
అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ అసెంబ్లీకి హాజరుకావడం, కాకపోవడంపైనే ప్రధాన చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కాగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారు. ఏకంగా 8 నెలల తరువాత అసెంబ్లీలో కేసీఆర్‌ను ప్రజలు చూడగలిగారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముందుగానే ప్రారంభమైన బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం నాడు అసెంబ్లీకి వైఎస్ జగన్ హాజరయ్యారు. పట్టుమని 10 నిమిషాలే ఉండి తమ పార్టీ సభ్యులతో సహా బైటకు వెళ్లిపోయారు. కేసీఆర్ కూడా గవర్నర్ ప్రసంగం నాడు బడ్జెట్ సమావేశాల తొలిరోజు హాజరయ్యారు. అయితే సమావేశాలకు రిగ్యులర్గా హాజరు కాలేక పోయినా, కీలకమైన సమయాల్లో తమ నేత సభకు హాజరవుతారని బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్ తనయుడు కేటీఆర్ తెలిపారు. అంటే మొత్తంగా అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టకుండా, కొంత మేర సమావేశాలకు హాజరుకావడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని భావించాలి.
అయితే జగన్ పరిస్థితి వేరు, తనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు. ప్రతిపక్ష నేతగా గుర్తిస్తేనే సభకు వస్తానని తేల్చిచెప్పారు కూడా. ఇప్పుడు అదే చర్చ సాగుతోంది. అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కొంత సుముఖంగా ఎందుకు ఉన్నారు. జగన్ ఎందుకు సుముఖంగా లేరన్నది ప్రధానమైన ప్రశ్నలు.
కేసీఆర్ ప్లస్‌లు, జగన్ మైనస్‌లు ఏంటి?
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పది మంది పార్టీ ఫిరాయించినా 28 మిగిలారు. కేసీఆర్‌కు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంది. సభలోకి వచ్చి కేసీఆర్ మాట్లాడాలని అటు అధికార పార్టీ నేతలు కూడా కోరుకుంటుంటే, తమ నేత సభకు వస్తే కాంగ్రెస్‌కు వణుకు పుడుతుందనే ధీమాతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి మాజీ సీఎం కేసీఆర్‌కు మధ్య వ్యక్తి గత విభేదాలు లేవు.
గతంలో రేవంత్‌ను జైలులో ఉంచినా, ఆ కేసులు విచారణలు వేరని చెప్పాలి. బీఆర్ఎస్ హయాంలో తీసుకొన్న నిర్ణయాలు జరిగిన తప్పులపై చట్టపరంగా విచారణకు, చర్యలకు రేవంత్ ప్రభుత్వం కూడా సిద్ధమవుతోంది. సభకు కేసీఆర్ హాజరయితే విధాన పరంగానే చర్చలు సాగే వీలుంది. కేసీఆర్‌కు అండగా కేటీఆర్, హరీష్ రావులాంటి వారు గళం విప్పడానికీ రెడీగా ఉన్నారు. కేసీఆర్ సభకు వచ్చి తగిన సలహాలు ఇస్తే స్వీకరిస్తామని సీఎం రేవంత్, మంత్రులు అంటున్నారు కూడా. అటు కేసీఆర్ కూడా ప్రభుత్వం మంచి చేస్తే ఆహ్వానించాలని, తప్పులను ఎత్తిచూపాలని తమ పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. స్వతహాగా మంచి వక్త అయిన కేసీఆర్ విపక్ష నేతగా సభకు వచ్చి ఏమి మాట్లాడతారన్నది ప్రజలలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది.
అటు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు వేరుగా వున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ పార్టీ వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేమని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తెగేసి చెబుతున్నారు. అయితే సీట్ల సంఖ్యతో సంబంధం లేకుండా తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని అప్పుడే సభలో మాట్లాడే సమయం దొరుకుతుందని జగన్ వాదన. అసెంబ్లీకి జగన్ వెళ్లకపోతే పార్టీ పరంగా సరిగా ప్రజల గొంతు వినిపించే ఎమ్మెల్యే లేకపోతే సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎత్తి చూపుతారు. అసెంబ్లీ సమావేశాలంటేనే ప్రభుత్వం భయపడేవిగా ఉండాలి. ప్రతిపక్షం ఎలా నిలదీస్తుందోనన్న సందేహం అధికార పక్షంలో ఉండాలి.
అయితే, జగన్ సభకు హాజరు కాలేకపోవడానికి గతంలో అధికార పక్షంగా వైసీపీ సభలో అనుసరించిన వైఖరి ఇప్పుడు ప్రతిబంధకంగా మారుతోంది. అప్పుడు 23 మంది సభ్యులే ఉన్నా చంద్రబాబు హుందాగా సభకు హాజరయ్యారు. అయితే వ్యక్తిగత దూషణలు, అవమానాలు శృతిమించి, సభకు రానని గెలిచే వస్తానని శపథం చేసి నెరవేర్చుకున్నారు. ఇప్పుడు సభకు హాజరైతే అవమానాల పాలౌతానన్న భయం జగన్‌లో కనబడుతుంది. అటు అధికార పక్ష సభ్యులు కూడా జగన్ ఎప్పుడొస్తాడా, ఆడుకుందామన్న రీతిలో ఎదురు చూస్తున్నారు.
ప్రతిపక్ష హోదా లేదు, పార్టీకి బలం లేదని సంకోచించకుండా జగన్ అసెంబ్లీకి హాజరై తేల్చుకోవాలని కొందరు సూచిస్తున్నారు. వాగ్ధాటి వున్న వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డిలాంటి వారు ఏ ప్రతిపక్ష హోదా వుందని రాణించారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. సభలో అవమాన పడితే ప్రజలలో తేల్చుకోవాలని వారి ఆశ్వీర్వాదాలు పొందాలని జగన్‌కు సూచిస్తున్నారు.
ఏదైనా 8 నెలల తరువాత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడం, అక్కడ జగన్ కూడా సుదీర్ఘ కాలం తర్వాత ఒక్కరోజు హాజరుకావడం చర్చకు తావిచ్చింది. వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకుంటే అనర్హత వేటు పడుతుంది. కాబట్టి, దానినుండి తప్పించు కోవడానికి వీరిద్దరూ సభకు అటెండెన్స్ కోసం హాజరయ్యారనే వాదనా వినిపిస్తోంది. ఏదైనా కేసీఆర్, జగన్ మధ్య పోలిక చేయలేమన్నది నిజం. ఇకనైనా వీరిద్దరూ సభకు హాజరై ప్రజల తరుఫున గళం విప్పుతారేమో చూడాలి. కేసీఆర్ మాటేమో కానీ, జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చే సూచనలు కన్పించడం లేదు. అయితే కేసీఆర్ మాత్రం తాను హాజరైనా, కాకున్నా పార్టీ ఎమ్మెల్యేలు సభలో గట్టిగా ఎలా నడుచుకోవాలో వ్యూహం మాత్రం రచిస్తునే ఉన్నారు.
బాలకృష్ణ ఎం, సీనియర్ జర్నలిస్ట్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.