(ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా అంతర్జాతీయ స్థాయి పలుకుబడి కలిగిన బహుళజాతి కంపెనీలను తన పరిశోధనలతో గడగడలాడిరచిన హిండెన్‌బర్గ్ సంస్థ తన పరిశోధనలకు శెలవు ప్రకటించింది. భారతదేశానికి చెందిన అదానీ కంపెనీపై అమెరికా కోర్టుల్లో కేసు నమోదు కావటానికి ఈ సంస్థ వెల్లడిరచిన రహస్యాలు, మార్కెట్ ఉల్లంఘనలకు సంబంధించిన సాక్ష్యాధారాలే కారణం. ఈసందర్భంగా సంస్థ అధినేత నేట్ ఆండర్సన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, పాఠకులనుద్దేశించిన రాసిన లేఖ పూర్తి పాఠం తెలుగు పాఠకులకోసం ఇస్తున్నాము – సంపాదకులు)
గత సంవత్సరమే నా సహచరులు, కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు హిండెన్‌బర్గ్ పరిశోధనా సంస్థను మూసేస్తున్నాను. గత కొంతకాలంగా కొనసాగుతున్న ప్రాజెక్టులు ముగింపుకు వచ్చాక సంస్థను మూసేయాలన్నది మా నిర్ణయం. మా చేతిలో ఉన్న చివరి పరిశోధన ప్రాజెక్టు గురించిన తుది నివేదికను ఈ రోజు సంబంధిత అధికారులకు సమర్పించబోతున్నాము. అందువల్ల రేపటి నుండి మార్కెట్‌కు, మార్కెట్ మోసాలకు ఇకమీద మా గురించిన భయం ఉండక్కర్లేదు.
ఈ సంస్థను మూసేస్తున్నామని చెప్తున్నప్పుడు నాకెంతో తృప్తిగా ఉంది. నా కలలను నెరవేర్చుకున్న తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకోవడమే దీనికి కారణం.
జీవితంలో ఎంచుకున్న మార్గాన్ని సంపూర్ణంగా ఆచరణ సాధ్యం చేయటం కలా నిజమా అన్నది నాకు ఇంకా అర్థం కాలేదు. ఈ రంగం నాకు కొత్తది. దీనిలోని లోతుపాతులు తెలీకుండానే యాంత్రికంగా నేను ఇందులోకి ప్రవేశించాను.
ఈ పని ప్రారంభిస్తున్నప్పుడు నాకు నేనే వేసుకున్న ప్రశ్న ఈ పనికి నేను తగునా అని. సాంప్రదాయక ఆర్థిక రంగంలో కానీ ద్రవ్య రంగంలో కానీ ప్రవేశం ఉన్నవాడిని కాదు. నా కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల్లో ఎవ్వరూ స్టాక్ మార్కెట్ బ్రోకరేజి రంగంలో లేరు.
నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడినే. మాటలు నేర్పిన సేల్స్‌మన్‌ను కాదు. ఏ సమయానికి ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా తెలీని వాడిని. గోల్ఫ్ ఆడటం చేతకాదు. (పశ్చిమ దేశాల్లో సంపన్నులంతా గోల్ప్ ఆడటం తమ ఆర్థిక హోదాకు చిహ్నంగా భావిస్తారు.)
కేవలం రోజుకు నాలుగు గంటలు విశ్రాంతి తీసుకుని రోజంతా పని చేయగల సామర్ధ్యం ఉన్న వాడిని కూడా కాదు. నేను చేసిన అన్ని ఉద్యోగాల్లోనూ బాగానే పని చేశాను. కానీ నన్ను ఎవ్వరూ గుర్తించలేదు. నేను ఈ పరిశోధన రంగంలోకి వచ్చేసరికి నా దగ్గర పెట్టుబడి ఏమీ లేదు. పని ప్రారంభించగానే మూడు పెద్ద సంస్థలు నా మీద కేసులు బనాయించాయి. నాకు అంతంత ఫీజులు ఇచ్చుకునే శక్తి లేకపోయినా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సామాజిక లక్ష్యాల కోసం పని చేసే న్యాయవాది బ్రియాన్ వుడ్ సహకారం లేకపోతే నేను ఈ రోజు ఈ లేక రాయగలిగేవాడినే కాదు. హిండెన్‌బర్గ్ పనిలో లోతుగా దిగబడే సమయానికి నాకో పాప పుట్టింది. అదేసమయంలో ఇంటి అద్దె కట్టలేకపోవటంతో ఖాళీచేయమన్న తాఖీలు అందుతున్నాయి. అదో విచిత్రమైన పరిస్థితి. అక్కడే ఉండిపోతే నలిగిపోతాను. అక్కడ నుండి కదిలితే కుటుంబం రోడ్డున పడుతుంది. ఏదేమైనా జీవితంతో పాటు నేను కూడా సాగుతూ పోవాలన్నదే నా ముందు మిగిలిన ప్రత్యామ్నాయం.
పరిస్థితులు అనుకూలించనప్పుడు మన గురించి తప్పుడు ప్రచారాలు హోరెత్తుతున్నప్పుడు మన గురించి ప్రచారంలో ఉన్న అపోహలు అందరికీ నమ్మదగినవిగానే ఉంటాయి. అయితే ఈ అపోహలన్నింటికీ సమాధానం చెప్పటం తేలికే. అందుకే నా భయాందోళనలు పక్కన పెట్టి ఈ ఆరోపణలన్నీ అలానే కొనసాగనిచ్చాను.క్రమంగా ఈ పరిశోధనలు పురి విప్పుకోవడం మొదలైంది.
11 మందితో అద్భుతమైన టీం తోడైంది. నా సంస్థలో పని చేసేందుకు ఉద్యోగులు కావాలి కాబట్టి వాళ్లను పనిలోకి తీసుకోలేదు. వాళ్లతో మాట్లాడినప్పుడు నా దారీ వాళ్ల దారీ ఒక్కటే అని అర్థమైన తర్వాత వాళ్లను నా బృందంలో కలుపుకోకపోవడం పిచ్చితనం అవుతుందనిపించింది.
వాళ్లంతా తెలివిమంతులు. వాళ్లతో కలిసి పని చేయటం ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్లను కలిసినప్పుడల్లా చాలా హుందాగా నమ్రతగా ఉండేవారు. కానీ ఈ రంగానికి వచ్చేసరికి ముందూ వెనకా చూసేవాళ్లు కాదు. ముక్కుసూటిగా వ్యవహరించేవాళ్లే. ప్రపంచం దృష్టినాకర్షించగలిగిన పనిమంతులే. నాలాగే నా టీంలో ఉన్న వారంతా ఆర్థిక నేపథ్యం లేనివాళ్లే. నాతో పాటు మొదటిసారి కంపెనీలో చేరిన ఉద్యోగి మొదట్లో బార్లో అటెండర్‌గా పని చేసేవాడినని గుర్తు చేసుకునేవాడు. మా అందరి ప్రపంచ దృక్ఫథం ఒక్కటే. అందరిలో ఏదో చేయాలన్న దాహార్తి ఉంది. మాదంతా ఒక కుటుంబం. మేమంతా ఓ కుటుంబం.
మేమంతా చాలా కష్టపడ్డాం. మేము చేసిన ప్రతి పనికీ, చెప్పిన ప్రతి మాటకీ సాక్ష్యం, ఆధారం ఉన్నాయి. ముందుచూపుతోనే మా పరిశోధనలు, లక్ష్యాలు ఉండేవి.
ఈ పనిలో ఎన్నో ఒడిదుడుకులు ఉండేవి. మా 11 మందికీ కలిపి ఉండే శక్తికంటే ఎన్నో రెట్లు ఎక్కువ శక్తివంతులైన వారిని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తేవి. మేము పని చేసే ప్రపంచంలో మోసం, అవినీతి, స్పర్థ చుట్టూ ముసురుకుని ఉంటాయి. మొదట్లో న్యాయం అన్నది ఎండమావిగా కనిపించేది. ఒకసారి న్యాయం సాధించినప్పుడు కలిగిన తృప్తి అంతా ఇంతా కాదు. అదే మమ్ములను ముందుకు నడిపించింది.
రానురానూ మా పని ఎంత ప్రభావం చూపించిందంటే తొలి అడుగులు వేసేటప్పుడు మా కృషి ఇంతటి ప్రభావం చూపుతుందని ఊహించనుకూడా ఊహించలేదు. ప్రపంచంలో లక్షల కోట్ట కొద్దీ సొమ్ము పోగేసుకున్న వారితో సహా వందమంది హేమా హేమీలను సివిల్, క్రిమినల్ కేసులోల కోర్టు మెట్లెక్కించటంలో మేము సాగించిన పరిశోదనలు కూడా ఓ మేరకు పాత్ర పోషించటం ఆషా మాషీ వ్యవహారం ఏమీ కాదు. కొన్ని వ్యాపార సామ్రాజ్యాలను కూడా ఓ కుదుపు కుదిపాము. ఆయా సామ్రాజ్యాలకు ఆ మాత్రం షాకివ్వాల్సిన అవసరం ఉందని భావించాము. మనం ఏమిటి ఎవరు ఎంతటి వాళ్లమనేదాంతో నిమిత్తం లేకుండా మనం చేసే కృషే మనకి గుర్తింపు తెస్తుందనీ, ఆశించిన ప్రభావాన్ని చూపించవచ్చనీ మా అనుభవం రుజువు చేసింది.
మేము నెత్తికెత్తుకున్న పని కూడా లోతైనదీ. నాలుగు దిక్కులూ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాల్సిన పని. నేను సాగిస్తున్న పరిశోధనల్లో కొత్త కోణం తడితేనో, రాస్తున్న నివేదికలో రోజంతా తల బద్దలు కొట్టుకున్న అవసరమైన వివరణ ఆలోచనలకు తడితేనో ఉలిక్కిపడి లేచిన రాత్రుళ్లు ఎన్నో ఉన్నాయి. మాకు భయం లేదని చెప్పుకోవడం భేషజం అవుతుంది. మాకు న్యాయం మీద, సత్యం మీద ఉన్న నమ్మకమే మమ్ములను సరైన దారిలో నడిపించింది.
జరిగిందంతా తృప్తిగానే ఉంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మాగురించి వచ్చిన వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలూ అన్నీ చూసి నవ్వుకునేవాళ్లం. అవే మా పని ఒత్తిళ్లల్లో మాకు ఉల్లాసం. ఉత్సాహం. మేము చేసింది జీవితానికో సాహసం.
మరి ఇంత సాధించిన తర్వావత ఎందుకు సంస్థను మూసేస్తున్నామన్న ప్రశ్న మీ అందరికీ ఎదురవుతుంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. కాకపోతే ఏవో బెదిరింపులో, ఆరోగ్య సమస్యలో, వ్యక్తిగత సమస్యలో కారణం కాదు
ఏదో ఒక దశలో మనం చేసే పనిలో మనం స్వార్ధాన్ని వెతుక్కుంటామని మా మిత్రుడొకరు చెప్పారు. మొదట్లో నన్ను నేను నిరూపించుకోవాలన్న తపన ఉండేది. ఇంతకాలానికి నాకంటూ జీవితంలో ఓ తృప్తి దక్కింది. ఈ మాత్రం తృప్తి దక్కేదేమో కానీ దీన్ని సాధించటానికి ముందుగా నన్ను నేను కష్టపెట్టుకోవాలనుకున్నాను. నేను చేసే కృషిలో సాధించిన విజయాలకు బదులు నాకంటూ ప్రియమైన కొంతమందిని కోల్పోయాను. నాకు ఇష్టమైన కొన్నిటిని వదులుకోవాల్సి వచ్చింది. దాంతో హిండెన్‌బర్గ్‌ను నా జీవితంలో ఓ అధ్యాయానికి పరిమితం చేయదల్చుకున్నాను.
ఈ నిర్ణయానికి మరో కారణం నాకు నేను విశ్రాంతి తీసుకోవడమే కాదు. మేము సాగించిన పరిశోధనలు, ఛేదించిన రహస్యాలు మా చిన్ని బృందంతోనే జాగ్రత్త చేయదల్చుకున్నాము. చాలా రోజుల నుండీ మేమేమి చేస్తాము, మేమెవరు, మాతో కలిసి పని చేయవచ్చా అని వేలాదిమంది ప్రశ్నలు వేశారు. ఆ మెయిల్స్, మెస్సేజులు అన్నీ చదివాము. మేము చేసిన ప్రతి పరిశోధన గురించి లోతైన వివరాలు, పాటించిన విధి విధానాలతో రానున్న ఆర్నెల్లలో వివరంగా వీడియోలు ద్వారా మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేయాలనుకున్నాము. తద్వారా ఇంతకాలంగా మేము చేసిన పనీ, పాటించిన పద్ధతులూ అందరికీ తెలియచేయటం ద్వారా ఔత్సాహికులైన పరిశోధకులకు, న్యాయం కోసం పోరాడేవారికి మా అనుభవాలు పంచుకోదల్చుకున్నాము.
ఒకటి రెండేళ్ల తర్వాత మేము సాగించిన పరిశోధనలూ, వెలికి తీసిన వాస్తవాలూ దానికోసం అనుసరించిన విధి విధానాలు తెలుసుకున్న మీలో కొందరు ఆ పద్ధతులు పాటించి మీరు కూడా మరుగునపడిన వాస్తవాలు ఎన్నో ప్రపంచం దృష్టికి తెచ్చినట్లు సందేశాలు పంపుతారన్న నమ్మకం నాకుంది. ఆ సమయానికి నేనేదో వ్యాపకంలో ఉన్నా, విశ్రాంతిలో ఉన్నా మీ సందేశం నాకు సంతోషాన్నీ, తృప్తినీ ఇస్తుంది.
ప్రస్తుతానికి మా బృందంలోని సభ్యులందరూ వాళ్ల వాళ్ల జీవితాల్లో కోరుకున్న స్థానాల్లో స్థిరపడేలా చేయటం మొదటి కర్తవ్యం. కొంతమంది నా తరహాలోనే స్వంతంగా పరిశోధనా సంస్థలు ప్రారంభించాలనుకుంటున్నారు. అటువంటి వారిని పూర్తిగా ప్రోత్సహిస్తాను. కాకపోతే నేను ప్రత్యక్షంగా పాలుపంచుకోను. మరి కొంతమంది ఫ్రీలాన్సింగ్గా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అటువంటి అనుభవజ్ఞుల సేవలు మీకు కావల్సి వస్తే నన్ను సంప్రదించవచ్చు.
హిండెన్‌బర్గ్ కథ నా ఒక్కడిద కాదు. అందుకే దీన్ని ఓ ప్రేమ కావ్యంగా భావిస్తాను. నా జీవిత భాగస్వామి నా లక్ష్యం కోసం నేను సాగించే ప్రయాణంలో తోడుగా ఉండే క్రమంలో తానెంతో కోల్పోయింది. ఆమెకు నా కృతజ్ఞతలు. ఓ నా సహచరీ ఇక మీద ప్రపంచం అనుమతించినంత కాలం మనం కలిసే ఉంటాము. కలిసే సుఖసంతోషాలు పంచుకుంటాము.
ఇప్పటి వరకూ నేను అందుబాటులో లేకపోయినందుకు నా సహచరులు, బంధుమిత్రులకు అందరికీ నా క్షమాపణలు. ఇకమీద మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను.
చివరిగా నా పాఠకులందరినీ ఎంతో రుణపడి ఉంటాను. మా ప్రయాణంలో మీ సందేహాలు, శుభాకాంక్షలు మాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచాయి. ఇందంతా చూసినప్పుడు లోకంలో ఇంకా మంచి మిగిలే ఉందన్న నమ్మకం నాకు కలుగుతుంది. ఇంతకన్నా నేను కోరేదేమీ లేదు.
ఈ ఆదరాభిమానాలే మాకు ఆశీర్వాదాలు.
మీ
నేట్ ఆండర్సన్
అనువాదం : కొండూరి వీరయ్య
ది వైర్ తెలుగు ప్రత్యేకం