టాంబో, వాల్టర్ సిసులు, జో స్లోవో, అహ్మద్ కత్రాడా, ఆల్ఫ్రెడ్ జో తదితరుల ఫోటోలు ఎక్కడ కనిపించవు. అవి ఇంగ్లీష్ ఒరిజినల్ పుస్తకంలో లేకపోయినా తెలుగు పుస్తకంలో వేసి ఉంటే పుస్తకానికి వాల్యూ అడిషన్ అయి ఉండేదని నా అభిప్రాయ, చాప్టర్ చివరలో అవసరమైన వివరాలతో ఫూట్ నోట్స్ ఇచ్చారు. అయితే వీటిని ఆ ప్రస్తావన వచ్చిన పేజీలోనే పెట్టి ఉంటే పాఠకుడికి సౌకర్యంగా ఉండేది. నంబర్లు కూడా కబడలేదు. మలి ముద్రణలో ఈ అంశాలు గమనంలోకి తీసుకోవాలని కోరుతున్నాను. నాలుగు వందల రూపాయల బౌండ్ ఎడిషన్ తో పాటు పేపర్ బ్యాక్ ఎడిషన్ కూడా తీసుకువస్తే పుస్తకం ధర తగ్గి ఎక్కువ మందికి చేరువ అవుతుంది.
కొని చదవదగ్గ పుస్తకం. ఒకసారి కాదు నిర్వేదంలో కూరుకుపోయిన ప్రతీసారి చదివితే మనిషిలో జీవితేచ్ఛ వెల్లుబుకుతుంది. ఆలస్యంగానైనా ఈ పుస్తకాన్ని వెలువరించిన దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదికకు, అనువదించిన రాపోలు సీతారామరాజు గారికి హృదయపూర్వక అభినదనలు.
చివరి మాట : మండేలా చనిపోయినప్పుడు తెలంగాణ ఉద్యమం చివరి దశలో ఉన్నది. తెలంగాణ విద్యావంతుల వేదిక తరపున రెండు సంస్మరణ సభలు నిర్వహించాము. ఒకటి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో, రెండవది సికిందరాబాద్ అడ్డగుట్ట లో. ఆ సభల్లో మండేలా పోరాట జీవితాన్ని స్మరించుకున్నాము. కొత్త దక్షిణాఫ్రికా ఏర్పడి 20 ఎండలు అయినా ఆయన కలలు ఇంకా పూర్తిగా నెరవేరలేదన్న విషయాన్ని విశ్లేషించుకున్నాము. దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజల ఉద్దరణకు ఇంకా చాలా చేయవలసి ఉన్నదని ప్రస్తావించుకున్నాము. తెలంగాణ సాధన తర్వాత మనకు ఈ వైఫ్యల్యాలు ఒక పాఠంగా పనికి వస్తాయని విశ్లేషించుకున్నాము.
“పర్వత శిఖరం చేరుకున్నాకే తెలుస్తుంది .. అధిరోహించాల్సిన పర్వతాలు మరెన్నో ఉన్నాయని” అన్న మండేలా మాటలు మనం అందరం గుర్తుంచికోవలసిన అవసరం ఉన్నది.
✍️శ్రీధర్ దేస్ పాండే
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.