
కుంభమేళా సాక్షిగా హిందూ- బుద్ధిస్టు భాయీ భాయీ అంటూ సాగుతున్న సమ్మేళనాలు ధార్మిక క్రతువు కంటే రాజకీయ సంకీర్ణ నిర్మాణంగానే కనిపిస్తోంది. ఇటువంటి ప్రయత్నాలకు వైరుధ్యాలతో కూడిన సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది.
1923లో అఖిలభారత హిందూ మహాసభ ఏడవ వార్షికోత్సవాల కోసం బెనారస్ నగరం ముస్తాబయింది. నగరమంతా కోలాహలంగా ఉంది. హిందూ మత చిహ్నాలతో వేదిక అలంకరించబడింది. వేలాదిమంది వేదికముందు గుమిగూడారు. వేదికెక్కుతున్న వ్యక్తిని చూసి హాజరైన వాళ్లంతా నోరెళ్లబెట్టారు. వేదిక ఎక్కింది బ్రాహ్మణుడూ కాదు. హిందూ రాజకీయ నాయకుడూ కాదు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ సన్యాసి. శ్రీలంకలో మహాబోధి సొసైటీని స్థాపించిన అనగారిక ధర్మపాల. ధవళ వస్త్రధారి అయిన ధర్మపాల వేదిక మీది నుండి ‘బౌద్ధులంతా హిందువులే’ అని ప్రకటించారు. అది విన్న వేదికముందున్న వారికి ఆనందోత్సాహాలకు హద్దుల్లేకుండా పోయాయి. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ధర్మపాల బౌద్ధం, హిందూయిజం మధ్య ఉన్న సంబంధం ప్రాచీనమైనదనీ, నాగరికత ఆవిర్భావంలోనే ఈ సంబంధాలు వేళ్లూనుకుని ఉన్నాయని, నిజానికి హిందూయిజాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది బౌధ్ధమేననీ, తర్వాతి కాలంలో ఇస్లాం ప్రవేశంతో రెండు మతాలకూ ఇక్కట్లు వచ్చి పడ్డాయన్నది ఆయన ఉపన్యాస సారాంశం. ఇస్లాం పాటిస్తున్నవారినందరినీ తిరిగి హిందూమతంలోకి మార్చుకోవాలన్నది ధర్మపాల ఇచ్చిన పిలుపు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపూ సభ కేరింతలు, చప్పట్లతో మారుమోగింది.
ధర్మపాల ఉపన్యాసం ముగిసిన తర్వాత వేదిక మీద ఉన్న మదన్ మోహన్ మాలవీయ లేచారు. అప్పుడే హిందూమహాసభ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు మాలవీయ. అప్పటికే పేరుమోసిన మేధావి. రాజకీయ నాయకుడు. ధర్మపాల మాటలను సంపూర్ణంగా బలపరిచారు. కరతాళ ధ్వనుల మధ్య ‘బౌద్దం, జైనం, సిక్కిజం అన్నీ గొప్పదైన హిందూయిజంలో ఉపాంగాలే’ అన్నారు. బుద్ధుడు ప్రత్యేక మతాన్ని ప్రతిపాదించలేదనీ, తన కాలంలో అవసరమైన హిందూయిజంలోని కొన్ని అంశాలనే వక్కాణించి చెప్పారని మాలవీయ అన్నారు. అది బెనారస్‌లో జరిగిన సభయినా దాని ప్రకంపనలు దేశసరిహద్దులను దాటి వెళ్లాయి. బౌద్ధాన్ని హిందూరాష్ట్రలో అనివార్యమైన అంతర్భాభంగా మార్చింది ఈ సభ.
వందేళ్ల తర్వాత 2025లో జరుగుతున్న కుంభమేళాలో కూడా ఈ వాదనలే ప్రతిధ్వనిస్తున్నాయి. కుంభమేళాలో ఆరెస్సెస్ అగ్రనేతలైన భయ్యాజి జోషి, ఇంద్రేష్ కుమార్ వంటి వారితో ప్రపంచ నలుమూలల నుండి తరలి వచ్చిన బౌద్ధ భిక్షువులు వేదికలు పంచుకుంటున్న వైనంపై ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కథనాలు ప్రచురించింది. కుంభమేళాలో పుణ్యస్నానాలు, ప్రకృతి విపత్తులూ ఓ వైపు కొనసాగుతూ ఉంటే మరోవైపున ఆరెస్సెస్ నాయకుల ప్రచారాలు, ప్రసంగాలు, హిందూరాష్ట్ర నిర్మాణానికి కావల్సిన రాజ్యాంగ ప్రతుల విడుదలలూ, సనాతన హిందూయిజం, బౌద్ధం మధ్య సంఫీుభావ సందేశాలు సాగుతూనే ఉన్నాయి.
బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో మతపరంగా అల్పసంఖ్యాకులైన హిందువులపై దాడులను ఖండించటం, టిబెట్‌కు స్వయంప్రతిపత్తి కల్పించడం, హిందూయిజం, బౌద్ధంల మధ్య ఆధ్యాత్మిక సంబంధాల గురించిన తీర్మానాలు ఆమోదం పొందుతున్నాయి. టిబెట్ మత గురువు ఏడవ కేబ్జే యోంగ్జిన్ లింగ్ రింపొచే కుంభమేళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాబా రామ్‌దేవ్ ప్రకృతి చికిత్సాలయానికి రావటం ఓ ఊరేగింపుగా జరిగింది. బౌద్ధం, హిందూయిజంలే అనేక ప్రాపంచిక విషయాలపై ఏకాభిప్రాయానికి రావటం, అదీ కూడా కుంభమేళా వేదికగా రావటం ధార్మిక సంస్కృతి చరిత్రలో సంగమమన్న ప్రశంసలూ కురుస్తున్నాయి. ప్రవాస టిబెట్ ప్రభుత్వంలో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారు కూడా కుంభమేళాలో ప్రత్యక్షమవుతున్నారు. ప్రవాస టిబెట్ ప్రభుత్వంలో రక్షణ మంత్రి గ్యారి డొల్మా కుంభమేళాలో జరిగే సభల్లో పాల్గొన్నారు. లామాలు(బౌద్ధ సన్యాసుల్లో ఉన్నత శ్రేణి), బౌద్ధ సన్యాసులు, హిందూ సాధువులతో కదం కదం కలిపి నడవటం పట్ల డొల్మా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బౌద్ధులు, సనాతనులు నిరంతరం కలిసే ప్రయాణించారు. ఇకముందు కూడా కలిసే ప్రయాణిస్తారని ఆమె ప్రకటించారు. అయితే రోజువారీ పత్రికల్లో ఈ విషయాలేవీ రిపోర్టు కావటం లేదు.
నిజానికి సనాతనత్వం (కరుడుగట్టిన హిందూత్వ) బౌద్ధం మధ్య ఉన్న సంబంధాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నంత సాదాసీదాగానూ, సహృద్భావంతోనూ సాగలేదని చరిత్ర సాక్ష్యం చెప్తోంది. ఇతర అన్ని విషయాలకు సంబంధించిన చరిత్ర వక్రీకరణకు గురైనట్లుగానే హైందవ బౌద్ధ సంబంధాల చరిత్ర కూడా వక్రీకరణకు గురవుతుంది. రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికన నూతన చరిత్ర నిర్మాణమవుతోంది.
తొలినాళ్లలో బౌద్ధం హిందమత ప్రభావం నుండి పూర్తిగా తనను తాను విడగొట్టుకున్న తీరు పట్ల చరిత్ర పరిశోధకుల్లో ఆసక్తి పెరుగుతున్న సమయంలో ఈ రెండు ధోరణులూ కాలక్రమంలో ఒకే చారిత్రక నేపథ్యం గుండా ప్రయాణించటంతో వీరిద్దరి భాష, వ్యక్తీకరణ కూడా ఒకేలా కనిపించసాగింది. ఉదాహరణకు రెండు స్రవంతులూ జానార్జనా సాధనాల గురించి, భౌతిక వాస్తవికత గురించీ, జ్ఞానసాధన గురించి లోతుగానే చర్చించాయి. వీటన్నిటినీ పైపైన పరిశీలిస్తే రెండు మతాచారాల మధ్య పెద్దగా తేడాలు లేవనిపిస్తుంది. కానీ భారత ఉపఖండంలో రెండు మతాలు కాలానుగుణంగా తమనుతాము తీర్చి దిద్దుకున్న తీరును గమనిస్తే రెండు ధోరణుల మధ్య ఉన్న వైమనస్యం, వైషమ్యం, దాడులు, నిర్మూలనాయత్నాలు వెల్లడవుతాయి.
గతం
పాళీ భాషలో రాయబడిన తెవిజ్జ సుత్త బ్రాహ్మణుల్లో ఏ ఒక్కరూ దైవాన్ని చేరుకోలేకపోయినా తాము దైవదూతలమనని చెప్పుకుంటున్న బ్రాహ్మణులను ఎగతాళి చేస్తుంది. బుద్ధుడు అంతిమంగా తిరస్కరిస్తున్న వర్ణాశ్రమ ధర్మాలనే పట్టుకుని వేళ్లాడుతున్న బ్రాహ్మణుల బేషజాన్ని అంబత్త సుత్త మరింత కటువుగా విమర్శిస్తుంది. దీనికి బదులుగా బ్రాహ్మణీయ రచనలన్నీ బుద్దుడు జ్ఞానోదయం కలిగిన వ్యక్తి కాదనీ, విఛ్చిన్నకారుడనీ ప్రస్తావించాయి. పకడ్బందీగా వైదీక వ్యవస్థ ద్వారా వర్ణాశ్రమ ధర్మంలో ఇమిడ్చిన కులాలను బద్దలు కొట్టి యువతీ యువకులను సంఘంలోకి లాక్కెళ్తుందనీ ఈ విమర్శ సారాంశం. బుద్ధుడిని అత్యంత తీవ్రంగా విమర్శించిన బ్రాహ్మణీయ దృక్కోణం నుండి సాగిన రచనగా విష్ణుపురాణాన్ని చెప్పుకోవచ్చు. విష్ణు పురాణంలో బుద్ధుడిని ప్రపంచ శాంతికాముకుడిగా కాకుండా వైదీక ధర్మాన్ని సవాలు చేసేవారిని తన కుతంత్రాలతో ప్రభావితం చేసేవాడిగా చిత్రిస్తుంది. ఇటువంటి వ్యాఖ్యానాలు బౌద్ధం కూడా వర్ణాశ్రమ ధర్మంలాగానే నిచ్చెనమెట్ల వ్యవస్థతో కూడి ఉంటుందనీ, అత్యంత ప్రమాదకరమైనదన్న బ్రాహ్మణుల వర్ణనలతో కూడుకుని ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యానాలు చూస్తే బౌద్ధాన్ని ఎంత ప్రమాదకరమైనదిగా వైదీక బ్రాహ్మణులు భావించారో అర్థమవుతుంది.
ప్రఖ్యాత శైవ భక్తుడు, బాలమేధావి సంబంధార్ కూడా తన ప్రవచనం ముగింపులో బౌద్ధులను, జైనులను ఆడిపోసుకోవడానికే దృష్టి సారించాడు. వీరంతా ఐహిక విషయాలపైనే దృష్టి పెడతారనీ, తాము జ్ఞానసంపన్నులమని భావించుకుంటూ ఉంటారని విమర్శలు గుప్పించారు.
ప్రాచ్యభాషా నిపుణులైన పాశ్యాత్యులు భారతదేశంలోకి ప్రవేశించే సమయానికి ఈ వైమనస్యాలు పతాక స్థాయిలో ఉన్నాయి. ఏసియాటిక్ సొసైటీ ప్రారంభించిన విలియం జోన్స్ తన చుట్టూ ఉన్న బ్రాహ్మణులే బుద్ధుడిని ఓ వైపు దేవుడిగా భావిస్తూనే మరోవైపున దేవుడిగా తగడని వాదించటాన్ని చూసి విస్మయం చెందారు. తెలుగు భాషా పండితుడు ప్రొఫెసర్ వి నారాయాణరావు మాటల్లో 19 వ శతాబ్దం నాటికి బ్రాహ్మణ కుటుంబాల్లో కుల కట్టుబాట్లు వీడి వ్యవహరించే పిల్లలను బౌద్ధ సన్యాసులతో పోల్చి తిట్టేవారు. వివేకానందుడు లాంటి వాడు కూడా బౌద్ధం మంచి ఆలోచనే కానీ దారితప్పిన ప్రయోగమని వ్యాఖ్యానించాడు. వివేకానందుని దృష్టిలో బౌద్ధం అంటే కరుణామయుడు అన్న భావనను వికృతంగా వ్యాఖ్యానించటం వలన తలెత్తిన ధోరణి.
క్రమంగా వలసపాలకులు రూపొందించిన కొన్ని చట్టాలు, మారిన మతాధారిత అస్తిత్వాల నేపథ్యంలో 20 వశతాబ్దంలో మాత్రమే హిందూ జాతీయవాదులు బౌద్ధాన్ని కూడా హిందూమతం గుప్పెట్లోకి ఇముడ్చుకోవడానికి వ్యూహాత్మకంగా ప్రయత్నాలు ప్రారంభించారు. హిందూమహాసభ దాని రాజకీయ అనుబంధ సంఘాలు, సంస్థలు తమ రాజకీయ శక్తిని, పలుకుబడిని పెంచుకోవాలన్న ప్రయత్నంలో హిందూయిజానికి సంబంధించిన నిర్వచనాన్ని విస్తరించే దిశగా పావులు కదిపింది.
అంగారిక ధర్మపాల కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు కానీ నిబద్ధతతోనో లోతైన అవగాహనతోనో కాదు. అప్పటికి హిందువు సంత్‌ల సంరక్షణలో ఉన్న మహాభోధి సొసైటీపై పెత్తనం సంపాదించటం కోసం వలసవాద వ్యతిరేక జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. బౌద్ధం, హిందుత్వల మధ్య సత్సంబంధాల కోసం ప్రయత్నాలు ఎంతగా ముందుకెళ్లాయంటే బర్మాకు చెందిన బౌద్ధ మత గురువు యు ఓట్టమా ది రఖినేకు 1935లో హిందూమహాసభ పగ్గాలు అప్పగించేందుకు కూడా సిద్ధమయ్యారు హిందూత్వ జాతీయనాయకులు. ఓట్టమా హిందూత్వవాది కాదు. కానీ బర్మాలో సాగుతున్న బ్రిటిష్ వలసవాద వ్యతిరేక పోరాటానికి భారతదేశంలోని హిందూమహాసభ నాయకత్వం మద్దతు ఆశించారు. ఆ తరుణంలో అంగారిక ధర్మపాల ఉపన్యాసానికి, ఆయన వెళ్లగక్కిన ముస్లిం ద్వేషానికి, హిందూ ముస్లింల ఐక్యత గురించి ఆయన చెప్పిన విషయాలకు హిందూమహాసభ నాయకత్వం ఉబ్బి తబ్బిబ్బయ్యింది. ఈ ఐక్యత ధార్మిక ప్రయోజనాల కోసం. ముస్లింలను శతృవులుగా చూపించే ప్రయత్నంలో ఏర్పడిన ఉద్విగ్నతలను అధిగమించే అవసరం కలిపిన స్నేహం.
ప్రస్తుతం
వర్తమానాన్ని పరిశీలిస్తే ఈ ధార్మిక రాజకీయ సంకీర్ణం మరింత సంఘటితం అయినట్లు కనిపిస్తోంది. కుంభమేళా ఎక్కడ జరిగా, ఎప్పుడు జరిగినా ముస్లింల నుండి వచ్చే ఊహాత్మక ప్రమాదం గురించిన చర్చ నిరంతరంగా ప్రతిఫలిస్తూనే ఉంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్లలో మతపరమైన అల్పసంఖ్యాక తరగతులకు రక్షణ కల్పించటం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో భారతదేశంలో మతపరమైన అల్పసంఖ్యాక తరగతులను సంరక్షించటం అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. కానీ ఇతర దేశాలలో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్‌కు తగినట్లుగా భారతదేశంలోని ముస్లింలకు రక్షణ కల్పించాలన్న పట్టుదల బిజెపి ప్రభుత్వానికి లేకపోవటం ప్రభుత్వ ప్రాధాన్యత ఏమిటో తెలియచేస్తుంది. మణిపూర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాధమిక రక్షణలు కూడా వదిలేసి దళితులను, ఇతర బలహీన వర్గాలను ఇక్కట్ల పాలు చేస్తున్న తీరును గమనిస్తున్నాము. కానీ కుంభమేళాలో ఆమోదించే తీర్మానాల్లో ఒక్కటి కూడా ఈ విషయాల్లో ప్రభుత్వ వ్యవహారాన్ని సవాలు చేయటానికి వేలెత్తి చూపటానికి సిద్ధంగా లేవు. అన్నా హర్డెంట్ చెప్పినట్లు అణచివేత ఎదుర్కుంటన్నపుడు కూడా నోరు మూసుకుని ఉండటం అంటే ఆ అణచివేతను స్వాగతించటమే. వాస్తవం అన్నది సౌకర్యం కాదు. అవసరం.
వలసపాలన నాటితో పోలిస్తే ప్రస్తుత కుంభమేళాలో ప్రవాస టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొనటం మరో ప్రాధాన్యత కలిగిన అంశం. ఇది రెండు మతాల మధ్య సాధారణంగా ఉండే సంఫీుభావం కాదు. వ్యూహాత్మక స్నేహమే. దలైలామా వృద్దులవుతున్నారు. వారసుడు ఇంకా ఖరారు కాలేదు. ఈ పరిస్థితుల్లో ప్రవాస టిబెటన్లు భారతదేశంలో తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా భారత ప్రభుత్వం దలైలామాకు మాత్రమే ఆశ్రయం ఇచ్చింది. కానీ వేలాదిమంది టిబెటన్లు ఎటువంటి పౌర రాజకీయ హక్కులు లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఆ మాత్రం ఉండగలుగుతున్నారంటే దానికి కారణం భారతీయుల స్నేహశీలతే. భారతదేశంలో తలదాచుకున్న టిబెటన్లు తమకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తకుండా ఉండాలంటే సున్నితంగానైనా బిజెపి రాజకీయ అవగాహనలను, వైఖరులనూ సమర్ధించకతప్పదు. బాహాటంగా ఆరెస్సెస్ బిజెపిల నీడన చేరాలి. వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఈ పరిస్థితులు వారికి కూడా ఇబ్బందికరమైనవే.
ఈ నేపథ్యంలో చూసినప్పుడు మహాకుంభమేళాలో కనిపిస్తున్న ఐక్యత అవసరార్థం ఏర్పడిన వ్యూహాత్మక ఐక్యతగానే చూడాలి. ఇటువంటి ఐక్యతను తనదైన చరిత్రతో పాటు తనవైన వైరుధ్యాలు కూడా ఉన్నాయి. ఈ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే కళ్ల ముందు కనిపిస్తున్న వేదికలు, అక్కున చేర్చుకోవడాలు, ఆశీర్వాదాలివ్వడాలతో పాటు కనిపించని చరిత్ర, అధికారం, మనుడగకు సంబంధించిన సవాళ్లను కూడా అర్థం చేసుకోవాలి. అధ్యయనం చేయాలి. 1956లో అంబేద్కర్ బౌద్ధంలోకి మరటాన్నీ, ప్రస్తుతం బౌద్ధంలోనే కులవ్యతిరేక ఘర్షణ జరగటాన్నీ ఈ విశాల నేపథ్యాన్ని పరిశీలించకపోతే అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. ఐక్యత కోసం కుంభమేళాలో ఇచ్చిన నినాదాలు దేశమంతా సవ్వడి చేస్తున్నాయి కానీ ఇది శాశ్వతంగా ఒకరితో ఒకరు మమేకమైపోయి విలీనమైపోయే ఐక్యత కాదు. ఇరుపక్షాల మధ్య స్పర్థలు నివారించుకోవడానికి ఏర్పడిన అవకాశవాద ఐక్యత మాత్రమే.
– డగ్లస్ ఓబర్
అనువాదం : కొండూరి వీరయ్య
(రచయిత ఫోర్ట్ లూయిస్ (అమెరికా) కళాశాలలో చరిత్ర అధ్యాపకుడు. డస్ట్ ఆన్ ది థ్రోన్: సెర్చ్ ఆఫ్ బుద్ధిజం ఇన్ మోడరన్ ఇండియా గ్రంథ రచయిత)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.