
ఈ మధ్యనే కర్నాటక కులగణన వివరాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో వచ్చినట్లే కర్నాటక కులగణన విషయంలో కూడా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు వచ్చాయి. కులగణన మీద కర్నాటకలో సంఖ్య రీత్యా ప్రధానమైన వొక్కలింగ, లింగాయత్ ఈ రెండు కులాలు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కర్నాటక రాష్ట్ర ఒక్కలింగ సంఘం ఆందోళనకు సిద్ధం అయ్యింది. ఈ ప్రయత్నంలో రెండో పెద్ద కులం వీరశైవానికి( లింగాయతులు) ప్రాతినిధ్యం వహించే వీరశైవ మహాసభ మద్దతుకోసం ప్రయత్నిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో తొలినాళ్ళలో మినహా ఈ రెండు కులాలు ఒకే సమస్య మీద ఒకే బాట పట్టింది లేదు. ఈ రెండు కులాలు 99 శాతం నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి. అటువంటి సంఖ్యాపరంగా బలమైన కులాలు రెండూ ఒకటైతే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం మొదలవుతుంది. ఇపుడున్న పరిస్థితుల్లో ఇది మితవాద అస్తిత్వ రాజకీయాలకు కేంద్రం అవుతుంది.
అటువంటి రెండు కులాలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు రెండూ ఏప్రిల్ 11న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సామాజిక విషయక సర్వే నివేదికను వ్యతిరేకించేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు కుల సంఘాల మధ్య కులగణన నివేదికను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమ నిర్మాణం కోసం చర్చలు జరుగుతున్నాయని ఒక్కలింగ సంఘం అధ్యక్షులు కేంచెప్ప గౌడ తెలిపారు. అంతేకాకుండా “వీరశైవ మహాసభ నాయకత్వంతో ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఉమ్మడిగా ఓ కార్యక్రమం నిర్వహించాలి అనుకుంటున్నాము. ఇంకా తేదీ ఖరారు కాలేదు” అని కెంచెప్ప గౌడ అన్నారు.
వీరశైవ మహాసభ ఉపాధ్యక్షుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఆందోళన, వ్యూహాన్ని రూపోదించే దిశగా చర్చలు జరుగుతున్నాయని ఏకీభావన్ని వ్యక్తం చేశారు. దీంతోపాటు రెండు సంస్థలు తాజాగా ప్రభుత్వం ప్రకటించిన కులగణన నివేదిక ఆధారంగా నిర్ణయాలు చేయవద్దని కొత్తగా సర్వే జరపాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ నెలలోనే కర్నాటక మంత్రిమండలి ఆమోదం పొందిన నివేదికను వ్యతిరేకిస్తూ అగ్రకులాలకు చెందిన సంస్థలు, సంఘాలూ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ సర్వే పదేళ్ల క్రితం జరిగిందనీ అందువలన తాజా వాస్తవాలకు ప్రతినిధిత్వం వహించేది కాదని ఈ సంఘాల వాదన. ఈ నివేదిక ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలోని పలు సామాజిక తరగతులకు సరైన న్యాయం జరగదని మరో వాదన ఉంది.
రాష్ట్ర వెనకబడిన కులాలు తరగతుల కమిషన్ అధ్యక్షుడిగా జయప్రకాష్ హెగ్డే ఈ కులగణన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. అప్పటి నుంచి కర్ణాటకలోని వివిధ సామాజిక తరగతులు, ప్రత్యేకించి అగ్రకులాలకు చెందిన సంస్థలు దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.