
అమెరికాలో మెజారిటీ యువత కమ్యూనిజానికి మొగ్గుచూపుతున్నారు. గాలప్ నిర్వహించిన కొత్త పోల్ ప్రకారం, యువ అమెరికన్లు పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడింట ఒక వంతుకంటే ఎక్కువ మంది కమ్యూనిజాన్ని ఆమోదిస్తున్నారు.
2018 నుంచి పెట్టుబడీదారీ విధానంపై ప్రజాదరణ మరింతగా క్షీణించిందని గాలప్ నివేదిక తెలిపింది. 62 శాతం యువ అమెరికన్లు కమ్యూనిజం, సోషలిజం భావజాలంపై సానుకూలతను వ్యక్తం చేశారు.
గత రెండు సంవత్సరాలలో పెట్టుబడిదారీ విధానంపై ప్రపంచవ్యాప్తంగా యువతలో సానుకూల దృక్పథాలు 12 పాయింట్ల తగ్గుదలకు దారితీశాయి. 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా యువత భావజాలంలో గణనీయ మైన మార్పు చోటుచేసుకుంది. పెట్టుబడిదారీ విధానంపై యువత అసహనాన్ని వ్యక్తంచేస్తోంది.
19- 29 సంవత్సరాల అమెరికన్లలో 68 శాతం మంది కమ్యూనిజం, సోషలిజం విధానాలపై ఆసక్తి చూపుతున్నారు. యూనివర్సిటీల్లో మార్క్స్, ఎంగెల్స్ రచించిన కేపిటల్ గ్రంథంపై కుస్తీ పడుతున్నారు. కేవలం 38 శాతం మంది అమెరికన్లు మాత్రమే ప్రతికూలతను వ్యక్తంచేశారు.
కాటో ఇన్స్టిట్యూట్, యుగోవ్ నిర్వహించిన తాజా సర్వేలో అమెరికా ఆర్థిక విధానాలపై యువతను ప్రశ్నించారు. అమెరికా యువత పెట్టుబడిదారీ విధానాలపై తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేసింది. సమాజంలోని పేద,ధనిక వ్యత్యాసాలపై అనేక ప్రశ్నలు సంధించారు. కార్మికుల హక్కులపై స్పందిస్తున్నారు. ప్రపంచంలోని సంపద మొత్తం కొద్దిమంది ధనికుల చేతుల్లోనే ఉండటంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కమ్యూనిజాన్ని ప్రత్యామ్నాయ శక్తిగా శానోజోస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు పేర్కొన్నారు. న్యూయార్క్‌లోని హోబర్ట్, విలియం స్మిత్ కళాశాలలో రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ జోడి డీన్ యువతరంలో కమ్యూనిజం, మార్క్సిజం అత్యంత ప్రజాదరణ పొందిందన్నారు.పెట్టుబడిదారీ విధానం ప్రపంచవ్యాప్తంగా విఫలమవడంతో ఆర్థికంగా, రాజకీయంగా, వాతావరణ విపత్తులకు ప్రత్యక్ష బాధ్యత వహిస్తోందన్నారు.
సర్వే ప్రకారం, మెజారిటీ అమెరికా యవతకు సోషలిజంపై పరిజ్ఞానం కలిగి ఉన్నారని భావించినప్పటికీ, స్కాండినేవియా, సోవియట్ యూనియన్ దేశాలు ఉత్తమ ఉదాహరణలా అనే దానిపై సందిగ్ధదత వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అసమానతలకు ప్రధాన కారణం పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద నియంతృత్వ విధానాలని మెజారిటీ ప్రజలు అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికవ్యవస్థలో సమూల మార్పులను ఆశిస్తున్నారు.
అమెరికా జీవన విధానంలో గత కొద్ది సంవత్సరాలుగా తీవ్ర మార్పు చోటుచేసుకుంది. అక్కడ రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేతన విధానాలలో చాలా మార్పులు చోటచేసుకున్నాయి. వేతనాలు సరిగ్గా లేకపోవడం అక్కడి పౌరుల ప్రధాన సమస్యగా ఉంది.
ఆర్థిక దుర్బలత్వానికి, అస్థిరతకు ప్రధాన కారణం వ్యవస్థలో చోటుచేసుకున్న సామాజిక అసమానతలు, ఉద్యోగ అభద్రత. తమ ప్రాథమిక అవసరాలు తీర్చడానికి జీత, భత్యాలు గతంలో ఉన్నంతగా లేకపోవడంతో అమెరికన్లు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. 10 మందిలో నలుగురు అమెరికన్లు ఏదో ఒక రకమైన రెండవ ఉద్యోగాన్ని కోరుకుంటున్నారు.
అమెరికా విద్యావిధానం, మీడియాలో దశాబ్దాలుగా తీవ్రమైన కమ్యూనిస్టు భావజాలంపై వ్యతిరేక ప్రచారం ఉంది. అయినప్పటికీ యువతీ, యువకులలో గణనీయమైన సంఖ్యలో సోషలిజం, కమ్యూనిజం భావనలపై సానుకూల అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు.
కాటో/ యుగోవ్ సర్వే ప్రకారం, 18-29 సంవత్సరాల వయస్సు గల అమెరికన్లలో 62 శాతం మంది తాము సోషలిజం పట్ల “సానుకూల దృక్పథాన్ని” కలిగి ఉన్నామని చెబుతుండగా, 34 శాతం మంది కమ్యూనిజం సిద్ధాంతానికి తాము మక్కువ చూపుతున్నట్లు చెబుతున్నారు.
ముఖ్యంగా, సర్వే 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల 2,000 మందిని అమెరికన్ల ఆర్థిక విధానం గురించి “మీకు సోషలిజం, కమ్యూనిజం పట్ల సానుకూలత లేదా ప్రతికూల దృక్పథం ఉందా?” అని ప్రశ్నించగా, 43 శాతం మంది సోషలిజం పట్ల తమకు “సానుకూల” దృక్పథం ఉందని చెప్పగా, 18-29 సంవత్సరాల వయస్సు గల వారిలో 62 శాతం మంది కమ్యూనిజం సిద్ధాంతానికి తాము మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
మొత్తం 14 శాతం మంది తమకు కమ్యూనిజం, సోషలిజం భావజాలంపై సానుకూలతను వ్యక్తంచేశారు. ముఖ్యంగా 18- 29 వయసుగల వారిలో 34 శాతం మంది కమ్యూనిస్టు సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.
తమ తల్లిదండ్రులు, తాత-నానమ్మ, అమ్మమ్మలు ఎక్కువగా ఆధారపడే పెన్షన్లు ఇకపై అందుబాటులో ఉండవని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరింత భారం కానున్నాయనే అభిప్రాయాన్ని యువ అమెరికన్లు వ్యక్తంచేశారు.
ఏదేమైనా, సర్వే ఫలితాలు కాటో ఇన్స్టిట్యూట్ వంటి కమ్యూనిస్టు వ్యతిరేక సంస్థలకు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ సంస్థలు సోషలిజం- కమ్యూనిజానికి ప్రతికూలంగా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద విధానాలను ప్రోత్సహిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా పెట్టుబడిదారీ విధానంలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు నిరుద్యోగం, పేదరికం, సామాజిక అన్యాయం. 2019లో సీఐఏ నిధులతో నడిచే “విక్టిమ్స్ ఆఫ్ కమ్యూనిజం మెమోరియల్ ఫౌండేషన్” తరపున యూగొవ్ నిర్వహించిన సర్వేలో 36 శాతం మంది కమ్యూనిజాన్ని తాము ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది 2018లో 28శాతం నుంచి ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
అమెరికాలో 70 శాతం అంటే 23- 38 సంవత్సరాల మధ్య వయస్సులోని స్త్రీ, పురుషులు తాము అమెరికా అధ్యక్ష పదవికి సోషలిస్టు భావజాలం ఉన్న అభ్యర్థికి మద్దతు ఇస్తామని సమాధానమిచ్చారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా యువత సోషలిజంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు.ఇకపై పెట్టుబడి దారీ విధానానికి కాలం చెల్లిందని, కుళ్లిపోయిందని సామ్రాజ్యవాద విధాన నియంతృత్వ పోకడలు ఇకపై చెల్లుబాటు కావని అమెరికన్ యువత స్పష్టం చేసింది.
(ఐడీ కమ్యూనిజం సౌజన్యంతో.. @విశాలాంధ్ర దినపత్రిక నుండి సేకరణ)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.