
ప్రతి రాష్ర్టంలో బీజేపీయేతర పార్టీలు తమ బలాబలాలకు అనుగుణంగా ఐక్యంగా నిలిచి ఎన్నికలలో తలపడాలి అంటున్నారు ప్రకాశ్‌కారత్
భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) మహాసభలు మరికొద్దిరోజులలో మధురైలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘పర్వేజ్ సుల్తాన్’కు ఇచ్చిన ఇంటర్యూలో పార్టీ సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ మధ్యంతర సమన్వయకర్త ప్రకాశ్‌కారత్ ఈ మహాసభలు ప్రభావంగా పార్టీ రాజకీయ పలుకుబడిని విస్తరింపచేసుకోవడం, ప్రజాపునాదిని పటిష్ఠపరుచుకోవడం మీద దృష్టి పెడుతుందని వివరించారు. పార్టీలో యువనాయకత్వాన్ని, మహిళా ప్రాతినిధ్యాన్ని పెంపొందించడం మీద దృష్టిపెడతామని స్పష్టం చేశారు.
ప్రశ్న: మధురైలో జరగనున్న పార్టీ 24వ మహాసభలో నాయకత్వ మార్పు ఏమన్నా ఉంటుందా? కేంద్ర కమిటీలోకి యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారా?
జవాబు: కమిటీలు, నాయకత్వాన్ని నిర్ణయించడానికి పార్టీలో విశాలమైన ప్రాతిపదికన ఒక విధానం ఉంది. నాయకత్వం కొనసాగింపు, కొత్త కూర్పుల మేళవింపులో పార్టీ ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన అన్ని మహాసభలలో కొంతమంది వృద్ధులు తప్పుకోవడం, ఆ స్థానాలను యువనాయకత్వం భర్తీ చెయ్యడం కొనసాగుతూ వచ్చింది. అంటే దాని అర్థం వయసు మీరిన వాళ్లంతా తప్పుకుంటారని కాదు. ఇంతకు ముందే చెప్పినట్లు పార్టీ నాయకత్వం పాత, కొత్తలా మేళవింపుతో ఉంటుంది. ఈ మహాసభలో ఎన్నిక కానున్న కేంద్రకమిటీ, పొలిట్‌బ్యూరో పొందికలో కూడా అదే సంప్రదాయం కొనసాగుతుంది. అయితే ఈ సారి ప్రత్యేక పరిస్థితులలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో పార్టీ ప్రధాన కార్యదర్శి అకాల మరణం చెందడంతో ఈ మహాసభలు ప్రధాన కార్యదర్శి పరోక్షంలో జరుగుతుంది. ఈ మహాసభ నూతన ప్రధాన కార్యదర్శిని కూడా ఎన్నుకుంటుంది.
ప్ర: సమీప భవిష్యత్తులో పార్టీ ప్రధానకార్యదర్శిగా మహిళ ఎంపికయ్యే అవకాశం ఉన్నదా?
జ: జెండర్, వయసు తదితర ప్రాతిపదికల రీత్యా నాయకత్వ ఎంపిక జరగదు. ఉన్న పరిస్థితులలో ఆ పదవీ బాధ్యతలు చేపట్టడానికి తగిన వ్యక్తి ఎవరు అని కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరోలు నిర్ణయిస్తాయి.
ప్ర: 85 మంది కేంద్ర కార్యవర్గంలో మహిళల సంఖ్య 15. ఈసారి మహిళలకు మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉన్నదా?
జ: సంఖ్యాపరంగా కాదుగానీ శాతాలరీత్యా ఈ సారి మహిళల ప్రాతినిధ్యం పెంచాలని మా పార్టీ కేంద్రకమిటీ నిర్ణయించింది. ఈ దఫా కేంద్రకమిటీని మరింత విస్తరించడంతో పాటు మహిళల సంఖ్య, శాతాలు రెండూ పెరుగుతాయి.
ప్ర: వయసురీత్యా ఈసారి కొంతమంది నాయకులకు మినహాయింపు లభించే అవకాశం ఉన్నదా, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విషయంలో ఈ సారి ఏమన్నా మార్పు ఉంటుందా?
జ: గతంలో మినహాయింపు ఇవ్వడానికి కారణం విజయన్ కేరళ ముఖ్యమంత్రిగా ఉండడమే. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించనున్న రీత్యా పార్టీ అగ్రనాయత్వంతో ఉండాల్సిన అవసరం ఉందని భావించాం. ఈసారి మరోసారి కొత్తగా నిర్ణయం తీసుకోవాలి. రానున్న మధురై మహాసభలో ఈ విషయమై నిర్ణయం తీసుకుంటాం.
ప్ర: ఎన్నికల రాజకీయాలలో మొండిగా వ్యవహరించడం అవసరమా లేక పట్టు విడుపులు ప్రదర్శించాలా?
జ: రెండూ కాదు. మా పార్టీకి సంబంధించినంత వరకు పార్టీ మహాసభలో నిర్ణయించిన రాజకీయ ఎత్తుగడల పంథాకు అనుగుణంగా వ్యవహరిస్తాం. మా పార్టీ ఎన్నికల ఎత్తుగడకు ప్రాతిపదిక మహాసభ నిర్ణయించిన రాజకీయ పంథాయే. ఈ అవగాహనతో ఎన్నికల రాజకీయాల్లో పాల్గొంటాం తప్పితే మొండిగా వ్యవహరించడమో, పట్టు విడుపులు ప్రదర్శించడమో ఉండదు. ఉదాహరణకు బీజేపీని ఓడించి, ఆ పార్టీని ఒంటరిపాటు చెయ్యడం మా ప్రధానకర్తవ్యంగా నిర్ణయించుకుంటే ఆయా రాష్ట్రాలలో ఉన్న నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణమైన ఎత్తుగడలు అవలంబిస్తాం. పార్టీ నిర్దేశించుకున్న ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా మేం ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, ఎత్తుగడలు ఆధారపడి ఉంటాయి.
ప్ర: ప్రస్తుతం ‘ఇండియా బ్లాక్’ పరిస్థితి ఏమిటి? ఆ బ్లాక్‌లోని భాగస్వామ్య పక్షాలతో, మీ పార్టీ చర్చలు పునఃప్రారంభించేందుకు చొరవ తీసుకుంటుందా?
జ: లోక్‌సభ ఎన్నికల అనంతరం ఇండియా బ్లాక్‌ను ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే అంశం మీద స్పష్టత లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన అంశాల మీద పార్లమెంటులో ఇండియా బ్లాక్ భాగస్వామ్య పార్టీలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. కానీ పార్లమెంటు వెలుపల దీని మీద చర్చ ఉండడం లేదు. అలాంటి చర్చ జరగాల్సిన అవసరం నేడు ఎంతైనా ఉన్నది. అది నిర్ణయించాల్సింది మేం కాదు. మేం అంత ప్రధానమైన శక్తి కాదు. అయితే భాగస్వామ్య పక్షాలు అన్నీ కలిసి కూర్చుని ముందుకు ఎలా పోవాలో చర్చించి. ఒక నిర్ణయానికి రావాలి. ఇప్పటి వరకు అలాంటి సమావేశం జరగలేదు కాబట్టి ‘ఇండియా బ్లాక్’ దిశారహితంగా తయారయ్యింది అనే అభిప్రాయం జనంలో ఏర్పడింది.
ప్ర: పార్టీ మహాసభలో ప్రాంతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకునే అవకాశం ఉన్నదా?
జ: రాబోయే నాలుగేళ్ల వరకు పార్లమెంటు ఎన్నికలు ఉండవు. ప్రస్థుతం వివిధ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి రాష్ర్టంలో బలాబలాలు పొందిక ఆధారంగా బీజేపీ వ్యతిరేక/ బీజేపీయేతర పార్టీలు ఒకటయ్యేందుకు ప్రయత్నించాలి. ఇలాంటి ప్రయత్నం రాష్ట్రానికి, రాష్ట్రానికి భిన్నంగా ఉంటుందని మనందరికీ తెలుసు. బీహార్‌లో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ర్టంలో ఇప్పటికే ‘మహాఘట బంధన్’ పేరిట కూటమి ఏర్పాటయి ఉన్నది. ‘ఇండియా బ్లాక్’ ఆవిర్భవించడానికన్నా ముందు నుండే ఈ కూటమి ఏర్పడి ఉన్నది. ప్రస్థుతం అదే కూటమి కొనసాగవచ్చు లేదంటే మరికొన్ని శక్తుల కలయికతో మరింత బలపడవచ్చు. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ర్టంలో డీఎంకే ఆధ్వర్యంలో ఉన్న కూటమి కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో ఏం జరగనున్నది అనే దానితో నిమిత్తం లేకుండా ఈ కూటమిలు కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రాంతీయ స్థాయిలో రాష్ట్రాలవారిగా ఇలాంటి అవగాహన కోసం కృషి చెయ్యవచ్చనే ఆశాభావంతో ఉన్నాను.
ప్ర: కేరళలో ఆర్ఎస్ఎస్- బీజేపీల పలుకుబడి పెరుగుతుందనే వార్తల మీద మీ అభిప్రాయం ఏమిటి?
జ: నిజమే, గత లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మా పార్టీ సమీక్షిస్తూ కేరళలోనే కాదు మొత్తంగా దక్షిణాదిన ఆర్ఎస్ఎస్- బీజేపీల ప్రభావం పెరుగుతున్నట్లు అంచనాకు వచ్చింది. ఎన్డీఏ ఓటింగ్శాతంలో పెరుగుదల ఉన్నది. బీజేపీ ఇతర చిన్నాచితకా పార్టీలను కలుపుకుని 19శాతం ఓటింగ్ సంపాదించింది. దక్షిణాదిన ఇంత శాతం ఓటింగ్ రాబట్టడం ఇదే తొలిసారి. అయితే కేరళలో పార్లమెంటు ఎన్నికల నాటి సరళి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కానరాలేదు. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని బీజేపీ-ఆర్ఎస్ఎస్ల ప్రభావాన్ని తిప్పికొట్టడానికి చేపట్టాల్సిన చర్యలు ఏమిటో మా పార్టీ లోతుగా చర్చించింది.
ప్ర: ఈ మధ్యకాలంలో మీ పార్టీ తరచూ వామపక్షశక్తుల ఐక్యత గురించి నొక్కివక్కాణిస్తుంది. సిపిఐ, సిపిఐ-ఎంఎల్ పార్టీలు వామపక్ష ఐక్యతకు కలిసి రావట్లేదని మీరు భావిస్తున్నారా?
జ: లేదు, వామపక్ష ఐక్యతకు ఆ పార్టీలు ప్రతిబంధకం కాదు. వాస్తవానికి బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో మా పార్టీ బలహీనపడ్డానికి జాతీయ రాజకీయాల్లో వామపక్షాల ప్రభావం క్షీణించింది. అందుకే ఒకనాటి వామపక్ష ఐక్యత ఈనాడు కొరవడింది. అందుకే మళ్లీ వామపక్ష ప్రాధాన్యత పూర్వవైభవం సంతరించుకోవాలని మేం కృషి చేస్తున్నాం. ఇదేదో కేవలం మా పార్టీ సిపియం బలపడడానికి సంబంధించినది కాదు. మొత్తంగా దేశంలో వామపక్ష శక్తుల మధ్య ఐక్యత పెరగాలని, ఐక్యకార్యాచరణ, ఐక్య ఉద్యమాలు పెంపొందించాలని భావిస్తున్నాం. మా పార్టీ కృషి ఈ దిశగా ఉన్నది. కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం. బడ్జెట్లో ప్రజావ్యతిరేక ప్రతిపాదనలకు వ్యతిరేకంగా అఖిత భారత స్థాయిలో ఉమ్మడిగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాం. అంతకు ముందు గాజాపై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాం. అనేక అంశాల మీద వామపక్ష పార్టీలు కలిసి పని చేస్తున్నాయి. అయితే ఈ వామపక్ష ఐక్యకార్యచరణ మరింత విస్తృత ప్రాతిపదికన, మరింత ప్రభావవంతంగా కొనసాగించడానికి కృషి చెయ్యాలని భావిస్తున్నాం. మా పార్టీ మహాసభల అనంతరం ఈ కృషిని ద్విగుణీకృతంగా చేపడతాం.
ప్ర. ఫక్తు సైద్ధాంతిక నిబద్ధతకు కట్టుబడి ఉండడం మూలంగా ప్రధాన స్రవంతి రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీలకు విశాల ప్రాతిపదికన ఆమోదయోగ్యత లభిస్తుందా?
జ: ఇప్పటికిప్పడు దేశంలో సోషలిజం స్థాపించాలనే అజెండా మాముందు లేదు. రాజకీయంగా మా అవగాహన ఈ స్పష్టతతో ఉన్నది. మేం ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోరుకుంటున్నా. అదే సోషలిజం, ప్రస్తుతం మా పోరాటం ప్రధాన లక్ష్యం మితవాద శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ- ఆర్ఎస్ఎస్లను తిప్పికొట్టడం, ఈ లక్ష్య సాధన కోసం విశాల ప్రాతిపదికన ఐక్య వేదిక ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని మేం తరచూ చెబుతూ వస్తున్నాం. ఇంతకు ముందే మనం ‘ఇండియా బ్లాక్’ గురించి మాట్లాడుకున్నాం. మేం ఈ ‘బ్లాక్’లో ఎందుకున్నాం? విశాల ప్రాతిపదికన ఐక్యవేదిక ఆవశ్యకతను గుర్తించాం. కాబట్టే మేం ఆ ‘బ్లాక్’తో కలిసి పని చేస్తున్నాం. అదే సందర్భంలో మా స్వతంత్ర్య ఉనికిని, మా పాత్రను మేం పోషిస్తాం. వామపక్ష పార్టీగా మా అస్థిత్వం, మా పార్టీ పని తీరు కొనసాగుతుంది. వామపక్ష ప్రత్యామ్నాయం ప్రజలకు అందించడానికి మా కృషి కొనసాగుతుంది. అలాగే విశాల ప్రాతిపదికన ఐక్యత కోసం మా కృషి కొనసాగుతుంది. ఇందులో శుద్ధ సిద్ధాంతవాదం ఏముంది?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.