
కేరళలోని రెండు సీబీఎస్ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పాదాలు కడిగే కార్యక్రమం జరిగింది. దీనిని లౌకిక, ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా రాష్ట్ర సీపీఐ(ఎం) ప్రభుత్వం అభివర్ణించింది. అంతేకాకుండా, ఈ ఆచారం భూస్వామ్య వ్యవస్థకు చిహ్నమని పేర్కొంది. మరోవైపు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ “గురు పూజ”ను బలంగా సమర్థించారు. ఇంకా ఉపాధ్యాయుల పాదాలకు పూలు అర్పించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగమని అన్నారు.
న్యూఢిల్లీ: కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆదివారం(జూలై 13) “గురు పూజ” ఆచారాన్ని సమర్థించారు. “గురువుల పాదాలకు పూలు అర్పించడం భారతీయ సంస్కృతిలో భాగం” అని అన్నారు.
కేరళలోని రెండు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)పాఠశాలల్లో “పాద పూజ” (పాదాలు కడగడం) కార్యక్రమం జరిగింది. ఈ సంఘటనను కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)(సీపీఐ-ఎం) నేతృత్వంలోని ప్రభుత్వం ఖండించింది. దీని తర్వాత స్పందించిన గవర్నర్ అర్లేకర్ ఈ మాటలు చేశారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత పాఠశాలల యాజమాన్యం నుంచి వివరణ కోరింది.
వార్తా సంస్థ పీటీఐ రిపోర్ట్ ప్రకారం, ఈ సంఘటన మీద రాష్ట్ర ప్రభుత్వ విమర్శలను ఉద్దేశ్యించి గవర్నర్ అర్లేకర్ సందేహాన్ని వ్యక్తం చేశారు. “ఈ వ్యక్తులు ఏ సంస్కృతి నుంచి వచ్చారో నాకు అర్థం కావడం లేద”ని అన్నారు.
కేరళలోని బలరామపురంలో బాలగోకులం అనే మితవాద సంస్థ ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అర్లేకర్ పాల్గొని, మాట్లాడారు. “గురుపూజ మన సంస్కృతిలో భాగం, ఇందులో మనం మన గురువుల పాదాలకు పూలను అర్పిస్తాము. కానీ కొందరు దీని మీద తీవ్ర అసంతృప్తిని, అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు ఏ సంస్కృతికి సంబంధించిన వారో నాకు అర్ధం కావడం లేదు. ఒకవేళ మనం మన సంస్కృతిని మర్చిపోతే, మనల్ని మనం మర్చిపోతాము. అప్పుడు మనం ఈ ప్రపంచంలో ఎటూ కాకుండా పోతాము” అన్నారు.
పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయుల పాదాలను కడిగించిన ఘటనపై వచ్చిన వార్తా కథనాల మీద కేరళ విద్యాశాఖమంత్రి వీ శివన్కుట్టి ఆశ్చర్యంవ్యక్తం చేశారు. ఈ చర్యలను “ఖండించదగినవి”, “ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమైనవి”గా అభిర్ణించారు.
ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ కూడా విమర్శించారు. దీనిని ప్రత్యేకించి “కేరళ లౌకికత్వ, ప్రజాస్వామ్య విలువలకు నష్టం చేసే ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగమ”ని తెలియజేశారు.
“ఉపాధ్యాయులను సన్మానించడాన్ని, గౌరవించడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ ఈ ఆచారాన్ని శతాబద్దాల క్రితమే వదిలేశారు. ఇది భూస్వామ్య సంస్కృతిలో భాగం. ప్రస్తుతం దీని లక్ష్యం ప్రాచీన కులవ్యవస్థ- చాతుర్వర్ణ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించడం”అని గోవింద్ అన్నారు.
ఇటువంటి ఆచార- వ్యవహారాల లక్ష్యం యువతరాన్ని, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ద్వారా నిర్వహించబడుతోన్న పాఠశాలలో బానిసమనస్తత్వాన్ని సృష్టించడమేనని పేర్కొన్నారు.
అదే సమయంలో, ఆర్లేకర్ మాటల మీద ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రతిస్పందించారు. పాఠశాల పిల్లలతో ఉపాధ్యాయుల కాళ్లను కడిగించే చర్యను సరైనదనే గవర్నర్ నిర్ణయం కేరళకు సిగ్గుచేటని మండిపడ్డారు.
పాలక్కాడ్లో పాత్రికేయులు మాట్లాడుతూ, ఇలాంటి ఒక సంఘటనలో విద్యార్థులు బీజేపీ జిల్లా కార్యదర్శి పాదాలను కూడా కడిగారని ఆరోపించారు. “చీకటియుగంలోకి కేరళను తీసుకువెళ్లడానికి ఆర్లేకర్ ప్రయత్నిస్తున్నారు. పునరుజ్జీవనాన్ని చూసిన ఈ భూమి చరిత్ర బహుశా గవర్నర్కు తెలియకపోవచ్చు” అని ఎద్దేవా చేశారు.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.