
భారతదేశ విద్యా రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఒక న్యాయపోరాటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భారతీయ విద్యారంగంలో అగ్రగామిగా ‘అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్’ ఉండగా, మరోవైపు విద్యా సంస్కరణల లక్ష్యంతో ‘కోచింగ్-ఫ్రీ భారత్’ అనే మిషన్‌తో ముందుకు సాగుతున్న ‘ఇన్నోవర్తన్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే స్టార్టప్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ రెండు సంస్థల మధ్య జరుగుతోన్న న్యాయపోరాటం కేవలం ఒక వ్యాపార తగాదాగా కాకుండా, భారతదేశ విద్యా వ్యవస్థలోని లోపాలను, న్యాయ వ్యవస్థలో ధనవంతుల ప్రభావం, చిన్న స్టార్టప్‌లు ఎదుర్కొంటున్న సవాళ్లను బయటపెడుతోంది.
రాజస్థాన్‌లోని జైపూర్ కమర్షియల్ కోర్టులో ఇటీవల ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ చేసిన అభ్యర్థన మేరకు, కోర్టు ‘ఇన్నోవర్తన్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై‘ ఎక్స్-పార్ట్ ఆర్డర్ (ఒక పక్షం వాదన వినకుండా ఇచ్చే ఏకపక్ష ఆదేశం)ను జారీ చేసింది. ఈ ఆర్డర్ జారీ చేసే ముందు ఇన్నోవర్తన్కు నోటీసు ఇవ్వడం గానీ, వారి వాదన వినడం గానీ జరగలేదు. అలెన్ తరపున దాఖలు చేసిన ఈ కేసు, ఐదేళ్ల క్రితం అలెన్ విద్యాసంస్థలో ఉద్యోగిగా ఉన్న ప్రశాంత్ శర్మను లక్ష్యంగా చేసుకుంది. ప్రశాంత్ శర్మ, ఇన్నోవర్తన్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అమిత్ మోహన్ అగర్వాల్‌తో పాటు ఇన్నోవర్తన్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా అలెన్ తమ వ్యాజ్యానికి ప్రతివాదులుగా చేర్చింది.
అలెన్ ఆరోపణలు ఏమిటి?..
అలెన్ కెరీర్ ఇన్స్టిట్యూట్ దాఖలు చేసిన సివిల్ దావా(కేసు నంబర్ 181/2025) ప్రకారం, అమిత్ మోహన్ అగర్వాల్ అనే వ్యక్తి అలెన్‌లో వైస్-ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఆయన 2016 నవంబర్ 17న అధ్యాపకుడిగా అలెన్‌లో చేరి, 2025 మే 6న రాజీనామా చేసే సమయానికి వైస్-ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆయన ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్(ఉద్యోగ ఒప్పందం) ప్రకారం, అలెన్ సంస్థకు చెందిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయడం లేదా వేరే దగ్గర ఉపయోగించడంలాంటివి చేయకూడదు. అంతేకాకుండా ఉద్యోగం మానేసిన తర్వాత 24 నెలల పాటు అదే రంగంలో వ్యాపారం స్టార్ట్ చేయకూడదు. అలాగే అలెన్ ఉద్యోగులను, విద్యార్థులను ఆకర్షించకూడదు(నాన్-సోలిసిట్ క్లాజ్).
అలెన్ ఆరోపణల ప్రకారం, అమిత్ మోహన్ అగర్వాల్ ఈ ఒప్పందాలను ఉల్లంఘించారు. ఆయన అలెన్ రహస్య యాజమాన్య సమాచారాన్ని పద్ధతి ప్రకారం ఇన్నోవర్తన్ సంస్థకు బదిలీ చేశారని ఆరోపణ. ఇన్నోవర్తన్, అమిత్ మోహన్ అగర్వాల్‌కు చెందిన మరొక అల్టర్ ఈగో సంస్థను, అలెన్‌తో పోటీ పడటానికే దీనిని స్థాపించారని అలెన్ పేర్కొంది. అంతేకాకుండా, అమిత్ మోహన్ అగర్వాల్ అలెన్ ఉద్యోగులను, విద్యార్థులను ఇన్నోవర్తన్లో చేరమని ప్రేరేపించారని కూడా ఆరోపణలు చేసింది సదరు సంస్థ. అమిత్ మోహన్ అగర్వాల్ ఉద్యోగంలో ఉన్నప్పుడే ఇన్నోవర్తన్ కోసం నిధులు సేకరించడానికి ప్రయత్నించారని, ఇన్నోవర్తన్ పోటీ వ్యాపారంలో ఉందని స్పష్టంగా చూపించే పెట్టుబడి డెక్‌ను కూడా సిద్ధం చేశారని అలెన్ ఆరోపించింది.
అలెన్ గోప్యమైన సమాచారాన్ని 2023 సెప్టెంబర్ నుంచి తన కంపెనీ ఈమెయిల్‌తో వ్యక్తిగత ఈమెయిల్‌కు అమిత్ మోహన్ అగర్వాల్ పంపించుకోవడం ప్రారంభించారని కూడా అలెన్ పేర్కొంది. ఇది సమాచార సాంకేతిక చట్టం– 2000 ప్రకారం శిక్షార్హమైన డేటా దొంగతనం అని, దీనిపై అలెన్ తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపింది. ఇందులో ఉద్యోగుల ‘కీ రెస్పాన్సిబిలిటీ ఏరియా’ షీట్లు, క్లినికల్ కౌన్సిలర్లను గుర్తించడానికి సంబంధించిన ప్రతిపాదనలు, ఇన్వాయిస్లు, విస్తరణ ప్రణాళికలు, లాభ నష్టాల వివరాలు, ‘ప్రీ-నర్చర్ అండ్ కెరీర్ ఫౌండేషన్’ ప్రోగ్రామ్ వివరాలు వంటి కీలక సమాచారం ఉందని అలెన్ వెల్లడించింది. అమిత్ మోహన్ అగర్వాల్ కుమార్తె ఆర్షియా మోహన్ అగర్వాల్ కూడా అతని ఉద్యోగ కాలంలో ఇన్నోవర్తన్లో షేర్లు కలిగి ఉన్నారని అలెన్ పేర్కొంది.
‘కోచింగ్-ఫ్రీ భారత్’ మిషన్ వర్సెస్ కోచింగ్ కార్టెల్..
ఇన్నోవర్తన్ సంస్థ ‘కోచింగ్-ఫ్రీ భారత్’ అనే కార్యక్రమంతో ముందుకు వచ్చింది. దీని లక్ష్యం ఏమిటంటే, పాఠశాలల్లోనే విద్యార్థులకు JEE/NEET వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయులను, పాఠశాలలను బలోపేతం చేయడం. దీని ద్వారా విద్యార్థులు ఖరీదైన కోచింగ్ సెంటర్లపై ఆధారపడకుండా, తమ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్యను పొందేలా చేయడమే లక్ష్యం. ఈ విధానం ‘డమ్మీ స్కూల్స్, లక్షల రూపాయల కోచింగ్ ఫీజులతో నడుస్తున్న పెద్ద కోచింగ్ సంస్థల వ్యాపార నమూనాను నేరుగా ప్రభావితం చేస్తుందని ఇన్నోవర్తన్ పేర్కొంది.
ఇన్నోవర్తన్ ప్రకారం, అలెన్ వంటి పెద్ద కోచింగ్ సంస్థలకు ఈ ‘కోచింగ్-ఫ్రీ భారత్’ మిషన్, వాళ్ల వ్యాపారానికి చెక్ పెట్టాలా ఉందని వారు భావిస్తున్నారు. అందుకే, ఇన్నోవర్తన్ను అణచివేయడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఇన్నోవర్తన్ ఆరోపిస్తోంది. ప్రశాంత్ శర్మపై అలెన్ దాఖలు చేసిన కేసు “ఆధార రహితమైనది” అని, “న్యాయబద్ధతకు విరుద్ధం” అని ఇన్నోవర్తన్ పేర్కొంది. ప్రశాంత్ శర్మకు ఐదేళ్లుగా అలెన్‌తో సంబంధం లేదని, ఈ కేసు కేవలం ఒక పోటీదారుడిని అణచివేయడానికి చేసే ప్రయత్నమని ఆరోపించింది.
కోర్టు ఆదేశాలు, వాటి ప్రభావం..
2025 మే 14న జారీ చేయబడిన కోర్టు ఆదేశం(Order dated 14.05.2025_Allen vs Amit Mohan Agarwal& Anr) ఈ కేసులో కీలకమైన అంశం. జైపూర్ మెట్రోపాలిటన్-IIలోని కమర్షియల్ కోర్ట్ నం 1 న్యాయమూర్తి దినేష్ కుమార్ గుప్తా ఆర్జేఎస్ (డీజే కేడర్) ఈ ఆదేశాన్ని జారీ చేశారు. ఈ మధ్యంతర ఆదేశం ప్రకారం, ఇన్నోవర్తన్ సంస్థ కొత్త విద్యార్థులను చేర్చుకోకూడదు. అలాగే, అలెన్ సంస్థకు చెందిన అనధికారిక సమాచారం అండ్ మెటీరియల్‌ను తమ విద్యా లేదా ఇతర కార్యకలాపాలలో ఉపయోగించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆదేశం సీపీపీ(కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్)లోని ఆర్డర్ 39 రూల్ 3కు కట్టుబడి అమలు చేయబడుతుందని కూడా పేర్కొన్నారు. ఈ ఆదేశం ఇన్నోవర్తన్కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇన్నోవర్తన్ వాదన వినకుండానే ఏకపక్షంగా కోర్టు ఆదేశాన్ని జారీ చేసింది. “ఒక సామాజిక లక్ష్యంతో కూడిన స్టార్టప్‌కు, 4000 కోట్లకు పైగా విలువైన ఒక దిగ్గజ సంస్థతో పోటీకి దిగినప్పుడు సరైన విచారణ లభిస్తుందా?” అని ఇన్నోవర్తన్ పత్రం ప్రశ్నిస్తోంది.
విద్యా వ్యవస్థపై ప్రభావం, విస్తృత చర్చ..
ఈ న్యాయపోరాటం భారతదేశంలోని కోచింగ్ పరిశ్రమలో నెలకొన్న లోతైన సమస్యలను బయటపెడుతోంది. కోచింగ్ సెంటర్లు ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారాయి, విద్యార్థులు తమ పాఠశాలలను విడిచిపెట్టి, ఈ కోచింగ్ హబ్‌లకు (ముఖ్యంగా కోటా వంటి నగరాలకు) వెళ్లడం సర్వసాధారణమైంది. దీనివల్ల ‘డమ్మీ స్కూల్స్’ అనే వ్యవస్థ పెరిగిపోయింది, విద్యార్థులు పాఠశాల విద్యపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రవేశ పరీక్షల కోసమే సన్నద్ధమవుతున్నారు. ఇన్నోవర్తన్ ‘కోచింగ్-ఫ్రీ భారత్’ మిషన్, ఈ సమస్యకు ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పాఠశాలలకే శిక్షణ ఇచ్చే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా, విద్యార్థులు తమ కుటుంబాలకు దూరంగా వెళ్లకుండా, తమ పాఠశాల వాతావరణంలోనే అత్యున్నత పరీక్షలకు సన్నద్ధం కావచ్చని ఇన్నోవర్తన్ నమ్ముతోంది. ఇది కోచింగ్ పరిశ్రమపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది, తద్వారా ఖరీదైన కోచింగ్ ఫీజుల భారం తల్లిదండ్రులపై తగ్గుతుంది.
అలెన్ వంటి కోచింగ్ దిగ్గజాలు, ఇన్నోవర్తన్ వంటి స్టార్టప్‌ల ఎదుగుదలను తమ వ్యాపారానికి ముప్పుగా భావించి, న్యాయపరమైన చర్యలకు దిగడం, విద్యా వ్యవస్థలోని వాణిజ్య కోణాన్ని, సామాజిక లక్ష్యాల మధ్య సంఘర్షణను స్పష్టం చేస్తుంది. ఈ కేసు కేవలం రెండు కంపెనీల మధ్య వివాదం కాకుండా, విద్యా సంస్కరణలు, న్యాయ వ్యవస్థలో సమగ్రత, సమాజంలో ధనవంతుల ప్రభావం వంటి విస్తృతమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
భవిష్యత్ పరిణామాలు..
జైపూర్ కమర్షియల్ కోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశం ఇన్నోవర్తన్కు తాత్కాలికంగా ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ, ఈ న్యాయపోరాటం ఇంకా ముగియలేదు. ఇన్నోవర్తన్ తమ వాదన వినిపించడానికి, తమ ‘కోచింగ్-ఫ్రీ భారత్’ మిషన్ ప్రాముఖ్యతను వివరించడానికి ప్రయత్నిస్తుంది. అలెన్ సంస్థ తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికి న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుంది. ఈ కేసు విద్యా రంగంలో సంస్కరణలు కోరుకుంటున్న వారికి, చిన్న స్టార్టప్‌లకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆసక్తికరంగా మారింది. న్యాయ వ్యవస్థ ఈ కేసును ఎలా పరిష్కరిస్తుంది, ఇది భవిష్యత్తులో భారతీయ విద్యా వ్యవస్థపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనేది చూడాలి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు, విద్యా సంస్కరణల దిశ ఈ కేసు తీర్పుపై ఆధారపడి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.