![The Indian Space Research Organisation (ISRO) launched its historic 100th launch](https://thewiretelugu.in/wp-content/uploads/2025/01/The-Indian-Space-Research-Organisation-ISRO-launched-its-historic-100th-launch-1024x576.jpg)
A proud mile stone for India’s Space Journey అంటూ ఇస్రో సోషల్ మీడియా ద్వారా తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ తో సెంచరీ కొట్టేశాం స్పేస్ మైదానంలో మనమంతా కలిసి…!తన సెంచరీలతో సెంచరీ కొట్టి ప్రపంచానికి క్రికెట్ అను మానవత్వపు మతాన్ని కానుకగా ఇచ్చిన భారతరత్న సచిన్ పుట్టిన గడ్డ సాక్షిగా నాదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సాంకేతిక ఉద్యమం చేస్తుంది విను వీధుల్లో.మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో విజయాల పంటను పండిస్తుంది..!
విఫలమైనా ప్రతీసారి…
ఆకలి చావులు ఆపలేని దేశానికి అంతరిక్ష ప్రయోగాలు అవసరమా?అంటూ దశాబ్దాలుగా ఎగతాళి చేస్తూనే వున్నారు..!
పేదరికం, నిరక్షరాస్యత,నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యలను స్వాతంత్ర్య భారతం నుంచి తరిమేయ్యలేని వారికి జాబిల్లిపై విక్రమ్ జాడ అవసరమా?అంటూ వెనక్కి లాగుతూనే వున్నారు..?
అయినా…బాధను దిగమింగి బాధ్యతగా ఫనిచేస్తూ..విఖ్యాత భారతీయ శాస్త్రవేత్తలు విక్రమ్ సారాభాయ్,హోం జహాంగీర్ బాబా, అబ్దుల్ కలాం వంటి ఎంతోమంది మహానుభావుల స్ఫూర్తితో శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనం అగ్రరాజ్యాలకు దీటుగా ఎదిగితేనే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారగలం అని నమ్మి ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు,తదితర సిబ్బంది అహార్నిశలు గెలుపోటములకు అతీతంగా ప్రయోగాల యుద్ధంచేస్తూనే వున్నారు.. మనదేశాన్ని గెలిపించడానికి..!
ఇప్పుడు ఇండియాకే కాదు..
యావత్ ప్రపంచానికి పాఠం చెబుతుంది ఇస్రో…!
“ఆగని ప్రయత్నాల పరంపరే అంతరిక్షపు హద్దులను చెరిపేస్తుందని..!
అలుపెరగని కఠోర శ్రమతో కూడిన ఆత్మవిశ్వాసపు శోభకు అనంత విశ్వం తలోంచుతుందని..!!”
స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ మరియు ఎన్ వీ యస్-02 ప్రయోగాల ఘన
విజయాలతో ఇస్రో అగ్రరాజ్యాలకు దీటుగా మనసత్తాను చాటింది.భవిష్యత్లో స్పేస్ స్టేషన్, చంద్రయాన్-4, శుక్రయాన్,గగనయాన్
తదితర ప్రాజెక్టుల విజయానికి నాంది పలికింది.
డిసెంబర్ 30,2024 న చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం దిశల వారిగా మన శాస్త్రవేత్తలు విజయవంతం చేశారు.కీలకమైన ఎస్ డీ ఎక్స్ 01(ఛేజర్) మరియు ఎస్ డీ ఎక్స్ 02(టార్గెట్) ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం చేసే దశను మనం దాటేశాం.ఈ డాకింగ్ ప్రక్రియ కోసం సెన్సర్ల సాయంతో మూడుసార్లు ప్రయత్నించి, పరిస్థితులు అనుకూలించక చివర్లో విరమించుకోవాల్సి వచ్చింది.వృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఉపగ్రహాలను వాటి వేగాన్ని నియంత్రిస్తూ, బాగా తగ్గించి, చివరికి 3 మీటర్ల దూరం వచ్చాక చాలా జాగ్రత్తగా డాకింగ్ ప్రక్రియ చేసి ఒకే యూనిట్ గా మార్చడం చాలా చాలా కష్టం.అయినా మన శాస్త్రవేత్తలు తొలి ప్రయోగంతోనే దాన్ని సాధించి
నవ చరిత్ర సృష్టించారు.ఇప్పుడు
అనుసంధానమైన శాటిలైట్ ల మధ్య విద్యుత్ ప్రసారం చేసి స్పేస్ లో ఉపగ్రహాల మధ్య సర్వీసింగ్ ను పరిశీలిస్తారు.ప్రయోగాలు పూర్తయ్యాక అన్ డాకింగ్ ప్రక్రియను కొనసాగిస్తారు.ఈ రెండు ఉపగ్రహాలు రెండు సంవత్సరాల పాటు మనకు సేవలు అందించనున్నాయి.ఈ అసాధారణ విజయంతో మన అంతరిక్ష ప్రయోగాల జోరు ప్రపంచ పత్రికల్లో ప్రముఖ వార్త అయ్యింది.ఇదే సందర్భంలో మన కేంద్ర ప్రభుత్వం 3,984 కోట్లతో శ్రీహరికోట లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మించాలని తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం.ఇప్పటికే విదేశీ ఉపగ్రహాలను రోదసీ లోకి విజయవంతంగా ప్రవేశ పెడుతూ అంతరిక్ష వ్యాపారంలో దూసుకుపోతున్న మనం త్వరలోనే ఇంకా మెరుగైన ప్రయోగ ఫలితాలతో దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఇస్రో వుంటుందని మనం గట్టిగా చెప్పవచ్చు.
జనవరి 29,2025న శ్రీహరికోటలోని షార్ నుంచి జీ ఎస్ ఎల్ వీ-ఎఫ్ 15 వాహక నౌక ద్వారా చేసిన ఇస్రో వందో ప్రయోగం విజయవంతం కావడంతో మరో మైలురాయి దాటినట్టైంది.2250 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహా వ్యవస్థ.వ్యవసాయంలో సాంకేతికత,విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లోకేషన్ వంటి వాటిలో పది సంవత్సరాలు ఈ వ్యవస్థ మనకు సేవలు అందిస్తుంది.మనదేశం సరిహద్దుల ఆవల 1500కిమీ పరిధి వరకు ఇది పనిచేస్తుంది.
1962 లో INCOSPAR గా ఆరంభమై 1969 లో ఇస్రో గా రూపాంతరం చెంది 1975 ఏప్రిల్ 19న ఆర్యభట్టగా స్పేస్ యుద్ధంలో అడుగేశాం.నేడు 548 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాం.రాబోయే ఐదేళ్ళలో రెండు వందల ప్రయోగాల మార్కును అందుకుంటామని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ చేసిన ప్రకటనతో మన టార్గెట్ ను నిర్దేశించుకున్నాం.
ఎక్కడ మొదలుపెట్టాం మనం…!
సైకిల్ పై, ఎద్దుల బండ్లపై రాకెట్ల విడిభాగాలను మోసుకెళ్ళిన స్థాయి నుంచి…
ఒకే ప్రయోగంతో వంద ఉపగ్రహాలకు పైగా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించాం..!
అంగారక గ్రహాంపై జీవరాశి మనుగడను శోధిస్తున్నాం.తొలి ప్రయత్నంలో నిలబడలేని విక్రమ్ ల్యాండర్ అపజయంపై నాలుగు సంవత్సరాలు పెద్ద సంగ్రామమే చేసి పొగొట్టుకున్ళచోటే నిలబడి చంద్రుని ఉపరితలంపై విక్రమ్ సాక్షిగా”India,I reached my destination and you too!అంటూ ప్రజ్ఞాన్ రోవర్ తో చరిత్రను అడుగులు వేయించాం.శుక్రయాన్ కు సిద్ధమవుతున్నాం.అంతరిక్ష వ్యవసాయం కోసం అన్వేషిస్తున్నాం.మానవ సహిత రోదసీ యాత్రల కోసం ఉత్సాహంగా బయలుదేరుతున్నాం.
సూర్యుని ఉపరితలం శోధనలో మన పరిజ్ఞానపు పరిధిని పెంచుకుంటున్నాం.
కేవలం పాన్ ఇండియా స్థాయి సినిమాల బడ్జెట్ తో మన మేధో అంతరిక్ష సినిమాలను ప్రపంచానికి చూపిస్తూ “ఇస్రో అంటే వేరే లెవెల్” అనిపించుకుంటున్నాం.మన జాతీయ జెండా ను సగర్వంగా అగ్ర రాజ్యాలకు దీటుగా స్ఫూర్తివంతంగా నిలుపుతున్నాం..!
ఎలా మొదలుపెట్టాం అని కాదు…!ఎంతలా ఎదిగాం అనేదే నేటి “మ్యాటర్”.అదే భావి భారత తరాలకు న్యూ చాప్టర్.గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు అన్నట్లు..మన ఇస్రో ప్రయాణం మరియు ప్రకాశం విశ్వ రహస్యాల శోధనలో నిరంతరాయంగా విజయవంతంగా కొనసాగాలని ఆశిస్తూ…
Congratulations to@isro on the historic 100th launch !
This incredible milestone illustrates the vision,dedication and commitment of our scientists and engineers.
అంటున్న మన ప్రధాని సందేశం సమక్షంలో….
ఇస్రో కు సెల్యూట్ చేస్తూ…
నమస్కారం.
ఫిజిక్స్ అరుణ్ కుమార్
ప్రయివేటు టీచింగ్ ఫ్యాకల్టీ