
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పనులు మళ్లీ ప్రారంభమ్యాయి. ఇప్పటికే పలు నిర్మాణ పనులకు సంబంధించిన పనుల కోసం టెండర్స్ పిలిచిన ప్రభుత్వం, ప్రముఖ కంపెనీలకు ఆ పనులను కూడ అప్పగించింది. అయితే, ప్రస్తుతం ఈ అంశాలే వివాదస్పదమవుతున్నాయి.
తాజాగా రాజధాని ప్రాంతంలో 220KV ఎక్స్ట్రా హైవోల్టేజ్ లైన్లలకు సంబంధించిన పనులను బీఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు రూ 1,082.44 కోట్లకు కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం అప్పగించింది. అయితే ఈ సంస్థ ప్రాజెక్టును అంచనా ఒప్పంద విలువపై 8.98% అధిక ధరను కేటాయించడం ఇప్పుడు వివాస్పందమవుతుంది. ఇది జీవో నెం 133కు విరుద్దంగా ఈ కేటాయింపులు జరిగాయనే విమర్శలు వస్తోన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవలే షాపూర్జీ పల్లోంజీ అండ్ కో లిమిటెడ్(ఎస్పీసీపీఎల్) అమరావతిలో భారీ మౌలిక వసతుల నిర్మాణ బాధ్యతలను అప్పగించారు.
ఇప్పటికే ఈ కంపెనీతో సహా చంద్రబాబుపై 118 కోట్ల రూపాయిల అవినితి ఆరోపణాలకు సంబంధించిన కేసు దర్యాప్తులో ఉంది. దీంతో పాటు ఎస్పీసీపీఎల్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన తరువాత అన్‌బ్లాక్ చేసింది. ఈ రెండు పరిణామాలు రాష్ట్రంలోని కీలక మౌలిక ప్రాజెక్టుల అమలులో పారదర్శకత, రాజకీయ పక్షపాతం పట్ల తీవ్రమైన ప్రశ్నలను కలిగిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్దంగా బీఎస్ఆర్కు ప్రాజెక్ట్‌లు..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలోని నోడ్ 10 నుంచి నోడ్ 13 వరకు 220KVఎక్స్ట్రా హైవోల్టేజ్ లైన్లను, అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా నిర్మాణంచడానకి రూ1,082.44 కోట్ల విలువైన ఒప్పందాన్ని బీఎస్ఆర్ ఇన్‌ఫ్రాటెక్‌కు 8.98% అధిక ధరకు ప్రభుత్వం అప్పగించింది. ఇది 2004లో విడుదల చేసిన జీఓఎంఎస్ నం 133లో పేర్కొన్న 5% పరిమితికనే నిబంధనకు విరుద్దం. దీంతోపాటు మరో కంపెనీ ఎం/ఎస్. పీవీఆర్ కన్స్ట్రక్షన్స్, ఎం/ఎస్. కే రామచంద్ర రావు ట్రాన్స్మిషన్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌కు 400KV లైన్ రీ- రూటింగ్ 8.99% ఎక్స్‌సెస్ బిడ్డింగ్‌తో ప్రభుత్వం కేటాయించింది.
“సీఆర్డీఏ ఆ బిడ్లను ఆమోదించలేదు. మేము కేవలం ఈ ప్రాజెక్ట్స్‌కు అవసరమైన నిధులను మాత్రమే మంజూరు చేస్తాం. అధిక ధర బిడ్లు ఏపీట్రాన్స్కో ఆమోదించింది. మేము అధిక ధర గమనించిన వెంటనే వివరణ కోరాము. ఏపీట్రాన్స్కో తమకు ఆ నిర్ణయం తీసుకునే హక్కు ఉందని చెప్పారు. మేము ఇదే విషయాన్ని కేబినెట్‌కు పంపించాము, కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంది” అని ది వైర్ తెలుగుతో సీఆర్డీఏ కమిషనర్ కన్న బాబు తెలిపారు.
ఒకే సంస్థకు 18 కాంట్రాక్ట్‌లు..
అధికారిక రికార్డులు- సీఆర్డీఏ అంతర్గత అంచనాల ప్రకారం, బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ 2025 మార్చి నుంచి జూలై మధ్యలో అమరావతి రాజధాని ప్రాంతంలో దాదాపు 18 ప్రాజెక్ట్స్‌ను కేటాయించింది. ప్రభుత్వం. వీటి విలువ దాదాపు రూ 5,400 కోట్లు. ఈ కేటాయింపులన్నీ జీఓఆర్టీ నం 201, 202(2025 మార్చి 19) ద్వారా మంజూరయ్యాయి. ఇవి ప్రధాన రహదారులు(E4, E5, E7, E12, E15, N1, N2, N18), వరల్డ్ బ్యాంక్, ఏడీబీ మద్దతుతో లేఅవుట్ అభివృద్ధి, మంత్రులు న్యాయమూర్తుల కోసం హైఎండ్ బంగళాల నిర్మాణాలకు సంబంధించిన పనులు ఉన్నాయి. ఈ 18 కేటాయింపుల్లో 16 కేటాయింపులు అంచనా ఒప్పంద విలువ(ఈసీవీ)పై 3.18% నుంచి 4.41% శాతం ఎక్స్‌సెస్ బిడ్డింగ్‌తో కేటాయించారు. ఇవిన్నీ జీఓఎంఎస్ నం 133లో పేర్కొన్న 5% పరిమితిలోపలే ఉన్నాయి. కానీ రెండు ఒప్పందాలు ఈ పరిమితిని మించి ఉన్నాయి. రూ 1,082.44 కోట్ల విలువైన ఈహెచ్‌వీ అండర్‌గ్రౌండ్ కేబులింగ్ ప్రాజెక్ట్(జీఓఆర్టీ నం 197 ప్రకారం) 8.98% అధిక ధరతో మంజూరైంది. బీఎస్ఆర్కు మాత్రమే ఎందుకు ఇన్ని ప్రాజెక్ట్స్ కేటాయించారని సీఆర్డీఏ కమిషనర్‌ను ‘ది వైర్’ అడిగినప్పుడు, సీఆర్డీఏ కమిషనర్ స్పందిస్తూ “మేము అన్ని నియమాల ప్రకారమే కేటాయింపులు చేశామ”ని సమాధానం ఇచ్చారు.
బీఎస్ఆర్ ఎవరికి చెందిన సంస్థ ?
బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్, బలుసు శ్రీనివాసరావు అనే వ్యాపారవేత్త- కాంట్రాక్టర్‌కు చెందిన సంస్థ. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో గత కొన్ని సంవత్సరాలుగా మంచి రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నారు. బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అధికారికంగా కార్యలయం బెంగళూరులో ఉంది. అయిన్నప్పటికి, కంపెనీ కార్యకలాపాలు ఏపీలోనే అధికంగా ఉన్నాయి.

పలు పబ్లిక్ ఈవెంట్స్, సీఎస్ఆర్ కార్యకలాపాల ఫొటోలు- చంద్రబాబు, బలుసు శ్రీనివాసరావు మధ్య సాన్నిహిత్యాన్ని సూచించే పలు ఫొటోలను ది వైర్ యాక్సస్ చేసింది. ముఖ్యంగా, చంద్రబాబు బీఎస్ఆర్ నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఫొటోలు సంస్థ అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ ఉన్నాయి. బీఎస్ఆర్ 2014 ఎన్నికల సమయంలో టీడీపీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళంగా డబ్బులు ఇచ్చిన కంపెనీల్లో ఒకటిగా ఉంది.

అధికారిక రికార్డులు ప్రకారం , 851, బ్లాక్, 15వ క్రాస్ శంకర్‌నగర్, బెంగళూరు నుంచి రూ 49,99,944ను ఆర్టీజీఎస్/ఎన్ఈఎఫ్టీ ద్వారా 2014 మార్చి 30న బాండ్లను బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా లిమిటెడ్ పంపింది. ఈ లావాదేవీని రాజకీయ విరాళంగా సంస్థ స్పష్టీకరించింది. అయితే 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సంస్థకు భారీ ప్రాజెక్ట్‌లు కట్టబెట్టారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ చంద్రబాబు కొనసాగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మళ్లీ తెరపైకి 118 కోట్ల కిక్ బ్యాగ్స్ వివాదం..
బీఎస్ఆర్ తరహాలోనే ఇటీవల ఎస్పీసీపీఎల్ అనే సంస్థకు కేటాయించిన రూ 900 కోట్ల విలువైన అమరావతి మౌలిక వసతుల నిర్మాణ పనులకు సంబంధించిన వ్యవహారం కూడా ఇప్పుడు వివాదస్పందమవుతోంది. చంద్రబాబు నాయుడు తన హయాం(2014– 2019)మౌలిక వసతుల ప్రాజెక్టుల కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని దాదాపు రూ 118 కోట్ల మేర కిక్ బ్యాగ్స్ స్వీకరించారనే ఆరోపణలపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకే, అందులోను చంద్రబాబు కూడా విచారణనను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మళ్లీ ఈ సంస్థకు వేల కోట్ల ప్రాజెక్ట్‌లు కట్టబెట్టడంపై పలు విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ హయాంలో ఎస్పీసీపీఎల్ అమరావతిలో మూడు పెద్ద నిర్మాణ పనులను అప్పగించారు. అందులో ఆంధ్రప్రదేశ్ సచివాలయం భవనం రూ 2,890 కోట్లు, శాసన సభ మండలి సముదాయం రూ1,010 కోట్లు, హైకోర్టు సముదాయం రూ 1,300 కోట్లు. ఈ కేసులో ఆదాయపన్ను శాఖ 2023 ఆగస్టు 4న చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ కేసుపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఇలాంటి ఆరోపణాలు ఎదుర్కొంటున్న సంస్థకు మళ్లీ దాదాపు 1000 కోట్ల పనులు కేటాయించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్పీసీపీఎల్ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి, తొలగించిన ఏఏఐ..
ఎస్పీసీపీఎల్ను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అంశం కూడా ఇప్పుడు ఈ వివాదానికి మరింత అగ్గిని రాజేస్తోంది. ఏఏఐ నార్త్ డివిజన్ లేహ్ ఎయిర్పోర్ట్ అధికారుల సమాచారం ప్రకారం, ఎస్పీసీపీఎల్నును 2024 ఆగస్టు 22న బ్లాక్‌లిస్ట్ చేశారు. ఇది 2026 ఆగస్టు 21వరకూ అమల్లో ఉంది. అయినప్పటికీ, ఎస్పీసీపీఎల్ను ఈ బ్లాక్ లిస్ట్ జాబితా నుంచి రాజకీయ ఒత్తిడితో తొలగించినట్టు సమాచారం.
ఇది జరిగిన కొద్ది నెలల తరువాత ఎస్పీసీపీఎల్ అమరావతిలో రూ 514.41 కోట్ల విలువైన నివాస సముదాయ నిర్మాణ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో నెలపాడు సమీపంలో 1,440 అపార్ట్మెంట్ యూనిట్లు, 14 టవర్స్‌తో కూడిన నిర్మాణం, వీధి దీపాలు, డ్రైనేజ్ వ్యవస్థ, హెచ్‌వీఏసీ, భద్రతా వ్యవస్థలు మొదలైన అంశాల కోసం అదనంగా రూ 420 కోట్ల మౌలిక వ్యయాన్ని ఖర్చు చేయనున్నారు.
ఈ అంశంపై ది వైర్‌తో సీఆర్డీఏ కమిషనర్ కన్నా బాబు మాట్లాడారు. “ఐకానిక్ టవర్లను నిర్మించగలిగే సంస్థలు రెండు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఎల్&టీ మరోకటి ఎస్పీసీపీఎల్. ఎస్పీసీపీఎల్పై ఏఏఐ బ్లాక్‌లిస్ట్ ఉన్న సంగతి మాకు తెలుసు. కానీ ఏఏఐ వారు అధికారికంగా ఆ బ్లాక్‌లిస్ట్‌ను తొలగించారు. టెండర్‌కు ముందు ఇదంతా చర్చించాం. మాకు అది సమస్యగా అనిపించలేదు” అన్నారు.
అమరావతి రాజధాని నిర్మాణమనేది రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలతో ముడిపడి ఉంది. ఇలాంటి కీలక ప్రాజెక్టుల్లో వివాదాలు, అవినీతి ఆరోపణలు చోటు చేసుకోవడం ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తుంది. ఈ వ్యవహారాలపై పూర్తిస్థాయి, నిష్పక్షపాతంగా ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
జీవోలకు విరుద్ధంగా టెండర్ల కేటాయింపులు, బ్లాక్లిస్టయిన కంపెనీలకు మళ్లీ పనులు అప్పగించడం వంటి అంశాలు ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండానే, అదే పంథాలో ముందుకు వెళ్లడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందానే చర్చకు దారితీస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.