
రెండవ భాగం
సమకాలీన ప్రపంచీకరణ సారమైన ద్రవ్య పెట్టుబడి పెరుగుదల, ద్రవ్య పెట్టుబడిగా సరిహద్దులు దాటే పెట్టుబడి కదలికలకు జాతీయ అడ్డంకులను విచ్ఛిన్నం చెయ్యడంలో దాని విజయం. అట్లాంటిక్‌కు రెండువైపులా ఉన్న శ్రామిక ప్రజల హక్కులపై క్రూరమైన దాడి చేయడం ద్వారా, తూర్పు యూరపులోని సోషలిస్టు దేశాలనూ, సోవియట్ రష్యాను అణగద్రొక్కడానికి ఒక క్రమపద్దతిలో ప్రయత్నంగా అమెరికాలోని రీగన్ ప్రెసిడెన్సీ, బ్రిటన్‌లోని థాచర్ ప్రభుత్వం, రెండూ ఆయుధ పోటీని రుద్దడం ద్వారా సులభతరం చేయబడింది.
1970ల చివరలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థలోని అపారమైన ద్రవ్య నిల్వలు మూడవ ప్రపంచ దేశాలలో సిద్ధంగా ఉన్న ఋణ గ్రహీతలను బ్యాంకులు వెతుక్కోవడానికి దారితీసింది. మూలధనం, వృద్ధి కోసం దేశీయ ధనికుల నుంచి వనరులను సమీకరించడానికి రాజకీయంగా మరింత కష్టతరమైన మార్గాన్ని నివారించదానికి వీలుకల్పిస్తున్నందున, ఉదార షరతులపై వస్తున్నట్లు కనపడుతున్న ద్రవ్య ఋణాలను వినియోగించుకోవడానికి ఈ దేశాల పాలక వర్గాలు సాధారణంగా చాలా సంతోషంగా ఉన్నాయి.
నయా ఉదారవాద విధానాలలో భాగంగా రీగన్ ఆధ్వర్యంలో అమెరికాలో వడ్డీ రెట్లు పెరగడంతో, మూడవ ప్రపంచ దేశాలు త్వరలోనే ఋణ సంక్షోభంలో చిక్కుకున్నాయి.
ఇది క్రమంగా ఋణాల సంక్షోభంలో చిక్కుకున్న మూడవ ప్రపంచ దేశాలపై ద్రవ్యోల్భణాన్ని తగ్గించే తీవ్రమైన నిర్మాణ సర్దుబాటు కార్యక్రమాలను విధించడానికి, పాశ్చాత్య శక్తుల ఆధిపత్యంలోని అంతర్జాతీయ ద్రవ్య- అభివృద్ధి సంస్థలు, అంతర్జాతీయ ద్రవ్య నిధితో పాటు ప్రపంచ బ్యాంకులకు తోడ్పడింది. దాదాపు అధిక వడ్డీ నిబంధనలపై ఋణాన్ని తిరిగి చెల్లించవలసిన అవసరంతో పాటు, కరెన్సీ విలువ తగ్గింపు, దిగజారిన వాణిజ్య నిబంధనలు రెండూ ఋణపడి ఉన్న పేద దేశాలను బాగా దెబ్బ కొట్టాయి.
1970ల మధ్య నుంచి 1980ల మధ్య వరకు చోటు చేసుకున్న ఈ పరిణామాల ద్వారా సంభవించిన అపారమైన మార్పులను గురించిన కొంత అవగాహన ఈ దిగువన ఇచ్చిన దాని నుండి పొందవచ్చు.
1974లో ఐక్యరాజ్య సమితి సర్వ సభ్య 37వ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు తీసుకువచ్చిన, సోషలిస్టు దేశాలు మద్దతు ఇచ్చిన ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇది నూతన అంతర్జాతీయ ఆర్ధిక క్రమానికి పిలుపునిచ్చింది. ఒక దశాబ్దం తరువాత సుంకాలు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందానికి(జీఏటీటీ) జరిగిన ఉరుగ్వే సమావేశాలలోని చర్చలలో, అంతర్జాతీయ పెట్టుబడులకు, వాణిజ్యానికి స్వేచ్ఛగా ప్రవేశించదానికై తమ ఆర్ధిక వ్యవస్థలను తెరవడానికి అనువుగా మూడవ ప్రపంచ దేశాలను బెదిరించడానికి అభివృద్ధి చెందిన దేశాలు సరికొత్త చొరబాటు ఎజండాను తీసుకువచ్చాయి.
1945 తరువాత కొంత కాలం పాటు తాత్కాలికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు అనుకూలంగా ఉన్న బలాబలాల పొందికలో వచ్చిన మార్పు, 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)సృష్టికి దారితీసిన చర్చలతో ఇప్పుడు వారికీ వ్యతిరేకంగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాల సార్వభౌమత్వాన్ని, స్వావలంభనను బలహీనపరుస్తూ అనేక ఒప్పందాలతో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పడింది. అంతేకాకుండా, అభివృద్ధిచెందిన ప్రపంచ బహుళజాతి సంస్థల సాంకేతిక గుత్తాధిపత్యాన్ని బలోపేతం చెయ్యడానికి ప్రధానంగా ఉపయోగపడింది.
1986 నుంచి 1995 మధ్య కాలంలో సోవియట్ యూనియన్ ఉనికిలో లేకుండా పోయింది. ఈ భూములలో అనూహ్యంగా క్రూరమైన పెట్టుబడిదారీ విధాన పునరుద్ధరణకు మార్గం సుగమం చేస్తూ, తూర్పు యూరపులోని సోషలిస్టు ప్రభుత్వాలు, ఇదివరకటి సోవియట్ రష్యా పడగొట్టబడ్డాయి.
ఈ పుస్తకం మొదటి అధ్యాయంలో వివరించిన 1970ల నాటి ప్రపంచం నుంచి 1990ల మధ్యలోని ప్రపంచం చాలా భిన్నంగా కనిపించింది. ప్రపంచ వ్యాపిత ప్రగతిశీలుర నమ్మకమైన నిరీక్షణకు విరుద్ధంగా పెట్టుబడిదారీ విధానం 1914 నుంచి 1945 వరకు 30 సంవత్సరాల సంక్షోభాల నుంచి బ్రతికిబట్టకట్టడమే కాదు, ఇంతకుముందు సోషలిస్టు విప్లవాలకు కోల్పోయిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నది. మరొక వైపున సోషలిజం ప్రపంచమంతటా పూర్తిస్థాయి తిరోగమనంలో ఉన్నట్లు కనుపిస్తున్నది. చైనా ఆర్ధిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందడాన్ని, చైనా ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలలో రాజ్యం, సమాజపరం చేయబడిన ఉత్పత్తి సాధనాల కీలక పాత్ర ఉంది. అయినప్పటికీ కూడా సోషలిస్టు ఆర్ధిక వ్యూహాలను విడిచిపెట్టడంగా చూడాలని కోరబడుతున్నది.
1970ల చివర నుంచి ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం పెరుగుదల, ప్రపంచ వ్యాపితంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలో 1980, 1990లు అంతా సగటు స్థూల జాతీయ ఉత్పత్తి వార్షిక పెరుగదల రేటులో తీక్షణమైన క్షీణతతో కూడి వున్నది వాస్తవమైనప్పటికీ, 1990ల ప్రారంభంలోని ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారీ సిద్ధాంతకర్తలచే సోషలిజంపై పెట్టుబడిదారీ విధాన అంతిమ విజయాన్ని సూచిస్తున్నదని భావించారు.
2008- 2018 కోల్పోయిన దశాబ్దం..
బహుశా ఎప్పటికీ సోషలిజం వెనుకకు నెట్టబడడమే కాకుండా, గతంలో వలస దేశాలుగా ఉన్న వాటికి గతంలో లాగా వాటి స్థానం ఏమిటో చూపడం జరిగిందని, శాంతియుత పెట్టుబడిదారీ విధానం చేతుల్లో ఉందని, ఈ సిద్ధాంతకర్తలు ఆశించారు. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల కీలక విజయంగా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) ఏర్పడినప్పటి నుండీ పదిహేను సంవత్సరాలు గడిచాయో లేదో మరోసారి ప్రపంచం నాటకీయంగా ఒక్కసారిగా మారిపోయింది. దోహా ‘అభివృద్ధి’ బంతి ఎటూ కదలక ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) విషాదకరమైన స్థితిలో ఉంది.
2008 నాటి ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి ముందు 2007 చివరి త్రైమాసికంలో అమెరికా ఆర్ధిక వ్యవస్థలో ప్రారంభమైన మాంద్యం అప్పటి నుంచి పూర్తి స్థాయి ప్రపంచ ఆర్థిక మాంద్యంగా మారింది. అది వెళ్ళిపోవడానికి తిరస్కరించింది. చాలా చర్చలలో భయంకరమైన పదం ‘D’ నివారించబడినప్పటికీ ‘గొప్ప మాంద్యం’ అన్న పదం స్థిరపడింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వంటి ప్రముఖ అంతర్జాతీయ ఆర్ధిక సంస్థల అంచనాలు, 2008 నుంచి 2018 వరకు దశాబ్దాన్ని ‘కోల్పోయిన దశాబ్దం’ అని పిలవడాన్ని తోసిపుచ్చడంలేదు.
ఈ పుస్తకం లోని వ్యా సాలు వ్రాసినప్పటి నుంచీ ప్రపంచ పెట్టుబదిదారీ విధానంలోని పరిణామాల సైద్ధాంతిక విశ్లేషణ ఈ ఉపోద్ఘాతం పరిధి వెలుపలిది. ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక సంక్షోభం పెట్టుబడిదారీ విధాన స్వాభావిక వైరుధ్యాలపై మార్క్స్ విశ్లేషణను, ప్రత్యేకించి నియమిత కాలంలో సంభవించే (ఆవర్తన) పెట్టుబడిదారీ సంక్షోభాల ప్రవృత్తిపై అతని అంతర్దృష్టులను, మరోసారి వెలుగులోకి తెచ్చిందని చెప్పడానికి ఇది సరిపోతుంది.
పెట్టుబడిదారీ విధానం కింద సంక్షోభాలపై మార్క్స్ విశ్లేషణల మూడు అంశాలు, అసమానతకు దారితీస్తున్న దాని అరాచకత్వం, ఉత్పత్తి పెరుగుతున్న సామాజిక పాత్రకూ, సముపార్జన వ్యక్తిగత పాత్రకూ మధ్య వైరుధ్యం నుండి ఉద్భవిస్తున్న మిత-వినియోగ ధోరణి, లాభం రేటు తగ్గే ధోరణి కూడా, 150 సంవత్సరాల క్రితం మార్క్స్ వాటిని ప్రతిపాదించినప్పుడు అవి ఉన్నట్లుగానే నేటికీ సందర్భోచితంగా ఉన్నాయి.
పెట్టుబడిదారీ విధానం డిమాండు-నిరోధిత వ్యవస్థ అన్నది ఈ రోజున వివాదాస్పదంగా ఉండదు. నిలవ వున్న శ్రామిక సైన్యం అన్న మార్క్స్ భావన మరింత సందర్భోచితమైనదని పెట్టుబడిదారీ దేశాలలోని అనేక ప్రాంతాలలోని ఆచరణలోని గత మూడు దశాబ్దాల ఉద్యోగ కల్పనా లేని పెరుగుదల నిరూపణ అయ్యింది.
‘ఆక్రమించు’ (‘ఆక్రమణ’) ఉద్యమం 99 శాతానికి వ్యతిరేకంగా 1 శాతం అన్న దాని ఆకర్షణీయ నినాదంతో దాని స్వంత మార్గంలో పెట్టుబడిదారీ సంచితం సాధారణ నియమానికి అర్ధం ఒక చోట (ధృవం వద్ద) సంపద పోగుపడడం, మరొక చోట దౌర్భాగ్యం (దరిద్రం) పోగుపడడం అన్న మార్క్స్ సూత్రీకరణను సంగ్రహించినది.
పెట్టుబడిదారీ ప్రపంచమంతటా అసమానత అపారంగా పెరగడం పెట్టుబడిదారీ విధాన చలన నియమాలపై మార్క్స్ భావనల గట్టితనానికి సాక్ష్యం ఇస్తున్నది. పెట్టుబడిదారీ విధానానికీ ప్రకృతికీ మధ్య గల సంబందాన్ని గురించి మార్క్స్ దూరదృష్టిని, వాతావరణ మార్పుల సంక్షోభం గుర్తుచేస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ వ్యాసాలు వ్రాసిన తరువాత దశాబ్దాలుగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, రాజకీయాలలో వచ్చిన నాటకీయమైన (పెను)మార్పులు, పెట్టుబడిదారీ విధాన చలన సూత్రాలపై మార్క్స్ ప్రాథమిక సూత్రీకరణలకు విరుద్ధంగా కాక, పెట్టుబడిదారీ విధానంలోని వైరుధ్యాలపై అతని దూరదృష్టిని నిర్ధారించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి.
వివరణలు, సూచనలు..
♦ 1958లో అమెరికా ఆర్ధిక వ్యవస్థలో స్వల్ప మాంద్యం ఉంది. కానీ మిగతా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ప్రపంచానికి అది విస్తరించ లేదు.
♦ అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల పాలక వర్గాలకు నిరంతరాయంగా అభివృద్ధి చెందుతున్న కాలం ‘స్వర్ణ యుగం’ అయి ఉండవచ్చు. కానీ అది ఏ విధంగానూ ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలోకి చాలా అసమాన మార్గాలలో చాలా ఎక్కువగా చొప్పించబడిన, ఏకీకరణ చేయబడిన, అభివృద్ధి చెందుతున్న అత్యధిక దేశాలకు కాదు. ఇండో- చైనా ప్రజలపై క్రూరమైన యుద్ధాలను ప్రారంభించిన కాలం కూడా ఇదే.
♦ వాస్తవానికి జాన్ రాబిన్సన్ సుందరంగా చిత్రించిన, కీన్సియన్ అర్ధశాస్త్రమే కీన్స్‌కు జారత్వం ఆపాదించడమే అవుతుంది.
♦ ఫ్రాన్సిస్ ఫుకుయమ రచన, ‘చరిత్ర ముగింపు మరియు చిట్టా చివరి మనిషి, ఫ్రీ పేస్, 1992లో(శాస్త్రీయ) సాంప్రదాయ ప్రకటన కనపడుతుంది. (The classic declaration is to be found in Francis Fukuyama, The End of History and the Last Man, Free Press, 1992.)
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం, మొదటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.