
పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత దేశంలో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం చిల్లర పనులకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోనికి వస్తున్నాయి.
తాజాగా హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ వద్ద ఉన్న కరాచి బేకరీ లోనికి బిజెపి కార్యకర్తలు చొరబడి, 1953 నుండి నడుస్తున్న దాని పేరు మార్చేయాలని గొడవ పెట్టారు. దుకాణం లోని సామాన్లను చిల్లర మిల్లర చేసారు. దేశ విభజన సమయంలో ఇక్కడ స్థిరపడిన వారి తాతలు పెట్టిన దుకాణం ఇదని దాని యజమానులు తెలిపారు.
కొద్ది రోజుల ముందే విశాఖపట్నంలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. విశాఖపట్నంలో ‘కరాచీవాలా స్టోర్స్’ అని ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంది. ఆ దుకాణం విశాఖపట్నంaలో ఏనాటి నుండో ఉంది. ఆ దుకాణం వద్దకు కొంతమంది వచ్చి ఆ కరాచీవాలా అనే పేరు ఉండడానికి వీలులేదని దానిమీద కాగితాలు అంటించిపోయారు. ఇంతకీ విషయం ఏంటంటే కరాచీ అన్నది పాకిస్తాన్ దేశంలోని ఓ ప్రధాన నగరం. అక్కడ నుండి దేశ విభజన సమయంలో ఎప్పుడో మన దేశానికి వచ్చిన Nihalchand Chaturani అనే ఆయన వారి ప్రాంతం పేరుతో పెట్టుకున్న దుకాణం ఇది. అది అపర దేశభక్తులకు ఆగ్రహం కలిగించి ఇలాంటి చర్యకు పాల్పడ్డారు. ఈ స్టోర్స్ విశాఖపట్నంలోనే మంచి ప్రాముఖ్యత కలిగినది. అటువంటి దుకాణంపై ఈ రకమైన దాడికి పాల్పడడం పచ్చి చిల్లర పని తప్ప మరొకటి కాదు. దీనితో కొంతమంది చివాట్లు పెట్టడంతో బిజెపి నాయకులు ఉలిక్కిపడి దుకాణం వద్దకు వచ్చి, తమకు అలాంటి ఉద్దేశం లేదని తెలిపి, అంటించిన కాగితాలను తీసి వెళ్ళవలసి వచ్చింది.
అంతకుముందే కర్ణాటకలో బురఖాలు వేసుకుని ముస్లిం మహిళల వేషాలు వేసి, పాకిస్తాన్ జండాలు పట్టుకుని తిరుగుతున్న కొంతమంది వ్యక్తులను పోలీసులకు అనుమానం వచ్చి అడ్డుకున్నారు. బురఖాలు తొలగించి చూస్తే, తీరా వారు ఆడవారు కాదు మగవారు. వారంతా ఈ గ్యాంగ్ కు చెందిన కార్యకర్తలే. పోలీసులు వారి అరెస్ట్ చేసి కేసు పెట్టవలసి వచ్చింది.
పాకిస్థాన్ జెండాలతో ఉద్రిక్తతలు సృష్టించే అనేక ఘటనలు ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి వివిధ రాష్ట్రాలలో చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఈ చిల్లర మూకల పనే.
ఇలాంటి చిల్లర పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాద దాడుల తర్వాత దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుతున్న కాశ్మీర్ విద్యార్థులపై దాడులు చేయడం, వారిని కాశ్మీర్ తిరిగి వెళ్లిపోవాలని బెదిరించడం వంటివి ఇలాంటి చిల్లర మనుషులు మాత్రమే చేయగలిగిన పనులు.
దేశం ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో కాశ్మీర్ ప్రజలు ఎంతో ఉన్నతమైన సంస్కారంతో దాడి ప్రదేశం నుంచి పర్యాటకులను సురక్షితంగా కాపాడారు. దాడిని కాశ్మీర్ ప్రజలు నిర్విద్ధంగా తిరస్కరించారు. మరునాడే స్వచ్ఛందంగా బంద్ కూడా పాటించారు. అటువంటి దేశభక్తి, సభ్యత, సంస్కారం ఉన్న వారిపై ఇటువంటి దాడులు చేయడం ఇసుమంత దేశభక్తి ఉన్నవాళ్లు కూడా చేయరు.
విచిత్రం ఏమిటంటే ఇటువంటి చిల్లర పనులను నిరోధించి, దేశ ప్రజల ఐక్యతను కాపాడవలసిన కేంద్ర పెద్దలు ఆ పని చేయకపోగా చూసీ చూడనట్లు ఊరుకోవడం ఇందులో భాగస్వాములు అవడం తప్ప మరొకటి కాదు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఒక పథకం ప్రకారం పై నుండి ఆశీస్సులతోను, ఆదేశాలతోనే జరుగుతున్నాయా అనే అనుమానం కలగక మానదు.
కానీ విచిత్రంగా ఈ ముష్కరులు దేశభక్తి ముసుగు వేసుకుని, దేశానికి ద్రోహం చేసే చర్యలకు పాల్పడుతున్నారు. విద్వేషాలు రాజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికలపై కూడా ఉగ్రవాద బాధిత మహిళలపై కూడా దుర్భాషలాడుతూ అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు.
ఏ చిన్న అవకాశం దొరికినా ప్రజల మధ్య చీలికలు తెచ్చి, మత రాజకీయాలు చేయడమే వీరికి తెలుసు. దేశం, ప్రజలు నేడు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, ధరలు, మహిళలపై అత్యాచారాలు, పంటలకు గిట్టుబాటు ధర, కార్మికులకు కనీస వేతనాలు, కార్మిక హక్కుల హరింపు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ, దళితులపై దాడికి, గిరిజన భూముల అన్యాక్రాంతం, తీవ్ర ఆర్థిక అసమానతలు వంటి సమస్యలేమీ వీరికి పట్టవు. దీనికి భిన్నంగా వీరి పాలనతో సంభవించిన ఈ దుష్ప్రభావాల నుండి ప్రజల చూపు మరల్చి, ఓట్లు దండుకోవడమే వీరి కుతంత్రం. దేశంలో ఇంత దిగజారుడు, చిల్లర చర్యలకు పాల్పడే వారు వీరు తప్ప మరెవరూ కనపడరనడంలో సందేహం లేదు.
అబద్ధాలు ప్రచారం చేయడం, వాటిని నిజాలుగా నమ్మేలా గోబెల్స్ తరహా వ్యూహం పన్నడం, ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు నమ్మించడంలో వీరు దిట్టలు.
ఇటువంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే దేశానికి, ప్రజల ఐక్యతకు పెద్ద నష్టమే జరుగుతుంది.
— ఎ. అజ శర్మ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.