
భారత్ గ్రీన్ ఎనర్జీ పారడాక్స్: సామర్థ్యం అద్భుతంగా పెరిగినా, ఉత్పత్తిలో బొగ్గుదే ఆధిపత్యం
ది వైర్ స్టాఫ్
భారత్ తన విద్యుత్ రంగంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. దేశ మొత్తం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీలో సగానికి పైగా అంటే 50% కంటే ఎక్కువ నాన్-ఫాసిల్ ఫ్యూయల్ (శిలాజేతర ఇంధన) వనరుల నుంచి వస్తున్నాయని అధికారికంగా వెల్లడైంది. పారిస్ ఒప్పందం కింద భారత్ 2030 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఇప్పటికే సాధించింది. ఇది గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశం సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు.
484.8 గిగావాట్లలో 242.8 GW నాన్-ఫాసిల్ ఫ్యూయల్ వనరుల నుంచి
2024 జూలై నాటికి దేశ మొత్తం ఇన్స్టాల్డ్ ఫవర్ సామర్థ్యం 484.8 గిగావాట్లు (GW) కాగా, ఇందులో 242.8 గిగావాట్లు సౌరశక్తి, గాలిశక్తి, జలవిద్యుత్, అణుశక్తి వంటి శిలాజేతర ఇంధనంగా ఉన్నాయి. అంటే మొత్తం దేశ విద్యుత్ సామర్థ్యంలో 50.1 శాతం వాటా ఇవి కలిగి ఉన్నాయి. పారిస్ ఒప్పందం ప్రకారం భారత్ 2030 నాటికి తన ఇన్స్టాల్డ్ సామర్థ్యంలో 50% నాన్-ఫాసిల్ వనరులుగా ఉండే లక్ష్యం పెట్టుకుంది. కానీ ఈ లక్ష్యాన్ని భారత ప్రభుత్వం ఐదేళ్ల ముందే చేరుకుంది. ఈ వివరాలను మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ (MNRE), సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) విడుదల చేశాయి.
ఉత్పత్తిలో మాత్రం కార్బన్ ఆధారిత విద్యుత్‌దే ఆధిపత్యం
ఇదిలా ఉంటే విద్యుత్ ఉత్పత్తిలో మాత్రం ఇప్పటికీ కార్బన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిదే పైచేయిగా ఉంది. 2024లో దేశ మొత్తం విద్యుత్ ఉత్పత్తి 2,030 టెరావాట్ల ఒక గంటకి (TWh) కాగా, అందులో 1,517.9 TWh కార్బన్ ఆధారంగా ఉత్పత్తి అయ్యింది. అదే సమయంలో, సౌర, గాలి, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక వనరుల ద్వారా వచ్చిన విద్యుత్ 240.5 TWh మాత్రమే. అంటే, ఇన్స్టాల్డ్ కెపాసిటీలో నాన్-ఫాసిల్ వనరులు 50 శాతం ఉన్నా, విద్యుత్ ఉత్పత్తిలో మాత్రం ఇప్పటికీ 75 శాతం పైగా కార్బన్ ఆధారంగానే జరుగుతోంది. దీని వల్ల గ్రీన్ ఎనర్జీ అంశంలో భారత్‌కు ఇంకా పలు సవాళ్లు ఎదురవుతున్నాయి.
కోల్ ప్రాజెక్టుల విస్తరణ – రెన్యూబుల్స్ పెరుగుతున్నా స్పష్టమైన వ్యతిరేక ధోరణి
నాన్-ఫాసిల్ వనరులపై పెట్టుబడులు పెరుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం మరోవైపు కొత్త కోల్ మైనింగ్ ప్రాజెక్టులను ప్రారంభిస్తూ, కార్బన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తోంది. పలు గ్రీన్ ఫీల్డ్ మైనింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది దేశ గ్రీన్ ఎనర్జీ టార్గెట్‌పై పలు అనుమానాలను కలిగిస్తోంది. అయితే, సౌరశక్తి, గాలిశక్తి రంగాలలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక్క 2024లో 28 GW విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగింది. 2025 మొదటి ఐదు నెలల్లోనే 16.3 GW అదనపు విద్యుత్‌ను సౌర, గాలిశక్తి రంగాల్లో అనుసంధానం చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న రిన్యూబుల్ మార్కెట్లలో దేశాన్ని ముందుకు నడిపిస్తోంది.
గ్రీన్ ఎనర్జీకి ఇదో ముందడుగు, సవాళ్లు కూడా
భారత ప్రభుత్వం అధికారికంగా తెలిపిన ఈ లెక్కల ప్రకారం గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశం ముందడుగు వేసినట్లు చూపిస్తున్నప్పటికీ, వ్యవహారికంగా విద్యుత్ వినియోగంలో కార్బన్ వినియోగం ఎక్కువగా ఉండటం ఒక ఆందోళనకర విషయం. పునరుత్పాదక శక్తిపై పెట్టుబడులు పెంచడం, గ్రిడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, స్టోరేజ్ సాంకేతికతను మెరుగుపరచడం వంటి అంశాల్లో దేశం మరింత స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలి.
మన దేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల్లో ముందడుగు వేసినట్టు అనిపించినా, నిజమైన ప్రగతి విద్యుత్ ఉత్పత్తిలో నాన్-ఫాసిల్ ఆధారిత శక్తి వాటా పెరిగితేనే సాధ్యమవుతుంది. అప్పుడే దేశం సరైన మార్గంలో ఉందన్న నమ్మకం అంతర్జాతీయంగా ఏర్పడుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.