
కశ్మీర్‌కు సంబంధించిన 25 పుస్తక ప్రచురణలను జమ్మూకశ్మీర్ గృహ మంత్రిత్వ శాఖ నిషేధించింది. ఇందులో అరుంధతి రాయ్ , ఏజీ నూరాని రాసిన పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకాలు “విచ్ఛిన్నత”కు దారి తీస్తున్నాయని చెపుతూ నిషేధించినట్టు మంత్రిశాఖ ప్రకటించింది.
గృహ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ భార్తి, కశ్మీర్ రాష్ట్ర లెఫ్టనెంట్ గవెర్నర్ మనోజ్ సిన్హా ఇచ్చిన ఆదేశాలు నోటిఫై చేశారు.
నొటిఫికేషన్‌లో “జమ్మూ కశ్మీర్ గురించి, అక్కడి వేర్పాటువాదాన్ని గురించి తప్పుడు సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ సాహిత్యం యువతి, యువకులను మానసిక వేదనకు గురిచేస్తున్నది. బలిపశువులైన భావన కలిగిస్తున్నది. తీవ్రవాదాన్ని ధైర్యసాహసాలుగా భావించే తత్త్వం పెంపొందిస్తుంది. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది” పేర్కొన్నారు.
“ఈ సాహిత్యం చారిత్రక సత్యాలు వక్రీకరించే విధంగా, తీవ్రవాదాన్ని కీర్తించే విధంగా, మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే విధంగా, హింస- తీవ్రవాదం వైపు యువతను మళ్లించే విధంగా ఉన్నది” అని నోటిఫికేషన్లో చెప్పుకొచ్చారు.
“వేర్పాటువాదాన్ని ప్రేరేపించి, దేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు ఈ పుస్తకాలు భంగం కలిగించే ప్రమాదం ఉంది. దీంతో భారతీయ న్యాయ సంహిత 2023లోని 152, 196, 197 అధికరణలు దీనికి వర్తిస్తాయ”ని తెలియజేశారు.

నిషేధంలో ప్రముఖుల పుస్తకాలు..
ఈ పుస్తకాలలో రాజకీయ విశ్లేషణలు, ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు ఏజీ నూరాని రచించిన 1947- 2012 కశ్మీర్ వివాదం వంటి చారిత్రిక కథనాలు, సుమన్త్ర బోస్ రచించిన కశ్మీర్ మూలమలుపులో, వివాదాస్పద భూభాగాలు, డేవిడ్ దేవదాస్ రచించిన కశ్మీర్ కథ, అరుంధతి రాయ్ రచించిన ఆజాదీ, అనురాధ భాషిన్ రచించిన ఒక విచ్ఛిన్నమైన రాష్ట్రం: 370వ అధికరణం గురించి తెలియని ఓ కథ ఉన్నాయి.
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం, భారతీయ న్యాయ సంహిత 2023లోని 98వ అధికరణం ప్రకారం ప్రభుత్వం ఈ పుస్తక ప్రచురణలు అన్నీ, వాటి కాపీలు , వాటికి సంబంధించిన ఇతర పత్రాలు “స్వాధీన పరచు” కున్నటు భావించవలసి ఉంటుంది.
నిషేధించిన అంతర్జాతీయ ప్రచురణలో అమెరికా రచయిత హఫ్సా కాంజ్వల్ రచించిన కశ్మీర్‌ని వలస దేశంగా మార్చిన వైనం: భారతదేశ ఆక్రమణలో రాష్ట్ర నిర్మాణం, హాల్య్ దుశ్చింస్కి రచించిన కశ్మీర్లో ప్రతిఘటన, విక్టోరియా షఫీల్డ్ రచించిన కశ్మీర్ వివాదం, క్రిస్టోఫర్ నెడ్డెన్ రచించిన స్వతంత్ర కశ్మీర్ ఉన్నాయి.
సీమా కాజీ రచించిన ప్రజాస్వామ్యానికి దేశానికీ నడుమ: కశ్మీర్లో లింగం, సైనికీకరణ, ఎస్సార్ బ్యాతోల్ రచించిన కునాన్ పొష్పొరా గుర్తుందా?, ఏతెర్ జియా రచించిన అదృశ్యమవడాన్ని ప్రతిఘటించడం: కశ్మీర్ సైన్యం అధీనంలో, మహిళల క్రియాశీలత, పుస్తకాలు కూడా నిషేధించబడ్డాయి.
జమాత్ ఏ ఇస్లాం స్థాపకుడు, మౌలానా అబ్దుల్ ఆ’ల మవుదుది రచించిన ఐ జిహాద్ ఫీల్ ఇస్లాం, ముస్లిం సోదరభావం సంస్ధ స్థాపించిన హాసన్ అల్ బన్న రచించిన ముజాహిద్‌కి అజాన్ నిషేధించబడిన పుస్తకాలలో ఉన్నాయి.
నిషేధించబడిన పుస్తకాల్లో పీఓత్ర్ బ్లసురో అనీజ్ కుస్జీకా రచించిన కశ్మీర్లో చట్టం- వివాద పరిష్కారం, డాక్టర్ షంషాద్ షా రచించిన అమెరికా- కశ్మీర్, డాక్టర్ అఫక్ రచించిన తరిఖే సియాసత్ కశ్మీర్ పుస్తకాలు ఇందులో ప్రముఖమైనవిగా చెప్పవచ్చు.
అనువాదం: ఉషారాణి కె
(ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో ది వైర్లో ప్రచురితం..)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.