
కర్ణాటక ప్రభుత్వం రైతులను మోసం చేయబోతోందా? ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికి దేవనహళ్లిలోని సారవంతమైన వ్యవసాయ భూములను కార్పొరేట్, రియల్ ఎస్టేట్ మాఫియాకు అప్పగించబోతోందా? అది తన పతనాన్ని తానే చూడాలనుకుంటుందా?
దేవనహళ్లి తాలూకాలోని చన్నరాయపట్నం హోబ్లిలో 13 గ్రామాలకు చెందిన 800 కుటుంబాలు తమ పూర్వీకుల భూములలో నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీళ్లు అనేక సంవత్సరాలుగా తమ చెమటను చిందించి, రక్తాన్ని ధారపోసి తమ భూమిలను అభివృద్ధి చేసుకున్నారు. బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఈ గ్రామభూములు ఉండడం వల్ల వీటి విలువ అమాంతం పెరిగింది. కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు(కేఐఏడీబీ) ఇప్పటికే హారలూరు పారిశ్రామిక ప్రాంతం కోసం చుట్టుపక్కల గ్రామాల నుంచి 6,000 ఎకరాలను సేకరించింది. జనవరి 2022లో అప్పటి పాలక బీజేపీ ప్రభుత్వం పైన సూచించిన 13 గ్రామాల నుంచి రైతులను బలవంతంగా తొలగించి, కార్పొరేట్లు- రియల్ ఎస్టేట్ మాఫియాకు విక్రయించడానికి 1777 ఎకరాల భూమిని మరింతగా సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నోటీసు కూడా జారీ చేసింది.
గతంలో జరిగిన భూసేకరణ వల్ల తమ సొంత ఊరి నుంచే కొందరు రైతులు- గ్రామస్తులు బహిష్కరించబడ్డారు. వీళ్లు ఎదుర్కొంటున్న పరిణామాలను, భరించలేని కష్టాలను చూస్తున్న రైతులు మొదటి నుంచీ భూసేకరణ ప్రయత్నాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ ప్రతిఘటన వివిధ రూపాలను దాటి, కేఐఏడీబీ భూసేకరణ నిరోధక పోరాట కమిటీ పేరుతో పోరాటంగా మారింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ అసెంబ్లీలో ఈ భూసేకరణ చర్యను ప్రశ్నించడమే కాక, ఆ పార్టీ నాయకుడు సిద్ధరామయ్య పోరాట స్థలాన్ని సందర్శించారు. తాము అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తన మునుపటి వైఖరికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రైతుల భూములను స్వాధీనం చేసుకోవడానికి బీజేపీ అడుగుజాడలను అనుసరిస్తోంది.
దాదాపు 80% మంది రైతులు భూసేకరణ విషయంలో తమ సమ్మతిని ఇవ్వడానికి నిరాకరించారు. అంతేకాక, 1180 రోజులుగా(సుమారు మూడున్నర సంవత్సరాలు) నిరవధిక పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ భూములను ఎలాగైనా గుంజుకోవాలని చూస్తున్నది. ఈ చర్యలు ఒకప్పుడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన “భూసేకరణ, పునరావాస విధానం- 2013” చట్టానికి తీవ్ర ఉల్లంఘన.
భూసేకరణలో భాగంగా ఇటీవల కర్ణాటక ప్రభుత్వం రైతులకు తుది నోటీసు జారీ చేసింది. ఫలితంగా రైతుల పోరాటం తదుపరి తీవ్రమైన దశలోకి ప్రవేశించింది. ఎస్కేఎంలో భాగమైన సంయుక్త హొరాట కర్ణాటక సమన్వయ కమిటీ(రైతులు, కార్మికులు, దళితులు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాల సమన్వయ కమిటీ) పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా “చలో దేవనహల్లి”కి పిలుపునిచ్చింది.
పెరుగుతున్న ఒత్తిడి వల్ల ప్రభుత్వం పాక్షికంగా వెనక్కి తగ్గి, మూడు గ్రామాల్లోని 495 ఎకరాలను వదిలివేస్తామని ప్రకటించింది. రద్దీ నివాసాలు, నీటిపారుదల కారణాలను చూపుతూ అధికారులు ఆదేశాలిచ్చారు. వాస్తవం ఏమిటంటే, ఈ 495 ఎకరాల భూములను స్వాధీనం చేసుకోవడంపై ఇప్పటికే ఒక కేసు పెండింగ్లో ఉంది. ఎందుకంటే వాటి సేకరణ 1978 నాటి ఎస్సీ- ఎస్టీ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. ఇది మంజూరు చేయబడిన భూముల బదిలీని నిషేధిస్తుంది.
పూర్వపు కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్ అర్స్ కాలంలో ఎస్సీ- ఎస్టీలకు మంజూరు చేయబడిన భూమిని స్వాధీనం చేసుకోవడం సిగ్గుచేటు. దీనివల్ల ముఖం చెల్లక ఆ భూములను మినహాయిస్తున్నారు. కానీ మిగిలిన 1,232 ఎకరాలు ఇప్పటికీ ముప్పులో ఉన్నాయి. నిరసన నాయకుల్లో ఒకరైన నరసింహ అక్కడి ప్రజల భావాలను ప్రతిబింబిస్తూ “ఇది మా ఐక్యతను విభజించడానికి ఒక చీలిక వ్యూహంగా మేము చూస్తున్నాము, మేము ఈ వ్యూహంలో చిక్కుకోము” అన్నారు.
జూన్ 24న జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రభుత్వం తరఫున ఎంబీ పాటిల్, మునియప్ప ఎకరానికి 10,771 చదరపు అడుగులు వాణిజ్య ప్లాట్లను రైతులకు పరిహారంగా ఇస్తామని పత్రికా విలేకరుల సమావేశంలో ప్రకటన ఇవ్వవలసి వచ్చింది. కానీ గ్రామస్తులు ఈ ఎరను కూడా తిరస్కరించారు. “మేము మా పొలాలను కోల్పోయినప్పుడు ప్లాట్లను ఏం చేసుకోవాలి? మా కష్టాలపై దుకాణాలను నిర్మించాలా?” అని 67 ఏళ్ల లచ్చమ్మ ప్రశ్నించింది.
చలో దేవనహళ్లి పిలుపు కర్ణాటక వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. వేలాది మంది కార్యకర్తలు, వివిధ ప్రజా ఉద్యమాల నాయకులు, కళాకారులు, న్యాయవాదులు, రచయితలు జూన్ 25న దేవనహళ్లిలో సమావేశమయ్యారు. వాతావరణం ఉత్సాహంగా, నిరసన చాలా శాంతియుతంగా జరిగింది.
కర్ణాటక రాష్ట్ర రైతు సంస్థ అధ్యక్షుడు బద్గల్పుర నాగేంద్ర మాట్లాడుతూ, “అన్ని పార్టీలు కార్పొరేట్లకు బ్రోకర్లు మాత్రమే. కార్పొరేట్లకు సేవ చేయడమే వారి ఏకైక విధానం. సంపదను సృష్టించే మన రైతులు, కార్మికులు, దళితులను వీధుల్లోకి నెట్టాలని వారు కోరుకుంటున్నారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ, ప్రజలకు సహాయపడే అభివృద్ధిని మేము కోరుకుంటున్నాము. పాలకులు శ్రామిక ప్రజలకు వ్యతిరేకంగా ఒప్పందాలపై సంతకం చేశారు. వారు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. మేము దానిని అనుమతించలేము. చట్టాలు ప్రజలకు, వారి పోరాటాలకు వ్యతిరేకంగా ఉంటే మనం వాటిని ఉల్లంఘించాలి. మాకు న్యాయం కావాలి, మేము గెలుస్తాము.”
కొనసాగుతున్న పోరాటానికి అదనపు బలాన్నిచ్చిన ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. “ఎన్నికలలో రాజకీయ నాయకులుగా మీ అంతట మీరు గెలవలేదు. ప్రజలు మిమ్మలని గెలిపించారు. మీరు పాలించడానికి రాలేదు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వచ్చారు. మీరు మాట ఇచ్చారు, ఔనా- కాదా? మీరు మీ మాట మీద నిలబడతారా లేదా? మీరు మీ మాటను తప్పుతారా? మా రైతులకు మీరు ఏమి చేయాలని అనుకుంటున్నారు? వారిని ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డులుగా మార్చుతారా?” అని సిద్ధరామయ్యను అడిగారు.
“దయచేసి మీ చెవులతో, మనస్సాక్షితో స్పందించండి. మాకు మా భూమి, మా హక్కులు, మా జీవితాలు కావాలి” అని ఆయన అన్నారు.
సంయుక్త హొరాట- కర్ణాటక జనశక్తి అధ్యక్షుడు, సమన్వయకర్త నూర్ శ్రీధర్ మాట్లాడుతూ, “ఎంబీ పాటిల్ ఈ భూమి వెనుక ఎందుకు ఉన్నారు. కర్ణాటకలోని మరే ఇతర బంజరు జిల్లాలో పరిశ్రమలను నిర్మించడానికి సిద్ధంగా లేరు. దేవనహళ్లి భూములపై మాత్రమే ఎందుకు కన్నేశారు? ఎందుకంటే ఇది అమూల్యమైన వజ్రం లాంటి భూమి కాబట్టి. ఈ నైతిక, రాజకీయ ప్రశ్నను సిద్ధరామయ్య ముందే కాదు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ముందు కూడా అడుగుతాను. వారు సమాధానం చెప్పనివ్వండి. 2013లో వారి స్వంత విధానం తప్పని చెప్పనివ్వండి. అది అమలు చేయడానికి సాధ్యం కాదని చెప్పనివ్వండి. వాస్తవానికి ఈ విధానం భూములను దోచుకోవడానికి, ధనవంతులను మరింత ధనవంతులుగా మార్చడానికి, శ్రామిక ప్రజలను ఉద్యోగాల కోసం అడుక్కునే పేదలుగా మార్చడానికి మాత్రమే పనికి వస్తుంది. మా ఈ పోరాటం ఆగదు.”
ఇంకా చెప్తూ, “బాధిత ప్రజలకు తెలుసు. ఈ కార్పొరేట్ అభివృద్ధి నమూనా ఏదైనా రైతులు, ఆదివాసీలు లేదా మురికివాడ నివాసితులను స్థానభ్రంశానికి గురిచేస్తుంది. తమను విధ్వంసానికి గురి చేసి పేదరికం పాలు చేస్తుందని వారికి తెలుసు. దీని అర్థమేంటంటే, స్థానిక ప్రజలు తమ మూలాల నుంచి గెంటివేయబడతారు. వారి ప్రాథమిక సంస్కృతి దెబ్బతింటుంది. అంతేకాకుండా, పర్యావరణ సమతుల్యత శాశ్వతంగా విధ్వంసమవుతుంది. మేము ఈ భూమిపై ఆధారపడి జీవిస్తున్నాము. మాలో చాలా మంది జీవనోపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడతారు. మా పూర్వీకుల సమాధులు ఈ భూములపై ఉన్నాయి. మేము మా జీవితాంతం సంపాదించిన డబ్బును ఇక్కడ నీటిపారుదల అభివృద్ధి చేయడానికి, పండ్ల తోటలను పండించడానికి పెట్టుబడి పెట్టాము. మేము పాడి పెంపకం, కోళ్ల పెంపకంలాంటి వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నాము. మా కుటుంబాలు, బంధువులతో కలిసి జీవించాలనుకుంటున్నాము. ఏదిఏమైనా కానీ, ఈ జీవితాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము.”
కర్ణాటక ప్రభుత్వం పంపిన తుది నోటీసును ఆందోళనకారులు తగలబెట్టారు. బదులుగా ఉద్యమం తరఫున ప్రభుత్వానికి తుది నోటీసు జారీ చేశారు. “ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించాలి, మమ్మల్ని బ్రతకనివ్వాలి. లేదా, మేము పోరాటాన్ని తీవ్రతరం చేస్తాము. అంతేకాకుండా మీరు మీ ప్రణాళికలతో ముందుకు సాగాలనుకుంటే, ముందుగా మా 800 కుటుంబాలన్నింటినీ జైలులో పెట్టాల్సి ఉంటుంది” అని స్పష్టంగా నోటీసులో పేర్కొన్నారు.
“ప్రభుత్వం 24 గంటల్లో స్పందించకపోతే, మేము తాలూకా కార్యాలయానికి తాళం వేస్తాము” అని ప్రభుత్వానికి గడువు ఇవ్వబడింది. దేవనహళ్లి రైతుల నిరసనను మొదటి నుంచి ఎక్కువమంది పోలీసు బలగాలను ఉపయోగించి అణచివేయడానికి మాత్రమే ప్రభుత్వం ప్రయత్నించింది. సాయంత్రానికి నిరసనకారులను అనాగరికంగా రోడ్డు మీద ఈడ్చుకుని పోయి అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రజలందరినీ ఆగ్రహానికి గురిచేసింది.
జూన్ 26న కర్ణాటకలోని అనేక జిల్లాలు, తాలూకాల్లో పోలీసుల క్రూరమైన ప్రవర్తనను ఖండిస్తూ డీసీపీ సచిన్ కుమార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు జరిగాయి. బెంగళూరులో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ నాయకత్వంలో కళాకారులు, రచయితలు, ప్రగతిశీల సమాజం ముఖ్యమంత్రి నివాసానికి నిరసన ప్రదర్శన కూడా నిర్వహించింది. వారం రోజుల్లో ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా జూలై 4న ప్రజాసంఘాలతో సమావేశం జరగాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ, సానుకూల పరిష్కారం అంత తేలిక కాదని సంయుక్త హొరాట కమిటీ అభిప్రాయపదాటింది. కాంగ్రెస్ పెద్ద నాయకుల్లో ఒకరైన, భారీ పరిశ్రమల మంత్రి పాటిల్, ఏఐసీసీలో చాలా ప్రభావవంతమైన వ్యక్తి. ఆయన భూసేకరణ చేసి తీరవలసిందేనని మొండిగా ఉన్నాడు. కాబట్టి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తను కోరుకున్నప్పటికీ తన మంత్రివర్గాన్ని ఒప్పించగలరా అనేది, ఆర్థిక వ్యవస్థ- రాజకీయాలపై కార్పొరేట్ పట్టును దృష్టిలో ఉంచుకుని చూస్తే, పెద్ద ప్రశ్నగా కనబడుతున్నది.
కానీ సంయుక్త హొరాట కమిటీ కూడా ఎటువంటి అడ్డంకినైనా ధైర్యంగా ఎదుర్కొని, పోరాటాన్ని కొనసాగించాలని దృఢ సంకల్పంతో ఉంది. దేవనహళ్లి రైతు సంఘం దానిని వదులుకునే ప్రశ్నే లేదని ప్రతిజ్ఞ చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్నట్లుగా కార్పొరేట్లకు అనుకూలంగా భూకబ్జాల భారంతో కర్ణాటక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇది పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతం లాంటిది. భూమిని, ఆశ్రయాన్ని కోల్పోయిన వారి కోసం కమిటీ నిర్వహించిన భూమిలేని, సన్నకారు రైతులు ఇప్పటికే దశాబ్ద కాలంగా కొనసాగుతున్న అనేక రౌండ్ల సుదీర్ఘ, తీవ్రమైన పోరాటాలను చూశారు. పాక్షిక విజయాలు సాధించినప్పటికీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
కర్ణాటక ప్రజలు ఈ పోరాటంలో తార్కిక ముగింపు వరకు పోరాడాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇది ఒక భారీ ప్రజా ఉద్యమంగా, ఒక ప్రధాన రాజకీయ సమస్యగా కూడా మారనుంది. ఈ సందర్భంలో, ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకుని ఈ కీలక సమయంలో తమ పార్టీ మరో తీవ్రమైన రాజకీయ తప్పిదానికి పాల్పడకుండా చూసుకోవాలని సంయుక్త హొరాట కమిటీ సభ్యులు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వాన్ని కోరారు. లేకుంటే అది తన పతనానికి తానే మార్గాన్ని సుగమం చేసుకుంటుంది. పెద్ద కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న బాధిత 13 గ్రామాల రైతుల పోరాట స్ఫూర్తి ప్రశంసనీయం. రైతులతో దృఢంగా నిలబడి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సంయుక్త హొరాట కమిటీ ప్రస్తుత ప్రధాన పాత్ర ప్రశంసనీయం. పోరాడటం మన హక్కు, ఈ ప్రశంసనీయ ప్రజా ఉద్యమానికి అవసరమైన మద్దతును అందించడం మన బాధ్యత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.