
వారంత ధారావాహిక రోజుల నుంచే సు వెంకటేశన్ నవల అద్భుతమైన స్పందనతో కూడిన ప్రజాధరణను పొందింది. సామాజిక మాధ్యమంలో అభిమానుల పేజీలతో పాటు రీడర్ సర్కిల్లు పుట్టుకొచ్చాయి. తమ పిల్లలకు “వేల్పారి”లోని పాత్రల పేర్లను పెట్టేంత, నవల ప్రభావం పాఠకుల మీద ఉంది.
“కోల్పోయే ఆవాసంలో ఏ జీవిని ప్రకృతి సృష్టించలేదు. దీంతో, ఒక జీవి తన ఆవాసాన్ని కోల్పోవడం అంటే ప్రకృతి నుంచి తన మూలాలను తొలిగించుకోవడంతో సరిసమానం.” 1,408 పేజీలలో రెండు సంపుటాలుగా ప్రచురించబడిన తమిళ నవల వేల్పారిలోని ఈ పంక్తులు పాఠకుల హృదయాంతరాలను తాకాయి.
వేల్పారి నవల లక్ష కాపీలు అమ్ముడుపోవడంతో, తమిళనాడులోని పాత- అత్యంత ప్రసిద్ధ ప్రచురణ సంస్థ వికటన్ జూలై 11న ఒక మైలురాయిని నమోదు చేసింది. సాహిత్య అకాడమీ అవార్డును పొందిన రచయిత, మధురై పార్లమెంటు సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్)కు ప్రాతినిధ్యం వహిస్తున్న సు వెంకటేశన్ వీరయుగ నాయగన్ వేల్పారి నవలను రచించారు. ఈ నవల మొదట 2016లో ఆనంద వికటన్‌లో వారంత ధారావాహికగా ప్రచురించబడింది. అంతేకాకుండా, 2016 దీపావళి నుంచి 2018 క్రిస్మస్ వరకు 111 వారాల పాటు నిరంతరాయంగా ప్రచురితమైంది. అప్పటి తమిళనాడు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2018 డిసెంబర్ 29న దీనిని పుస్తక రూపంలో విడుదల చేశారు.
ఆనంద వికటన్‌లో ధారావాహికగా వస్తున్న సమయంలో కూడా ఈ నవల పాఠకుల నుంచి మంచి స్పందనను పొందింది. అదే సమయంలో సోషల్ మీడియాలో వేల్పారి పేరుతో అభిమానుల పేజీలు, రీడర్ సర్కిల్లు పుట్టుకొచ్చాయి. అంతేకాకుండా, పాత్రల ప్రభావం ఎంతలా ఉందంటే చాలా మంది పాఠకులు తమ పిల్లలకు వేల్పారిలోని పాత్రల పేర్లను పెట్టారు. చెన్నైలోని కలైవానర్ అరంగంలో శుక్రవారం(జూలై 11) నవల విజయోత్సవ కార్యక్రమం జరిగింది. తమ పిల్లలకు నవలలోని ప్రధాన పాత్రల పేర్లు పెట్టిన 30 మంది తల్లిదండ్రులను, విజయోత్సవ కార్యక్రమం వేదికగా యాజమాన్యం సత్కరించింది.
తమిళనాడులోని పశ్చిమ కనుమల ప్రాంతాన్ని పాలించిన పరాక్రమవంతుడైన అధిపతి పారి జీవితాన్ని ఈ నవల వివరిస్తుంది. చేర, చోళ, పాండ్య రాజవంశాలను సమిష్టిగా ఎదుర్కొన్న తీరును ఈ రచన పేర్కొంటుంది. వీళ్లు మువేంథర్(ముగ్గురు కిరీటాలు ధరించిన రాజులు) పేరుపొందారు. అంతేకాకుండా తన భూమి, ప్రజలు, సహజ వనరులను రక్షించుకోవడానికి పోరాడిన పారి తీవ్రమైన ప్రతిఘటనను తెలియజేస్తుంది.
కొండప్రాంతానికి చెందిన ప్రజల గిరిజన సమాజం, అభివృద్ధి చెందుతున్న వ్యవసాయం ద్వారా ఉద్భవించిన ఆస్తి- యాజమాన్య వ్యవసాయ రాజ్యాలు. ఈ రెండు ప్రపంచాల మధ్య సంఘర్షణలో వేళ్లూనుకుపోయిన కథగా సు వెంకటేశన్ వేల్పారిని చిత్రీకరించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రసంగంలో రచయిత రచనా శైలిని నటుడు రజనీకాంత్ ప్రశంసించారు. నవల లక్షకు పైగా కాపీలు అమ్ముడయ్యాయని తెలిసి చాలా ఆశ్చర్యపోయానని అన్నారు. “కల్కి తర్వాత, నేను ఈ గొప్ప కథ చెప్పే విధానాన్ని సు వెంకటేశన్ రచనలో మాత్రమే చూస్తున్నాను. తను ఆధునిక కల్కి” అని నటుడు కితాబిచ్చారు.

త్వరలో నవలను సినిమాగా తీయబోయే ఫిల్మ్‌మేకర్ శంకర్ ఈ సందర్భంగా మాట్లాడారు, “ఎంథేరియన్ ఒకప్పుడు నా కలల ప్రాజెక్టు, ఇప్పుడు నా కలల ప్రాజెక్టు వెల్పారి. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లా ఈ చిత్రం ప్రపంచం మెచ్చుకోగలిగే మేధోపరంగా సుసంపన్నమైన, ప్రజాదరణ పొందిన భారతీయ- తమిళ సృష్టిగా ఉద్భవించే సామర్థ్యాన్ని కలిగి ఉంది” అని పేర్కొన్నారు.
సంగం సాహిత్యంలోని 2,281 కవితల నుంచి, ముఖ్యంగా పారి గురించి ప్రస్తావించే వాటి నుంచి రచయిత నవల ప్రధాన కథనాన్ని రూపొందించారు. కానీ అతను సాహిత్య వనరులతో ఆగలేదు. పారి ప్రపంచానికి జీవం పోయడానికి, అతను పశ్చిమ కనుమలలో కూడా ప్రయాణించారు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో నివసించే గిరిజన సమూహాలతో మాట్లాడారు. అంతేకాకుండా వారి జీవన విధానం, ఆచారాలు, ప్రకృతితో వారికి ఉన్న సంబంధం గురించి తెలుసుకున్నారు.
అమ్మకాల్లో లక్ష కాపీలు దాటాయి. నవల మైలురాయి గురించి మాట్లాడుతూ, “ఈ నవల వాణిజ్యపరంగా విజయం సాధించడం కంటే నాకు ఎక్కువ ఆనందాన్నిచ్చే విషయం ఏంటంటే, 1000 మందికి పైగా పాఠకులు తమ పిల్లలకు ఈ నవలలోని పాత్రల పేర్లు పెట్టార”ని సు వెంకటేశన్ అన్నారు. అయితే, వేల్పారిలోని కేంద్ర పాత్రలైన పరి, అధిని, కబిలన్, నీలన్, ఇరావధన్, ఉధిరన్, మయిల, పోర్చువై వంటి పేర్లు తమిళనాడు అంతటా కుటుంబాలలో చోటు సంపాదించుకుంటూనే ఉన్నాయి. ఇది నవల సృష్టించిన భావోద్వేగ, సాంస్కృతిక ప్రతిధ్వనికి నిదర్శనం.
ఈ నవల వారసత్వాన్ని గౌరవించటానికి, వికటన్ తన ఆడియో ప్లాట్‌ఫామ్ వికటన్ ప్లే ద్వారా వేల్పారికి ప్రాణం పోసింది. ఆ వేదికలో, తక్కువ కాలంలో ఎక్కువ మంది పాఠకులు విన్నటువంటి శీర్షికను వేల్పారి పొందింది.తమిళ ప్రజల హృదయాలలో, ఇళ్లలో ఎంత లోతుగా ప్రవేశించిందో ఈ అద్భుతమైన ఆదరణను పొందిన విధానం ప్రతిబింబిస్తుంది.
వేల్పారి అసాధారణ పరిధి గురించి మాట్లాడుతూ, “ఇది చారిత్రాత్మకమైనది. డిజిటల్ అంతరాయాలు, క్షణిక శ్రద్ధ ఉన్న యుగంలో ప్రాంతీయ భాషలో ఒక పుస్తకం 1,00,000 కాపీలకు పైగా అమ్ముడైంది. ఇది ఒక అసాధారణ మైలురాయి. భారతీయ ప్రచురణ చరిత్రలో బహుశా మాక్సిమ్ గోర్కీ రాసిన అమ్మ మాత్రమే వివిధ భాషలలోకి అనువదించబడి, ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కానీ వేల్పారి రచనా విధానం, కథ శైలి భిన్నంగా ఉంటుంది. ఇది సాహిత్యం మాత్రమే కాదు, ఇది సమాజ వారసత్వం. ఇది తమిళ సంస్కృతి ఆత్మలోనే వేళ్లూనుకుపోయింది. అయినప్పటికీ ఇది ఆధునిక పాఠకులను, శ్రోతలను సమానంగా ఆకట్టుకుంటుంది” వికటన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బీ శ్రీనివాసన్ అన్నారు.
వేల్పారి విజయాన్ని శ్రీనివాసన్ మొత్తం తమిళ ప్రపంచం గర్వించదగ్గ సాంస్కృతిక క్షణంగా అభివర్ణించారు. “మణియం సెల్వన్ గంభీరమైన చిత్రాలు, సు వెంకటేశన్ శక్తివంతమైన కథా కథనంతో జోడించబడినప్పుడు ఏదో మాయాజాలం జరిగింది. వేల్పారిని నవల నుంచి ఇతిహాసంగా పెంచిన దృశ్య, కథన సింఫొనీ” అని ఆయన అన్నారు. “ఇది కేవలం ప్రచురణ విజయం కాదు. ఇది మన గుర్తింపు, మన కళ, మన కథ చెప్పే సంప్రదాయం వేడుక.”

చేర, చోళ, పాండ్య రాజవంశాల గొప్ప చక్రవర్తుల కంటే పారి వంటి చిన్న అధిపతిని ఎందుకు ఎక్కువగా తమిళ సమాజం ఆదరిస్తుందనే దీర్ఘకాలిక ప్రశ్నకు వేల్పారి విజయం ఒక బలమైన సమాధానాన్ని అందిస్తుంది.
“పారి అనేది 2,000 సంవత్సరాలకు పైగా తమిళ సంప్రదాయంలో లోతుగా పాతుకుపోయిన పేరు. చేర, చోళ, పాండ్య ముగ్గురు గొప్ప చక్రవర్తులు, వారి గురించి లెక్కలేనన్ని కథలు వ్రాయబడ్డాయి. కానీ పారి చక్రవర్తి కాదు. అతను పర్వత ప్రాంతంలో నివసించిన వంశానికి నాయకుడు. తమిళ సంప్రదాయం కడైయేలు వల్లల్గల్ అని పిలువబడే ఏడుగురు గొప్ప దాతలను గౌరవిస్తుంది. “చివరి ఏడుగురు దాతలు” వారందరూ కొండ ప్రాంతాల నుంచి వచ్చారు. ఎవరూ చక్రవర్తులు కాదు. చేర, చోళ లేదా పాండ్య రాజవంశాల నుంచి ఒక్క పాలకుడు కూడా ఈ జాబితాలో లేడు” అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తమిళ స్టడీస్ చైర్మన్ ఆర్ బాలకృష్ణన్ వివరించారు.
“పారి వారసత్వం నిలిచి ఉండటానికి కారణం బహుశా ముగ్గురు రాజుల కంటే కూడా బలంగా ఉండవచ్చు. అతను తమిళ సమిష్టి జ్ఞాపకాల తొలి పొరలలో ఒకదానికి చెందినవాడు. అటువంటి నాయకుడి జీవితాన్ని శక్తివంతమైన కథనంగా మార్చడంలో రచయిత సాహిత్య నైపుణ్యంలో వేల్పారి విజయం ఉంది. సు వెంకటేశన్ తమిళ సాంస్కృతిక స్పృహలో ఇప్పటికే లోతుగా నిక్షిప్తం చేయబడిన వ్యక్తిత్వాన్ని బలవంతంగా తిరిగి ఊహించుకున్నాడు.”
వేల్పారి విజయానికి మరో పెద్ద కారణం మణియం సెల్వన్ రాసిన స్పష్టమైన, ఉత్తేజకరమైన చిత్రాలు. పరంబు కొండల కఠినమైన వైభవం, దట్టమైన అడవుల నిశ్శబ్దం, ఉప్పొంగుతున్న జలపాతాల గర్జన, ప్రేమ సున్నితత్వం, యుద్ధ ఉగ్రతను అనుభవించడం ద్వారా పాఠకులను పారి ప్రపంచంలోకి తీసుకెళ్లడం అతని అద్భుతమైన స్ట్రోక్‌ల ద్వారానే సాధ్యమైంది. అతని కళ కథకు మరపురాని విధంగా ప్రాణం పోసిన గొప్ప దృశ్య పొరను జోడించింది.
అనువాదం: కృష్ణ నాయుడు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.