
ఆడ పిల్ల పుట్టుక దుఃఖమయంగా భావించకూడదని బౌద్ధం అంటుంది. బుద్ధుడు, ప్రసెన్జిత్ మహారాజుల మధ్య ఓ సంఘటన జరిగింది. తనకు ఆడపిల్ల జన్మించిందనే కారణంతో ప్రసెన్జిత్ మహారాజు బాధపడుతూ ఉంటే ‘ఆడ బిడ్డ పుట్టిందని ఎంత మాత్రం దుఃఖించాల్సిన అవసరం లేదు. ఆడ బిడ్డ మగ బిడ్డకు ఏమాత్రం తీసిపోదు’అని బుద్ధుడు అన్నాడని అంబేడ్కర్ ఒకానొక సందర్భంలో గుర్తుచేశారు.
1951 సెప్టెంబర్ 9న కేంద్ర న్యాయ శాఖా మంత్రి పదవికి అంబేడ్కర్ రాజీనామా చేశారు. ఆధునిక ప్రపంచ చరిత్రలో ఆడవారి హక్కుల కోసం ఆ పదవిని వదులుకున్న మహానేతగా ఆయన మిగిలారు.
రాజ్యాంగ రచన కంటే కష్టమైన సమస్య అంబేడ్కర్ నిర్మించిన మొదటి హిందూ కోడ్. డాక్టర్ భీమ్రావ్ అంబేడ్కర్(1891-1956)ఒక పండితుడు, సామాజిక సంస్కర్త, దళితులు, మహిళల హక్కుల కోసం శక్తివంతమైన న్యాయవాదిగా, భారత రాజ్యాంగ సభలో రచనా సంఘం అధ్యక్షుడిగా, దేశ తొలి న్యాయమంత్రిగా పని చేశారు. అటువంటిది, రాజ్యాంగ నిర్మాణం కంటే హిందూ కోడ్ తయారీ చాలా కష్టమని రాజీనామా చేయవలసి వచ్చింది.
సమానత లేకపోతే ఆర్టికిల్ 14 కానీ, పీఠిక కానీ, ప్రాథమిక హక్కులూ ఎందుకూ అక్కరకు రావు. స్వాతంత్య్రోదమం నుంచి గణతంత్రం వరకు రాజ్యాంగ రచన(1947- 26 జనవరి 1950 వరకు) వలస భావాల బానిసత్వం నుంచి విముక్తికోసం పోరాడడం కూడా చాలా ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు. హిందూ శాసనాలను సంస్కరించడానికి అంబేడ్కర్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. వ్యతిరేకతలు, ప్రతిఘటనలు, అవమానాలను భరిస్తూ కూడా మహిళా చైతన్యాన్ని అంబేడ్కర్ రగిలించారు. స్త్రీశక్తిని తీవ్రంగా కదిలించి, సంస్కరణ ఉద్యమ సామాజిక విప్లవాన్ని ఆయనే ప్రారంభించారు.
రెండు హిందూ కోడ్ల మధ్య భారత దేశంలో పెద్ద పోరాటమే జరిగింది. మొదటి హిందూ కోడ్ పోరాటాన్ని అంబేడ్కర్ స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రారంభించారు. నెహ్రూ ఆధ్వర్యంలో రాజ్యాంగ రచనలో పాల్గొన్న అనేక నాయకులకు అంబేడ్కర్‌కు హిందూ కోడ్‌పై తీవ్రమైన ప్రతిఘటనలు ఎదురైయ్యాయి. ఎన్నో అభ్యంతరాలు వ్యతిరేక అభిప్రాయాలు వల్ల ఎన్నో మార్పులు చేసి మరో క్రోడీకరణ జరిగింది. వీటిని రెండు హిందూ కోడ్లుగా చెప్పవచ్చు.
హిందూ సామాజిక సంస్కరణ..
భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి 1947-1950 వరకు సమావేశమైన రాజ్యాంగ సభకు డాక్టర్ అంబేడ్కర్ చేసిన సేవ మామూలు కాదు. అసాధారణం, అద్భుతం కూడా. (అంబేడ్కర్ రచనలలో 14వ సంపుటిలో హిందూ చట్టాన్ని ‘సవరించేందుకు, క్రోడీకరించేందుకు’ ఆయన రాజ్యాంగ సభలో చేసిన ప్రసంగాలు చదవవచ్చు. 1947 ఏప్రిల్ 11న అంబేద్కర్ ప్రవేశపెట్టిన హిందూ కోడ్ బిల్లుపై పూర్తి చర్చ అందరూ చదవవలసిందే.)
బహుభార్యత్వాన్ని వ్యతిరేకించడం, విడాకుల చట్టాన్ని అమలు చేయడం వంటి అనేక ముఖ్యమైన తీర్మానాలను ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ మహిళా సమావేశం ఆమోదించింది. దురదృష్టవశాత్తు, ముఖ్యమైన మహిళా నాయకులు బిల్లుకు మద్దతు ఇవ్వడంలో ఆసక్తి చూపలేదని అంబేడ్కర్ బాధపడ్డారు.
అంబేడ్కర్ రాజ్యాంగానికి కంటే ముందు హిందూ కోడ్‌ను నిర్మించారు. దీనిని చాలామంది వ్యతిరేకించారు. బిల్లు మీద చర్చించారు, తిరస్కరించారు. చాలా వరకు హిందూకోడ్లో ఆయన చేర్చిన అంశాలు తొలగించడం సాధ్యం కాని అంశాలు అని అర్థమైంది. అందులో ముఖ్యమైన అంశాలు ఇవి:
- ప్రధానమైన సంస్కరణ హిందూ వివాహానికి సంబంధించినది
- దత్తత కోసం చాలా సమగ్రంగా నియమాలు తయారు చేశారు
- పిల్లలను ఏవిధంగా సంరక్షించుకోవాలి? అంటే అమాయకులను, మతిస్థితి ఆధారంగా పెంచుకోవలసిన వారనే పోషకుల నియమాలు ముఖ్యమైనవి.
- వీలునామా, ఉమ్మడి-కుటుంబ ఆస్తి, దాని విధానం, మహిళలకు సాంప్రదాయేతర ఆస్తి కేటాయించడం కూడా చాలా వివాదాస్పదమైంది.
హిందూ శాస్త్రాల ఆధారంగా అమలులో ఉన్న మితాక్షర, దాయభాగ రకాల ఆస్తిసంక్రమణ, తదితర అంశాలను, వీలునామాతో మార్చే ఆస్తి వివరాలు అన్నీ సమస్యలమయమైనవే. వీలునామా లేని సందర్భాలలో ఆస్తి వారసత్వం ఏ విధంగా పంచుకోవాలనేది కూడా సంక్లిష్టమైనది. (మితాక్షర అనేది ‘పుట్టుక ద్వారా వారసత్వం’ అనే సిద్ధాంతానికి ప్రసిద్ధి చెందిన యాజ్ఞవల్క్య స్మృతి, దయాభాగ చట్టానికి అధికారంగా ప్రబలంగా ఉంది. ‘దాయభాగం’ అనేదానిని ఇంగ్లీష్‌లో ఇన్హెరిటెన్స్ అంటారు.)
- మగవారికి మహిళల ఆస్తికి సంబంధించిన విధానాలు వేరుగా ఉన్నాయి. ఇదే పెద్ద చారిత్రక వివాదం, కోర్టులో కూడా తేలవు. స్త్రీధన, వారసత్వ ధనం. సర్వైవర్‌షిప్ ఆస్తుల బదిలీ, సంక్రమించడం చిన్నవిషయాలేమీ కావు. లాయర్లకు సవాలు విసిరే అంశాలు, బోలెడు డబ్బు తెచ్చే వివాదాలు కూడా అవే. ఎవరు కష్టపడి సంపాదించిన డబ్బయినా సరే, వారసులు వేరే అయినా, నిజంగా దాదాపు సగం, లేదా అంతకన్న ఎక్కువ సంపాదించేవారు న్యాయవాదులే అవుతారు.
- వీటితో పాటు వారసత్వం, ఆస్తుల సంక్రమణ విధానాలను కోడ్ తయారికి ఏర్పాటు చేశాయి.
హిందువులు ఎవరు?
హిందువుల నిర్వచనం, కుల వ్యవస్థను తొలిగించింది. ముస్లిం, పార్సీ, క్రైస్తవులు లేదా యూదులు కాని ఎవరికైనా హిందూ కోడ్ వర్తిస్తుంది. అందరికీ యూనిఫాం (ఉమ్మడి) కోడ్ ఇది. కానీ అందరూ ఒప్పుకుంటారా? ఈ బిల్లులోని ‘కోడ్ అప్లికేషన్’ గురించి చర్చించే క్లాజ్ 2తో చర్చ ప్రారంభమైంది.
హిందువులెవరు అనే ప్రశ్నతో ఈ చర్చ కీలకంగా మారింది. ఈ క్లాజ్‌లో హిందువులతో పాటు బౌద్ధులు, జైనులు సిక్కులకు కూడా కోడ్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇది ముస్లింలు, క్రైస్తవులు, పార్సీలు లేదా యూదులకు వర్తించదు. ఈ క్లాజ్‌ను పార్లమెంటులోని చాలా మంది సభ్యులు వ్యతిరేకించారు. ఇదే వివక్షకు ఆధారమనీ విమర్శించారు. అదే ఉండాలనే వారు కూడా ఎక్కువమందే ఉన్నారు.
ఈ బిల్లును హిందువులకు మాత్రమే కాకుండా ‘మన అధికార పరిధిలోని మనం చట్టం చేయగల అన్ని మతాలకు చెందిన పౌరులకు’ వర్తింపజేయాలి అని మధ్యభారత్ రాష్ట్రానికి చెందిన వి.ఎస్. సర్వతే అన్నారు. బీహార్‌కు చెందిన సభ్యులు బనార్సి ప్రసాద్ జున్‌జున్‌వాలా ఈ బిల్లుకు భారతదేశంలోని అందరు పౌరులకు ‘ఏ కులానికి, ఏ మతానికి చెందినవారనే దానితో సంబంధం లేకుండా’ వర్తించే సవరణను ప్రతిపాదించారు.
స్వయం ప్రతిపత్తి..
భారతీయ మహిళలకు స్వయం ప్రతిపత్తి, స్వాతంత్య్రం అనే హక్కులు ఉన్నాయా లేవా అనేది అనుమానమే కదా. మగా ఆడ అనే పదాలతో సంబంధం లేకుండా వీలునామా రాయకుండా మరణించే హిందువు ఆస్తి హక్కు ఎప్పుడొస్తుంది?
అంబేడ్కర్ కోడ్ మహిళలను సమాన పౌరులుగా గుర్తించింది. ఈ ప్రయత్నం వారి వ్యక్తిత్వం దెబ్బతినకుండా చూడాలన్న కోరికగా చెప్పవచ్చు. మహిళలకు ఆస్తి పై హక్కు లేకపోవడం తీవ్రమైన లోపంగా చూడాలి. ఆస్తి హక్కు కూడా లింగ ఆధారిత అణచివేత కుల-ఆధారిత అణచివేతతో ముడిపడి ఉంది. ఈ సంబంధం అర్ధం చేసుకోవాలంటే కులం, బ్రాహ్మణ పితృస్వామ్యంలాంటి అంశాలు అర్థం కావాలి. కాబట్టి సంస్కరణతో పాటుగా ఈ సంస్కరణాలన్నిటి క్రోడీకరణ అవసరమైంది. అయితే, దీంట్లో మతపరమైన పునాది ఉందని అంబేడ్కర్ పదే పదే చెప్పారు. అయినా ఇంకా చాలా మంది అర్థంచేసుకోవాల్సి ఉంది.
కాపురం హక్కు, వ్యక్తిగత గోప్యత హక్కు?
భారతీయ హిందూ వివాహాల చట్టంలో కాపురం హక్కు ఉంది. రైట్ టు కాంజుగల్ లైఫ్. అసలేమిటీ హక్కు? ఇక్కడ ఒక విచిత్రమైన విషయాన్ని ప్రస్తావించాలి. సినీ నటి సరితకు ఎప్పుడో పెళ్లయిందంటారు. ఆమె, ఆమె భర్త కూడా ఆ విషయాన్ని మరిచిపోయారు. ఆమె పెద్ద ప్రసిద్ధమైన నటి అయిన తరువాత భర్త కోర్టులో కేసు వేశాడు. అయితే దీని మీద స్పందించిన కొందరు బలవంతంగా కాపురం చేయిస్తారాని అడిగారు. దీని గురించి జస్టిస్ పిఎ చౌదరి సంచలనమైన తీర్పు వెలువరించారు. అది ప్రైవసీ హక్కు అని మొదట చెప్పి, కొన్ని దశాబ్దాల తరువాత ఇది అన్యాయమని అన్నారు. అప్పటి వరకు పోలీసులతో కాపలా పెట్టి కాపురాలను రక్షిస్తారా? ఇది విచిత్రం కాదు, పిచ్చి అనకూడదా..!
రాజ్యాంగం సరే, విడాకుల పోరాటం ఏమిటి?
ఓసారి పెళ్లయిన తరువాత ఆ బంధానికి మోక్షం అసలు దొరికే అవకాశమే లేదనే స్థితి వచ్చింది. హిందూ సనాతన ధర్మం లో పెళ్లయిన భార్యకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మరో జీవితం లేదు. న్యాయం కోసం, రాజ్యాంగం కోసం కూడా సమానత హక్కులు అవసరం. సమానత లేకుండా భారత రాజ్యంగం రాసుకోవడం ఒక వృధా.
ఓ సారి పెళ్లయిన తర్వాత బంధం ఎంత నరకమైనా కొనసాగించాలా? ఆడవారా మగవారని కాదు. ఎవరైనా సరే విడాకులు అవసరమని ఎన్నాళ్ల తరువాత తెలుస్తుంది? వివాహం రద్దు చేసే అవకాశాలు ఉండి తీరాలనేది అంబేడ్కర్ తీవ్రమైన ప్రతిపాదన అంటారు. కులం దుర్మార్గాన్నే కాదు, స్త్రీ మీద అణచివేత ధోరణులను కూడా అంబేడ్కర్ తీవ్రంగా వ్యతిరేకించారు. భర్తతో తేడాలు వస్తే విడాకుల ద్వారా పెళ్లిని రద్దు చేసుకునే అవకాశాన్ని హిందూ కోడ్ బిల్లుతో అంబేడ్కర్ కల్పించారు.
విడాకులు ఉండనే ఉండవంటారు. విడిపోయి కూడా బతకనివ్వరు. కోర్టులో అడిగినా విడాకులు ఇవ్వరు. విడాకులు ఉండాలని, వాటికి అనుమతించాలని సంస్కరణలు కోరుతున్నాయి. తప్పనిసరి విడాకుల స్వేచ్ఛ నిబంధన కోసం అంబేడ్కర్ వాదించారు. అంతేకాకుండా భారతదేశంలో చట్టాల బ్రాహ్మణీకరణతో భారతీయ సంస్కృతి విచ్ఛిన్నం అవుతందంటూ దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు.
భారతీయ సంస్కృతిలో 90% ఉన్న శూద్రులలో విడాకులు ఒక అలవాటు. చట్టం కాబట్టి మెజారిటీపై మైనారిటీ పాలన విధించడాన్ని ఆయన ప్రశ్నించారు. సాంప్రదాయ హిందూ మతం రక్షణ కోసం ధర్మ సంఘం అనే సాంస్కృతిక సంస్థ హిందూ కోడ్ బిల్‌కు వ్యతిరేకంగా అనేక ఆందోళనలను నిర్వహించింది.
విడాకులు రావడానికి ఎన్నేళ్లు?
మరో ప్రశ్నేంటంటే విడాకులు సులభం చేయలేరా? విడాకులు ఇవ్వరు, వదలరు. చంపేస్తారే గాని బతకనివ్వరు. కోర్టుకు వెళ్తే పదేళ్లు ఇరవైళ్లు దాటినా సుప్రీంకోర్టుకు ఆ కేసు చేరదు. అయినా ఎంత ఆశ్చర్యపోయినా సుప్రీంకోర్టు మందలింపులు మాత్రం పత్రికల్లో ప్రచురిస్తుందే కాని వారికి ఏం లాభం. విడాకులు సులభం చేస్తే కోట్ల కేసులు ఓ వారంలో రద్దైపోతాయి.
ఏకపత్నీవ్రతం ఎక్కడ?
వివాహం తప్పనిసరి, కానీ ఏకపత్నీవ్రతం ఎవరు చేస్తారు? ఒక భర్త ఒక భార్య అనే మాటే గొప్ప విప్లవకరమైన సంస్కరణగా చెప్పుకోవాలి. భార్యలకు రకరకాల పేర్లు ఉంటాయి. కొన్ని మాటలు దారుణంగా ఉంటాయి. స్త్రీని హీనంగా బలహీనం చేసే నియయాలే అన్నీ. విడాకులు, మహిళలకు సమాన ఆస్తి హక్కులను సాకారం చేసుకోవడానికి కుల ఆధారిత పరిమితుల తొలిగింపు ముఖ్యమని అంబేడ్కర్ అంటే విన్నదెవరు? వాటిని వ్యతిరేకించినందుకు ఎన్నో సమస్యలు, వివాదాలు వచ్చాయి.
భారత రాజ్యాంగ సభ ఛైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఉన్నత విద్యావంతులైన మహిళలు మాత్రమే బిల్లుకు మద్దతు ఇస్తారని అతని భార్య విడాకుల నిబంధనను ఎప్పటికీ సమర్థించదని అన్నారు. అదే పరిస్థితి. బహుభార్యత్వాన్ని సమర్థించడం చాలా పాశ్చాత్యమని బిల్లు విమర్శకులకు ప్రతిస్పందిస్తూ అంబేడ్కర్ హిందూ స్మృతి శాస్త్రాలను ఉదహరణగా చూపారు. చాలావరకు బహుభార్యత్వాన్ని పరోక్షంగా సమర్థిస్తున్నాయి.
బహుభార్యత్వం, స్త్రీకి శాశ్వత బానిసత్వం
రాజ్యాంగ సభలోని కొంతమంది సభ్యులు సమర్థించిన వివాహం అనే భావన ‘స్వేచ్ఛ లేదా సమానత్వం ఆదర్శానికి’ అనుగుణంగా లేదని అంబేద్కర్ పేర్కొన్నారు. హిందూ చట్టాల ప్రకారం వివాహాన్ని ‘పురుషుడికి బహుభార్యత్వం, స్త్రీకి శాశ్వత బానిసత్వం’ అని ఆయన తీవ్రగా విమర్శించారు. ఈ బిల్లులో విడాకుల నిబంధనను ఆయన గట్టిగా సమర్థించారు.
ఒకే బాణమూ ఒకటే మాట ఒక్క భామకే ఈ ప్రేమ..
లవకుశ సినిమాలో అద్భుతమైన పాట ‘ఒకే బాణమూ ఒకటే మాట ఒక్క భామకే ఈ ప్రేమ’ చాలా మంది ఒక భర్తకు ఒక భార్య అనే నియమాలు పాటిస్తున్నారు. కాని పాటించని వారు కూడా ఉన్నారు కదా. అది లేకుండా రామరాజ్యం సాధ్యమా? రాముడి తండ్రికే బోలెడుమంది భార్యలు, దశరథుడికి ముగ్గురు భార్యల నుంచి నలుగురు సంతానం జన్మించారు కదా.. రామరాజ్యం గురించి చెప్పేవారు కనీసం భార్యల సంఖ్యను ఒకటికి తగ్గించడం సాధ్యం కాదా? పేదరికం భయంకరంగా ఉన్నా చదువు సంధ్యలు లేకపోయినా ముస్లింలు నలుగురు భార్యలను చేసుకోవడాన్ని సంస్కృతి, సంస్కరణ అనుకోవడం న్యాయమా? తలాక్ తలాక్‌తో విడాకులను చట్టం ఇప్పుడు వింటున్నాం కాని దాన్ని ఆపగలరా?
కొడుకులకు కుమార్తెల వారసత్వం ఎందుకు ఇవ్వరు?
సమానతలో రెండు అవసరాలు ఉంటాయి. ఒకటి అబ్బాయిలకు ఆడబిడ్డలకు ఎందుకు సమానత ఇవ్వడం లేదు? రెండు బహుభార్యత్వం కొనసాగితే సమస్యలు ఉండి తీరతాయి. బాల్య వివాహాలు, వితంతువు తంతు, ముసలి వాళ్లకు పెళ్లిళ్లు తీవ్ర సమస్యలుగా మారుతాయి. అంబేడ్కర్ కోడ్‌లో కుమార్తెలకు వారసత్వ భాగాలను కేటాయించింది, వితంతువులకు గతంలో పరిమితం చేయబడిన పూర్తి ఆస్తి హక్కులను ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్, హిందూ మహాసభ, ఇతర హిందూ మత అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు.
హెచ్‌యూఎఫ్…
హిందూ యూనైటెట్ ఫ్యామిలీ అనేమాట ఒక జోక్ అయిపోయింది. హిందూ అవునో కాదో కానీ యునైటెడ్ మాత్రం కాదు. ఇక ఫామిలీ అన్నా, వసుధైక కుటుంబమని కవిత్వం చెప్పడమన్నా అది ఉందా లేదా? హెచ్‌యూఎఫ్ కేవలం పన్ను ఎగొట్టడానికి, లాయర్లు డబ్బు సంపాదించడానికే కాక ఇంకెక్కడైనా అమలులో ఉందా? అన్నదమ్ములు కొట్టుకుచావడానికి కాక ఇంకెందుకు? బ్రహ్మ పదార్థమా? ఒక పెద్ద పత్రిక యజమాని హెచ్యూఎఫ్ను బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు.
కానీ హిందూ కోడ్ సంస్కరణ సాంప్రదాయ హిందూ వ్యక్తిగత చట్టంతో విభేదించింది. అర్థం కాని సంగతి ఉమ్మడి కుటుంబాలు. ‘అన్ని హిందువులకు ఆస్తి యాజమాన్యం ఒక ఉమ్మడి కుటుంబ వ్యవస్థను స్థాపించింది’ అంటారు. కొన్నాళ్ల కిందట ఉండవచ్చు. కాని ఇప్పటి సంగతేంటి?
దత్తత హక్కు కూడా లేదా!
ఆర్టికిల్ 14 మాట చెబుతూ ఉంటారు. కానీ మహిళలకు సమాన హక్కులు మాత్రం ఇవ్వరు. పిల్లలను కనే స్త్రీలకు కనీసం పిల్లలను దత్తత తీసుకునే అధికారం కూడా ఇవ్వరు. ఇదెంత దారుణం కదా. ఆడవారికి ఆత్మగౌరవం అవసరం లేదా! ఒక భర్త అనేకమైన భార్యలనే బహుభార్యత్వాన్ని రద్దు చేయాలని, ఇది అసమానతని పెద్దవారు ఆలోచించకపోవడం అన్యాయం కూడా.
ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్
‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ ఉమెన్’ పేరుతో రాసిన వ్యాసంలో స్త్రీని చీకటి అగాధంలోకి నెట్టే వేసిన సామాజిక పరిస్థితుల గురించి లోతుగా చర్చించారు. ఆడబిడ్డ పుట్టుకను బౌద్ధ సంప్రదాయం దుఃఖమయ ఘటనగా భావించదని బుద్ధుడికి, ప్రసంజిత్ మహారాజుకు మధ్య జరిగిన సంఘటన వివరిస్తుందని అంటారు. ఇప్పటికీ పుట్టేది ఆడపిల్లని తెలిస్తే ముందే గర్భం తీయించుకునే టెక్నాలజీని వాడుకుంటున్నారు.
అంబేడ్కర్ హిందూ కోడ్
139 ఆర్టికల్స్‌తో ఉన్నటువంటి హిందూ కోడ్ బిల్లు భారతదేశంలోని హిందూ చట్టాలను సంస్కరించడాన్ని క్రోడీకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది బహుభార్యత్వం, కులాంతర వివాహాలు, విడాకులు, దత్తత వారసత్వం వంటి అంశాలను పరిశీలించింది. ఈ బిల్లుపై ప్రారంభ చర్చ 1947 నవంబర్ 17- 1948 ఏప్రిల్ 9 మధ్య జరిగింది. దీని తర్వాత, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. కమిటీ సవరణలను సూచించి, బిల్లును తిరిగి పంపిన తర్వాత 1949 ఫిబ్రవరి 11- 1950 డిసెంబర్ 14 మధ్య రాజ్యాంగ సభలో దీనిపై మరింతగా చర్చ జరిగింది. 1951 ఫిబ్రవరి 5న డాక్టర్ అంబేడ్కర్ పార్లమెంటులో బిల్లుపై నిబంధనల వారీగా చర్చను కోరారు.
ఓవైపు రాజ్యాంగ నిర్మాణం ముగుస్తున్న దశలో అంబేడ్కర్ బిల్లును ప్రవేశపెట్టారు. మనస్థాపానికి గురై 1951 సెప్టెంబర్ 9న రాజీనామా చేయక తప్పలేదు. హిందూ కోడ్ బిల్లుపై చర్చ ప్రారంభించాలనే ప్రతిపాదనపై యాభై గంటలకు పైగా చర్చ జరిగింది. ఆ తర్వాత చర్చ ఒక సంవత్సరం పాటు వాయిదా కూడా పడింది.
బిల్లును చంపేశారు, ఏడవకుండా నోరుమూశారు..
ఈ కోడ్ రాజ్యాంగ చెల్లుబాటుపై కూడా వాదనలు జరిగాయి. పండిత్ థంకూర్ దాస్ భార్గవ, జెఆర్ కపూర్ వంటి సభ్యులు, బిల్లులోని నిబంధనలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(1), 25(1) కింద వివక్ష లేకుండా ఏ మతాన్ని అయినా ఆచరించే స్వేచ్ఛకు హామీ ఇచ్చే ప్రాథమిక హక్కులను తగ్గించాయని పేర్కొన్నారు.
దీంతో ప్రభుత్వానికి మతపరమైన ఆచారాలలో జోక్యం చేసుకునే హక్కు లేదు. దీనికి ప్రతిస్పందనగా, పార్లమెంటు వారి మతం తప్ప అన్ని వర్గాల వ్యక్తిగత చట్టాలపై అధికారాన్ని ఉపయోగించిందని డాక్టర్ అంబేడ్కర్ నొక్కి చెప్పారు. ‘పార్లమెంటు సార్వభౌమ అధికారం నుండి తమకు మినహాయింపు ఉంటుందని ఏ సమాజమూ భావించకూడదు’ అని ఆయన అన్నారు. చివరకు ‘బిల్లు చంపబడింది, ఏడవకుండా నోరు మూసింది’ అని అంబేడ్కర్ బాధ పడ్డారు.
అంబేడ్కర్ రాజీనామా..
మళ్లీ మితాక్షర ఉమ్మడి కుటుంబ వ్యవస్థను తిరిగి స్థాపించడం, సోదరులు కుమార్తెల వారసత్వ వాటాను కొనుగోలు చేయడానికి అనుమతించే సవరణ, వివాహమైన మూడు సంవత్సరాల తర్వాత మాత్రమే విడాకులను అనుమతించే నిబంధన వంటి విమర్శకుల డిమాండ్లకు అనుగుణంగా ఉన్న కొత్త ముసాయిదాను నెహ్రూ అంబేడ్కర్ కమిటీతో పంపిణీ చేయించారు. ఆ బిల్లులు మళ్ళీ అసెంబ్లీలో ఓడిపోయిన తరువాత, అంబేడ్కర్ రాజీనామా చేశారు.
ప్రభుత్వం – హిందూ కోడ్..
ఇప్పుడు హిందూ బిల్లు అంబేడ్కర్ బిల్లు కాదు. అది నెహ్రూ కోడ్ బిల్లు. దానికి 4 భాగాలు: హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనారిటీ సంరక్షణ చట్టం, హిందూ దత్తత నిర్వహణ చట్టాలు. దీని పట్ల ఎదురైనా వ్యతిరేకత తక్కువే. ఆ మాత్రం మార్పులు, సంస్కరణలు చేయడానికి కూడా నెహ్రూ నానా తంటాలు పడ్డారు. ఆయనే ఎన్నో సార్లు ఇందులో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. 1952, తరువాత 1956 సంవత్సరాల మధ్య, ప్రతి ఒక్కటి పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. ఆమోదించారు కూడా.
అంబేడ్కర్ అసంతృప్తి..
ఈ నేపథ్యంలో అంబేడ్కర్‌కు అసంతృప్తి, బాధ ఎక్కువగానే ఉంది. హిందూవులకు ఇతరులకు మధ్య తేడా తరువాత చర్చించాలి. కానీ హిందువుల మగ, ఆడవారి మధ్య తేడా సంగతేంటో చర్చించాలనీ, వారసత్వ క్రమం ఎవరు నిర్ణయిస్తున్నారన్నది మార్చకుండా రాజ్యాంగంలో సమానత ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఆయన ప్రశ్న.
10 శాతం జనాభాకు వర్తించే చట్టం 90 శాతం జనాభా జీవితాల్ని కట్టి పడేస్తుంది
తన ప్రసంగాల్లో, పార్లమెంట్లో అంబేడ్కర్ ‘హిందువులలో 90 శాతం మంది శూద్రులు ఉంటారనడం లో సందేహం లేదు. ద్విజులు 10 శాతం మంది జనాభాలో ఉంటారు. 90 శాతం మంది అనుసరించే చట్టాన్ని అందరి శాసనంగా చేద్దామా లేక కేవలం 10 శాతం మంది అనుసరించే చట్టాన్ని వంద శాతం మంది మీద రుద్దుదామా?’ అని అంబేడ్కర్ ప్రశ్న
ధర్మశాస్త్రాలలో విడాకులు..
హిందూ ధర్మశాస్త్రాలలో నారదస్మృతి పరాశరస్మృతిలో కూడా విడాకులు ఉన్నాయని ఉంది. కాని ఆమాట చెప్పడం లేదు. విడాకులు ఉండే పరిస్థితులు ఇవి: భర్తలు వదిలినపుడు, మరణించినపుడు, పరివ్రజం(సన్యాసం) తీసుకున్నపుడు వివాహ బంధంనుంచి బయటపడవచ్చు. ఎంతో మంది మతం మారతారు. భర్త మతం మారితే భార్య విడాకులు తీసుకోవచ్చని చాలాకాలం నుంచి ఓ నియమం అమలులో ఉంది. ఎవరికీ తెలియదు. తెలిసినా ఏదో ఒకటి పోనీ అని సర్దుకుంటూ ఉంటారు.
చట్టంలో సివిల్ డెత్ అని ఒక నియమం ఉంది. మూడు సందర్భాలలో ఈ పౌరత్వ మరణం ఉంటుంది. భర్త విడాకులు తీసుకున్నా అది భార్యకు సివిల్ డెత్‌గా ఉంటుంది. రెండో సారి సన్యాసం తీసుకున్నవారు, వివాహం తెగిపోయిచ భార్య వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఇవన్నీ ఎవరికీ చెప్పరు అర్థం కాదు. లాయర్లకు కూడా తెలుసో లేదో చెప్పలేం. ఇక మూడో పరిస్థితి. ఎక్కువగా భర్తలు చెప్పాపెట్టకుండా ఏదోదేశానికి వెళ్లిపోతారు, వాళ్ల గొంతు వినబడదు. వాళ్లు కనబడరు. మొత్తం ఏడేళ్లు ఎదురుచూసినా రాకపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చు. (Civil Death, Divorce, Renouncing, Unheard of 7 years)
కౌటిల్యుడి అర్థశాస్త్రం..
కౌటిల్యుడు రచించింది మొదటి రాజ్యాంగం. Practical Constitution is his creation. ఒక ప్రభుత్వాన్ని యుద్ధం లేకుండానే కూలగొట్టిన వాడు కౌటిల్యుడు. చాణుక్యుని అర్థ శాస్త్రంలో ప్రపంచమంతా ఒకే వివాహ ప్రశస్తమైన నియమాన్ని పాటిస్తున్నారు. మరుముక్కతాయం అలియ సంతానం చట్టాలు ఏక వివాహాల నియమాలు రూపొందించాయి. కౌటిల్యుడు రెండో పెళ్లి హక్కుపైన చాలా పరిమితులు విధించారు. ఒకరూ మొదటి 10, 12 సంవత్సరాల వరకు రెండో పెళ్లి చేసుకోవద్దు. పిల్లలు కనడానికి అవకాశం ఉందో లేదో వేచి చూడాలి. ఇదో ప్రధాన పరిమితి. రెండో పెళ్లి చేసుకోదలచుకున్న వ్యక్తి మొదటి భార్యకు ఆమెతో పెళ్లికి వచ్చిన సొమ్మంతా తిరిగి ఇవ్వాలని కౌటిల్యుడు నిర్దేశించాడు. ఇదీ కౌటిల్యుడి అర్థశాస్త్రం.
స్త్రీ చైతన్యానికి నాంది అంబేడ్కర్..
అంబేడ్కర్ బిల్లు పోతే పోయింది కాని, ఒక ఉద్యమ విత్తనాన్ని నాటింది. స్త్రీ చైతన్యం కోసం అంబేడ్కర్ ఆ విత్తనాన్ని నాటారు. మారుతున్న సమాజంతో పాటు మారాలని, మూఢాచారాలను వదిలి వేయాలని, అనవసర ఆర్భాటాలకు దూరంగా ఉండాలని చెప్పేవారు. ఇప్పుడు చూస్తే విపరీతమైన డబ్బు వెదజల్లుతూ ఆర్భాటాల కోసం దారుణంగా ఖర్చుచేస్తున్నారు. వేశ్యవృత్తిలో ఉన్న కొందరు మహర్ మహిళలు, ఆ నరక చీకట్లో నుంచి వెలుగులోకి రావడానికి, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంబేడ్కర్ ప్రసంగాలు, నినాదాలు, వివాదాల మాటలు అన్నీ ఎంతో దోహదపడ్డాయి.
రాజ్యాంగం – మహిళా సాధికారత..
మహిళా సాధికారత కోసం రాజ్యాంగంలో ఎన్నో నియమాలు అంబేడ్కర్ చేర్చారు. మహిళల పట్ల వివక్షను అంతం చేస్తూ రూపొందించిందే ఆర్టికల్ 15(3).(Article 15(3) of the Constitution of India allows the state to make special provisions for women and children. It also states that these provisions cannot be challenged on the basis of discrimination.)
ఆడ, మగ అనే వివక్ష లేకుండా అందరూ జీవనోపాధి పద్ధతులను కలిగి ఉండటానికి 39(ఎ) ఆర్టికల్‌ను రచించారు. (Articles 36 to 51 are Directive Principles of State Policy. Article 39A of the Constitution of India states that the state must ensure equal justice and provide free legal aid to all citizens. This article was added to the Constitution in 1976 through the 42th Amendment. Citizens should not be denied justice due to economic or other disabilities. It ensures that legal services are available to women, children, elderly, and people with disabilities)
భారత దేశంలో చాలా కాలం పాటు ఒకే పనిని ఆడ, మగ ఇద్దరూ చేసినా వేతనం విషయంలో మాత్రం వివక్ష ఉండేది. మగవాళ్లకు ఎక్కువ వేతనం, ఆడవారికి తక్కువ వేతనం ఇచ్చేవాళ్లు. ఈ దుర్మార్గానికి అంబేడ్కర్ ముగింపు పలికారు. సమానపనికి సమానం వేతనం ఇచ్చే ఆర్టికల్ 39(డి)ను రూపొందించారు. (Article 39(d) of the Constitution of India states that men and women should be paid equally for the same work. It is a Directive Principle of State Policy.) మగవాళ్లతో పోలిస్తే మహిళలు తక్కువ అనే అన్యాయయపు ఆలోచనల ఆధారంగా అనేక దురాచారాలు ఉండేవి.
మహిళల గౌరవాన్ని తగ్గించే పాతకాలపు ఆచారాలను చట్ట విరుద్ధమని పేర్కొంటూ ఆర్టికల్ 51(ఎ)(ఇ)ను రాజ్యాంగంలో అంబేడ్కర్ ప్రవేశపెట్టారు. (Article 51A(e) directs the citizens to renounce practices derogatory to the dignity of women) తమ వ్యక్తిగత(మత) చట్టాలలో కానీ, ఏ ఇతర చట్టాలలో కానీ జోక్యం చేసుకోవద్దని చెప్పే హక్కు పార్లమెంట్‌కు లేదనే వాదన కరెక్ట్ కాదు. అప్పుడిక రాజ్యాంగం ఎందుకు?
అంబేడ్కర్ – నెహ్రూ ప్రభుత్వం..
ఈ బిల్లును వ్యతిరేకిస్తే తన ప్రభుత్వం కూలిపోతుందని నెహ్రూ మొదట బెదిరించినప్పటికీ, బిల్లు ప్రవేశ పెట్టడం వాయిదా పడింది. ఈ బిల్లు మంచిదే అని నెహ్రూ ముందు ఒప్పుకున్నా సామాజిక, చారిత్రిక, రాజకీయ కారణాలతో ఈ ఆలోచన వెనుకబడింది. రాజ్యాంగ నిర్మాణంలో సాధ్యమైనా హిందూ బిల్లు గెలవడం కష్టం అని నెహ్రూకు తెలిసింది. బిల్లు ఆమోదం పొందాలంటే గణనీయమైన రాయితీలు ఇవ్వాలని నెహ్రూకు అర్థమైంది. అనేక విభాగాలుగా విభజించాలని సూచించారు. వివాహం విడాకులకు సంబంధించిన మొదటి 55 నిబంధనలతో మాత్రమే తాము పోటీ చేస్తామని, మిగిలిన వాటిని మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత భారత పార్లమెంట్ పరిశీలిస్తుందని నెహ్రూ రాజ్యాంగ సభకు చెప్పారు. రాజీ మార్గాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి నిలువలేదు. సంప్రదాయవాదులను ఒప్పించడంలో రాజీ పెద్దగా ప్రభావం చూపలేదు. మరో వారం రోజుల చర్చ తర్వాత 55 నిబంధనలలో మూడింటిని మాత్రమే ఆమోదించారు.
సామాజిక పితృస్వామ్య సోపానక్రమానికి వ్యతిరేకంగా మహిళల హక్కుల కోసం జరిగిన ప్రజాస్వామ్య పోరాటాల చరిత్రలో, హిందూ కోడ్ బిల్లుకు అనుకూలంగా డాక్టర్ అంబేడ్కర్ చేసిన వాదనలు తర్వాత మంత్రివర్గం నుంచి రాజీనామా తప్పలేదు. ప్రస్తుతం భారత రాజ్యాంగానికి చాలా కీలకమైన అంశం సమానత. రాజ్యాంగ రచన చాలా క్లిష్టమైన పని. కాని హిందూ కోడ్ నిర్మాణం అంతకన్న కష్టమైంది. డాక్టర్ అంబేద్కర్ రాజీనామా, భారతదేశ మహిళా హక్కుల చరిత్రలో ఒక మలుపుగా నిలిచింది.
2005లో సమాన హక్కులు..
2005లో హిందూ చట్టాలను సవరించిన సమాన హక్కులు కూడా గొప్ప మార్పుగా చూడాలి. అంతకుముందు తమిళనాడులో మగవారికి మహిళలకు సమాన హక్కులను కల్పించారు. తరువాత ఎన్‌టి రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ మార్పును తెచ్చారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా సమాన హక్కులను తేవడం 2005లో మాత్రమే సాధ్యమయింది. 2005లో సమాచార హక్కును తెచ్చినా, అది నీరసించి హాస్పిటల్ ఐసియులో ఎప్పుడో చేరింది. ఈ సమానత హక్కు ఉంచుతారో లేదో తెలియదు.
కొన్ని మంచి మార్పులు వచ్చినప్పటికీ అంబేడ్కర్ హిందూ కోడ్‌లో ఇప్పటికీ సవరణల, సంస్కరణల అవసరం ఎంతైనా ఉంది. హిందువులకు, ఇతరులకు కూడా వర్తించే యూనిఫాం సివిల్ కోడ్‌ను చేయగలరా? అనే ప్రశ్న ఇప్పటికీ మిగిలిపోయి ఉంది. సతి, బాల్య వివాహాలు, వితంతుల వివాహం చాలావరకు ఆగిపోయినా, ఒకే భర్త ఒకే భార్య అనే సమానత అందరికీ సమానంగా సాధ్యమా?
హిందూ చట్టాలు బోలెడు. స్పెషల్ వివాహ చట్టాలు, ముస్లిం, క్రైస్తవ వివాహ సమస్యలు ఎన్నెన్నో ఉంటాయి. ‘మనం నా నుంచి ఇంకా మా దాకా రాలేదు. మనం అన్నపుడు కదా మన అన్నది ప్రగతి’ కాళోజీ అన్నట్టు ఇంకా ‘మన’ అనే నాగరికత ఎప్పుడు వికసిస్తుంది?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.